నల్లగొండ / ఆంధ్రప్రభ ప్రతినిధి – తెలంగాణ సంపదను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టారని బీ ఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సూర్యాపేటలో నేడు జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 15 మాసాల కాలంలో రేవంత్ రెడ్డి 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాడని వెళ్లినప్పుడల్లా డబ్బులను అక్కడి పెద్దలకు కడుతూ వస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రూ.30 వేల కోట్లు కప్పం కట్టారని అంటూ ఆ కప్పం కట్టకపోతే హైదరాబాదుకు వచ్చేసరికి ఆయన పదవి పోతుందని ఎద్దేవా చేశారు.

శూన్యం నుండి సునామి సృష్టించిన మహా నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు. కెసిఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు కండబలం, అంగ బలం, ఆర్థిక బలం, కుల బలం లాంటివి ఏమీ లేవని ప్రజల్లో ఉన్న తెలంగాణ కాంక్షనే గొప్ప ఉద్యమానికి ఊపిరి పోసిందని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలలో బీ ఆర్ఎస్ ఓడిపోతే నల్లగొండ జిల్లాలో పార్టీ పని అయిపోయిందని కొంతమంది నాయకులు అవాకులు, చవాకులు పేలాలని వారికి ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తల బలమే బుద్ధి చెబుతుందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మూడు పాత్రల్లో అద్భుతమైన విజయం సాధించిందని అన్నారు. 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, పది సంవత్సరాలు అధికారంలో ఉంటూ తెలంగాణ అభివృద్ధిలో, 15 మాసాల నుండి ప్రతిపక్ష పార్టీగా అనునిత్యం ప్రజల పక్షాన నిలవడం ఆనందంగా ఉందన్నారు. చిన్న వయసులో సీఎం అయిన రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకుంటారని అనుకుంటే పర్సంటేజీలను పెంచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. వికృత మనస్తత్వంతో రేవంత్ రెడ్డి తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బంగారం లాంటి పంటలను పండించామని చెప్పారు. అసమర్థ పాలనతో సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు అందక వేలాది ఎకరాల భూమి నిలువునా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వారికి ధీటుగా జవాబు చెబుతున్నారంటూ కితాబునిచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు గల్లంతయితే వారిని ఎలా కాపాడాలో దృష్టి సారించకుండా పరామర్శకు వెళ్లిన ఓ మంత్రి అక్కడ చేపల కూర వండించుకున్నారని అంటే ఈ మంత్రులకు సామాన్యుల ప్రాణాలపై ఎంతటి ప్రేమ ఉందో తెలుస్తుందని అన్నారు.

రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ పథకం అమలు కోసం రూ. 49,500 కోట్లు కావాలని నిర్ణయించగా మూడో రోజు అది 40 వేల కోట్లకు చేరిందని అన్నారు. క్యాబినెట్ లో రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అనంతరం రుణమాఫీ కోసం కేవలం రూ 26,500 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇందులో కేవలం 20 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించారని ఇలాంటప్పుడు రైతులందరికీ రుణమాఫీ చేసినట్లు ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.
అసూయ, ద్వేషం, అసత్య ఆరోపణల తోనే టిఆర్ఎస్ ఓటమి.
అసూయ, ద్వేషం, అసత్య ఆరోపణలతోనే టిఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయిందని కేటీఆర్ చెప్పారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన ప్రజలు ఎందుకు ఓటేయలేదని ప్రతి నాయకుడు ఆలోచించాలని సూచించారు. తాను నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రచయిత ను నల్లగొండ జిల్లాలో పార్టీ ఘోర ఓటమికి కారణం ఏంటని ప్రశ్నించగా ఆయన అసూయ, దేశం, ఆశతోనే కేసీఆర్ ను ఓడించారని చెప్పారని తెలిపారు.
బొల్లం మల్లయ్య యాదవ్ కారు కొంటే ప్రజల సొమ్ముతో జల్సా పడుతున్నాడని ఈర్ష పడ్డారని, మరో ఎమ్మెల్యే కొత్త షర్టు వేసుకున్నా ప్రజల సొమ్మేనని ప్రచారం చేశారని ఆయన అన్నారు. కెసిఆర్ పెద్ద దొర అని, ఆయనది దొరల పాలన అని, తెలంగాణ వస్తే ఆయన కుటుంబం కోసమే తెలంగాణను తెచ్చుకున్నారని ఇలా ప్రతి ఒక్కరి మదిలో కేసీఆర్ పై ద్వేషం పెంచారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ ను దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నారని అన్నారు. మళ్లీ అధికారం బీ ఆర్ఎస్ దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తులో పదవులు వస్తాయని కార్యకర్తలకు సూచించారు. వరంగల్ లో నిర్వహించే పార్టీ 25 సంవత్సరాల వేడుకలకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రశ్ర్నించే గొంతును నొక్కేస్తున్నారు… జగదీశ్ రెడ్డి

ప్రశ్నించే గొంతుకను కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ ఏమాత్రం బలహీన పడలేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ పథకాల అమలు కోసం నిలదీస్తూనే ఉంటామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ లో జరిగే పార్టీ 25 సంవత్సరాల వేడుక కార్యక్రమానికి జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రామావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.