Telangana రేపే ఇంట‌ర్ రిజ‌ల్ట్స్

హైదరాబాద్, : తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2024-25 ఫలితాలు మరికొన్ని గంటల్లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్‌ ఫీలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు.


పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే ఐవీఆర్‌ పోర్టల్‌ 9240205555 ఫోన్‌నంబర్‌ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మొత్తం 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి ప్రారంభమైన ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్‌ 10వ తేదీతో ముగిసింది. ప్రతి సెంటర్‌లో దాదాపు 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొని సకాలంలో మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేశారు.

ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను అధికారులు మంగళవారం ఫలితాలు విడుదల అనంతరం వెల్లడిస్తారు. అనంతరం ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *