TG | మట్టిలో మాణిక్యం పూనెం కావేరి

TG | మట్టిలో మాణిక్యం పూనెం కావేరి
TG | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పూనెం లక్ష్మణ్ మల్లీశ్వరి దంపతులు జన్మనిచ్చిన కుమార్తె పూనెం కావేరి భద్రాద్రి జిల్లా మణుగూరు పట్టణంలో గురుకులం పాఠశాల్లోని 7వ తరగతి విద్యనభ్యసిస్తుంది. బాలిక కావేరి సీఎం కప్ యోగాసనాల్లో తమ ప్రతిభను కనబరిచి భద్రాద్రి జిల్లాలో క్రీడాకారులు అధికారులు ఉద్యోగులు చూపరులకు ఆసక్తికరంగా విన్యాసాలు చేస్తూ తన సత్తాను చాటి జిల్లా స్థాయిలో ప్రధమంగా నిలిచి బహుమతిని అందుకోవడం గర్వకారణంగా ఉందని తల్లిదండ్రులు పూనెం లక్ష్మణ్ మల్లీశ్వరి తెలిపారు. ఏదేమైనా గిరిజన బాలిక మట్టిలో మాణిక్యంలా విద్యతో పాటుగా క్రీడలను సైతం రెండు కళ్ళుగా క్రమశిక్షణ, నైపుణ్యం పట్టుదలతో యోగాసనాలను ప్రదర్శనలతో అధికార్లను చూపరులను ఆకట్టుకుంది.
లక్ష్మీపురంలో తల్లిదండ్రులతో పాటు, గ్రామానికి ఆళ్లపల్లి మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టడంలో పూనెం కావేరి ఆదర్శంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థిని విద్యార్థులు పట్టుదల ఉంటే సాధించనిది లేదని, బాలుర కంటే బాలికలు దేనికి తీసిపోలేరని, పూనెం కావేరి జిల్లా సీఎం కప్ యోగాసనాలతో భద్రాద్రి జిల్లా ప్రథమ స్థాయిలో నిలిచి నిరూపించింది. క్రీడానైపుణ్యంలో ప్రతిభ కనపరిచినందుకు ఆళ్లపల్లి మండల అధికారులు, వ్యాపారులు, యువత, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మీడియా మిత్రులు పూనెం కావేరిని ప్రత్యేకంగా అభినందించారు.
