ఊరూవాడా ఏర్పాటుచేస్తాం
సీఎం ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రను మరింత ముందుకు తీసుకెళ్తాం
త్వరలో విజయవాడ కెనాల్ నెట్‌వర్క్‌లో వాటర్ ట్యాక్సీలు
అవార్డు పొందిన ప్రతిఒక్కరూ స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్
సమష్టి కృషితో స్వచ్ఛతలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుదాం
సమర్థ అధికారుల కృషి ఫలితమే అన్ని రంగాల్లో ఎన్‌టీఆర్ జిల్లాకు అగ్రస్థానం
రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : స్వచ్ఛాంధ్ర అవార్డుల (Swachhandhra Awards) ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జై స్వచ్ఛ సేవక్ నినాదాన్ని ఇచ్చారని.. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషిచేయనున్నట్లు రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) తెలిపారు. మంగళవారం విజయవాడ (Vijayawada)లోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తొలుత అతిథులు.. స్వచ్ఛతా వారియర్స్‌తో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పట్టాభిరామ్‌తో పాటు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (Collector Dr. G. Lakshmi), పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులతో కలిసి 50 మంది విజేతలకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో గౌరవ సీఎం ఆలోచనలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర పురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. నేడు పురస్కారాలు అందుకుంటున్న ప్రతిఒక్కరూ స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్లని.. సమష్టి కృషితో స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకంగా రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులను వివిధ కేటగిరీల్లో అందించినట్లు పట్టాభి తెలిపారు.

ఎన్‌టీఆర్ జిల్లాలో సమర్థవంతమైన, నిబద్ధత కలిగిన అధికారుల వల్లే ఎన్‌టీఆర్ జిల్లాకు అత్యధిక అవార్డులు లభించాయని.. పేరుకు తగ్గట్లు ఎన్‌టీఆర్ జిల్లా అన్ని అంశాల్లోనూ ముందుండేందుకు తమ భాగస్వామ్యం ఉంటుందన్నారు. విజయవాడలో అద్భుతమైన కెనాల్ నెట్‌వర్క్ ఉందని.. మైక్రో ఎస్‌టీపీల ద్వారా శుద్ధిచేసిన నీరు కాల్వల్లోకి వెళ్లేలా చేస్తే త్వరలోనే వాటర్ ట్యాక్సీల ఏర్పాటు సాకారమవుతుందని పేర్కొన్నారు. వాటర్ ట్యాక్సీల వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. త్వరలో గ్రామాలకు 12 వేల ట్రై సైకిళ్లు అందిస్తామని, 1,600 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనున్నామని.. శుభ్రంచేసిన డంపింగ్ యార్డులను హరిత స్థలాలుగా అభివృద్ధి చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

ఓ చిన్న పిలుపు.. పెద్ద మార్పునకు నాంది…
ఓ చిన్న పిలుపు, సంకల్పం.. పెద్ద మార్పునకు నాంది అవుతుందని.. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో జిల్లా స్వచ్ఛాంధ్రలో ముందంజలో నిలిచిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి స్వచ్ఛాంధ్ర కీలకమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన జై స్వచ్ఛ సేవక్ నినాదం స్ఫూర్తిగా ఇకపైనా జిల్లాను స్వచ్ఛతలో నెం.1గా నిలిపేందుకు కృషిచేద్దామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఇన్‌ఛార్జ్ మంత్రి, ఎంపీ చిన్ని తరఫున కూడా విజేతలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

డ్రోన్, ఏఐ సాంకేతికత అనుసంధానంతో మంచి ఫలితాలు…
స్వచ్ఛాంధ్రను విజయవంతంగా ముందుకుతీసుకెళ్లేందుకు ప్రభుత్వం వినూత్న విధానాలను అనుసరిస్తోందని.. జిల్లాకు 8 రాష్ట్ర, 50 జిల్లాస్థాయి అవార్డులు రావడం ఆనందంగా ఉందని, పోలీస్ కమిషనరేట్‌కు కూడా పురస్కారం రావడం చాలా సంతోషమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. వినూత్న విధానాల అమలుతో దసరా ఉత్సవాలను విజయవంతం చేశామని.. స్వర్ణాంధ్ర సాకారానికి అవసరమైన కీలక ప్రగతి సూచికల (కేపీఐ)లో పురోగతిని ఎప్పటికప్పుడు మదించేందుకు డ్రోన్, ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా తమ శాఖ కీలక భాగస్వామ్యం అందిస్తుందని తెలిపారు.
స్వచ్ఛాంధ్ర పురస్కారాలతో ఆరోగ్యకర పోటీ…
స్వచ్ఛాంధ్ర పురస్కారాలతో స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు మధ్య ఆరోగ్యకర పోటీ వాతావరణం నెలకొంటుందని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. శాస్త్రీయ విధానాలతో డేటా విశ్లేషణతో అవార్డులకు విజేతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అత్యుత్తమ విధానాలను పరస్పరం తెలుసుకొని అమలుచేసేందుకు కూడా ఈ అవార్డులు దోహదం చేస్తాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. ఏటా స్వచ్ఛాంధ్ర పురస్కారాల్లో జిల్లాను నగరాన్ని ముందు నిలిపేందుకు సమష్ఠిగా కృషిచేద్దామని ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్స్ బి.భూషణం, బి.సామ్రాజ్యం, శంకర్ తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జెడ్‌పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీపీవో పి.లావణ్యకుమారి, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, పురస్కార విజేతలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.