పట్టణ అభివృద్ధిలో సీసీ రోడ్లు..

పట్టణ అభివృద్ధిలో సీసీ రోడ్లు..
మున్సిపల్ వార్డుల సమగ్రాభివృద్ధి లక్ష్యం
సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ వార్డుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శనివారం పట్టణంలోని మొదటి వార్డులో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గౌరీ శంకర్, మున్సిపల్ కమిషనర్ మురళితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ప్రజా పాలన–పట్టణ ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ఈ విషయంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు వై. శ్రీనివాసులు, శారదమ్మ, రతన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
