TG | భారత రాజ్యాంగం అమూల్యమైనది…

TG | భారత రాజ్యాంగం అమూల్యమైనది…
- భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్
TG | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : మాతృభూమి కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగం చేసిన ఫలితంగా మనకు లభించిన భారత రాజ్యాంగం అమూల్యమైనదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ… మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని, ఎలాంటి భేదాభిప్రాయాలు లేని భారత నవసమాజ నిర్మాణమే రాజ్యాంగ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని, ప్రతి బాధితుడికి న్యాయం అందినప్పుడే భారత రాజ్యాంగానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. విధులను అంకితభావంతో నిర్వహించి ప్రజల మనసులు గెలవాలని సూచించారు. అనంతరం పోలీస్ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు, ఆర్ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
