IND vs SA T20 | బోణీ అదిరింది…

- తిలి టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్ షో…
కటక్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా సంచలన విజయంతో ప్రారంభించింది. కటక్ వేదికగా ఈరోజు (డిసెంబర్ 9) జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో హార్దిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్, ఆరుగురు బౌలర్ల ప్రదర్శన కీలకంగా నిలిచింది.
హార్దిక్ పాండ్యా విధ్వంసం!
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమాన్ గిల్ (4), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (11), అభిషేక్ శర్మ (17) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో భారత్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) కాసేపు క్రీజ్‌లో నిలబడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా… పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయారు. 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్‌కు ఆపద్బాంధవుడిగా నిలిచాడు హార్దిక్ పాండ్యా.
హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దూబేతో కలిసి పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా.. ముఖ్యంగా 16వ ఓవర్లో మహారాజ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి స్కోర్ బోర్డు వేగాన్ని అమాంతం పెంచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగింది.
సఫారీలను కూల్చేసిన భారత బౌలర్లు!
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్‌ను డకౌట్ చేసి అర్షదీప్ సింగ్ టీమిండియాకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత అర్షదీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కలిసి సఫారీ బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీశారు.
వీరి ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. కేవలం 12.3 ఓవర్లలోనే సౌతాఫ్రికా జట్టు 74 పరుగులకే ఆలౌట్ అయింది.
టీమిండియా బౌలర్లందరూ వికెట్లు పడగొట్టడం ఈ మ్యాచ్‌లోనే హైలైట్! జస్ప్రీత్ బుమ్రా (2/17), అర్షదీప్ సింగ్ (2/14), వరుణ్ చక్రవర్తి (2/19), అక్షర్ పటేల్ (2/7) తలో రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా (1/16), శివమ్ దూబే(1/1)లకు తలో వికెట్ దక్కింది.
ఈ భారీ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
