TG | సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి…

TG | సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి…
TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజ్ కుమార్ (సన్నీబాబు) పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రకటించిన 34 వార్డుల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పార్టీ ‘బి-ఫామ్’ పొందిన అభ్యర్థుల గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరగాలని సూచించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించాలన్నారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అధిష్టానం కఠినంగా ఉంటుందని సన్నీబాబు అన్నారు. ఎవరైనా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, అభ్యర్థుల గెలుపునకు ఆటంకం కలిగించినా వారిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. అందరూ అభ్యర్థుల విజయమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన కోరారు.
