హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాతలు, దర్శకుల ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా ఆయన ఈ భరోసా ఇచ్చారు.

సినిమా కార్మికుల సమస్యల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకుంటే పరిశ్రమకు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.

పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి స్కిల్స్ పెంపు అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సినీ పరిశ్రమకు అవసరమైన ట్రైనింగ్ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

తెలుగు సినిమా రంగం తెలంగాణలో ఒక ప్రధాన పరిశ్రమగా ఎదిగిందని సీఎం అన్నారు. ఇలాంటి సమయంలో వివాదాలు రాకూడదనే ఉద్దేశంతోనే కార్మికుల సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ చూపిందని వెల్లడించారు. నిర్మాతలు, కార్మికుల మధ్య వ్యవస్థబద్ధమైన నియమావళి అవసరమని సూచించారు.

తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని, తెలుగు సినిమా పరిశ్రమను ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, డివివి దానయ్య, చెరుకూరి సుధాకర్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, శరత్ మరార్ తదితరులు హాజరయ్యారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply