చెన్నై, ఆంధ్రప్రభ : పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి భారత దేశ అభివృద్ధి యాత్రలో ఒక మైలు రాయి అని ప్రధాని మోదీ అన్నారు. ₹535 కోట్లతో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బిడ్జిని ఆదివారం ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంతెన రామేశ్వరం యాత్రికులకు, స్థానిక ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. శ్రీలంక పర్యటన ముగించుకుని నేరుగా తమిళనాడు చేరుకున్న ప్రధాని చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.

ఆర్థిక వృద్ధికి తోడ్పాటు..
తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ రైల్వే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది. ఈ కొత్త వంతెన వల్ల రైలు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడనుంది. ఈ కొత్త వంతెన 1914లో నిర్మించిన పాత పంబన్ బ్రిడ్జికి బదులుగా ప్రత్యామ్నాయంగా నిర్మించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు, రైల్వే అధికారులు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
