TG | పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ : డిప్యూటీ సీఎం భట్టి

పెట్టుబడులకు యువ రాష్ట్రమైన తెలంగాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ బృందం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కాన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా భారతదేశ వాణిజ్య అభివృద్ధిలో తెలంగాణ పాత్రను, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అతిథులకు వివరించారు. ఈ సమావేశంలో యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ సభ్యులు, యూరప్‌ దేశాల రాయబారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల విధానాలు రూపొందించడం, క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని విందు సమావేశానికి హాజరైన యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధి బృందానికి వివరించారు.

తెలంగాణలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్తు, పారిశుద్ధ్య వ్యవస్థ, రవాణా వంటి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దావోస్‌ లోని ప్రపంచ ఆర్థిక వేదిక సమ్మిట్‌లో పాల్గొనడం ప్రారంభించామని, గత రెండు ఎడిషన్లలో తెలంగాణ రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం రూపొందిస్తున్న పాలసీలకు పెట్టుబడిదారుల నుంచి విశేష మద్దతు, విశ్వాసానికి దావోస్‌లో కుదిరిన వ్యాపార ఒప్పందాలు నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.

యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు త‌మ‌ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను అభివృద్ధి చేసుకునేందుకు భారతదేశంలోని రాష్ట్రాలతో నేరుగా పని చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఉర్సులను కోరారు.

యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలకు తెలంగాణను పరిచయం చేయడానికి యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్షుని సహకారం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. సమావేశంలో ప్రెసిడెంట్‌ సంజీవ్‌ పురి, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *