TTD | శ్రీవారి మెట్టు వద్ద టోకెన్ జారీలో తాత్కాలిక మార్పు..

తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళ్ళే భక్తులకు ముఖ్య సమాచారం. టీటీడీ తాత్కాలికంగా టోకెన్ల జారీ కౌంటర్లను శ్రీవారి మెట్టు నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు మార్చింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి టిటిడి ఈవో జె.శ్యామలరావు మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా టిటిడి అధికారులతో సమీక్షించారు..

టోకెన్ల జారీ విధానం

ఆధార్ చూపిన భక్తులకు ముందు వచ్చిన వారికి ముందు (First Come, First Serve) ప్రాతిపదికన టోకెన్లు జారీ చేయ‌నున్నారు. నివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టులో 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయాలి

SSD టోకెన్లు కూడా అదే ప్రాంగణంలో

ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉండ‌నున్నాయి.

భద్రత & వసతులపై ప్రత్యేక దృష్టి

భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టిటిడి విజిలెన్స్, సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించి, టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వి. వీరబ్రహ్మం, టీటీడీ ఇన్‌చార్జి సీవీఅండ్ఎస్‌వో, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, సీఈ టి.వి. సత్యనారాయణ, ఎస్ఈలు మనోహరం, వెంకటేశ్వరులు, జీఎం (ట్రాన్స్‌పోర్ట్‌) శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, సెల్వం, గోవింద రాజన్, సోమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply