చిట్యాల సుజన థియేటర్‌లో ఉద్రిక్తత..

చిట్యాల సుజన థియేటర్‌లో ఉద్రిక్తత..
- ఉస్తాద్ భగత్ సింగ్ షో రద్దు..
- టికెట్ డబ్బులు వాపస్..
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని సుజన సినిమా థియేటర్ వద్ద గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ షో ప్రదర్శన సందర్భంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షోను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్‌కు చేరుకున్నారు. అయితే.. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సౌండ్ సిస్టంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. డైలాగులు వినిపించకపోవడం, సౌండ్ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన ప్రేక్షకులు షో మధ్యలోనే బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.
థియేటర్ లోపల సౌకర్యాలు లేవని, నాణ్యమైన సౌండ్ సిస్టం లేకుండా షో ఎలా వేస్తారని యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో యాజమాన్యానికి, ప్రేక్షకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో థియేటర్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఫస్ట్ షో చూస్తున్న ప్రేక్షకులకు టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేసి సర్దిచెప్పింది. ఫస్ట్ షో గందరగోళం కారణంగా సాంకేతిక సమస్య సద్దుమణగకపోవడంతో, యాజమాన్యం సెకండ్ షోను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటికే సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు పరిస్థితిని తెలుసుకుని తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.
