ప్రపంచానికి చాటాలి
కాకతీయుల అపూర్వ శిల్ప సంపదను కాపాడుకొందాం
ఖిలావరంగల్ కు పురావస్తు ప్రదర్శనశాలను తరలించాలి
శాసనాల సంరక్షణకై మరిన్ని చర్యలు చేపట్టేలా కృషి చేస్తా
జిల్లా పురావస్తుశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ కావ్య
(ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్) : పురాతన శిల్పకళ, కాకతీయ శిలాశాసనాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయని, వీటి సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య (Kadiyam Kavya) హామీ ఇచ్చారు. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా విల్లాసిల్లిన ఓరుగల్లును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషిని సాగిస్తానని స్పష్టం చేశారు. ఉద్యోగావకాశాలు అంతగా లేని వరంగల్ లో ఉపాధి అవకాశాలు పెంపొందించే చర్యలు చేపట్టాల్సిన అవసరముందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అభిప్రాయ పడ్డారు. వరంగల్ జిల్లా (Warangal District) పురావస్తు పరిశోధన, ప్రదర్శనశాలను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ వెనుక భాగంలోని పురావాస్తు శాఖ మ్యూజియం స్థితిగతులను స్వయంగా పరిశీలించారు.

మ్యూజియం (Museum) లో ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఎంపీ పరిశీలించారు. అపూర్వమైన కాకతీయ సంపదను భద్రపర్చిన మ్యూజియంను సందర్శించే సందర్శకుల రాకపోకలు అంతంత మాత్రంగా ఉండడాన్ని అడిగి తెలుసుకొన్నారు. అపూర్వమైన, అబ్బురపరిచే అద్భుతమైన కాకతీయ శిల్ప, కళా సంపద కొలువై ఉన్న ఖిలా వరంగల్ కు జిల్లా మ్యూజియం తరలించాల్సిన అవసరాన్ని గుర్తించారు. సుదూర ప్రాంతాల నుండి కాకతీయ శిల్పసంపధను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు అన్నీంటిని ఒకే చోట తిలకించి, మైమరపించే అవకాశాలు కల్పించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అభిప్రాయ పడ్డారు.

ఓరుగల్లు చరిత్ర, కాకతీయుల సంస్కృతి, కళాసంపద తెలంగాణ (Telangana) రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాంతపు వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. జిల్లా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సంరక్షణ పనుల గురించి ఎంపీ డా.కడియం కావ్య ఆరా తీశారు. జిల్లా పురావస్తు అధికారులు ఎంపీకి వివిధ శిల్ప సంపద, ప్రాచీన నాణేలు, శాసనాల చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.