జిల్లా బాలమేళాలో ఆళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎఫ్‌ఎల్‌ఎన్ బాలమేళా–2.0 కార్యక్రమాన్ని ప్రాథమిక స్థాయి విద్యార్థుల సామర్థ్యాలను మూల్యాంకనం చేయడానికి గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జిల్లా స్థాయి బాలమేళాలో ఆళ్లపల్లి మండలంలోని ఎంపీపీఎస్ వలసల్లా పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కొమరం శాంతారావు తెలిపారు.
జిల్లా స్థాయిలో నిర్వహించిన లైబ్రరీ, రీడింగ్, స్టోరీ టెల్లింగ్, ఎఫ్‌ఎల్‌ఎన్ లెర్నింగ్–2 విభాగాల్లో 23 మండలాల నుంచి ప్రతి తరగతికి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి పోటీలు నిర్వహించారు. ఆళ్లపల్లి మండలం నుంచి ఎంపీపీఎస్ వలసల్లా పాఠశాల నుండి ఆరు మంది, ఎంపీపీఎస్ ఆళ్లపల్లి నుండి ఇద్దరు, ఎంపీయుపీఎస్ పాతూరు నుండి ఒకరు, ఎంపీపీఎస్ రాఘవాపురం నుండి ఒకరు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
ఈ పోటీల్లో రెండో తరగతి విభాగంలో వలసల్లా పాఠశాల విద్యార్థి ఆరెం వినయ్ తేజ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. విజేతలకు కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్, జిల్లా విద్యాశాఖ అధికారి సుమతి నాగలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారి ఉపాధ్యాయులు పార్వతి, కవితతో పాటు ఎంఈఓ శాంతారావు, మర్కోడ్ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ బాబులాల్, డీఆర్‌పీ రాందాస్, ఎంఆర్‌పీలు హతీరామ్, శ్రీనివాసరావు, రామకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో మండల ఎంఆర్‌పీ హతీరామ్, వలసల్లా పాఠశాల హెచ్‌ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.
