తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని చౌటుప్పల్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కోరారు. స్థానిక నలంద డిగ్రీ కాలేజీలో ఉద్యమకారుల ఫోరం సమన్వయకర్త కట్టెల లింగస్వామి అధ్యక్షతన ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాతరాజు సత్యం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో అన్నిటినీ వదులుకొని ఉద్యమమే జీవితం అన్నట్లుగా ఉద్యమకారులం నిలబడి తెలంగాణ కోసం కొట్లాడామని, వారిని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు.
తాడూరు పరమేష్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో అనేకమంది కేసులపాలై జైలు జీవితం అనుభవించి, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం ఇప్పటికైన ఉద్యమకారులను ఆదుకోవాలని అన్నారు. ఉప్పు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు పలు తీర్మానాలు చేశారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లును నిర్మించి ఇవ్వాలి, పింఛన్లు మంజూరు చేయాలి, హెల్త్ కార్డులు, బస్ పాసులు ఇవ్వాలి, మిగిలిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, అధికార పార్టీలో ఉన్న ఉద్యమకారులకు నామినేట్ పదవులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, రిక్కల మహేందర్ రెడ్డి, బోయ లింగస్వామి, బోరం శేఖర్ రెడ్డి, ఎస్ కె మున్న, గరిశె మహేష్, ఎండి ఇబ్రహీం, కడ్తాల చంద్రశేఖర్, గుంటోజు ఆంజనేయాచారి, శ్రీనివాస్, ప్రవీణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
