మన సంస్కృతిలో తామర పూవుకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. దీనిని సంస్కృతంలో తామరసం అంటారు. ”తామ్యద్భి: రస్యత ఇతివా” అని తామరసమనే పదానికి వ్యుత్పత్తి. అంటే బడలిన (అలసిపోయిన) వారిచేత ఆస్వాదించబడేది అని అర్థం. మన కన్నులకు తన అందంతో విందుచేసి, మన అలసిపోయిన మనసుకు ఆనందాన్ని అందించే ఈ తామర పూవులు అంటే మనకే కాదు, దేవతలకూ ఎంతో ఇష్టమని పురాణాలు తెల్పుతున్నాయి. పద్మాలయ, పద్మప్రియ, పద్మహస్త, పద్మాక్షి, పద్మ సుందరి, పద్మోద్భవ, పద్మముఖి, పద్మమాలాధర, పద్మిని, పద్మ గంధిని అంటూ మహాలక్ష్మిని స్తుతించింది స్తోత్ర వాజ్మయం. పద్మం, అరవిందం, రాజీవం మొదలుగా తామర పువ్వుకు ఎన్నో పర్యాయ పదాలున్నాయి. సరస్వతీ దేవి పద్మవాసిని. విష్ణువు పద్మనాభుడు. బ్రహ్మ పద్మోద్భవుడు. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి సహస్రదళ పద్మాలతో పార్వతీ దేవిని ఆరాధించినట్లు శ్రీమద్రామా యణం వెబుతోంది.
తామర పువ్వును పంకజం అనికూడా అంటారు. పంకం అంటే బురద. తాను బురదలో జన్మించినా తన వికాసాన్ని కోల్పోక, ఆ బురదను తాను అంటించుకోక, సుగంధాన్నే వెదజల్లే పద్మంలాగా ధీమంతులు శోభిస్తారంటుంది నీతి శాస్త్రం.
తామర పువ్వు నిరంతరం నీటిలోనే ఉన్నా ఆ నీటి బిందువులను తనకు అంటించుకోదు. ”తామరాకుపై నీటి బొట్టు వలె” ఈ ప్రపంచంలో జీవిస్తున్నా జ్ఞానులు ప్రాపంచిక విషయాలు పట్టించుకోరు. అలాంటి వారి హృదయ కమలములలో పరమాత్మ కొలువై ఉంటాడు అని మన ఆధ్యాత్మిక గ్రంథాలు తామర పూవుకు మహూన్నత స్థానాన్ని కల్పించాయి.
తామర వేళ్ళు, దుంపలు, నీటి అడుగు భాగంలో ఎక్కడో ఉన్నా, దాని వెడల్పాటి ఆకులు నీటి ఉపరితలంపైన అందంగా పరచుకొని కనుల విందు చేస్తూంటాయి. కేవలం బురదలోనుండి తటి అద్భుతమైన సౌందర్యం ప్రభవించడం, భావుకుల మనసులను దోచుకొ ని వారిచేత ఎన్నో గొప్ప కృతులను వ్రాయించగలిగే సాహిత్య వస్తువు కావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అనువైన పరిస్థితులలో తామర దుంప, తామర గింజలు వందేళ్ళ దాకా సజీవంగా ఉంటాయనీ, వాటి గింజలను నాటితే మొలకెత్తుతాయనీ శాస్త్రీయంగా నిరూపించబడింది.
తామరపూలు, గింజలు తింటే ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తొలగిపోతుందని గ్రీకుల నమ్మకం. ఔషధీ విలువలు ఎక్కువగా ఉన్న తామరపూలకే సరాలను తేయాకుతో కలిపి చైనీయులు తేనీరు తయారుచేసి సేవిస్తారు. తామరపూలలోని కేసరాలను, కాడలను, అతిసార వ్యాధి, కామెర్లు, గుండె జబ్బుల నివారణకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. తామర పూల రసం సేవిస్తే దగ్గు, మూలవ్యాధి, రక్తస్రావం నయమవుతాయని, అనేక చర్మ వ్యాధులకు, కుష్ఠు వ్యాధి నివారణకు కూడా తామరపూలు, ఆకులు ఉపయోగపడతాయి అని అంటారు.
‘తామర’ అనేది ఒక చర్మ వ్యాధికి కూడా పేరు. ఇది ఒక అంటు వ్యాధి. తామర పూలు చెరువంతా పరచుకొన్నట్లు ఈ చర్మ వ్యాధి శరీరంలో ఎక్కడ ప్రారంభమైనా సరియైన చికిత్స తీసుకోకపోతే దేహమంతా అలుముకొంటుంది. దీని వల్ల కలిగే తీవ్రమైన దురదను భరించడం దుర్భరం అంటారు. ఈ వ్యాధి బారినపడిన ఒక చాటు కవి ఇలా అంటాడు ”బొడ్డు తామర వానికి పుట్టినాడు/ ముడ్డి తామర వాడు సముద్వహించె / కేలి తామరదాని తత్కత జగాన / తామరలకేమి తామర తంపరాయె”. నాభిలో తామర కల్గిన వాడు శ్రీహరి. అతని బొడ్డు తామర నుండి పుట్టిన వాడు బ్రహ్మ. ఆయన ‘చేతిలో తామర ఉన్న’ సరస్వతీ దేవిని వివాహమాడాడు. వారి సృష్టిలో ఇక తామర తంపరగా ఈ తామర (వ్యాధి) వ్యాపించింది అని అర్థం. కవులు నిరంకుశులు కదా !
- గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి.