డబుల్ బెడ్‌రూం ఇళ్లలో తీవ్ర తాగునీటి సమస్య..

డబుల్ బెడ్‌రూం ఇళ్లలో తీవ్ర తాగునీటి సమస్య..
వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకున్న ఆయన ఆదివారం ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు రోజుల తరబడి తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దారుణమన్నారు. అవసరమైన మౌలిక వసతులు ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలోనే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సమీపంలోనే ఈ సమస్య నెలకొన్నప్పటికీ పరిష్కారం కాకపోవడం ప్రస్తుత ప్రజాప్రతినిధుల పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తోందని విమర్శించారు. ప్రజలు ఇంతటి ఇబ్బందులు పడుతుంటే అధికార యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన గండ్ర వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని, లేదంటే తానే స్వంత ఖర్చుతో సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
