కర్నూలు బ్యూరో, సెప్టెంబర్ 9, ఆంధ్రప్రభ : అర్లీ ఖరీఫ్ లో పండించిన ఉల్లి (Onions) రైతులకు రూ.1200 మద్దతు ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా (Collector P. Ranjit Basha) వెల్లడించారు. మంగళవారం ఉల్లి కొనుగోళ్ల అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కొనుగోళ్ల కమిటీ సమావేశాన్ని టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఉల్లి కొనుగోళ్ల ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుండి ఆధార్, బ్యాంకు అకౌంట్ (Aadhaar, bank account) తదితర వివరాలను తీసుకుని, ఎక్కడా పొరపాట్లు లేకుండా ఉల్లి కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్లీ ఖరీఫ్ లో పండించిన ఉల్లి పంటను మద్దతు ధర రూ.1200 లతో కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.10కోట్లు మంజూరు చేసినందున, వ్యత్యాసపు ధరను రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులకు సెప్టెంబర్ 20వ తేదీ దాకా ఎర్లీ ఖరీఫ్ పంట వచ్చే అవకాశం ఉందని హార్టికల్చర్ అధికారులు (Horticulture officials) కలెక్టర్ కు వివరించారు.

మార్కెట్ యార్డుకు వచ్చే ఉల్లి ఫీల్డ్ నుంచి వస్తోందా లేక ఏమైనా రీసైక్లింగ్ (Recycling) జరుగుతోందా అని పరిశీలించేందుకు 5మంది హార్టికల్చర్ అధికారులను మార్కెట్ యార్డులో విధులు నిర్వర్తించేలా నియమించాలని కలెక్టర్ జిల్లా హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. ఉల్లి పంట తీసుకువచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ యార్డ్ సెక్రెటరీ (Market Yard Secretary)ని ఆదేశించారు. ప్రతి రోజు 500 మెట్రిక్ టన్నుల ఉల్లిని ఇతర ప్రాంతాల మార్కెట్ లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నంద్యాల, కడప జిల్లాల (Nandyal and Kadapa districts) హోల్ సేల్ మార్కెట్ లకు తరలించేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడతానని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఉల్లి పంట పండించని మండలాల్లో ఎఫ్ పి షాపులకు తరలించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ను ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య (Collector Dr. B. Navya) మాట్లాడుతూ… ఈ రోజు 200 టన్నులు తాడేపల్లిగూడెంకు, 200 టన్నులు హైదరాబాద్ కు, రైతు బజార్ కు 80 టన్నులు పంపుతున్నామని వివరించారు. టెలి కాన్ఫరెన్స్ లో మార్కెటింగ్ శాఖ జెడి రామాంజనేయులు, మార్కెటింగ్ ఏడీ నారాయణ మూర్తి, మార్క్ ఫెడ్ డీఎం రాజు, జిల్లా హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, మార్కెట్ యార్డ్ సెక్రెటరీ జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply