Temple | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణం..

Temple | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణం..
- సంక్రాంతి పండుగతో తగ్గిన భక్తుల తాకిడి..
- భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఆలయ అధికారుల ఏర్పాట్లు
Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రాకతో ఈ రోజు రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. సాధారణంగా ఆదివారాల్లో అధికంగా కనిపించే భక్తుల తాకిడి, సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం కావడంతో ఈసారి ఓ మోస్తరుగానే ఉంది. పండుగ ఏర్పాట్లు, సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణాల్లో భక్తులు నిమగ్నమవ్వడం వల్ల ఆలయానికి వచ్చే వారి సంఖ్య సగటునే ఉందని అధికారులు పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ సౌకర్యాలు కల్పించడంతో పాటు దర్శన ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా పండుగ సెలవుల్లో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.

