Syllabus | డిసెంబర్లోగా సిలబస్ పూర్తి చేయండి..

Syllabus | డిసెంబర్లోగా సిలబస్ పూర్తి చేయండి..
- 60రోజులపాటు సిలబస్ రివిజన్ జరగాలి
- పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు విద్యాశాఖ ఆదేశాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ఇక సిలబస్(Syllabus )ను సకాలంలో పూర్తి చేయడంపై పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు (Inter exams) జరగనున్నాయి. దాదాపు 22 రోజులపాటు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత మార్చి 18 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 18 రోజుల వ్యవథిలో ఇంటర్ పరీక్షలు పూర్తి కానున్నాయి.
ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో డిసెంబరు చివరి నాటికి పదోతరగతి, ఇంటర్మీడియట్ సిలబస్‌ను పూర్తి చేయాలని ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లను విద్యాశాఖ ఆదేశించినట్టు సమాచారం. సిలబస్‌ను సమగ్రంగా వేగంగా పూర్తి చేసి పునశ్చరణ తరగతులను నిర్వహించాలని, అప్పుడే టెన్త్, ఇంటర్‌లో వందశాతం ఫలితాలు వస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Syllabus | ప్రయివేటు బడులతో సమానంగా
అత్యుత్తమ ఫలితాలు సాధించే స్కూళ్ల్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రయివేటు బడులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 18ననే పదో తరగతి పరీక్షలు మొదలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది.
సిలబస్ పూర్తయిన తర్వాత చేపట్టే రివిజన్‌లో భాగంగా వివిధ సబ్జెక్టుల్లో ముఖ్యమైన, కష్టమైన చాప్టర్లపై దృష్టిపెట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 60 రోజులపాటు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రణాళికాబద్ధంగా సిలబస్ రివిజన్ చేయాలని నిర్దేశించింది.

మరోవైపు … ఇంటర్ సిలబస్‌ను కూడా డిసెంబరులోపు పూర్తి చేసి రెండు నెలలపాటు రివిజన్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశించినట్టు సమాచారం. ఈ సారి ఇంటర్ పరీక్షలను మార్చి మూడోవారం లోపు పూర్తి చేయడం ద్వారా విద్యార్థులు జేఈఈ, నీట్, వివిధ సెట్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం అందుబాటులో ఉండనుంది.
ఈ నేపథ్యంలో డిసెంబరులో ఇంటర్ సిలబస్‌ను పూర్తి చేస్తే విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గి రివిజన్ ద్వారా పరీక్షలను బాగా రాస్తారని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఏటా మే మూడో వారం నుంచి జూన్ లో జేఈఈ, నీట్ తదితర జాతీయస్థాయి పోటీ పరీక్షలు జరగనున్నాయి.
