తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ సినీ కార్మికుల సమ్మె మొద‌లైంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ షూటింగ్‌లకు హాజరు కావద్దని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఆగస్టు 4 (సోమవారం) నుండి 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ… నిర్మాతల నుండి వేతన పెంపునకు అంగీకరిస్తూ లిఖితపూర్వక నిర్ధారణ లేఖ అందిన తర్వాతే యూనియన్ సభ్యులు షూట్‌లకు హాజరు కావాలని పేర్కొంది. ఈ నియమాలు తెలుగు చిత్రాలకే కాకుండా ఇతర భాషల చిత్రాలకు కూడా వర్తిస్తాయని సమాఖ్య స్పష్టం చేసింది.

గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వేతనాలను 30 శాతం పెంచాల్సి ఉండగా, ఆ ఒప్పందం 2024 జూన్ 30న ముగిసింది. అయితే కొత్త వేతనాల విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదు.

తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున కేవలం 5 శాతం వేతన పెంపుదలకు మాత్రమే అంగీకారమిస్తున్నట్లు తెలియజేయగా, దీనిపై పలు సమావేశాలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కలగలేదు. ఫలితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమై కార్మికులకు లెటర్ విడుదల చేసింది.

ఈ ఆకస్మిక నిర్ణయం టాలీవుడ్‌లోని అనేక చిత్రాల షూటింగ్ షెడ్యూల్‌లను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్‌లు జోరుగా జరుగుతున్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు భారంగా మారుతుంది.

Leave a Reply