ఏసీబీ వలలో సర్వేయర్

  • భూమి సర్వే కోసం రూ.30వేలు డిమాండ్


సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఓ వ్యక్తి నుండి 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ కు చిన్న బోనాలలో 3 ఎకరాల భూమిని సర్వే చేయడం కోసం సర్వేయర్ వేణు 30 వేల రూపాయలు డిమాండ్ చేయగా, బాధితుడు ఇరుకుల ప్రవీణ్ కరీంనగర్ లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

మొదట సర్వేయర్ కు 10వేల రూపాయలు అప్పజెప్పాడు. తర్వాత పంచనామా సర్టిఫికెట్ కోసం మరో 20వేల రూపాయలు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు, సర్వేయర్ వేణు(Surveyor Venu) ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో వరుసగా సర్వేయర్ లపై ఏసీబీ దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి.

మొన్న మే నెలలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్ పట్టుబడగా, నేడు సిరిసిల్ల సర్వేయర్ వేణు ఏసీబీ ట్రాప్ లో పట్టుబ‌డటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా మరో వైపు పలు డిపార్ట్ మెంట్ ల అధికారుల తీరు మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply