టీమిండియా సూపర్ కంబ్యాక్ !

- మూడో టీ20లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం
హోబార్ట్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. బెల్లెరైవ్ ఓవల్‌లో తొలిసారిగా టీ20 మ్యాచ్ ఆడిన భారత జట్టు, స్టైలిష్ బ్యాటింగ్‌తో ఈ మైదానాన్ని స్మరణీయంగా మార్చుకుంది. ఇదే కాకుండా, ఇది ఆస్ట్రేలియా జట్టుకి హోబార్ట్‌లో తొలి టీ20 ఓటమిగా నమోదైంది.
ఆసీస్ కు అర్ష్‌దీప్ దెబ్బ..
టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. ఆపై రెండో ఓవర్లో జోష్ ఇంగ్లిస్‌ను ఔట్ చేస్తూ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుదిపేశాడు.
అయితే, నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ తన హోమ్ గ్రౌండ్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 38 బంతుల్లో 74 పరుగులు బాదిన అతడు 8 ఫోర్లు, 5 సిక్సర్లతో ఆడాడు. అతని భారీ షాట్లలో ఒకటి స్టేడియం రూఫ్‌ను దాటేలా 129 మీటర్ల దూరం వెళ్లింది.
డేవిడ్ కి తోడుగా మార్ష్ కూడా దంచేశాడు. వీరి జోడీగా మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. కానీ, మార్ష్ పెద్దగా రాణించలేక 10 పరుగులకే ఔటయ్యాడు. కీలక సమయాల్లో మార్ష్, ఆ తర్వాత ఓవెన్ వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తి భారత ఇన్నింగ్స్‌కు ఊపిరి పోశాడు. డేవిడ్ రాణిస్తుండగా, శివమ్ దూబే అద్భుతమైన బౌలింగ్‌తో అతన్ని ఔట్ చేశాడు. టిలక్ వర్మ బౌండరీ వద్ద అద్భుత క్యాచ్ పట్టాడు.
మ్యాథ్యూ షార్ట్ (26*) – స్టోయినిస్ (64) జోడీ ఆఖర్లో బౌలర్లపై విరుచుకుపడి స్కోరును 186/6కి చేర్చింది. అర్ష్‌దీప్ 3/34తో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 2/33తో సహకరించగా, బుమ్రా–అక్షర్ బాగానే బౌల్ చేసినా వికెట్లు దక్కలేదు.
రన్ చేజ్లో సూపర్ స్ట్రోక్స్..
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాథన్ ఎల్లిస్ వారిద్దరినీ త్వరగానే అవుట్ చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో 24 పరుగులతో మెరిశారు. తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (17) కూడా త్వరగా పరుగులు సాధించారు.
ఇక ఆ తరువాత వచ్చిన వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మలు తమ రీ-ఎంట్రీలతో సత్తా చాటారు. ఇద్దరూ చక్కటి ఇన్నింగ్స్‌తో భారత్ విజయం సాధించేందుకు దారితీశారు. వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 49 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్సర్లు). జితేష్ శర్మ 22*(13)తో నాటౌట్‌గా నిలిచారు. చివరగా 19వ ఓవర్లో జితేష్ విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో భారత్ 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్ 3/36తో ఆకట్టుకున్నా, సీన్ అబ్బోట్ 3.3 ఓవర్లలో 0/56 పరుగులు ఇచ్చాడు. ఇక తదుపరి మ్యాచ్ గోల్డ్‌కోస్ట్‌లో జరగనుంది. ఈ విజయంతో, భారత్ మరోసారి సిరీస్‌పై పట్టు సాధించారు.
