Telangana – మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు ?
హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. బహుశ మార్చి లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉద్యోగులు, అధికారులతో వరస భేటీలతో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీబిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలకు క్యాడర్‌ను కూడా సిద్ధం చేయనున్నారు.
రేపు కులగణన ముసాయిదా నివేదిక
తెలంగాణలో నిర్వహించిన బీసీ కులగణన ముసాయిదా నివేదికను అధికారులు సిద్ధం చేసి శనివారం సబ్‌కమిటీకి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి మూడో తేదీన సబ్‌కమిటీ సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించనుంది. అలాగే 5న కేబినెట్‌లో ముసాయిదాకు ఆమోదించి, ఏడో తేదీన ఏర్పాటు చేయనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెడటతారని తెలుస్తోంది.
ఎన్నికల ప్రక్రియ
ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 10 లేదా 12వ తేదీన రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ ప్రకటన విడుదల అవుతుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 15న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి లో పోలింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. మార్చి ఐదో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉన్నందున్న మార్చి ఐదో తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.