హైదరాబాద్ : అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్‌ఎస్ (BRS) కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద నేటి ఉదయం ఆందోళనకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల (Annapurna Canteens) పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.. కాగా, అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, గేటు బయటే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బల్దియా ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఇదే సమయంలోమాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అక్కడకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కలిసి ఆయన అక్కడే బైఠాయించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని.. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందన్నారు. పేరు మార్చాలని ఉద్దేశం ఉంటే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం (GHMC Council meeting) ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చిందన్నారు. ‘ఆరు గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్ధతి కాదు’ అని మండిపడ్డారు.