Temple Tank | భక్తి, బాధ్యత కలిసిన సేవా యజ్ఞం

Temple Tank | భక్తి, బాధ్యత కలిసిన సేవా యజ్ఞం
Temple Tank | ఆంధ్రప్రభ ప్రతినిధి, అవుకు రూరల్ : ఎర్రమల కొండల నడుమ విరాజిల్లే ప్రముఖ పుణ్యక్షేత్రం కంబగిరి స్వామి ఆలయం తన పురాతన నిర్మాణ శైలితో, ప్రకృతి సోయగాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ ఆలయ పరిసరాల్లోని ప్రతి నిర్మాణం చరిత్రను చెబుతుంటే, అందులో భాగమైన రాజుగారి కోనేరు కూడా ఒకప్పుడు వైభవానికి ప్రతీకగా నిలిచింది.
కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురైన ఈ కోనేరు శిథిలావస్థకు చేరింది. శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఈ జలాశయం చెత్తాచెదారాలతో నిండి, ముల్లకంపల మధ్య కనిపించే పరిస్థితికి దిగజారింది. భక్తులకు ఇబ్బందికరంగా మారిన ఈ దృశ్యం స్థానికులను కలచివేసింది.
ఈ పరిస్థితిని మార్చేందుకు పురాతన సంపద పరిరక్షణ సేన సభ్యులు, స్థానిక యువకులు ముందుకు రావడం విశేషం. ఆలయ నిర్వాహకులు గూడాల మురళీధర్ రెడ్డి, ప్రతాపరెడ్డి చొరవతో పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. వారి పిలుపుకు స్పందించిన యువత, గ్రామస్థులు కలిసి సేవా కార్యక్రమంగా కోనేరును శుభ్రపరిచే పనులు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కోనేరులో పేరుకుపోయిన శిథిలాలను తొలగించి, పరిసరాలను శుభ్రపరిచారు. దీంతో ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఈ చారిత్రక కోనేరు మళ్లీ పూర్వ వైభవం వైపు అడుగులు వేస్తోంది.
ఈ కార్యక్రమంలో గూడాల ప్రతాపరెడ్డి, ఎస్సై అశోక్, కునుకుంట్ల గ్రామ ప్రజలు పాల్గొని తమ వంతు సేవ అందించారు. భక్తి భావం, బాధ్యతా స్పూర్తి కలిసిన ఈ చర్య స్థానికంగా ఆదర్శంగా నిలుస్తోంది.
పురాతన వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది. ఇలాంటి ప్రయత్నాలు కొనసాగితే కంబగిరి స్వామి ఆలయం పరిసరాల అందం మరింత పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
