Telangana | ఇద్దరు అరెస్ట్

Telangana | ఇద్దరు అరెస్ట్

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నగరంలోని పాతబస్తీలో అక్రమంగా నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ (చార్మినార్ జోన్) పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చాదర్‌ఘాట్ పరిధిలో నిర్వహించిన దాడిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు ఓల్డ్ మలక్‌పేటకు చెందిన షేక్ సమీర్, వసీం ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు కొంతకాలంగా నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని ‘మెఫెంటెర్మైన్’ అనే నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి 20 నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఈ డ్రగ్స్‌ను ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసుల ద్వారా తెప్పిస్తున్నట్లు వెల్లడైంది.

అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని జిమ్ బాడీ బిల్డర్లు, యువతకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఇంకా ఎవరెవరికి ఈ ఇంజెక్షన్లు చేరుతున్నాయి? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply