ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లను పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేయాలి
ఉమ్మడి మెదక్ బ్యూరో, మే 27 ( ఆంధ్ర ప్రభ): ప్రభుత్వ ఉపాధ్యాయులు టెక్నాలజీనీ ఉపయోగించుకొని పాఠాలు బోధించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించారు. ఉపాధ్యాయుల శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సెలవు రోజుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శిక్షణ శిబిరాలకు రావడం అభినందనీయన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉందని, విద్యా బోధనా ఫలితాలు అద్భుతమని కొనియాడారు. ఉపాధ్యాయుల కృషితో ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులుగా మారుతున్నారన్నారు.
ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి, నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. గతంలో బడికి రాని విద్యార్థులను ఇంటి వరకు వెళ్ళి ఎందుకు రావడం లేదని అడిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనీ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని, తల్లిదండ్రులను మేల్కొలిపి విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా కృషి చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఇరువురు కలిసి విద్యార్థుల సంఖ్యను పెంచే పాత్రలో ప్రధాన భూమిక పోదించాలని చింతా పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, ఎంఈఓ విద్యాసాగర్, పట్టణ కార్యదర్శి నర్సింలు, మాజీ కౌన్సిలర్ రామప్ప, ఎర్రోళ్ల చిన్న, మల్లేశం ఉపాధ్యాయులు ఉన్నారు.
