t20 world cup | ఫైన‌ల్లో వీరే హీరోలు

t20 world cup | ఫైన‌ల్లో వీరే హీరోలు

ఆ ముగ్గురు అద్భుతం
భార‌త్‌కు క‌ప్ అందించారు
బ్యాటింగ్‌లో సంజూ శాంస‌న్‌
బౌలింగ్‌లో బుమ్రా, అక్ష‌ర్ అదుర్స్‌
అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ఈ సారి ఫైన‌ల్లో ముగ్గురు మొన‌గాళ్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఆ ముగ్గురు రాణించ‌డంతో వ‌రుస‌గా రెండోసారి భార‌త్‌క‌ప్ కొట్టేసింది. వారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తోనే క‌ప్ సాధించామ‌ని భారత అభిమానులు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. సంజూ, బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంతో కీల‌క పాత్ర పోషించారు. ముందుగా సంజూ శాంస‌న్ బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టాడు. మూడోసారి అత‌ను సెంచరీ మిస్ అయ్యాడు. సంజూ బ్యాటింగ్‌తో భార‌త్ భారీ స్కోరు చేసింది. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్‌లు న్యూజిలాండ్ న‌డ్డి విరిచారు. దీంతో భార‌త్ స‌గ‌ర్వంగా క‌ప్‌ను అందుకొని అభిమానులు సంబ‌రాల్లో మునిగిపోయేలా చేసింది.

సంజు శాంస‌న్ విధ్వంసం
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 భార‌త్ అందుకుందంటే ప్ర‌ధాన కార‌ణం సంజూ శాంసన్ అనే చెప్ప‌వ‌చ్చు. వరసగా మూడు మ్యాచ్ ల‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు విజ‌యాలు అందించాడు. 97, 89, 89 పరుగులు వరసగా మూడు మ్యాచ్ లలో చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. ఒకరకంగా సంజూ శాంసన్ లేకుంటే సెమీ ఫైనల్స్ లోకి, ఆ తర్వాత ఫైనల్స్ లోకి అనంతరం ఛాంపియన్ గా గెలిచే వారమే కాదు.

బూమ్ బూమ్ బుమ్రా..
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రిత్ బుమ్రా. బుమ్రా లేకుండా భార‌త్ బౌలింగ్ గురించి చెప్పుకోవ‌డానికి ఏమీ ఉండ‌దు. అత‌నే జ‌ట్టుకు ప్ర‌ధాన బ‌లం. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 భార‌త్ గెల‌వ‌డంలో బుమ్రా కీల‌కంగా మారాడు. అత‌ని పేస్‌ను ఎదుర్కోవ‌డంలో ప్ర‌త్య‌ర్థులు వ‌ణికిపోయారు. ప‌రుగులు చేయ‌డానికి చెమ‌ట‌లు క‌క్కారు. టీం ఇండియా ఈ సీనియర్ ఆటగాడు ఏ స్పెల్ వేసినా అత్యంత తక్కువ పరుగులు ఇచ్చాడు. సెమీ ఫైనల్స్ లోనూ, ఫైనల్స్ లోనూ బుమ్రా రాణించిన తీరుతోనే ఈరోజు కప్పు కల మరోసారి సాకారమయింది. ఫైనల్స్ లోనూ నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా నాలుగు వికెట్లు తీసి కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇత‌ని బౌలింగ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయ‌డానికి బెదిరిపోయింది. యార్క‌ర్ వేశాడంటే వికెట్ ఎగిరిపోవాల్సిందే. అంత‌లా భ‌య‌పెట్టాడు బుమ్రా. ఫైన‌ల్ మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో టీమిండియా క‌ప్ గెలిచింది.

అక్షర్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అదుర్స్‌
ఎడమ చేతి స్పిన్నర్ అక్షర్ పటేల్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్. కానీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇత‌నికి కొన్ని మ్యాచుల్లో ఆడ‌టానికి చాన్స్ రాలేదు. కానీ చాన్స్ ఇచ్చిన ప్ర‌తీ సారి అద్భుతంగా రాణించాడు. మ్యాచుల్లో ఇత‌ని విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం బౌలింగ్ చేయడంలోనే కాదు. ఫీల్డింగ్ లో అక్షర్ అద‌ర‌గొట్టాడు. సెమీ ఫైనల్స్ లో అద్భుతమైన క్యాచ్ లు పట్టి భారత్ ను ఫైనల్స్ కు చేర్చిన అక్షర్ పటేల్ ఫైనల్స్ లోనూ అత్యంత విలువైన మూడు వికెట్లు తీశాడు. అందులో దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్ లో చితక బాదిని అలెన్ ను అక్షర్ పటేల్ త్వరగా ఇంటికి పంపినప్పుడే భారత్ విజయం దాదాపు సగం ఖాయమయింది. అలాగే అక్షర్ ప్రమాదకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

అయితే ఈ ముగ్గురే కాకుండా టీమిండియా విజేత‌గా నిల‌వ‌డంతో జ‌ట్టులోని ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ పాత్ర‌ను పోషించారు. శివమ్ దూబె, ఇషాన్ కిష‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌, అర్ష‌దీప్‌సింగ్‌, సూర్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌తీ ఒక్క‌రు ఏదో ఒక మ్యాచులో మెరిశారు. ఇలా ఇండియా ప్రపంచ విజేతగా మారడానికి కారణమైంది.

Leave a Reply