కార్మికుల ప్రాణాలతో చెలగాటం..

కార్మికుల ప్రాణాలతో చెలగాటం..

రసాయన పరిశ్రమల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,
నోస్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ను సందర్శించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చిట్యాల, ఆంధ్రప్రభ : నోస్ పరిశ్రమ లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం అధికారుల చేత నివేదిక తప్పించుకొని యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ కంటి సత్యం డిమాండ్ చేశారు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని నోస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంపై శనివారం నాడు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సందర్శించి పరిశ్రమ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రసాయన పరిశ్రమల్లో కొనసాగుతున్న నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల లేమి, అధికారుల పర్యవేక్షణ లోపాలను బహిర్గతం చేసిందని అన్నారు.
రసాయన పరిశ్రమలు లాభాపేక్షతో కనీస భద్రతా నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి కొనసాగించడం అమానుషమని, ఇది కేవలం నిర్లక్ష్యం కాకుండా నేరమని పేర్కొన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు.

కాలుష్య నియంత్రణ అధికారులు, కార్మిక శాఖ, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయని అన్నారు. పరిశ్రమలపై పర్యవేక్షణ లేకపోవడం, నిబంధనల పాటించాలపోవడం వల్ల కార్మికులు నిత్యం ప్రాణభయంతో పనిచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ కార్మికులకు అత్యాధునిక వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య బృందాలను నియమించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, దీర్ఘకాలిక పునరావాస చర్యలు కూడా చేపట్టాలని సూచించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్మికుల భద్రతను విస్మరించి లాభాల కోసం పరుగులు తీసే కార్పొరేట్ ధోరణిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ యంత్రాంగం తన బాధ్యతను నిర్వర్తించి కార్మికుల ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్, మండల కార్యదర్శి ఎం డి అక్బర్, సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, నాయకులు బోడిగే సైదులు,జిల్లా యాదయ్య,బొంగోని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ్య, జిల్లా లక్ష్మయ్య,షేరిఫ్ బొల్గురి లింగయ్య, బొబ్బిల శంకర్ రెడ్డి, సీమ అంజయ్య, దేవేందర్, మిద్దెల రామలింగయ్య, తదితరులు ఉన్నారు.

Leave a Reply