మే 15 నుంచి పుష్కర మహోత్సవం
పుణ్య స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
కాళేశ్వరంలో సరస్వతీ మాత ఏకశిలా విగ్రహం ఏర్పాటు
రోజుకో మఠాధిపతి పుణ్య స్నానం చేసేలా ప్లాన్
రోజుకు లక్ష మంది వస్తారని అంచనాలు
2013 త్వరాత మళ్లీ ఇప్పుడు పుష్కరాలు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణంలో మే 15 నుంచి 26వ తేదీ వరకూ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే పుష్కరాలకు సంబంధించిన పోస్టర్, వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కాళేశ్వరం వేదికగా..
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది పుష్కరాలు మే నెల 15 నుంచి 26వ తేదీ వరకూ జరుగుతాయి.
దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను, పోస్టర్‌ను మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. సరస్వతీ పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
భక్తుల కోసం ఏర్పాట్లు
ఆలయాల దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. 12 రోజులపాటు కాశీ నుంచి వచ్చే పండితులతో ప్రత్యేక హోమాలు, హారతులు నిర్వహిస్తారు. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహితతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. 2013లో సరస్వతీ పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాలకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛతీస్‌గఢ్ నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల కోసం వంద పడకల టెంట్ సిటీని ఏర్పాటు కూడా చేయనున్నారు.

రోజుకో పీఠాధిపతి పుణ్యస్నానాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహించనున్నందున కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమ తీరంలో గతంలో తేది 2013 లో మే 30 నుంచి జూన్ 10వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. వచ్చే నెల 15 వ తేదీ నుంచి 26 వరకు “12” రోజులు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతీ రోజు ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేయనున్నారు.

పుష్కర ప్రారంభం రోజు మే 15న శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుంచి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి సరస్వతి పుష్కరాలను ప్రారంభిస్తారు. మూడవ రోజు మే 17 న తుని తపోవనం పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, మే18 పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి , మే 19 న నాసిక్ త్రయంబకేశ్వర్ శ్రీ శ్రీ శ్రీ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి పుష్కర స్నానం ఆచరిస్తారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సుమారు 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వచ్చి పుష్కర స్నానం చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారని ప్రభుత్వం అంచనా. ఇందుకు భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు అధికారులు చేపట్టారు.