- పోలీసు కస్టడీలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
ఆంధ్రప్రభ, కాశీబుగ్గ (శ్రీకాకుళం జిల్లా) : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు 179 బి. ఎన్. ఎన్ ఎన్ నోటీసులు అందించి పోలీసు విచారణకు హాజరుకావాలని తెలిపారు. అదే విదంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు శిష్టుపై ఇచ్ఛాపురం పోలీసులు కేసు నమోదు చేసి ఆయనకు కూడా నోటీసులు అందించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు శనివారం మాజీ మంత్రి సిధిరి అప్పలరాజు, పట్టణ అధ్యక్షుడితో పాటు ఇచ్చాపురం వెళ్లి హంగామా చేస్తారనే అనుమానంతో పోలీసులు మాజీ మంత్రి సిధిరికి ముందస్తు చర్యలులో బాగంగా శనివారం ఉదయం నుంచి హౌస్ అరెస్టు చేశారు.

అంతే కాకుండా కాశీబుగ్గ సీఐ ఇంటికి వచ్చి మాజీ మంత్రిని విచారించి స్టేట్ మెంట్ తీసుకుంటారని సమాచారం పోలీసులు నుంచి రావడంతో అప్పలరాజు కూడా హౌస్ అరెస్టు లోనే ఉన్నారు. కానీ కాశీబుగ్గ సి.ఐ ఎప్పటికి రాకపోవడంతో మధ్యాహ్నం అప్పలరాజు స్వయంగా కాశీబుగ్గ పాలీస్ స్టేషన్కు వెళ్లి కాశీబుగ్గ సి.ఐ. పి.సూర్యనారాయణ ముందు విచారణకు హాజరయ్యారు. వలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన బూర్లె విజయ్ క్రిష్ణంరాజు ఫిర్యాదు మేరకు క్రైం నెంబర్ 486/2024 కేసుకు సంభందించి అప్పలరాజుకు నోటీసులు అందించినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలు అవుతున్న మంత్రి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాకపోవడం,
పాలీస్ స్టేషన్ వద్ద బారీగా పోలీసులు మోహరించి ఉండడం, గేట్లు వేసి ఉండడంతో ఏ క్షణాన అయినా మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేయవచ్చునని వైకాపా నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మాజీ మంత్రి అప్పలరాజు ఓ సంఘటనపై ప్రభుత్వ, పాలీసులు తీరుపై చేసిన వాఖ్యలపైనే ఆయనకు నోటీసు అందించి విచారిస్తున్నట్లు తెలుస్తుంది. క్రైమ్ నెంబర్ 486/2024 కేసులో బెయిల్ బుల్ సెక్షన్లు రెండు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు మాజీ మంత్రిపై నమోదు చేయడంతో అప్పలరాజును విచారించి విడిచిపెట్టవచ్చని, లేదా రాత్రి వరకు విచారణ కొనసాగించి చివరి నిముషంలో అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశాలు కూడా ఉండడంతో మాజీ మంత్రి ఏ క్షణానైనా అవకాశం ఉందని విశ్లేషకులు బావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల సమయం అవుతుండగా కాశీబుగ్గ పొలీస్ స్టేషన్ ఎదుట, పాత్రికేయులు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వేచి ఉండి ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

