తుది పోరుకు టీమిండియా రెడీ…

- నేడు ఆసీస్‌తో భారత్ చివరి టీ20
- కంగారూలను కట్టిపడేయడమే లక్ష్యం…
బ్రిస్బేన్, (ఆంధ్రప్రభ): టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య నేడు కీలకమైన ఐదవ టీ20 మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2–1 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది.
ఇక ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా మాత్రం కనీసం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 2–2తో సమం చేయాలని సంకల్పంతో బరిలోకి దిగనుంది. దీంతో ఈ తుది పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టీ20ల్లో అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. బ్యాటింగ్ విభాగం కొద్దిగా తడబడుతున్నా, బౌలర్లు మాత్రం అద్భుత ఫామ్‌తో జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు.
సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. అయితే, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తిరిగి బౌన్స్ బ్యాక్ అయి వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా మూడో టీ20లో సూర్యకుమార్ సేన కంగారూలను చిత్తు చేయగా, నాలుగో మ్యాచ్‌లో బౌలర్లు విజృంభించి జట్టుకు విజయం అందించారు. ఇక నేడు జరగనున్న తుది పోరులో భారత్ అదే జోరును కొనసాగించాలనే ధీమాతో ఉంది.
గత మ్యాచ్‌లో భారత సారథి బ్యాట్ ఝుళిపిండటంతో అతడి ఫామ్‌పై ఉన్న ఆందోళన కాస్త తగ్గిందనే చెప్పాలి. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌పై మళ్లి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తిలక్ వర్మ, జితేశ్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో తలో చేయి వేస్తే టీమిండియా భారీ స్కోరు సాధించం ఖాయం.
బౌలింగ్ విభాగంలో బుమ్రా, అర్ష్‌దీప్, శివమ్ దూబే పేస్ దాడికి బలం చేకూరుస్తుండగా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు అదనపు మద్దతు అందిస్తున్నారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా నిరంతరం మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా నేటి తుది పోరులోనూ అదే ధాటిని కొనసాగించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇక మధ్యాహ్నం 1.45 గంటల నుండి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), జోష్ ఫిలిప్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా.
