
ముఖపత్ర కథనం
నాడు గురువులు… నేడు లఘువులు…

గురుబ్రహ్మ గురు:విష్ణు
గురు:దేవో మహేశ్వర
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమ:
క్రమశిక్షణ అలవర్చి… చదువు నేర్పి… మనిషిలా తీర్చిదిద్దే గురువు ప్రత్యక్ష దైవం. అక్షరాలు వల్లె వేయించి, తప్పు చేస్తే దండించిన తొలి గురువులను ఆజన్మాంతం మర్చిపోలేం.
గురువులు పాఠశాల బయట కనబడినా అదో భయం. నిలబడి ఓ నమస్కారం పెట్టేస్తేగానీ ఆ భయం పోదు. ఒక్కరోజు బడి ఎగ్గొడితే ఆరోజంతా మాస్టారు ఏ వీధిలో కనిపిస్తారోనని భయం….తెల్లారి క్లాసులో మాస్టారికి కనిపించి బెత్తం దెబ్బలు తినేస్తేనే గానీ ఓ పనైపోదు.
మాస్టారంటే భయమే కాదు. ఎంతో అభిమానం కూడా… ఎంత అభిమానమంటే తమపొలాల్లో, పెరట్లో పండిన కూరగాయలు, తాము వెళ్ళొచ్చిన పుణ్యక్షేత్రాల ప్రసాదాలు మాస్టారికి, టీచరమ్మకి తెచ్చి సమర్పించుకునేంత…
మరి మాస్టార్లకూ, టీచరమ్మలకూ తమ విద్యార్థులంటే తక్కువ అభిమానమా? ఏం కాదు. తమ విద్యార్థులను తమ కన్నబిడ్డల్లాగా అబిమానించి ప్రేమించి, వారి ఆలోచనలను కనిపెట్టి, మనసు గ్రహించి, బుజ్జగించేది గురువులే. వారు చదువులో ఎందుకు వెనకపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? అని బాగా స్టడీ చేసి, వారిలోని బాధ, నిరాశా-నిస్పృహలనుపారద్రోలి చదువు వైపు దారిమళ్ళించి చైతన్యవంతులను చేసేదీ, చెయ్యగలిగేదీ గురువులే.
కాస్త కఠినంగా వ్యవహరించినా, క్రమశిక్షణకై దండించినా గురువుని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ పిల్లల తల్లిదండ్రులకైనా. అయితే అదంతా గతం….గురువులు దైవంగా పూజించబడే కాలంలో…. ఇప్పుడంతా కార్పొరేట్ కాలం. అందరు ఉద్యోగుల్లాగానే గురువులూ జీతగాళ్ళే…వినియోగదార్లకు(పిల్లల తల్లిదండ్రులకు) జవాబుదారీలే. కార్పోరేట్ స్కూల్ లో ఒక టీచర్ ని అప్పాయింట్ చేసుకోవాలంటే మిగిలిన టీచర్లతోబాటు స్టూడెంట్స్ కూర్చుని, లెస్సన్స్ విని, ఆ టీచర్ ని ఓకే చేస్తేనే టీచర్ కి ఉద్యోగం. ఇక స్టూడెంట్లని పల్లెత్తు మాటన్నా, ఒకచిన్న దెబ్బ వేసినా, అంతే సంగతులు.
మానేజ్ మెంట్ నుంచి ప్రెషర్. పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్…స్టూడెంట్స్ సరిగా చదువు మీద ధ్యాస పెట్టకున్నా, చదువులో వెనుకబడినా, పూర్తి బాధత టీచర్లదే. మానేజ్ మెంట్ వైఖరి కూడా ఒక టీచరు పోతే పదిమంది వస్తారు కానీ ఒక్క స్టూడెంటు పోతే లక్షల ఫీజు మిస్ అవుతామన్నట్లుగానే ఉంటుంది. ఇది కరెక్ట్ కాదని తెలిసినా, కాదనలేని పరిస్థితి..టీచర్లే రాజీపడాల్సిన దుస్థితి.
ఇది ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల పరిస్థితి.
ఇక గవర్నమెంట్ టీచర్ల విషయానికొస్తే, ఉద్యోగభద్రత, జీతం విషయం ఢోక లేదు. మంచి మంచి జీతాలు, పెన్షన్లు…కానీ ఇతరత్రా అనేక సమస్యలు వాళ్ళని చుట్టుముడుతున్నాయి. ఎక్కడో పోస్టింగులు, కిలోమీటర్లకొద్దీ ప్రయాణాలు…మారుమూల పల్లెటూర్లలో విద్యార్థులను బడికి రప్పించుకోవడాలూ, ఇలాంటి ఇబ్బందులు వారిని వదలడం లేదు.
ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రకాశిస్తున్న ప్రతిభామూర్తులైన గురువులకు వందనాలు….గురుపూజోత్సవ శుభాకాంక్షలతో…..
ముఖపత్ర కథనం
మరీ అంత కౄరంగా…. ఘోరంగా….

ఆయన ప్రాణం నిలవదని ఆమెకు తెలుసు, ఒకగంటో…ఒకరోజో..అంతేననీ తెలుసు…అయినా ఆమెలోని అర్థాంగి మనసు వాస్తవాన్ని అంగీకరించడం లేదు. ఏ దేవుడైనా అడ్డుపడకపోతా, తన భర్త ప్రాణాలను నిలపకపోతాడాడాన్న ఆశతో మాటి మాటికీ మెడలోని మంగళ సూత్రాలను కళ్ళకొత్తుకుంటూనే ఉందామె. ఆయన వయసు 90…ఆమె వయసు 85…వారి సంసార జీవన ప్రయాణం యాభై ఏళ్ళకు పైనే…
ఆమె మాట్లాడలేదు…వినలేదు…అసలు బాహ్యప్రపంచంతో సంబంధం ఉందో లేదో కూడా తెలీదు. అచేతనంగా చక్రాల కుర్చీలోనే ఆమె జీవనం. అయినా ఆమెను నీడలా వెన్నంటి, అనుక్షణం ఆమె అవసరాలను కనిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమె భర్త…వారిద్దరి వయసూ ఏడుపదుల పైనే.
ఏనాడూ ఆమెకు సేవ చేయడం పట్ల ఆయనలో కించిత్తు విసుగు లేదు. పైగా ఏనాటికైనా ఆమెలో చలనం రాకపోతుందా…మునుపటిలా తన కళ్ళల్లోకి ప్రేమగా చూడకపోతుందా…తనతో ప్రేమగా ఊసులు చెప్పకపోతుందా అన్న ఆశ….
ఈ రెండూ వేర్వేరు కథలు…కానీ, మన భారతీయ వైవాహిక వ్యవస్థలోని బలాన్ని తెలియజేసే ఇలాంటి కథలెన్నో. మన కళ్ళముందు కనిపించే వృద్ధజంటలెన్నో…నడవలేక నడుస్తూ…ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ…రాలే పండుటాకుల్లా ఉన్నా, కన్నపిల్లలు దూరతీరాలలో ఎక్కడో ఉన్నా….తామిద్దరే లోకమన్నట్టుగా జీవనం వెళ్ళదీస్తూ…కలిసి బ్రతుకుతూ..కలిసే ప్రాణాలను విడవడానికి ఎదురు చూస్తూ…
ఇదంతా ఒక వైపు…
మరి ఇంకోవైపు…?
కాళ్ళపారాణి ఆరకముందే కట్టుకున్నవాడిని కర్కశంగా కడతేర్చే నవ వధువులు…
హనీమూన్ లోనే భర్త ఊపిరి తీసే భార్యలు…
సుపారీలిచ్చి మరీ భర్తను లేపించేస్తున్న భార్యామణులు…
కలిసి కాపురం చేసి బిడ్డల్ని కనిచ్చిన అర్థాంగి ప్రాణాలను కేవలం అదనపు కట్నం డబ్బుల కోసం కడతేరుస్తున్న భర్తలు…
పెళ్ళినాటి ప్రమాణాలను మరచి, భార్య పరువును బజారుకీడుస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తోన్న మొగుళ్ళు…
ఇవన్నీ వారిలో ప్రవేశించిన డబ్బు పిశాచాలు చేయిస్తున్న పనులో…బుసలు కొట్టే కామంతో అక్రమ సంబంధాలకు అలవాటుపడి అసలు బంధాలను అర్థంతరంగా ముగించాలనుకుంటున్న రాక్షస చర్యలో అర్థం కావడం లేదు.
ముప్పై-నలభై ఏళ్ళు దాటిన వారిలోనూ ఈ తరహా కౄరమైన ఆలోచనలు రూపుదిద్దుకోవడం….
ఆందోళన కలిగించే విషయం.
అంతర్జాలం ప్రభావం అనుకొందామా?
సోషల్ మీడియా పైత్యం అనుకొందామా?
జీవిత భాగస్వామి నచ్చకపోతే విడాకులు తీసుకునేవాళ్ళున్నారు…
విడిచి దూరంగా వెళ్ళి బ్రతికేవాళ్ళున్నారు…
కానీ ఇదేమిటి? వాళ్ళ ప్రాణాలను కడతేర్చే అధికారం వీళ్ళకెవరిచ్చారు?
కలిసి జీవించిన క్షణాలు గుర్తుకు రావడం లేదా?
కాపురానికి గుర్తులుగా..
ఎదిగిన పిల్లల భవిష్యత్తు గురించి మరిచారా?
వీళ్ళకెవరు కౌన్సెలింగ్ ఇవ్వాలి?
సమాజం ఉలిక్కిపడేలా చేస్తోన్న సవాళ్ళు ఈ మానవ మృగాలు..
వైవాహిక బంధం పట్ల విలువలేని జంతువులు…

పూచీకత్తు

ఆదివారం.
“రాఘవా…రాఘవా…”
స్పందనరావు పిలుపు వినపడడంతో వంట రూంలో మా ఆవిడతో మాట్లాడుతున్న నేను హాల్లోకి వెళ్ళాను.
“రా…రా…స్పందనా…”అని లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగా నేనూ కూర్చుంటూ “సులోచనా! స్పందనరావొచ్చాడు…కాఫీ పట్రా..” అని “స్పందనా ఏంటి ఇలా వచ్చావు?” అడిగాను.
“చెల్లాయి ఏదో టిఫిన్ చేస్తున్నట్టుంది. నేను మా ఇంట్లో కాఫీ తాగి వచ్చాను, ఇక్కడ టిఫిన్ తింటాను” చిన్నపిల్లాడిలా అన్నాడు.
“అలాగే…” నవ్వుతూ అని “సులోచనా ముందు మా ఇద్దరికీ టిఫిన్ పట్రా, తర్వాత కాఫీ తెద్దువుగాని”అన్నాను.
కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుకున్నాము.
సులోచన ఉప్మా ప్లేట్లు పట్టుకొచ్చి ఇద్దరి ముందు పెట్టి “అన్నయ్యా, తిన్నాక మంచి రేటింగ్ ఇచ్చిపో, ఈయనెప్పుడు 2.5 మాత్రమే ఇస్తాడు” నవ్వుతూ అని పని చేసుకోడానికి వంటింట్లోకి వెళ్లిపోయింది.
ఇద్దరం కాఫీ టిఫిన్లు ముగించాక, “ఇప్పుడు చెప్పు స్పందనా, పొద్దున్నే ఇలా వచ్చావేంటి? నాకు తెలిసి కేవలం పలకరించడానికైతే ఇలా రావు. ఏదో ఉంది చెప్పు” అడిగాను.
“మా అబ్బాయి చిట్టీ కడుతున్నాడని తెలుసుగా, ఇప్పుడేదో వ్యాపారం చేయడానికి అవకాశం కలిసొచ్చిందట, చిట్టీ పాడుకున్నాడు. నేను ఉద్యోగంతో వచ్చే గొర్రెతోక జీతంతో సంసారాన్ని నెట్టుకురావడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. వాడన్నా వ్యాపారం చేసి నాలుగురాళ్లు సంపాదిస్తే, మేమంతా కాస్త సుఖపడతాం. ఒక్కగానొక్క కూతురి పెళ్లి కూడా ఏ చీకూచింతా లేకుండా చేయగలుగుతా. అందుకని…” నావంక చేతులు నులుముకుంటూ, అభావంగా చూస్తూ ఆగాడు.
“చెప్పరా…నేనేం చేయాలి?”
“నువ్వో ష్యూరిటీ సంతకం చేస్తే చాలు. నీకు ఇబ్బంది కలగకుండా వాడూ నేనూ చూసుకుంటాం” అన్నాడు.
“దాందేముంది? అలాగే. అబ్బాయి నాకూ తెలుసు, నీలాగే మర్యాద తెలిసినవాడు, నిదానస్తుడు. కాగితాలు తెచ్చావా, ఏవి? చిట్ అమౌంట్ ఎంత?”
“అయిదు లక్షలు, యాభై నెళ్ల చిట్టీ, ఇప్పటికి పాతిక నెలలయిపోయింది. ఆక్షన్ లో మంచి అమౌంట్ వస్తోంది. మా అబ్బాయి ప్రతినెలా ఠంచనుగా కట్టేస్తాడు.” అని కాగితాలు నాముందు పెట్టి సంతకాలు ఎక్కడెక్కడ పెట్టాలో చూపించి పెట్టించుకున్నాడు.
“మీ ఇంటికి రావడానికి ముందు…పేర్లెందుకు కాని ఇద్దరిళ్లకి వెళ్లాను. వాళ్లు తెలివిగా సాకులు చెప్పి సంతకాలు పెట్టమన్నారు. పరిచయాలకి, స్నేహాలకి వ్యత్యాసం ఉంటుంది. నువ్వు నా స్నేహితుడివి కాబట్టి అడగంగానే పెట్టావు. నీ మేలు నేను, నా కొడుకు జన్మలో మరవలేం” అని నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని వెళ్ళిపోయాడు.
అతనెళ్ళిన వైపు చూస్తుండగా మా ఆవిడ వచ్చి “అన్నయ్య ఏంటి చిట్టంటున్నాడు?” అడిగింది.
“ఆఁ, చిట్టీకి ష్యూరిటీ సంతకం కావాలంటేనూ చేశా”
“అమౌంట్ ఎంత?”
“అయిదు లక్షల చిట్టీ, పాతికనెల్లయింది…ఆక్షన్ లో బానే డబ్బు వస్తోందట! ఆ డబ్బుతో వాళ్ళబ్బాయి వ్యాపారం చేస్తాడట. నా సంతకం వాళ్ల నిర్ణయానికి బాసట అయి, వాళ్లు పైకొస్తే నాకంతకన్నా ఏం కావాలి?”
“లక్షలకి పూచీకత్తంటే మాటలా? ఆలోచించే పెట్టారా?” ముఖం చిట్లించుకుని అనుమానంగా అడిగింది.
“ఆలోచించడానికేముంది? మధ్యతరగతివాళ్లం ఒకరికొకరం సహాయాలు చేసుకుంటేనే జీవితాలు గాడిన పడతాయి”
“మీరు సంతకం పెట్టేశాక ఇంక ఆలోచించేదేముంది? చేసేదేముంది?”నిట్టూరుస్తూ లోపలికి వెళ్లిపోయింది.
నేను స్పందనరావు గురించిన ఆలోచనల్లోకి జారిపోయా.
మేము ఈ కాలనీలోని సొంతింట్లోకి వచ్చి పదిహేనేళ్లు అయితే, వాళ్ల కుటుంబం మా వీధిలోకి పదేళ్లక్రితం అద్దెకు వచ్చింది.
మంచివాళ్లు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుంటారు. ముఖ్యంగా స్పందనరావుకి వాళ్ల తల్లిదండ్రులు ఆ పేరెలా పెట్టారోగాని, కాలనీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందిస్తాడు. సహాయం చేయడంలో ముందుంటాడు. ఆయన ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ రెండు నెలల క్రితం రిటైరయ్యాడు. బతకడానికి ఆ సమయంలో వచ్చిన డబ్బు తప్ప, పెన్షన్ లాంటి ఆధారాలేవీ లేవంటాడు. ఆయనకి సంవత్సరం క్రితం చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ఆనంద్, పెళ్ళికెదిగిన కూతురు కౌముది ఉన్నారు. వ్యసనాలు లేవు. ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే రూపాయి రూపాయి జాగ్రత్తగా కర్చు చేసే స్వభావం. కొడుకు కూడా మంచివాడు. నేనెక్కడన్నా కనిపిస్తే నమస్కరించి, సౌమ్యంగా మాట్లాడతాడు. ఏదో ప్రైవేట్ ఆఫీసులో పని చేస్తున్నానని అన్నాడు నాతో ఒకసారి బజారులో కలిసినప్పుడు.
నేనూ ప్రైవేటు సంస్థ నుండే రెండేళ్ల క్రితం రిటైరయ్యాను. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, మరో సంస్థలో తక్కువ జీతానికి పని చేస్తున్నాను. ఎప్పుడో రియల్ ఎస్టేటు ఇంతగా అభివృద్ధి చెందనప్పుడు ఇక్కడ స్థలం కొన్నాను కాబట్టి, డబ్బు కూడబెట్టి సొంతిల్లు ఏర్పరచుకుని రోజులు నెట్టుకొస్తున్నాను. అందుకే బాధ్యతలు మోసే వాళ్లంటే నాకంత కన్సర్న్.
మూడు నెలలు గడిచిపోయాయి.
ఒకరోజు ఆనంద్ డిఫాల్టర్ అయి చిట్టీ డబ్బు కట్టలేదని, పూచీగా ఉన్నందుకు నేను డబ్బు కట్టాలని నోటీసు వచ్చింది. అది చూసి నా గుండె ఆగిపోయింది.
పరుగున స్పందనరావు ఇంటికి వెళ్లాను.
వాళ్ల ఇల్లు శవం వెళితే ఉన్నట్టు శోక సంద్రాన మునిగి ఉంది.
నన్ను చూడంగానే స్పందనరావు ఒక్క ఉదుటన నా దగ్గరకు వచ్చి ” రాఘవా, రెండు రోజులుగా పిల్లాడు ఇంటికి రావడం లేదేమిటా? అని ఊరంతా వాకబు చేస్తూ ఇల్లంతా వెతికితే రాత్రి టేబుల్ సొరుగులో మూలన ఉత్తరం దొరికింది. ఆనంద్ మొదలెట్టిన వ్యాపారంలో లాస్ వచ్చిందట, తన కోసం వెతకొద్దని ఉత్తరం సారాంశం. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలికదా, ఇలా మా అందర్నీ బాధపెట్టి ఎలా వెళ్లిపోయాడో చూడు! చేతికందొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడేమోనని బెంగగా ఉంది” నా చేతులు పట్టుకుని బావురుమన్నాడు.
నేను సముదాయించాను.
కొద్ది సేపటి తర్వాత ఇంటికెళదామని గుమ్మందాటబోతుంటే, గబగబ నా దగ్గరకొచ్చి “రాఘవా, నీకు చిట్ ఫండ్ ఆఫీసు నుండి నోటీసు వచ్చింది కదూ, నువ్వేం భయపడకు. నా దగ్గరుంటే నేను డబ్బు కట్టేవాడిని, ఈ ఒక్కసారి కట్టు, మమ్మల్ని వదిలి ఉండలేని వాడు ఒకటి రెండు రోజుల్లో మా దగ్గరకొచ్చేస్తాడు. అప్పుడు ఏదోలా మేమందరం ఆలోచించి నీ డబ్బు నీకిప్పించేస్తాను. నన్ను నమ్ము” అన్నాడు సజలాలయిన కళ్లతో.
నేను ధైర్యం చెబుతూన్నట్టు అతడి భుజం తట్టి బయటకి అడుగుపెట్టాను. ఆ పరిస్థితుల్లో ఇంకేం చేయగలను.
“మంచితనానికి ఓ హద్దుండాలి. ఇప్పటికీ ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు. పెళ్లికావలసిన ఇద్దరాడపిల్లలున్నారని, ప్రతి రూపాయి ఎంతో ఆలోచించి కాని కర్చుపెట్టరు. పదో పరకో అయితే పోనీలే అనుకోవచ్చు, మరీ లక్షలకి పూచీ ఉంటారా? నాకారోజే అనుమానం వచ్చింది కాని, మిమ్మల్ని వారించలేనుకదా, సమాజ ఉద్ధారకులాయే….”వెటకారంగా మా ఆవిడ వాగ్ధాటి సాగిపోతూనే ఉంది.
‘పాపం ‘వాళ్లబ్బాయి ఏమయిపోయాడో’ అని వాళ్లు బెంగ పడుతున్నారు. తన కాళ్ల మీద తను నిలబడాలనుకున్నవాడు, ఇలా అవుతుందనుకోడు కదా! ఒక్కోసారి పరిస్థితులు అలాగే వస్తాయి. వాళ్లను చూడకుండా అతనుండలేడు. ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాడు. సమస్యలు మబ్బుతునకలయిపోతాయి’ మనసులో అనుకున్నాను.
రెండు రోజుల తర్వాత నేను చిట్ ఫండ్ ఆఫీసుకు వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి డబ్బుకట్టాను.
పదిరోజులు గడిచిపోయాయి.
ఓ వార్త నా పాలిట పిడుగుపాటయింది.
అదేమిటంటే, స్పందనరావు కుటుంబం ఎవరికీ చెప్పాపెట్టకుండా రాత్రికిరాత్రి ఇల్లు ఖాలీ చేసి వెళ్లిపోయింది. ఇంటి ఓనర్ కి మూణ్నెళ్ల అద్దె కూడా బాకీట.
చీకట్లో కూరుకుపోయాను. నేనిక ఇప్పుడిప్పుడే వెలుగు కిరణం చూడలేను.
ఆ తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే స్పందనరావు ఒకరిద్దరిదగ్గర పెద్ద మొత్తంలో అప్పు కూడా తీసుకున్నాడట!
నేనెలాగూ మోసపోయాను, పోలీసులు వాళ్లనెప్పుడు పట్టుకుంటారో తెలియదు. ఈ ఉదంతం తర్వాత మా కాలనీలో సీనియర్ లాయరు, రిటైర్డ్ పోలీస్ ఇన్స్ పెక్టర్, జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ లతో ఒక వాలంటరీ అవగాహన, సహాయక కేంద్రం ఏర్పాటు అయింది. కాలనీలోని ఎవరికన్నా ష్యూరిటీ, విట్నెస్, గ్యారంటీలాంటివి కావాలంటే వ్యక్తిగతంగా ఎవరినీ కలవకూడదు. ఆ కేంద్రాన్ని మాత్రమే సంప్రదించాలి. వ్యక్తి సచ్ఛీలతను, ఆ విషయంలో ఉన్న అవసరాన్ని, ఖచ్చితత్వాన్ని అంచనావేసి, సిఫార్సు చేస్తారు లేదా వాళ్ళే సంతకాలు పెడతారు. ఆ కేంద్రం ఏర్పడ్డాక కాలనీలో ఆర్థిక నేరాలు, ప్రైవేటు చిట్టీ మోసాలు, అప్పులు చేసి ఎగ్గొట్టడాలు చాలావరకు తగ్గిపోయాయి. కాలనీలోని అందరు ఇప్పుడు గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం కళ్లారా చూసినా, పేపర్లలో చదివినా జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు. మా కాలనీలోలా దిద్దుబాటు చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండడం లేదు. వాళ్లని చూసి జాలిపడి మాత్రం ప్రయోజనమేంటి? శలభం మంటవైపే వెళుతుంది, మంట ఆకర్షణ శక్తి అంతటిది!
ఆర్థిక క్రమశిక్షణతో వ్యసనాల జోలికి వెళ్లక, సరదాలు చంపుకుని, అవసరాలకు సైతం రాజీ పడుతూ, బాధ్యతలు తీర్చుకోవడం కోసం డబ్బు కూడబెట్టుకుంటారు. మోసగాళ్లవలలో పడి పొదుపు, మదుపు చేసినదాన్ని పోగొట్టుకుని గిలగిల్లాడతారు. అలాంటి మంచి మనసుల కథ ఇది. దయచేసి సంతకాలు పెట్టేముందు వందసార్లు ఆలోచించండి. మొహమాటాలు జాన్తానై! -రచయిత)
భవిష్యత్తు..

ఉదయం తొమ్మిది గంటలకు హడావిడిగా ఇంటికి తాళం వేసి వడివడిగా బస్ స్టాప్ వైపు అడుగులు వేస్తున్నాను. రోజూ 5 లేక 10 నిమిషాల వ్యవధిలో అశ్రద్ధ వలన ఈ నడక. లేకపోతే ఆయనే బస్‌స్టాప్‌లో దించి వెడతారు. సరిగ్గా పావు తక్కువ తొమ్మిదికి ఆయన ఆఫీసుకి వెళ్ళిపోతారు. ఆ లోపు తయారవటం నా వల్ల కాదు. అసలే ఈ రోజు ఆలస్యమయింది. అక్కడ బస్సు ఉందో లేదో అనుకుంటూ గాబరా పడుతున్నాను. సగం దూరం నడిచేలోపే సెల్‌ఫోన్ రింగ్ నిలవనీయకుండా, అడుగు ముందుకు వేయనీయకుండా మోగటం ప్రారంభించింది. నా బేగ్‌లో వున్న ఆ సెల్‌ఫోన్ వెతకటానికి చాలా సమయమే పడుతుంది. లేడీస్ హాండ్ బేగ్ అలానే వుంటుంది. చివరకు వ్యవధి లేకుండా మ్రోగుతున్న శబ్ధానికి అడ్డుకట్ట వేసి రిసీవ్ చేసుకున్నాను.
‘హలో మేడమ్ నేను మాధవ్‌ని మీ స్టూడెంట్’
అని ఆవతలనుండి వినిపించింది. అతనిని గూర్చి రెండు సెకన్లు గుర్తుచేసుకుని తర్వాత చెప్పు మాధవ్ ఎలా వున్నావు అని అడిగాను.
‘మేడమ్ నేను బాగానే వున్నాను, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు కావాలి, నాకు బాబు పుట్టాడు.’
మీకు వివరాలు పంపిస్తాను, నక్షత్రం వగైరా వివరాలు చూడండి అని కోరాడు. సరే అని బస్ అందుకునేందుకు తొందర పడుతూ ముందుకు కదిలాను.
బస్ ఎక్కి తీరుబడిగా మాధవ్ గురించి ఆలోచించటం మొదలు పెట్టేను. రెండు సంవత్సరాల క్రితం నేను పనిచేసే కాలేజీలో బి.కామ్.లో చేరాడు. ఎప్పుడో ఇంటర్ పూర్తి చేసినప్పటికీ తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల చదువు ఆపేసి తనకు తెలిసిన డ్రైవింగ్‌తో డ్రైవరుగా పనిచేస్తూ తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు. రోజూ క్లాసులకు రావటం కుదరదని అప్పుడప్పుడు వస్తానని కళాశాల యాజమాన్యంతో మాట్లాడుకుని చేరాడు. తరగతికి వచ్చినప్పుడు మాత్రం అందరితో కలివిడిగా వుంటూ మర్యాదగా నడుచుకునేవాడు. జీవితం మీద మంచి అవగాహన వున్నవాడు. చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యత వహిస్తున్నాడు. ఎవరైనా ఏదైనా పని చెప్పినా చక్కగా చేసుకుని వచ్చేవాడు. మొదటి సంపత్సరం చివరన పరీక్షలకు సెలవులిచ్చారు.
సెలవుల ముందు సాధన అనే మాధవ్ తరగతిలోని స్టూడెంట్ అతనితో బయట మాట్లాడటం కనిపించింది. సహజంగా తరగతిలోని పిల్లలందరూ మాట్లాడుకుంటూ వుంటారు. అందువల్ల నాకు అది చూచిన తర్వాత ఏమీ ప్రత్యేకంగా అనిపించలేదు. కాని అదే రోజు రాత్రి మాధవ్ మరియు సాధన కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారని మాధవ్ మీద పోలీస్ కంప్లైట్ ఇచ్చారని అనుకోవటం విన్నాను. కాలేజీ తెరిచిన తరువాత కూడా అందరు అధ్యాపకులు, విధ్యార్థులు కూడా అదే చెప్పుకోవటం తెలిసింది. ఇంతలో ప్రిన్సిపాల్‌గారు వచ్చి ఇదే విషయం చెబుతూ నేను పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళవలసి పచ్చిందని తన బాధ నాతో చెప్పుకున్నారు.
ఓ వారం, పదిరోజులు గడిచాక మాధవ్ తరగతికి వచ్చాడు. నేను అతనిని అందరిలో ఏమీ అడగలేదు. నాకు తెలిసినంత వరకు అతను ఆలోచన లేని వ్యక్తి కాదు. మంచి ఆశయాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి. వివేకానందుడు, రామక్రిష్ణ పరమహంస మొదలగు గొప్పవారి జీవితాల గురించి చదువుతూ అప్పుడప్పుడు నాతో కూడా చర్చిస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఎందుకు తొందర పడ్డాడా అని అనిపించింది. క్లాసు పూర్తి అయి బయటకి వస్తుంటే నా వెనకాలే వచ్చి
‘మేడమ్ మీతో పదినిమిషాలు మాట్లాడవచ్చా’ అని అడిగాడు.
సరే క్యాంటీన్‌లో మాట్లాడుకుందామన్నాను. అక్కడ కాఫీ తాగుతూ ఉండగా తన గురించి చెప్పటం ప్రారంభించాడు.
‘మేడమ్ నన్ను గత ఏడాదిగా చూస్తున్నారు కదా! నా ప్రవర్తనతో ఎప్పుడైనా, ఎవరినైనా కష్టప్పెట్టేనా? నేను నా జాబ్ విషయమై అందరికీ చెప్తుంటే విని వివరాలు అడుగుతోందని, నా కుటుంబం గురించి మరియు మా ఆర్థిక పరిస్థితి గురించి అన్నీ అందరి ముందే చెప్పాను.’
ప్రిపరేషన్ సెలవులకి ముందు రోజు రాత్రి ఒంటి గంటకి నా ట్రావెలర్స్ ఆఫీసు దగ్గరకి ఒంటరిగా వచ్చేసి, నన్ను ఎక్కడికైనా తీసికెళ్ళిపో అంది సాధన. నాకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ సమయంలో ఇక్కడికి నాకోసం రావటం ఏమిటని అడిగాను. తనకి బెంగుళూరులో బేంకులో పనిచేసే ఒకతనితో పెళ్ళి కుదిరిందని, పెళ్ళి పదిరోజులలో ఉందని చెప్పింది. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, ఎప్పటినుంచో శివ అనే కుర్రాడితో ప్రేమ ఉందని, అతను ఈ రోజు తనని ఎక్కడికో తీసికెళ్ళి పెళ్ళిచేసుకుంటాడని చెప్పింది. అతనికి ఫోను చేసాను, అతను వచ్చే వరకు నీ దగ్గరో ఉంటాను అని చెప్పింది. ఈ సమయంలో వచ్చి నన్ను ఇబ్బంది పెడతావా అని కోపగించుకున్నాను. ఆ సమయంలో మరో ఇద్దరు కుర్రాళ్ళు నేను ఆఫీసులో ఉన్నాము. ఇంటి దగ్గర దింపేస్తానని కోపంగా చెప్పాను.
ఆటోలో ఒంటరిగా అర్థరాత్రి సమయంలో వచ్చిన తన తెగింపుకు ఆశ్చర్యపోయాను. ఆటోవాడు మంచి వాడు కాబట్టి జాగ్రత్తగా దింపి వెళ్ళాడు. నాతో ఉన్న కొద్దిపాటి పరిచయానికి నన్ను ఇరకాటంలో పెట్టవద్దని కోరాను. ఏడుస్తూ గోల చేసింది. ఆ సమయంలో నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసు కానిస్టేబులు ఇదంతా గమనిస్తున్నాడు. సంభాషణ వినపడక పోరునా, సాధన రావటం వగైరా గమనిస్తున్నాడు. నేను వెళ్ళి జరిగిందంతా చెప్పాను. మా యజమానికి కూడా ఫోను చేసాను. ఆవేశంలో ఉంది కాబట్టి కొంచెం స్థిమిత పడ్డాక ఇంటిలో దింపేద్దామనుకుని ఆయన సలహా కూడా అడిగాను. ఆయన సరేనన్నారు. కాని సాధన ఇంటికి మాత్రం వెళ్ళనంది. ఇంటి కి తీసికెళ్ళితే చచ్చిపోతాను అని బెదిరించింది. సరే దగ్గరలోనే ఉన్న తన మేనమామ ఇంటిలో దింపుదామని అనుకున్నాను.
సాధన ఈ మధ్యలో శివకి రెండు సార్లు ఫోను చేసింది. శివ పలకలేదు. మేనమామగారింటికి కూడా రానంది. సరేనని రైల్వే స్టేషనుకి వెళ్ళి వెయిటింగ్ రూములో వున్నాము. ఎన్నిసార్లు ఫోను చేసినా శివ సమాధానం చెప్పటం లేదు.
అకస్మాత్తుగా సాధన మనం పెళ్ళిచేసుకుందామని అంది. ఉలిక్కిపడ్డాను. ఏ ఉద్ధేశ్యంతో ఇంటి నుంచి బయటకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తోంది. నాకు అసలు అలాంటి ఉద్ధేశ్యం లేదు. అందులోనూ నాకు కొన్ని లక్ష్యాలు, బాధ్యతలు ఉన్నాయి. చాలా కోపం పచ్చింది. మీ నాన్నగారికి ఫోను చేస్తాను, ఆయన వచ్చి నిన్ను తీసుకెళతారు అని చాలా తీవ్రంగా చెప్పాను. లేనిపోని ఆవేశాలతో నా జీవితం నాశనం చేయకు అని చెప్పాను. నామీద ఆధారపడి మా తల్లిదండ్రులు, చెల్లెళ్ళు ఉన్నారు. నా చదువు పాడైపోతుందని అసహనంగా వున్నాను అని చెప్పాను.
వెంటనే పెద్దగా ఏడుస్తూ నన్ను పెళ్ళి చేసుకో అంటూ హంగామా మొదలు పెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను మోసం చేసి తీసుకుని వచ్చాననుకున్నారు. అందరూ తలోమాట అనటం మొదలు పెట్టేరు. ఆ సమయంలో నేను ఎవరినీ నమ్మించే స్థితిలో లేను. ఎందుకంటే ఈ సమాజం ఆడదానికి మాత్రమే ఆ సమయంలో విలువనిస్తుంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని హడవిడి చేయనారంభించింది. ఇక తప్పనిసరి పరిస్థితులలో పెళ్ళిచేసుకోవానికి అంగీరించాను. ఈ విషయాలన్ని మా నాన్నగారికి ఫోనులో చెప్పాను. ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు నేను తప్పుచేయనని నమ్మకం. ఆయన సలహా మేరకు ఇంటికి వెంటనే వెళ్ళదలుచుకోలేదు. రెండు, మూడు రోజులు తెలిసిన స్నేహితుల ఇంటిలోనే బసచేసాము.
చివరికి బాగా అలోచించి, తెలిసిన పెద్దవాళ్ళ సలహామేరకు, పోలీస్‌స్టేషనులో జరిగింది చెప్పాను. సాధన తల్లిదండ్రులు కూడా పోలీసులకు పిర్యాదు చేయటం వలన పోలీసులు ఈ విషయాన్ని సాధన తల్లిదండ్రులకు, మా పెద్దలకు తెలియజేసారు. మా ఆఫీసులోని సి.సి. కెమెరాలో ఉన్న దృశ్యాలను, రైల్వేస్టేషనులోని సి.సి. కెమెరాలోని దృశ్యాలను పోలీసువారు పరిశీలించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసును కూడా ఎంక్వయిరీ చేసారు. ఆ వివరాలు సేకరించటం వలన నా తప్పు ఏమీలేదని తేలింది.
నేను నాకు తెలిసిన న్యాయవాదిని, మహిళా సంఘ ప్రతినిధులను పిలిపించాను. మా ప్రాంత పెద్దలు నాకు అనుకూలంగా వాగ్మూలాలు ఇచ్చారు. నా కుటుంబ పరిస్థితులను పూర్తిగా వివరించాను. నా ప్రవర్తనపై పోలీసువారికి పూర్తి నమ్మకం కుదిరింది. అంతా సాధన తప్పు అని తేలింది. పోలీసులు, మహిళా సంఘ ప్రతినిధులు నన్నే సమర్థించారు. పోలీసు స్టేషనుకు వచ్చిన మన ప్రిన్సిపాలుగారు నా గురించి మంచిగానే చెప్పారు. అందరూ సాధననే తొందర పడిందని అన్నారు. పోలీసులు గట్టిగా మందలించి ఆమెను ఇంటికి తీసుకెళ్ళమని సాధన తల్లిదండ్రులతో చెప్పారు.
సాధన తల్లిదండ్రులు రోదించటం మొదలు పెట్టేరు. లేచిపోయిన ఆడపిల్లకి పెళ్ళి ఎలా జరుగుతుంది, ఇంటిలోని మిగిలిన పిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, కుటుంబ పరువు బజారున పడిపోతుందుని విలపించసాగారు. ఆ సమయంలో కొంతమంది పెద్దలు మాధవ్‌కి, వారి పెద్దలకు అంగీకారమైతే వారిద్దరికి పెళ్ళిచేయమని సలహా ఇచ్చారు. సాధన బందువులు కూడ ప్రాధేయపడ్డారు. సాధన శివని ప్రేమించిందేగాని ఎటువంటి తొందరపాటు పనులు చేయలేదని అందుకు సాధనని క్షమించి పెళ్ళిచేసుకోమని కోరారు. చివరకు మా పెద్దల, పోలీసువారి అంగీకారంతో పెళ్ళికి అంగీకరించాను. తరువాత కొద్దిరోజులకు నా పెళ్ళిజరిగిపోరుంది. ఇంత హంగామా జరిగినందుకు నా పెళ్ళికి మీతో సహా ఎవ్వరినీ పిలవాలనిపించలేదు. ఈ రోజు మీకు చెప్పాలనిపించింది అని వివరంగా జరిగింది చెప్పాడు మాధవ్.
నాకు తోచిన విధంగా అతనిని ఓదార్చాను. ‘జరిగిందేదో అయిపోరుంది. పాత విషయాలు మరచిపోయి ఇద్దరూ అన్యోన్యంగా ఉండండి’ అని సలహా ఇచ్చాను. మాధవ్ వెళ్ళిపోయాడు.
ఇలాంటి పరిస్థితులలో కథ సుఖాంతం అయింది కనుక ఎటువంటి ఇబ్బందిలేదు. మాధవ్ పెళ్ళిచేసుకోవాలని ఒప్పుకోకపోయినట్లయితే కథ మరోవిధంగా ఉండేది. ఒక ఆడపిల్ల జీవితం, ఆమె కన్నవారి జీవితం అభాసుపాలయిపోయేది. ఈ పరిస్థితులకు కారణం జీవితం మీద, భవిష్యత్తు మీద అవగాహన లేకపోవటం. తొందరపాటు నిర్ణయాలు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా క్షణికావేశాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కోరుకుంటారు.
పిల్లలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఇంటి వద్దే పరిష్కరించుకోవాలి. వీధినపడి అల్లరి పాలుకాకూడదు. పిల్లల అవగాహనా లోపంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడవలసి వస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయాలలో తగు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. తమ పిల్లలకు సందర్భానుసారంగా జీవితంపై అవగాహన కలిగిస్తూ ఉండాలి. పరస్పర అవగాహనతో ప్రవర్తిస్తే కలిగే ఉపయోగాలు వివరించాలి. సాధన తొందర పడినా, అదృష్టం కొద్ది మాధవ్‌లాంటి మంచి వ్యక్తి దగ్గరకు వెళ్ళటం వలన కథ సుఖాంతం అరుంది.
తరువాత కొద్దిరోజులకు నేను కాలేజీ మారిపోయాను. కాని నాకు అప్పుడప్పుడు కాలేజీ విషయాలు మాత్రం తెలుస్తున్నాయి. మళ్ళీ ఇన్నాళ్ళకు మాధవ్ ఫోనుచేసాడు. ఇంతలో నా కాలేజీ స్టాప్ రావటంతో ఆలోచనలకు అంతరాయం కలిగింది. సాయంత్రం తీరికగా పుట్టిన పిల్లవాని జాతకాలు పరిశీలించి నక్షత్రం, రాశి వగైరా అతనికి ఫోనులో తెలియజేసాను. నా శుభాకాంక్షలు తెలియచేసాను. ఇద్దరూ భవిష్యత్తుపై సరైన అవగాహనతో ఉండమని, ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా ఉండమని సలహా ఇచ్చాను. మాధవ్ ధన్యవాద ప్రణామములు అందచేసాడు.
ఏడూళ్ల సూరిగాడు !!

ఆకాశానికి చిల్లు పడింది. ఒకటే వాన. కుంభవృష్టి. ఏకదాటిగా.. ఎడతెరపి లేదు. జోరు వాన ఆగటం లేదు. ఇంకా నయం హోరు గాలి లేదు. ఈపాటి చెట్లు నేలకూలేవే. ఏంటిది? ఏక దంత గణపతి ఆక్రోశమా? ఉక్రోశమా? అని ఏడూళ్ల సూరిగాడు గొణుక్కుంటుంటే..‘‘ తుళ్లూరు.. తుళ్లూరు’’ అంటూ కండక్టర్ కేక పెట్టాడు. సూరిగాడు ఉలిక్కిపడ్డాడు. పక్కనే గొడుగును తీసుకున్నాడు. డోర్ వద్దకు వెళ్లాడు. జడివాన పడుతూనే ఉంది.
ఇలా బస్సు దిగాడో లేదో.. తడిచిపోయాడు. కంగారుగా గొడుగు తెరచి ఊళ్లోకి జొరపడ్డాడు. ఆశ్చర్యపోయాడు. ఎక్కడా ఒక్క గుడిసె కనిపించలేదు. పశువుల పాకలు లేవు. గేదెలు .. గొర్రెలు..గడ్డివేసే మనుషుల జాడ లేదు. అంబా అని అరిచే ఆవుల్లేవు. గణగణ గంటల శబ్ధంతో పరుగులెత్తే ఎడ్ల జంటలు గుర్తుకొచ్చి.. సూరిగాడు ఆశ్చర్యంతో వీధిలో నడుస్తున్నాడు. కాసేపటికి వర్షం ఆగింది. చూపుడు వేలు అంబేద్కర్ పలకరింతతో ఊహల్లోంచి సూరిగాడు బయటకు వచ్చాడు.

“ అదేంటీ.. ఇక్కడ మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉండేవి .. ఏమయ్యాయి? వాళ్ల బదులు ఎన్టీఆర్, వైఎస్ ఆర్ విగ్రహాలు వెలిశాయా? ఇదేం ఊరు..వామ్మో.. అన్నీ బిల్డింగులే. ఓరి నాయనో.. అపార్టుమెంట్లూ వచ్చేశాయే. వీటిల్లో జనమే ఉంటున్నారా? ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారో? ఇంతకీ సుబ్బయ్య శెట్టి కొట్టు ఎక్కడ? ఓ పొగాకు కాడ కొందాం’’? అని సూరిగాడు ముందుకు నడిచాడు.
ఇలా వాన వెలవగానే.. జనం రోడ్డు మీదకు రావటం మొదలైంది. ఇంతలో బైకు మీద ఓ కుర్రోడు వస్తున్నాడు.
చిన్నా.. సుబ్బయ్య శెట్టి కొట్టు ఎక్కడ? అని చిన్నోడిని సూరిగాడు ఆపాడు.
సుబ్చయ్యా.. లేడు. చచ్చిపోయాడు. అదిగో వెంకన్న షాప్ అని చూపించి బైకుపై కుర్రోడు వెళ్లిపోయాడు. ఆ కొట్టు దగ్గరకు వెళ్లిన సూరిగాడు తేరిపార చూశాడు. సుబ్బయ్యలాగే వెంకన్న కూడా కనించాడు.
“నాన్న.. పొగాకు కాడ ఇవ్వు” , సూరిగాడు అడిగాడు.
“పొగాకా?” వెంకన్న ఆశ్చర్యపోయాడు. “ పొగాకు లేదు. అన్ని సిగరెట్లే. పారిన్ సిగరెట్లే. ఏది కావాలి?” అడిగాడు వెంకన్న
“సరే.. బీడీ కట్ట ఇవ్వు”, సూరిగాడు ముఖం మాడ్చుకున్నాడు.
“తీసుకురావట్లే. అందరూ సిగరెట్లే అడుగుతారు”, వెంకన్న సమాధానం.
సూరిగాడికి మాట పెగల్లేదు. ఇంతలో తలమీద కండువాతో పదేళ్లు బుడ్డోడు వచ్చాడు. “ఏరా చిట్టి ఏంకావాలి” ? అని వెంకన్న అడిగాడు.
“కేజీ బియ్యం” అంటూ వంద నోటు ఇచ్చాడు. బియ్యం కవర్ ను ఈ బుడ్డోడి చేతికి ఇచ్చాడు వెంకన్న. గుప్పెడు శనగపప్పు, బెల్లం ముక్క కూడా చేతిలో పెట్టాడు. చిల్లర డబ్బులు బుడ్డోడి చొక్కా జేబులో పెట్టాడు. శనగపప్పు నోట్లో వేసుకుని ఆ బుడ్డోడు బెల్లం ముక్కను నంజుతున్నాడు. అంతే.. ఒక్క ఉదుటున ఓ పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. బుడ్డోడి వీపు చరిచాడు. “అమ్మా” అంటూ ఆ బుడ్డోడు ముందుకు తూలాడు. నోట్లో శెనగ గింజలు నేలమీద పడ్డాయి. అయినా వాటిని ఏరుకుంటూ .. “ఈ కొట్టుకే వస్తా” అంటూ ఇంటి వైపు తుర్రుమన్నాడు. అక్కడేం జరిగిందో? సూరిగాడికి అర్థం కాలేదు.
“ఆ పిల్లోడిని గొడ్డును బాదినట్టు బాదాడు. ఎవడా పశువు?” అని సూరిగాడు అడిగాడు.
“ఏం చెప్పనండి? ఏడాది కిందట మా పెద్దమాల వీర్లంకయ్య చచ్చిపోయాడు. చదువుకున్నోడు, పొలం ఉన్నోడు. వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఊళ్లో జనానికి అప్పులిచ్చే దిక్కు వీడే. అవసరానికి అప్పులిస్తాడు. కిస్తీ కట్టకపోతే తొక్కి నరం తీస్తాడు. పోతే పోనీ అనుకుని మాలపల్లికి పెద్ద మాలగా షడ్రక్ ను జనం తీర్మానం చేశారు” అని వెంకన్న దీనంగా చెబుతుంటే..
“పర్వాలేదు. భూమి, బంగారం తనఖా లేకుండా బ్యాంకులు కూడా అప్పు ఇవ్వవు. ఊళ్లో జనానికి పెట్టుబడి పెడుతున్నాడు, మంచిదే” అని సూరిగాడు మధ్యలో అందుకున్నాడు.
“ఇంతే ఈ ముసలోళ్లు.. అసలు కథ వినరు” అని వెంకన్న రుసరుసలాడాడు.
“అబ్చే అది కాదురా, అబ్బి ఓ సిగరెట్టు ఇవ్వు” అని సూరిగాడు అడిగాడు. “ఇరవై రూపాయలివ్వు అని గోల్డ్ ఫ్లాక్ కింగ్ సిగరెట్టును సూరిగాడికి అందించాడు వెంకన్న. సిగరెట్టు వెలిగించి, ఓ దమ్ము లాగి.. “సరే ఇప్పుడు చెప్పు,” అన్నాడు సూరిగాడు.
ఏం చెప్పను. ఆర్నెల్లు కిందట పెళ్ళాంతో షాపు పెట్టించాడు. మాలపల్లి జనం మొత్తం ఆ కొట్టుకే వెళ్లాలి. రొక్కం మూడొందలు, అరువు ఆరొందలు. ఇదీ వేపారం. ఈ బాధ పడలేక నా కొట్టుకు జనం వస్తే అసలు ఊరుకోడు. అప్పులు చిట్టా తీస్తాడు. చక్ర వడ్డీ లెక్క కడతాడు. డబ్బులిచ్చి, వేరే కొట్టుకు వెళ్లాలంటాడు. అప్పు తీసుకున్నోళ్లెవరూ ఇంటి బిడ్డల్ని కాన్వెంటు చదువుకు పంపిచకూడదు. ఈ బాధ పడక ఎవరన్నా నా కొట్టుకు వస్తే.. ఇదిగో ఇలా ఇంటి మనుషుల్ని కొట్టిస్తాడు” వెంకన్న బావురుమన్నాడు.
“ఓర్ని.. ఇంత లత్తుగోరా?” సూరిగాడు ప్రశ్నించాడు.
“ ఇది సరే.. ఊళ్లో మొగుడు, పెళ్లాల మధ్య జగడాలు పెట్టేది వీడే. అన్నదమ్ముల మద్య ఆస్తి గొడవలూ వీడివల్లే జరుగుతాయి. పెద్దల పంచాయితీ పెట్టేది వీడే. కుల తప్పులు వేసి.. ఆ డబ్బులతో పెద్దల్ని తాగించేదీ వీడే. తప్పు కట్టనోళ్లకి అప్పులిచ్చేదీ వీడే. జనం చస్తున్నారు”, వెంకన్న ఈసడించుకున్నాడు. వెంకన్న చెప్పిన కథతో సూరిగాడి తల తిరిగిపోయింది. ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
నిజమా? ఈ కథ వింటే, అమెరికా ట్రంప్ గుర్తొస్తున్నాడు. ఈ ఊరి కంపును ట్రంపు నేర్చుకున్నాడా? ట్రంపన్న దారిలో మీ షడ్రక్కు నడుస్తున్నాడా? అలా ట్రంప్ ప్రెసిడెంటు అయ్యాడు. మనోళ్లనే టార్గెట్ చేశాడు. వీసాలు ఇవ్వట్లే. చదుకునే పిల్లల్ని తరిమేస్తున్నాడు. రష్యా , ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని రెచ్చగొట్టాడు. ఇజ్రాయేల్, ఇరాక్ మధ్య జగడం రగిల్చాడు. ఇక ఇజ్రాయేల్, గాజా మద్య ఏకంగా ఆకలి యుద్ధమే జరుగుతోంది. చైనాతో టారిఫ్ వార్.. రష్యాతో వ్యాపారం వద్దు. ఇక ఇండియా, పాకిస్థాన్ మధ్య రగడకూ అతడే కారణం.
మనోళ్లకేమో దేశభక్తి విపరీతం. ఎన్నికలొస్తే చాలు.. ఆర్మీపై ఉగ్రదాడి జరుగుద్ది. బీహార్ లో ఎలక్షన్ వస్తోంది.. అంతలోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మోదీజీ దేశభక్తి రగిలింది. ఆపరేషన్ సింధూర్ షురూ చేస్తే.. మళ్లీ ట్రంప్ గాలిలో ఎగిరాడు. యుద్ధం వద్దన్నాడు. మోదీ మౌనం పాటించాడు. ఇంకేముందీ.. ట్రంనన్నకు నోబుల్ బహుమతి ఇవ్వాలట. తనే శాంతికాముడినని కావు కావుమంటున్నాడు. ఇంతలోనే ఇండియాపై టారిఫ్ అస్ర్తం సంధించాడు. సరీగా .. తుళ్లూరు పెద్దమాల కూడా నోబుల్ బహుమతికి అర్హుడే సుమీ, అని మనసులో అనుకుంటూ సూరిగాడు ముందుకు నడిచాడు.
- బాబు బహదూర్
పుస్తక సమీక్షలు…
వెలిగించిన అక్షర దీపాలు

ఈ వీధిదీపాలు దీర్ఘ కవితా సంపుటిలో సుమారు 40 మంది వీధిని ఆధారంగా చేసుకుని తమ ఆకలిని తీర్చుకునే వారి గురించి రాశారు కవి.
రోడ్డుపై చిత్రాలు గీసే వారి నుండి కొబ్బరినీళ్లు అమ్మే వారి వరకు ప్రస్తావించారు కవి.
“ప్రపంచ రంగస్థలంపై
వీధి వేదికపై
బడుగు జీవులు చేసే
ఆకలి పోరాటాలు
ఈ వీధి దీపాలు”.
అంటారు.
వీధి చౌరస్తాలో ఒక డబ్బా పెట్టుకుని
మైక్ లో పాటలు పాడే వారి గురించి
“వారి శిథిల నేత్రాలయాలలో
చీకటి గబ్బిలాలు రోడ్డు కట్టుకున్నా.
వారు పేగుల వాయిద్యాలను మోగిస్తూ
ఆకలి పాటలు పాడుతారు”
అని రాశారు.
హృదయాన్ని కదిలించేది కవిత్వమైతే మోపూరు గారి దీర్ఘ కవితా సంపుటి ఆశాంతం ఉదయాన్నే కదిలించే కవిత్వంతో నిండి ఉంది.
రెండో విభాగంలో వీధిలో చిత్రాలు వేసి చిల్లర తీసుకునే వారి గురించి రాస్తూ
“అతడు వేసే చిత్రాలు సప్తవర్ణాలతో
శోభిస్తున్నా
ఎండకు ఎండి వానకు తడిచి
రంగులు వెలిసిపోయిన
శిధిల చిత్రం అతడు”.
అంటారు.
కవితా సంపుటిలో అన్ని విభాగాలలోను శ్రమించి పొట్ట పోషించుకునే వారి గురించి మాత్రమే రాశారు.
కొలిమి పని చేసే వారి గురించి
“అతడు ఆశల కొలిమిలో
బ్రతుకు ఇనుమును కాల్చి
ప్రేగుల సమ్మెటతో కొట్టి
తయారుచేసిన ఇనుప ఆయుధాలను
స్వేదజలములో చల్లార్చి
రూపాయి నోట్లుగా మార్చుకుంటాడు.”
అదే విధంగా దేవుని బొమ్మలను తట్టలో పెట్టుకొని అమ్మే పిల్లవాని గురించి, పద్నాలుగు భువనాలను మోస్తున్న భగవంతుడిని ఆ పద్నాలుగు ఏళ్ల బాలుడు మోస్తాడు”. అంటూ ఒక మంచి భావ చిత్రాన్ని మన ముందు ఉంచారు. అయినా “అలా మోసేది పుణ్యం కోసం కాదు పొట్ట కోసం పిడికెడు వెతుకుల కోసం” అంటూ రాస్తారు.
మోపూరు గారి వీధి దీపాలు వివిధ భాగాలలో తాత్వికత కనిపిస్తుంది.ఉదాహరణకు
“దేవుడి రథయాత్ర అయినా
జీవుడి అంతిమయాత్ర అయినా
వీధి సమానంగా చూస్తుంది
మౌనిలా మౌనముద్రలో ఉంటుంది
వీధి గొప్ప సామ్యవాది.”
అంటారు.
ఈ సంకలనంలో అనేక కొత్త పద బంధాలు కూడా మనకు పరిచయం చేశారు కవి. ఉదాహరణకు..ఆకలిపిట్ట, జ్ఞాననక్షత్రాలు, శ్వాస చమురు, పేగుల వాయిద్యాలు, ఇలా.
ప్రతులకు
రచయిత : మోపూరు పెంచల నరసింహం
సెల్ :9346393501
-అవ్వారు శ్రీధర్ బాబు

బాలల నవలా ‘మాణిక్యం’
ఒక కోడిపుంజు (మాణిక్యం)ను కథావస్తువుగా తీసుకోని నవల పూర్తిచేయడం చూసి ఆశ్చర్యపోయాను.
శ్రీ శ్రీ గారన్నట్లు ‘కుక్క పిల్లా… సబ్బుబిళ్లా … అగ్గిపుల్లా… కాదేది కవితకనర్హం’ అన్నట్లు రచయిత ఎంచుకున్న కథావస్తువును, కథను నడిపిన విధానం చూసి ముచ్చటేసింది.
పాత చిత్తూరు జిలా పుత్తూరు ఈశ్వరాపురంలో విరిగిన ఎముకలకు కట్లు కట్టే ప్రకృతి వైద్యం ఎలా మొదలయ్యిందీ నవలలో తెలియజేశారు. దాంతో పాటు అనేక సామెతలు, పొడుపు కథలు, పల్లెటూళ్లలో పిల్లల స్నేహాలు, ఆప్యాయతల్ని నేటి తరానికి అందించారు. పిల్లలు ఆసక్తికరంగా చదివేలా రచయిత కూర్చిన విధానం బాగుంది.
ఇప్పటికే ఈ రచయితవి అనేక కథలు, పిల్లల కథలు, కథాసంపుటాలు వెలువడ్డాయి. వీరి రచనలు పరిశోధనలకు ఎంపికకావడం, విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో చోటు సంపాదించడం,అనేక ప్రతిష్టాత్మక సంస్థలచే పురస్కారాలందుకోవడంతోనే తెలుస్తుంది రచయిత గొప్పదనం. వీరి కలం నుండి మరిన్ని సామాజిక అంశాలపై మంచి రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నాము.
తానా – మంచి పుస్తకం వారి బాలల నవలల పోటీలో గెలుపొంది వారే ప్రచురించిన పుస్తకం ‘మునికిష్టడి మాణిక్యం’. నవ్వు పుట్టించే గమ్మత్తైన సంఘటనలతో, అందమైన ఆర్టిస్టు గోపాలకృష్ణ బొమ్మలతో ఎనభై పేజీలున్న ఈ పుస్తకం ధర కేవలం యాభై రూపాయలు మాత్రమే.
మల్లారపు నాగార్జున

ఈ సంచికలో ప్రచురణ కోసం మీ రచనలను పంపించాల్సిన మెయిల్ prabhanewscontent@gmail.com