AWARDS | బాపట్ల, ఆంధ్రప్రభ : కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో సూర్యలంక సముద్ర తీరాన వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత ఉసిరి చెట్టుకు పూజలు చేసి కార్తీక వన సమారాధన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా జిల్లాలోని కాపు విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలోని 564 మంది పేద కాపు విద్యార్థులకు రూ .23 లక్షలు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగిందని జరుగుతుందని తెలిపారు.
పురస్కారాలతో పాటు విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అసోసియేషన్ తరపున అందజేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే కుట్టు మిషన్లు, గ్రైండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కాపు సేవ సమితి ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగి వారే తిరిగి పురస్కారాలు అందించే స్థాయికి రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కాపు సేవా సంఘం అధ్యక్షుడు ఇక్కుర్తి శ్రీనివాసరావు ఏడాదిలో చేసిన కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ బి.లక్ష్మీకాంతం, వనమా రామకృష్ణ, మెండు చక్రపాణి, బీఎల్ నరసింహారావు, గల్లా సుబ్రహ్మణ్యం, గొర్రెపాటి అర్జున్ రావు, పర్వత్ రెడ్డి సుబ్బారావు పలువురు నేతలు వేలాదిమంది మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.

