Teachers | ఉపాధ్యాయులు యంత్రాలు కాదు..

Teachers | ఉపాధ్యాయులు యంత్రాలు కాదు..

Teachers | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులు యంత్రాలు కాదని, వారి పై మోపుతున్న అనవసరమైన పని భారం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చెన్నూరు తాహెర్ వలి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంవత్సరంలోని 12 నెలల్లో 12 రకాల పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని ఆయన అన్నారు. జూన్ నెలలో అడ్మిషన్లు, రికార్డుల నిర్వహణ, జూలై నుంచి నవంబర్ వరకు సిలబస్ పూర్తి చేయాలనే ఒత్తిడి, డిసెంబర్ నుంచి మార్చి వరకు పునశ్చరణ తరగతులు, ప్రత్యేక తరగతులు, ఏప్రిల్‌లో మూల్యాంకనం అంటూ ఉపాధ్యాయుడు ఒక యాంత్రిక విధానంలో పని చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు బోధకుడిగా కాకుండా ఇతర కార్యక్రమాలతో నిమగ్నమై యంత్రంలా మారిపోయాడని అన్నారు.

పదవ తరగతి ఫలితాల కోసం ఉపాధ్యాయుల పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని, ఒక వైపు విద్యార్థుల ప్రమాణాలు పెంచాలని, మరో వైపు మంచి ఫలితాలు సాధించాలని చెప్పడం వల్ల ఉపాధ్యాయులు రెండింటి మధ్య నలిగిపోతున్నారని అన్నారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు, రోజువారీ పరీక్షలు, వెంటనే మూల్యాంకనం చేసి మార్కులను యాప్‌లలో అప్లోడ్ చేయాలనే విధానం బోధన నాణ్యతను మెరుగుపరచడం లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరినీ మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని పేర్కొన్నారు.

ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఉపాధ్యాయుల పై ఇంతటి ఒత్తిడి లేదని, అక్కడ ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితం అవుతారని తెలిపారు. కానీ మన రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉండటంతో ఒక్క ఉపాధ్యాయుడే బోధన, హాజరు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, రికార్డుల సంరక్షణతో పాటు తల్లిదండ్రులు–అధికారుల మధ్య వారధిగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనే ఆదేశాలు కూడా అదనపు భారంగా మారుతున్నాయని అన్నారు.

బోధన అనేది భావోద్వేగ సంబంధం పై ఆధారపడాలని, భయం పై కాకూడదని తాహెర్ వలి స్పష్టం చేశారు. పిల్లలతో మాట్లాడినా, మందలించినా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. పాలకులు, అధికారులు, తల్లిదండ్రుల అంచనాలు వేర్వేరుగా ఉండటంతో ఉపాధ్యాయులు అయోమయ స్థితికి గురవుతున్నారని తెలిపారు. రెండవ శనివారాలు, ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా పని చేయించడం, వంద రోజుల ప్రణాళికల పేరుతో కొంతమంది ఉపాధ్యాయులపై అధిక భారం వేయడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతోందని అన్నారు. చివరికి ఈ ఒత్తిడి పెరిగితే విద్యార్థులు, సమాజం, దేశం నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఉపాధ్యాయులకు స్వేచ్ఛగా, భయంలేని వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన చేసే పరిస్థితిని ప్రభుత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply