2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పిలుపు

2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పిలుపు

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో శుక్రవారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల బృందం సమావేశమైంది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మార్చి 7న నిర్వహించనున్న మహా విజ్ఞాపన సభకు జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4/2019, 57/5/2021 మెమోల ప్రకారం 01-09-2004కు ముందు విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వివరాలు సేకరించినప్పటికీ పాత పెన్షన్ అమలులోకి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ అంశంలో పురోగతి కనిపించలేదని తెలిపారు.
గత సంవత్సరం జూలైలో తెలంగాణ హైకోర్టు 01-09-2004కు ముందు వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింప చేయాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ తీర్పుతో 20 సంవత్సరాలుగా పాత పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోలు, రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేస్తూ పాత పెన్షన్ అమలుపై ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 7న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహా విజ్ఞాపన సభకు వనపర్తి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు శివరాజ్, సురేందర్ రెడ్డి, నరసింహారావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply