ఈ సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.
- అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
- బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
- చెప్పుకోండి చూద్దాం..
- మా ఇంటి తోట (కథ)
- ఔరా కార్టూన్
- అది కూడా తప్పే ! (కథ)
- ఇదీ వరస.
- మా‘నవ’లోకం రెడీ – ఏడూళ్ల సూరిగాడు
- చిగురించిన వసంతం – బుక్ రివ్యూ
- ప్లీజ్…నా కథ కు బహుమతి ఇవ్వొద్దు (కథ)
- కాలక్షేపం పిలుస్తోంది! (కథ)
- చెప్పుకోండి చూద్దాం – సమాధానాలు
ముఖపత్ర కథనం
1.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

పృకృతి శోభతో అలరారే పండుగలు మనుషుల మధ్య సంఘీభావాన్ని కలిగిస్తాయి. ప్రకృతితో మమేకమైన మన జీవితాన్ని తెలియజేస్తాయి. ఒక ప్రాంతం యొక్క ప్రత్యేకతను అక్కడి జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.
చారిత్రక, పౌరాణిక గాధల ఆధారంగా, వారసత్వంగా వస్తోన్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవ చిహ్నం….బతుకమ్మ…
ఊరూ వాడా ఏకమై పట్టు చీరలూ పరికీణీలతో బామ్మలూ అమ్మమ్మల నుంచి అమ్మాయిల దాకా ఉత్సాహంగా ఆడుతూ పాడే బతుకమ్మ పాటలు వినాలంటే తెలంగాణలోని గల్లీ గల్లీ నుంచి కాలనీల దాకా..వరంగల్ లోని వేయిస్థంభాల గుడి నుంచి, హైదరాబాద్ టాంక్ బండ్ దాకా…
తెలంగాణ గ్రామీణ జీవన విధానంలో మొదలైన బతుకమ్మ నగరాల్లోనూ ఉయ్యాలో ఉయ్యాలో అంటూ ప్రతిధ్వనిస్తోంది. ఆశ్వయుజ అమావాస్య నుండి నవమి దాకా ప్రతిరోజూ వివిధ రకాల నైవేద్యాలందుకునే బతుకమ్మ రోజుకో పేరుతో పిలువబడుతుంది.
ఆయా పేర్లు- నైవేద్యాలు ..
1వ రోజు – ఎంగిలి పూల బతుకమ్మ
పసుపు, గంగవెల్లి ఆకు తోడుగా పూలతో బతుకమ్మ సంబురం ప్రారంభం..
రెండోరోజు అటికే బతుకమ్మ
సాదాసీదా వంటలు, ఆవాలు, పెరుగు వంటి పదార్థాలతో పూజలు.
మూడో రోజు మూడ బతుకమ్మ
తక్కువ పూలతో చిన్నగా ఏర్పాటు.
నాలుగో రోజు నాలుగ బతుకమ్మ
పసుపు గడ్డను వాడి పూజలు.
ఐదోరోజు ఆర బతుకమ్మ
చిన్న వంటకాలు, తినుబండారాలతో పూజ.
ఆరో రోజు ఏడు బతుకమ్మ
ఏడు రకాల వంటకాలతో పూజలు చేసే ఆనవాయితీ.
ఏడోరోజు వెన్నముద్దల బతుకమ్మ
వెన్నతో ముద్దలు చేసి వాటిని బతుకమ్మ చుట్టూ పెట్టి పూజ.
ఎనిమిదోరోజు అష్ట బతుకమ్మ
అష్టమి నాడు ప్రత్యేకంగా పూలతో అందమైన బతుకమ్మను అలంకరిస్తారు.
తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ
చివరి రోజు, ఇది అత్యంత ముఖ్యమైన రోజు.
ఐదు రకాల సద్దులు (అరటికాయ, గుమ్మడికాయ, సెనగలు, బియ్యం, పెసర పప్పు) వండి పూజ చేస్తారు.
ఆ తర్వాత బతుకమ్మను గంగమ్మ తల్లి ఒడికి చేర్చి, నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ పండుగలో ఉపయోగించే పూలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, ఔషధ విలువలు ఉన్నాయి.
గుమ్మడి పువ్వు ఆరోగ్యానికి మంచిది.
ఇంట్లో చెడు శక్తులను దూరం చేస్తుందని విశ్వాసం
గున్నేరు రంగురంగుల అందంతో బతుకమ్మను అలంకరిస్తుంది.
దీన్ని పవిత్రమైనదిగా భావిస్తారు.
పసుపు రంగు తంగేడు పువ్వు
శరీరానికి చల్లదనం, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
గోరింటాకు పువ్వు స్త్రీల అందానికి ప్రతీక. .
బంతి పువ్వు ఎక్కువగా వాడే పువ్వు. పూజల్లో పవిత్రతకు ప్రతీక.
చామంతి దీర్ఘాయుష్కు ప్రతీక. సువాసనతో వాతావరణాన్ని సుందరంగా చేస్తుంది.
తుమ్మెద పువ్వు విభిన్న ఆకారంలో ఉండే పువ్వు. కళ్ళకు హాయిగా, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
చిన్న చిన్న పువ్వులను పూసలాగా పేర్చి అలంకరిస్తారు.
పసుపు, ఎరుపు, తెలుపు, ఊదా వంటి రంగులు కలిపి అందంగా తయారు చేస్తారు.
వర్షాకాలం తర్వాత వచ్చే సీజన్‌లో ఈ పూలను స్పృశించడం, వాటి గుబాళింపులను ఆస్వాదిస్తూ ఆడడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని విశ్వాసం.
ఒకప్పుడు బతుకమ్మ పండుగకు ఒక్కో పువ్వును సేకరించాలంటే చెట్లూ పుట్టలూ పట్టుకు తిరిగి తిరిగి సేకరించాల్సి వచ్చేది. ఆ తర్వాత అన్నీ మార్కెట్లో అవలీలగా లభిస్తున్నాయి. ఇక అన్నీ ఆన్ లైన్ లో ఇంటికొచ్చేస్తున్న ఈ కాలంలో బతుకమ్మ పూలు కూడా ఈ కామర్స్ ప్లాట్ ఫాం లు అందుబాటులో ఉంచాయి.
2.చెప్పుకోండి చూద్దాం.
1.ఈ నెల రిలీజ్ అవుతున్న ఓజీ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు ఏంటి ?
2.భారత్ ఇప్పటి వరకు ఆసియా కప్ ఎన్ని సార్లు గెలిచింది. ?
3.HITEC City ఫుల్ ఫామ్ ?
4.ఇటీవల శ్రీశైలం బోర్డు చైర్మెన్ గా నియమితులైంది ఎవరు ?
- సమాధానాలు చివర్లో
3.మా ఇంటి తోట (బాలప్రభ కథ)

చైతు అనే ఏడేళ్ళ కుర్రాడు స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
“అమ్మా! ఈరోజు మా టీచర్ మొక్కల గురించి చెప్పారు. మొక్కల వల్ల మనకు ఎంత మేలు జరుగుతుందో చాలా బాగా వివరించారు. అందరూ తమ ఇళ్లలో పెరటి తోటలు పెంచుకోవాలని కూడా చెప్పారు.” అని అన్నాడు.
“ఔనా! పెరటితోటవల్ల మనకేంటి ప్రయోజనం?” అంటూ చైతును అడిగింది అమ్మ.
“పెరటి తోట వల్ల మనకు కావలసిన కూరగాయాలను, ఆకుకూరలను మనమే పండించుకోవచ్చు.” చెప్పాడు చైతు.
“అంత కష్టం ఎందుకు? ఎంచక్కా మార్కెట్టుకు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా!” చైతును పరీక్షిస్తూ అడిగింది అమ్మ.
“మార్కెట్లో దొరికే కూరగాయలు, పండ్లు పండించడానికి రసాయన ఎరువులు, మందులు వాడుతారని మా టీచర్ చెప్పారు. వాటి వల్ల అనారోగ్యం చేస్తుందని కూడా మా టీచర్ చెప్పారు.” అన్నాడు చైతు.
“మీ టీచర్ చెప్పింది నిజమే. మా చిన్నతనంలో మా ఇంటి ముందు చాలా పెద్ద స్థలం ఉండేది. అందులో రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుకునేవాళ్ళం. ఎటువంటి రసాయణాలూ కలవని ఆకుకూరలు, కూరగాయలతో భోజనం చేసేవారం.” అని చెప్పింది అమ్మ.
“మరైతే మనం కూడా మొక్కలు నాటుదామా?” అని ఉత్సాహంగా అడిగాడు.
చైతు మాటలు విన్న అమ్మ నిట్టూర్చింది.
“చైతు! అది మంచి ఆలోచనే! కానీ, మన ఇంటికి పెరడు లేదు. మన ఇల్లు ఉన్న వీధి మొత్తం సిమెంటు రోడ్డు వేశారు. మొక్కలు నాటడానికి ఎక్కడా ఖాళీ స్థలం లేదు.” అని చెప్పింది అమ్మ.
చైతు నిరాశగా తల దించుకున్నాడు.అప్పుడే అక్కడకు వచ్చిన నాన్న వారి మాటలు విన్నాడు.
“ఇంటి ముందు ఖాళీ స్థలం లేకపోతేనేం! ఇంటి మిద్ది పైన చాలా స్థలం ఉంది కదా! పెరటి తోటకు బదులుగా మిద్ది తోట ఏర్పాటుచేద్దాం!” అన్నాడు నాన్న.
“మిద్ది తోట అంటే ఏమిటి నాన్న?” అడిగాడు చైతు.
“పూలకుండీలను, వృథాగా పడివున్న కుండలను, ప్లాస్టిక్ డబ్బాలను మిద్ది పైకి చేర్చి, వాటిలో మట్టిని, ఎరువుగా తయారుచేసిన వంటగది వ్యర్థాలను వేసి మనకు కావలసిన మొక్కలు నాటడాన్ని మిద్ది తోట అంటారు.” వివరించాడు నాన్న.
“నా హుండీలో ఉన్న డబ్బులతో మనం కొన్ని కుండీలను కొనుక్కుందాం!” అన్నాడు చైతు.
ఆరోజు సాయంత్రం కుటుంబం మొత్తం ఆనందంగా మిద్దితోట నాటడానికి ఏర్పాట్లు చేశారు. టమాట, మిరప, బీర, గులాబీ, పుదీనా, మెంతు, పాలకూర మొదలైన మొక్కలు నాటారు. తన మిద్ది తోటను చూసి చైతు చాలా సంతోషపడ్డాడు.
4.ఔరా కార్టూన్–
5.అది కూడా తప్పే!

మాధవ్ కి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే అన్నావదినలే పెంచి పెద్ద చేశారు. అన్న ఎంతో అభిమానంగా ఉంటూ అతను కోరుకున్న చదువు చెప్పించాడు, మనసు పడిన అమ్మాయితో పెళ్లి జరిపించాడు. వదిన ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. కన్నతల్లిలాగానే చూసింది. మాధవ్ పెళ్లి అయిన తర్వాత “మేం ఈలోకంలోకి వచ్చిన పని అయిపోయింది” అన్నట్లు అన్నా వదినా ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి అన్న కూతురు హరిత, కొడుకు దీపక్ చిన్నవాళ్ళు. హైస్కూల్ లో చదువుతున్నారు.
బెంబేలు పడుతున్న అన్నపిల్లల్ని దగ్గరకి తీసుకుని “మీకు నేనున్నాను” అంటూ ధైర్యం చెప్పాడు మాధవ్. తనని అన్నావదినలు ఎలా చూశారో అలాగే అన్నపిల్లల్ని కూడ ఆప్యాయంగా చూశాడు మాధవ్. అన్నపిల్లలతో కలిసి పెరుగుతున్న తన కొడుకు వంశీ కూడా వాళ్లకి లాగానే తనని “బాబాయ్!” అని పిలిచేవాడు. అందుకు మాధవ్ నవ్వి ఊరుకున్నాడు తప్ప ఏనాడూ బాధపడలేదు. ముగ్గురినీ తన సంతానం లాగానే చూసుకున్నాడు. అన్నపిల్లలు కోరుకున్న చదువులు చెప్పించాడు. వారు కోరుకున్న వారితోనే వివాహాలు కూడా జరిపించాడు. ఇదంతా గతం.
ప్రస్తుతం మాధవ్ మాధవరావు అయ్యాడు. రిటైర్ అయి పదేళ్ళు అయింది. పల్లెటూరిలో సొంత ఇంట్లో ఉంటున్నాడు. అన్నకొడుకు, కూతురు వేర్వేరు ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాదులో ఉంటున్నారు. మాధవరావు కొడుకు తల్లిదండ్రులను వదిలి వెళ్ళటానికి ఇష్టపడక, అక్కడికి దగ్గరలోనే ఉద్యోగం చూసుకుని అక్కడే ఉంటున్నాడు. వారి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు.
ఒకరోజు “వంశీ! దీపక్, హరితలను చూసి చాలా రోజులైందిరా! ఎప్పుడు ఫోన్ చేసినా బిజీబిజీ అంటూ ఉంటారు. నేను బిజీ కాదుగా! రిటైర్ అయి ఖాళీగానే ఉన్నాను. హైదరాబాదు వెళ్లి, ఇద్దరి దగ్గరా చెరో రెండురోజులు గడిపిరావాలని ఉంది” అన్నాడు.
“అలాగే డాడీ! రేపు శని,ఆదివారాలు నాకు కూడా సెలవులేగా! తీసుకువెళతాను” అన్నాడు వంశీ. అతను తండ్రిని చిన్నప్పుడు ‘బాబాయ్’ అని పిలిచినా, ఇప్పుడిప్పుడే ‘డాడీ’ అని పిలవటం అలవాటు చేసుకుంటున్నాడు. మాధవరావు భార్య రేవతి మాట్లాడలేదు, భర్త ఇష్టమే తన ఇష్టం అన్నట్లు ఊరుకుంది.
ఆ మర్నాడు వంశీ కారు డ్రైవ్ చేస్తుంటే మాధవరావు కొడుకు పక్కన ముందు సీట్లో, రేవతి వెనక సీట్లో కూర్చున్నారు. హైదరాబాదు చేరుకునే సరికి సాయంత్రం అయింది. ముందే బుక్ చేసిన హోటల్ ముందు కారు ఆపాడు వంశీ.
“బంధువుల ఇంటికి వెళుతూ హోటల్ లో దిగటం ఏం బాగుంటుంది? వాళ్ళు బాధపడతారేమో!” అన్నాడు మాధవరావు.
“ఇక్కడ ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు ఉదయాన్నే అన్నయ్య వాళ్ళ దగ్గరకి వెళదాం డాడీ! అంతగా అవసరం లేదనుకుంటే అప్పుడే ఖాళీ చేయవచ్చు” అంటూ కిందికి దిగాడు వంశీ.
లగేజ్ తీసుకుని వాళ్ళకి బుక్ చేసిన రూమ్ కి వచ్చారు. మాధవరావు, రేవతి స్నానం ముగించేసరికి వంశీ భోజనాలు తీసుకువచ్చాడు. భోజనం చేయగానే నిద్ర ముంచుకువచ్చింది. మెలకువ వచ్చి చూసేసరికి తెల్లగా తెల్లవారిపోయింది. ప్రయాణపు బడలిక అంతా పోయి హాయిగా అనిపించింది. ఫ్రెషప్ అయిన తర్వాత టిఫిన్ లు చేసి అందరూ బయలుదేరారు.
మాధవరావుని చూడగానే హరిత ఆశ్చర్యంతో నవ్వుముఖంతో ఎదురు వచ్చింది. మంచినీళ్ళు అందించి వాళ్ళకి తినటానికి ఏమైనా చేయటానికి కిచెన్ లోకి వెళ్ళింది. ఎంతసేపైనా బయటకు రాలేదు. ముగ్గురూ హాల్ లో సైలెంట్ గా కూర్చున్నారు. అరగంట తర్వాత పకోడీలు చేసి మూడు ప్లేట్లలో పెట్టింది.
“అల్లుడు ఏడీ! కనబడటం లేదు” అడిగాడు మాధవరావు.
“నిద్రపోతున్నారు బాబాయ్! అమ్మాయి కాలేజీకి రెడీ అవుతూంది” అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళింది. “పదిగంటలు అవుతుంటే ఇంకా నిద్రలేవలేదా?” అని అడుగుదామని అనుకున్న ప్రశ్న నోట్లోనే ఉండిపోయింది. లోపలికి వెళ్ళిన హరిత ఎంతసేపటికీ బయటకు రాలేదు.
ఇంతలో బెడ్ రూమ్ లో నుంచీ అల్లుడు బైటకి వచ్చాడు. ఒంటిమీద షార్ట్స్, బనీను తప్ప ఏమీలేవు. బానపొట్ట ముందుకు పొడుచుకువచ్చింది. ఎర్రబడ్డ కళ్ళతో ఒక్కక్షణం చూశాడు తప్ప పలకరించలేదు. “బాగున్నావా బాబూ!” అని మాధవరావు అడిగేలోపు బాత్ రూమ్ లోకి జొరబడ్డాడు.
హరిత కూతురు కాలేజీకి వెళుతూ హాల్ లోకి వచ్చింది. ఒంటికి అంటుకు పోయినట్లున్న పల్చటి డ్రెస్ వేసుకుంది. జుట్టు విరబోసుకుని ఉంది. ఆ డ్రెస్ లో శరీరంలోని ఎత్తుపల్లాలు అన్నీ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. “హాయ్! గ్రాండ్ పా!” అంటూ చెయ్యి ఎత్తి ఫకాలున నవ్వింది. “ఆ బట్టలు ఏమిటమ్మా! చక్కగా పరికిణీ, ఓణీ వేసుకోక? జుట్టు అలా వదిలేయకూడదు. ఆ వెంట్రుకలు అన్నంలోకి వస్తే ఎంత అసహ్యం?” అన్నాడు మాధవరావు.
“నా బట్టల గురించి కామెంట్ చేయటానికి మీరు ఎవరు? నా ఇష్టం. నేనేమీ చిన్న పాపాయిని కాదు. యు నో?” అన్నది పెద్దగా.
“మీరంతా నాకు చిన్నపాపాయిలే!చిన్నపాపాయి తప్పటడుగులు వేసేటప్పుడు పెద్దవాళ్ళు సరిదిద్దుతారు. అలా చెబుతున్నాను. మీ అమ్మ కూడా నా కళ్ళముందే పుట్టి పెరిగింది” అన్నాడు. ఇంతలో బయట మెట్లదగ్గర బండి హారన్ వినిపించింది. తలతిప్పి చూశాడు. ఎవరో కుర్రాడు జీన్స్, టీ షర్ట్ వేసుకుని ఒక కాలు కిందపెట్టి స్టైల్ గా నిలబడి ఇటే చూస్తున్నాడు.
“హాయ్ రాహుల్!” అని చెయ్యి ఊపి, “రాహుల్ వచ్చాడు” అన్నది సంతోషంగా. “ఎవరతను?” అడిగాడు మాధవరావు. “నా బాయ్ ఫ్రెండ్. రోజూ అతని బైక్ మీదే కాలేజ్ కి వెళతాను” అన్నది.
“అలా పరాయి మగవాళ్ళతో చనువుగా ఉండకూడదు. జరగరానిది ఏమైనా జరిగితే నువ్వే కదా బాధ పడవలసింది?” అన్నాడు.
“ఎందుకు బాధ పడతాను? వాడు తప్ప లోకంలో మగాళ్ళే లేరా? వాడు కాకపోతే ఇంకొకడు” అన్నది నిర్లక్ష్యంగా. మాధవరావు ఏదో చెప్పబోతుండగా కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకుని హరిత బయటకు వచ్చింది. “దాని సంగతి నీ కెందుకు. ఊరుకో!” అన్నది బాబాయ్ వంకచూస్తూ.
“మమ్మీ! వాటీజ్ దిస్ ఓల్డ్ మ్యాన్ థింకింగ్ ఎబౌట్ మీ!” కోపంగా చూస్తూ అన్నది. “అది కాదమ్మా!” అని మాధవరావు ఏదో చెప్పబోతూ ఉండగానే “పోనీ బాబాయ్! వదిలెయ్యి” అని, కూతురితో “నువ్వెళ్ళు. నీ బాయ్ ఫ్రెండ్వెయిట్ చేస్తున్నాడు.” అని భుజాలు పట్టుకుని తోసింది. కాళ్ళు బాదుకుంటున్నట్లు పెద్దపెద్ద అంగలు వేస్తూ విసురుగా వెళ్లి, గేటుదగ్గర ఉన్న అతని బైక్ ఎక్కి వెనకకూర్చుంది ఆ పిల్ల.
మాధవరావు, రేవతి నోట మాటరానట్లు చూస్తూ ఉండిపోయారు. మగపిల్లలకి దూరంగా ఉండమని చెప్పాల్సిన తల్లే అతడితో పంపిస్తూంది కూతురిని. పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదని చెప్పకుండా ఆ వెర్రిమొర్రి వేషాలని సమర్ధిస్తూంది.
ఇక అక్కడ కూర్చోవాలనిపించలేదు మాధవరావుకి. లేచి నిలబడ్డాడు. రేవతి, వంశీ కూడా నిలబడ్డారు. “అప్పుడే వెళుతున్నారా! నాలుగురోజులు ఉండి వెళ్ళవచ్చుగా!” మాటవరసకు అన్నట్లు అన్నది హరిత. “లేదు. అర్జెంట్ పనులున్నాయి” చిన్నబోయిన మొహంతో చెప్పిబయటకు నడిచాడు మాధవరావు. భార్యాబిడ్డలు ఇద్దరూ ఆయన్ని అనుసరించారు. హరిత ఉండమని బలవంతం చేయలేదు.
వంశీ కారు డ్రైవ్ చేస్తూ “అన్నయ్య దగ్గరకి వెళదామా డాడీ!” అని అడిగాడు. “ఊ” అన్నాడు మాధవరావు.కొద్దిసేపటి తర్వాత కారు ఒక ఇంటిముందు ఆగింది. ఆ ఇల్లు చాలా మోడరన్ గా కనబడుతున్నది. ముగ్గురూ కారు దిగి లోపలకి వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టగానే ఒకామె వచ్చి తలుపు తీసింది. “బాగున్నావా అమ్మా! దీపక్ ఉన్నాడా!” అడిగాడు మాధవరావు. ‘ఊ’ అని ముభావంగా అని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. “దీపూ భార్య. వీళ్ళిద్దరూ ఇష్టపడితే నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను” కొడుకుతో చెబుతూ సోఫాలో కూర్చున్నాడు. భార్యాపిల్లలు కూడా పక్కనే కూర్చున్నారు.
లోపలికి వెళ్ళిన ఆమె ఎంతసేపయినా బయటకు రాలేదు. అతనితో చెప్పిందో లేదో తెలియలేదు. ఇలా వెయిట్ చేయించటం ఇక్కడ అందరికీ అలవాటు కాబోలు అనుకుంటూ, కాసేపు చూసి “మన దీపూ ఇల్లేగా!” అని లేచి బెడ్ రూమ్ దగ్గరకు వెళ్లి, గుమ్మంలో ఆగిపోయాడు మాధవరావు. అక్కడ దీపక్, అతడి కొడుకు ఇద్దరూ కుర్చుని డ్రింక్ చేస్తున్నారు. గ్లాసులు, నీళ్ళ బాటిల్ తీసుకువచ్చి అందిస్తూంది అతడి భార్య. తలెత్తి చూసిన దీపక్ “ఓ! నువ్వా బాబాయ్!” ముద్దముద్దగా అన్నాడు.
“ఏమిట్రా ఇది? పిల్లాడికి వద్దని చెప్పటం మాని, నువ్వు కూడా కుర్చుని డ్రింక్ చేస్తున్నావా! తప్పు కదూ!” అన్నాడు మాధవరావు.
“మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాము. తండ్రీ కొడుకుల్లాగా కాదు” అన్నాడు దీపక్. “మీ పెద్దవాళ్ళు ఉన్నారే మమ్మల్ని తిరగనివ్వరు, తాగనివ్వరు. మీ చాదస్తాలతో ఎందుకు చంపుతారు? ఇప్పటిదాకా నేను భరించాను. నేను నీ లాగా కాదు. నా కొడుకుకి పూర్తి స్వేచ్చ నిచ్చాను” అన్నాడు.
“ఏమిట్రా ఇదంతా!”
“మోడరన్ బాబాయ్! ఇక్కడ అందరూ ఇంతే! నీకు నచ్చదు గానీ నువ్వెళ్ళు” అన్నాడు దీపక్ తూలుతూ.
మాధవరావు హాలులోకి తిరిగివచ్చి, వెళదాం. లేవండి” అన్నాడు. భార్య, కొడుకు లేచారు. కారు డ్రైవ్ చేస్తున్న వంశీ వంక పరిశీలనగా చూశాడు మాధవరావు. వంశీ ఏనాడూ తన పట్ల అమర్యాదగా మాట్లాడలేదు. అమర్యాద కాదు, అసలు మనసు నొచ్చుకునేటట్లు ఏనాడూ ప్రవర్తించలేదు. ఎంతసేపూ తల్లిదండ్రులను సుఖపెట్టటానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్లు ఉంటాడు. అన్నపిల్లల్ని, తన కొడుకుని ముగ్గుర్నీ తనే పెంచాడు. వాళ్ళు ఆ విధంగా కావటానికి, వీడు ఇంత క్రమశిక్షణగా ఉండటానికి కారణం ఏమిటి?…వీళ్ళ ధోరణి ముందే ఊహించి కాబోలు హోటల్ లో రూమ్ బుక్ చేశాడు వంశీ!, అనుకున్నాడు మాధవరావు.
రూమ్ కి వచ్చిన తర్వాత ముగ్గురూ ఫ్రెస్ అప్ అయి కూర్చున్నారు. ఇప్పటివరకూ జరిగినవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు మాధవరావు. “మా అన్నయ్య పిల్లల్ని నా పిల్లలే అన్నట్లు పెంచాను. రాకరాక చాన్నాళ్ళ తర్వాత వస్తే రెండురోజులు ఉండమని మాటవరసకు కూడా అనలేదు. వెళ్ళటమే మంచిది అన్నట్లు చేశారు. నేను ఏం చేశానని వాళ్ళు నన్ను శత్రువు లాగా చూస్తున్నారు?” అన్నాడు బాధగా.
“ఏం చేయకపోతేనేం? తప్పుని తప్పని చెప్పారుగా! అదిచాలు…” అన్నది భార్య నవ్వు తెచ్చిపెట్టుకుంటూ.
“అది కూడా తప్పేనా!” అన్నాడు.
“వాళ్ళ దృష్టిలో తప్పే! మా ఇష్టం. మా ఇష్టం వచ్చినట్లు ఉంటాము. మమ్మల్ని ఏమీ అనటానికి వీల్లేదు అన్నట్లు ఉంటున్నారు ఈరోజుల్లో అందరూ”
“అలా అంటే ఎలా? మనం సమాజంలో నివసిస్తున్నప్పుడు ‘అంతా నా ఇష్టం’ అన్నట్లు ఉండకూడదు. మనవ్యక్తిగత ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యం తగ్గించుకుని, పదిమందికీ ఆమోదయోగ్యం అయ్యేటట్లు నడుచుకోవాలి”.
“అది మీ అభిప్రాయం. ఒక చిన్నమాట అంటే చాలు, ఎలాంటి బంధాన్ని అయినా పుటుక్కున తెంచేసుకుంటారు ఈరోజుల్లో. నేను కూడా సంపాదిస్తున్నాను. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అనుకుంటారు. బంధాల కన్నా ఈగోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు” అన్నది రేవతి.
“ఏమిటో!” బాధగా నిట్టూర్చాడు మాధవరావు.
6.ఇదీ వరస..

7.మా‘నవ’లోకం రెడీ
- ఏడూళ్ల సూరిగాడు

అమరావతి, అందాల స్వర్గ ధామం.సరీగా అక్కడే.. ఆ నందనవనంలో..పున్నమి వెన్నెల దోబూచులాడుతోంది. గుండు మల్లె మాలాంకృత శచీదేవీ ఎదలో మదిలో పాత జ్ఞాపకాల సవ్వడితో.. ఆమె తనువు తుళ్లింతకు అదుపు లేదు. అవధి లేదు. చల్లని గాలిలో ఆ కురులు ఎగిరెగిరి తెల్లటి బుగ్గలను తాకుతుంటే,, సన్నజాజుల సుగంధం మత్తు గొలుపుతుంటే.. ప్చ్.. అని శచీదేవీ తన శయన మందిరంలో అడుగు పెట్టింది.
“శచీ ..శచీ”,, అని పిలుపు వినగానే.. ఈ స్వరం తన భర్త దేవేంద్రుడిదే అని శచీదేవీ ఆశ్చర్య పోయింది. “ఇదేమి స్వామి కలియుగాంతంలో విశ్రాంతి దశలో గుర్తుకు వచ్చానా”? అని తనలో తాను ప్రశ్నించుకుంటూ.. శచీదేవి తేరిపార చూసింది. “నిజమే, స్వామే, ఈ దర్శనమేంటీ?” మళ్లీ శచీదేవీ అంతర్గత ప్రశ్న.
“శచీ…” అని తన వజ్రాయుధాన్ని పీఠంపై పెట్టి.. హంసతూలిక తల్పంపై నడుము వాల్చాడు. “కాస్త పాలు ఇవ్వు ” అనగానే శచీదేవీకి డౌటనుమానం రగిలింది.

“ఎవ్వడువురా? ఏడ నుంచి వచ్చినావ్” గంట కొట్టి భటుల్ని పిలిచింది. పతీదేవుని గుర్తించలేని అహల్యను అనుకొంటివా? నీచుడా, లే” శచీదేవీ అరిచింది.
“ఏమీ శచీ.. ఎలా బేలా’’? అంటూ దేవేంద్రుడు దరి చేరాడు. శచీదేవీ దూరంగా జరిగింది.
“ప్లీజ్.. ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్” అంటూ శచీదేవీని ఆక్రమించాడు. ఈ దృశ్యాన్ని చూసి భటులు వెనుతిరిగారు. వీరి మధ్య ఈ సరసం మామూలే అనుకుని కళ్లు మూసుకున్నారు.
“చీ నీచుడా.. వదులు, వదులు” అంటూ శచీదేవీ గింజుకుంటూ.. ఆశ్చర్యపోయింది. ఇతడి పదజాలం అర్థం ఏంటీ? ప్లీజ్ .. ప్లీజ్ అంటూ ఈ దుశ్చర్య ఏమిటీ? ఏమీ ఈ స్పర్శ. స్వామి ….హీనుడే. మేషాండుడే. గౌతమ మహాముని శాపగ్రస్తుడే. మరి ఇతగాడు ఎవరు? నా పతి కాదు, నా తనువు ఈ కీచకుడి వశమవుతోంది, కింకర్తవ్యమ్, ఎవరిని శరణు వేడాలి” అని శచీ దేవీ కంగారెత్తుతున్న క్షణాల్లో పుష్పక విమానం వాలింది. నీరసంగా దేవేంద్రుడు కిందకు దిగి నిశ్చేష్టుడయ్యాడు.
“ఓరీ రాక్షసాధమా? ఎవడురా నీవు? ఏలోకం? ఇప్పుడే నిన్ను ఖండఖండాలుగా.. తునా తునకలు చేసేదను గాక, అని దేవేంద్రుడు ఘర్జించగానే శచీదేవీని ఒడిసి పట్టిన దేవేంద్రుడు అదృశ్యమయ్యాడు. ఇంతలో చెలి కత్తెలు బిరబిర పరుగులతో శచీదేవీని అక్కున చేర్చుకున్నారు.
“ఏమైంది మహారాణి ” ప్రశ్నించారు. భటులూ పోగయ్యారు.
“ఎవరతడు?” దేవేంద్రుడు హుంకరించారు.
“నీచుడా నీవెవరు?” ఎదురు శచీదేవీ ఈసడించుకుంది.
“పతినే ప్రశ్నిస్తావా?” దేవేంద్రుడు కోపోద్రిక్తుడయ్యాడు.
“..రుజువేంటీ?” శచీదేవీ మళ్లీ ప్రశ్నించింది.
“ చూసుకో”. అంటూ పై వస్త్రాన్ని తొలగించాడు.
“చాలు చాలు… ఈ వేయి కన్నులు అతడిలోనూ కనిపించాయి.
“ఇతడిని బంధించండి” అని శచీదేవీ భటులను ఆదేశించింది.
“ఆగండి.. నారాయణ నారాయణ,” అంటూ నారద మహాముని ఎంట్రీ ఇచ్చాడు.
“మీరిద్దరూ అసలు సిసలు దంపతులే. ఆ అంతర్థానుడే ఏఐ దేవేంద్రుడు,” నారదుడు అనగానే,
“ఏఐ దేవేంద్రుడా” అంటూ అక్కడున్న చెలికత్తెలు, భటులు సహా శచీదేవీ, దేవేంద్రుడు నోరు వెళ్ల బెట్టాడు.
“ఔను మానవ నిర్మిత కృత్రిమ దేవేంద్రుడు, మీకు గుర్తుకు రాలేదా? కోడిపుంజు గళంతో అహల్యను మీరూ… బంగారు జింక వేషంలో సీతను మారీచుడూ మాయం చేయలా? మీరు నేర్పిన శిక్షే నీరజాక్షిగా మారింది. ఈ మానవులు మామూలోళ్లు కాదు, కృత్రిమ మేథస్సుకు పదును పెట్టారు. బ్రహ్మలోకానికే ఎసరు పెట్టారు.. ఇక మిగిలింది, విష్ణువు, శివుడే. యముడ్నీ వదలరు సుమీ, నారాయణ నారాయణ”, అంటూ నారదుడు చేతిలో చిడతలకు పని చెప్పాడు.
“స్వామీ ..స్వామీ పాహిమాం..పాహిమాం” అంటూ ఒక్క ఉదుటున రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ సహా అప్సరసలంతా దేవేంద్రుడి కాళ్ల మీద పడ్డారు.
“ఏంటీ వైపరీత్యం, సభ నుంచి నేరుగా ఇంత మంది దండులా మహారాజు ఏకాంత మందిరాన్ని చేరవచ్చా.. మీకు బుద్ధి నశిస్తోంది, తగిన మూల్యం తప్పదు, ఏం జరిగింది”? దేవేంద్రుడు హూంకరించాడు.
“వీళ్ల దగ్గరేముందీ.. మీ బొంద.. వీళ్లకు చావు లేదుగా. అమృతం తాగారు సరిపోయింది, లేక పోతే.. ఈ పాటికి ఎయిడ్స్ తో టపా కట్టే వాళ్లే”, లోలోన ఓ భటుడు విసుక్కున్నాడు. అప్సరసలందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.
“ఆ ఏడుపు ఆపి ముందు చెప్పి చావండి” మళ్లీ దేవేంద్రుడి దర్పం.
“దేవేంద్రుల వారికి మతి చలించినట్టుంది, ఏరునా పారునా దేవతలు కూడా చావులు, బతుకులు మాట్లాడరాదు, నారాయణా” అంటూ నారదుడు సాగదీశాడు. “మీరు చెప్పండి ఏమి జరిగింది?” అని అప్సరసలను ప్రశ్నించాడు.
“స్వామి, భూలోక వాసులను భరించలేక పోతున్నాం, నృత్యం చేస్తుంటే కప్పగంతులు, కుప్పిగంతులూ అంటూ గేలి చేస్తున్నారు. వామ్మో.. నేను రేప్ చేస్తా.. నేను రేప్ చేస్తా అంటూ గది ముందు బారులు తీరారు. మధ్యలో వాళ్లకు వాళ్లే కొట్టుకున్నారు. ఇంతలో కొందరొచ్చి.. ఎందుకంత గొడవ గ్యాంగ్ రేప్ చేస్తే సరి ? అనగానే.. ఇదేదో బాగుంది అని వరుసగా నిలబడ్డారు. ఇంతలో ఒక ముసలాయనొచ్చి .. సీనియర్ సిటిజన్ కన్సెక్షన్ లేదా, ఇదేమీ స్వర్గలోక న్యాయం, ముందు నేను వెళ్తా అనగానే.. ఓ యువకుడు తోసేశాడు.
ఇక వాళ్లంతా ఒకరిని మరొరకరు తోసుకుంటుంటే .. ఆ మాటలు, చేష్టలు బట్టి.. మాకు సామూహిక మాన భంగం తప్పదని ఇలా పారిపోయి వచ్చాం స్వామీ. ఈ కిష్కింధకాండ నుంచి రక్షించండి స్వామీ”.. ఊర్వశి చెబుతుంటే.. రంభ, మేనక, తిలోత్తమ్మ చేతులు జోడించారు. అప్సరసలందరూ భయం భయంగా చూశారు.
“అంత కామోన్మాదమా? వెంటనే నరకానికి పంపించండి” దేవేంద్రుడు కోపంతో ఊగిపోయాడు.
“ఔను, అక్కడ నరకం ఖాళీగా ఉంది మరీ, పాపులు లేక యమ భటులు ఈగలు తోలుతుంతే… తీర్పులు లేక యమ ధర్మ రాజు యముండ అనే పదం మర్చిపోయాడు.
ఇక మీరు ఎవరిని పడితే వార్ని పంపిస్తే సాదరంగా ఆహ్వానించి నూనెలో వేయించటానికి యమ భటులందరూ రెడీ ఉన్నారు. ఊరుకోండి దేవేంద్రా! ఈ యుగం మారింది, కాస్త ఆలోచించండి. భూలోకంలో పాపులు సంఖ్చే కాదు.. పుణ్యాత్ములూ పెరిగిపోయారు. ఏళ్ల కొద్దీ పుణ్యాన్ని స్వర్గం బ్యాంకులో జమ చేస్తున్నారు.
ఇదంతా దేనికీ? చచ్చిన తరువాత స్వర్గంలో సర్వ సుఖాలు అనుభవించాలనే కదా? ఔను.. భూలోకంలో ఇన్ని త్యాగాలు చేస్తే.. మరి స్వర్గమేగా తీర్చాలి. ఇతిహాసాలు చదివి చదివీ .. అప్సరసలతో సయ్యాట కోసమే.. పుణ్యం చేసి మరీ వీళ్లందరూ దేవలోకానికి వచ్చారు. గుర్తించండి, దేవేంద్రా”, నారదుడు వాదించాడు. దేవేంద్రుడు కూలబడిపోయాడు.
తల పట్టుకున్నాడు. “ఏంచేద్దాం, సలహా ఇవ్వండి నారదా” ధీనంగా అడిగాడు.
“హమ్యయ్య దారిలొకి వచ్చారు. అందరం వైకుంఠానికి వెళ్దాం. శ్రీ మహావిష్ణువుకు విన్న విద్దాం. భూలోకంలోని ఏఐ మాయావిని ఇక్కడకు రప్పిద్దాం. బహుళ అప్సరసలను సృష్టించే బాధ్యత అప్పగిద్దాం. ఇక స్వర్గంలో సుఖాలే కాదు, నరకంలో యమభటులకూ పని భారం తగ్గించవచ్చు, దేవేంద్రా” నారదుడు అన్నాడు.
“సాధ్యమా?” దేవేంద్రుడు బిక్కమొహం వేశాడు.
“చాలా సులభం దేవేంద్రా.. ప్రస్తుతం యముడు ఖాళీగా ఉన్నాడు. విష్ణుమూర్తి టాస్క్ ఇస్తే ఇట్టే చేసి చూపిస్తాడు. ఏఐ మాంత్రికుడిని తన పాశంతో బంధించి మీ ముందు ఉంచుతాడు”, నారదుడు సూచించాడు.
“సరే పదండి” దేవేంద్రుడు అనగానే, ఏడూళ్ల సూరిగాడు తుళ్లిపడి లేచాడు. “ఓర్నీ ఇది కలా? వామ్మో ఇదంతా నిజం కాదు, అమరావతి కథ భలే ఉంది” సూరిగాడు నవ్వాడు. “ఔను టెక్నాలజీ ఉరుకులు పరుగులు పెడుతోంది. కృత్రిమ మేథస్సు అంచనా దాటిపోతోంది. పైగా క్వాంటమ్ వ్యాలీగా అమరావతి మారిపోతోంది. ఇప్పటికే ఐబీఎం కంపెనీ క్వాంటమ్ కంప్యూటర్ ను సిద్ధం చేసిందట. మరో మూడు రెడీ అవుతున్నాయంట.
అమరావతి వ్యాలీలో 90 వేల మంది ఏఐ మాంత్రికులు నిత్యం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారంట. కొత్త లోకం సృష్టిస్తారట. రోజు రోజుకో కథ వినిపిస్తోంది. ఏఐ స్టార్లు కనిపించారు. ఏఐ మినిస్టర్ పలకరించింది. ఏ క్షణంలో ఏదైనా.. ఇట్టే సృష్టిస్తున్నారు.. ఏ సమస్యనైనా పరిష్కరించగలరు. సాధారణ కంప్యూటర్ లు బిట్ ల్లో డేటాను సేవ్ చేస్తే.. క్వాంటం కంప్యూటర్ క్యూబిట్స్ లో నిక్షిప్తం చేస్తుంది. సూపర్ కంప్యూటర్ 200 సెకన్నుల్లో సమస్య పరిష్కరిస్తే 50 క్యూబిట్ ల క్వాంటమ్ కంప్యూటర్ 60 రెట్లు వేగంతో దూసుకుపోతుంది.
ఇప్పటికే గూగుల బ్రహ్మ , ఐబీఎం, లోన్ క్యూ సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్ల తయారీలో బిజీబిజీగా ఉన్నాయి. 100 క్యూబిట్ ల నుంచి 1000 క్యూబిట్ ల సామర్థ్యం లక్ష్యం పెట్టుకున్నాయి. ఇదే జరిగితే.. భూలోకంలో ఒకరిద్దరు కాదు.. కోట్ల మంది ఏఐ మాంత్రికులు ఉద్బవిస్తారు. ఆ లోకం ఈ లోకం కాదు.. అన్ని లోకాల్లోనూ .. క్వాంటం మాయాజాలం తప్పదు, సర్వలోక కథలన్నీ.. ఇక జనగణమనే.. అని ఏడూళ్లు సూరిగాడు తనలో తాను నవ్వుకున్నాడు.
- బాబు బహదూర్, సీనియర్ జర్నలిస్ట్, 9912107367
8.చిగురించిన వసంతం

కందర్పమూర్తిగారి ‘చిగురించిన వసంతం’ కథా సంపుటిలోని కథలు సామాజిక విలువలు, ఆచారవ్యవహారాలు, మానవతా దృక్పథాన్ని సున్నితంగా ప్రతిబింబిస్తాయి. “చిగురించిన వసంతం” కథలో సాంప్రదాయపు బంధనాల్లో చిక్కుకున్న వితంతువు శారద జీవితంలో భాస్కర్ ఆదర్శవాదం వెలుగులు నింపుతుంది. స్త్రీని అభిమానవతిగా గౌరవించే దృక్పథం, పురోహిత కుటుంబాన్ని ఒప్పించి శారదకు కొత్త జీవితం కల్పించడం ద్వారా రచయిత “అంధకారంలోనుంచి వెలుగువైపు” అనే ఆశాజనక సందేశాన్ని అందించారు. గ్రామీణ నేపథ్యం, సహజ దృశ్యాల చిత్రణ ఈ కథకు ప్రత్యేక సౌందర్యాన్ని చేర్చాయి.
“ఆత్మీయ అనుబంధం” కథలోనూ స్త్రీ అణచివేత, కట్నం, ఆడబిడ్డ పట్ల సమాజపు నిర్లక్ష్యం వంటి సమస్యల మధ్య మానవతా విలువలు ప్రధానంగా నిలుస్తాయి. గర్భస్రావం కోరిన వనజ బిడ్డను కాపాడి, దత్తత తీసుకుని పెంచిన డాక్టర్ లావణ్య త్యాగం వల్ల ఆ శిశువు జడ్జిగాఫ ఎదగడం “బేటీ బచావో–బేటీ పఢావో” నినాదాన్ని సార్థకం చేస్తుంది. ఈ రెండు కథలతో పాటు అనురాగబంధం, మా ఇంటి మహాలక్ష్మి, దూరపు కొండలు, ఋణవిముక్తుడు, మానవత్వం మిగిలే ఉంది, తీరం చేరిన కెరటం మొదలైన కథలు కూడా గ్రామీణ వాతావరణం, మన చుట్టూ జరిగే సన్నివేశాల ఆధారంగా వ్రాసినవి అవి పాఠకుని మనసుకు చేరువవుతాయి.
- పుట్టంరాజు శ్రీ రామచంద్ర మూరి, అద్దంకి (బాపట్ల జిల్లా)
రచయిత : కందర్పమూర్తి
ప్రచురణ:2023
ధర:99రూ.
పేజీలు:106
నివాసం: పూనె.
సెల్ నెంబరు:8374540331
9.ప్లీజ్… నా కథకు బహుమతి ఇవ్వొద్దు

టౌన్ లో మా యిల్లు భక్త రామదాసు కళాక్షేత్రం పక్కనే ఉండటం, బాల్యం నుండి సాహితీ సభలు, చూస్తూ పెరగటం వలన, బాల్యంనుండే నాకు సాహిత్యాభిలాష ఏర్పడింది. ఈ ప్రభావం వలన నాలో నిద్రిస్తున్న రచయిత నన్ను కూడా “నువ్వు ఓ కథ రాయ ఓయ్!” అని తట్టి తంతున్నా, తలకు మించిన ఉద్యోగ, కుటుంబ బాధ్యతల బంధిఖానాలో బంధీనై, నా కథే ఓ వ్యథలా సాగుతున్నందున మరో కథకు పురుడు పోసే ఓపిక తీరిక లేకపోయింది.
కానీ…ఆ తరువాత రాసిన రాతలే నా తలరాతను మార్చి వేస్తాయని మాత్రం ఎన్నడు ఊహించ లేదు, కానీ అలా రాసిన ఓ కథే నా జీవిత కథను మలుపు తిప్పి, నన్నిన్ని తిప్పలు పెడుతుందని కలలో కూడా ఊహించలేదు.
సరే..రోటిలో తల పెట్టి రోకటి పోటుకు వెరవడం ఎందుకు? మీరు వినక, నేను చెప్పక తప్పని ఓ అభాగ్యుని వ్యదే ఈ నా కథ.
సాఫీగా సాగుతున్న నా సాహిత్యపు నావ, ఓ దిక్కుమాలిన కథామీలో అదే సునామీలో చిక్కుకున్న సంఘటన ఏంటంటే…..?
కథల పోటీ ప్రకటన ఒకటి నా కంట పడింది, కథకు ప్రథమ బహుమతి పదివేలు, రెండవ కథకు ఐదు వేలు కథలు పంపించడానికి తుది గడువు ఆ ఒక్కరోజు మాత్రమే మిగిలింది.
అది చూడగానే ఆరు నూరైనా బహుమతి పొందాలన్న పట్టుదలతో, వేడిగా ఒక కప్పు కాఫీ సిప్ చేసి, కథ రాయటం మొదలు పెట్టాను.
ఏకాగ్రతతో ఏకబిగిన కథను పూర్తిచేసి, ఒకసారి సరిచూసుకుని, కవర్లో పెట్టి సీల్ చేసి, స్టాంపులు అంటించి పోస్ట్ చేసి, ఏనుగునెక్కినంతగా సంబరపడి, హమ్మయ్యా! అని రొప్పుకుంటు ఇంటికి వచ్చి, ఊపిరి పీల్చుకున్నాను.
ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే మా ఆవిడ “అసలు మీరు మనిషేనా!? ఊరికి పోయి వచ్చాక ఇల్లు ఇల్లులా లేదు? దానికి తోడు పనమ్మాయి ఎగ్గొట్టి చచ్చింది, ఒక్కదాన్ని చస్తూ చాకిరీ చేస్తుంటే కాస్తా సహాయం చేయకుండా, పిచ్చి రాతలు రాస్తూ… టింగు రంగా అని బజార్లు తిరిగొస్తున్నారా!? ఓ స్నానం లేదు, జపం లేదు, కాఫీలు, తిరుగుళ్లు రామ రామ..!” ఇలా కొనసా…గుతూనే ఉంది నా పై ఆమె తిట్ల దండయాత్ర.
నా భార్యకు చీప్ గా దొరికే చాకు లాంటి వంకలు రెండు ‘శుచి, శుభ్రత’
“మీతో వేగలేక చస్తున్నాను, ఉద్యోగం ఉన్నన్ని నాళ్ళు అంటే ఏదో సర్ధుకున్నాను, ఇప్పుడైనా నన్ను కాస్తా ప్రశాంతంగా ఉండనివ్వరా!? ఈ చాకిరీ చేసి చావడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చావడం మంచిది… “
మా ఆవిడ….తిట్ల దండకం ఆగిపోయింది.
”ఏవండీ….వస్తున్నారా! టిఫిన్ చల్లారి చస్తుంది రండి.” అన్న మాటలు పిడుగు పడ్డట్లు వినిపించి అదిరి పడ్డాను.
ఒక్కసారి వీపు చరుచుకొని…హా ఇదిగో వస్తి అంటూ వెళ్లి బాత్రూములో దూరాను. వెచ్చటి నీళ్ళు తలపై పడగానే,కథ రాసే పిచ్చిలో గడ్డ కట్టిన నా మెదడు కరిగి వాస్తవంలోకి జారింది.
అంతే.. నా కాళ్ళ క్రింద ఆటంబాంబు పేలినట్లై ఉలిక్కి పడి, క్రింద పడబోయి తమాయించుకొని గోడను పట్టుకొని నిలదొక్కుకున్నాను.
ఆ ఆలోచన రాగానే, అప్పటివరకు కథ రాసిన ఆనందం జావగారి పోయి వొళ్ళంతా చెమటలు పట్టింది. ‘అబ్బా …! ఎంత పనయ్యింది!? ఇప్పుడేఒ చేయాలి? కథల పోటీ తన్మయత్వంలో పడి ఎంత ఘోరం జరిగి పోయింది? ఇప్పుడెలా!? ఓహ్ గాడ్ ఇక నువ్వే నన్ను రక్షించాలి’ అనుకున్నాను.
ఇంతకు విషయం ఏంటంటే? ఇందాక నేను రాసిన కథ అఖిల భారత భార్యా బాధితుల సంఘం వారు నిర్వహిస్తున్న పోటీకి రాసినది, కథాంశం భార్య బాధితుల వ్యథలు’.
వొళ్ళు మరిచి ఎలాగైనా బహుమతి కొట్టేయాలనే తలంపుతో, వెనక ముందు ఆలోచించకుండా నా జీవితంలోని సంఘటనలను ప్రోది చేసి, నా స్వీయ అనుభవాలను రంగరించి, సగటు భర్తగా నేను ఎదుర్కొనే ఇబ్బందులను ఉటంకిస్తూ.. భార్యను గజాశూరిణిగా కీర్తిస్తూ కథను రక్తి కట్టించడానికి, ఆమె పై అనేక అభాండాలు వేసి అబద్దాల రంగులద్ది, హంగులు జోడించి కథను పూర్తిచేశాను.
ఆవేశంలో కథ రాసాక ఇప్పుడనిపిస్తుంది, కథలకు బహుమతి ప్రదానోత్సవం మా భక్త రామదాసు కళాక్షేత్రంలోనే అని ప్రకటించి ఉన్నారు. నా శ్రీమతి ఆమె గ్యాంగ్ తప్పకుండా ఈ కార్యక్రమానికి రాక మానదు. ఇది తన గురించి రాసిన కథేనని ఆమెకు తెలియక మానదు, అప్పుడు నా చెవులు పిండి చేతిలో పెట్టి, కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టడం కాయం.అందుకే భయం పట్టుకుంది నాకు.
ఒకవేళ నా కథకే బహుమతి వస్తేనో!? అందులోని కొన్ని ముఖ్య సంఘటనలు ఉటంకిస్తూ బహుమతి తీసుకోవాల్సిందిగా నన్ను వేదికపైకి ఆహ్వానిస్తేనో!? అవన్నీ మా ఆవిడ వింటేనో!?…నా గతి ఏంకాను? రాసిన కథాంశం, అందులో రాసిన సంభాషణలు నా భార్యకు సూటిగా తగులుతాయి. కాదు అంకుశంలా గుచ్చుకుంటాయి, ఆవేశంతో నేను కథలో లీనమై రాసిన నా భార్యలోని లోపాలు, ఆమె ద్వారా నేను పడే ఇబ్బందులు, నేను అతిగా కల్పించి రాసిన అబద్దాలు విని ఆమె తట్టుకుంటుందా!? నన్ను బండ కేసి బాది క్లిప్పులు పెట్టి దండానికి ఆరేస్తుంది, ఇలా అర్ధం పర్ధం లేని రాతలు రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టు కోవాలి అనిపించింది.
“ఎంత సేపండి?” అన్న నా భార్య అరుపులకు నా గుండె, చేతిలోని చెంబు రెండూ జారిపోయాయి.
“రామ! రామా !! మనసెక్కడుందండి? మీకన్నా చిన్నపిల్లలు నయం, త్వరగా రండి టిఫిన్ చల్లారిపోతుంది”. అని హూంకరించింది.
స్నానం ముగించి గబగబా దేవుని దగ్గరికి వెళ్లి దీపం వెలిగించి గుంజీళ్ళు తీస్తూ… “జగన్నాధా! ఈ నాధునికి ఇక నువ్వే దిక్కు, నా కథకు బహుమతి రాకుండా చూసే భారం నీదే స్వామి, బహుమతి కాదుకదా కనీసం సాధారణ ప్రచురణకు కూడా ఎంపిక కాకుండా చేయాల్సిన బాధ్యత నీదే, నిజంగా నువ్వు అనే వాడివి ఉంటే, నన్ను ఈ సంకటం నుండి బయట పడేయి వెంకట రమణా! అని లెంపలు వాయించుకొని సాష్టంగా పడి ముక్కు నేలకు రాసి మొక్కుకున్నాను.
వేడి వేడిగా దోశలు ప్లేట్లో పెట్టి రెండు రకాల చట్నీలు సాంబార్ పక్కన పెట్టింది. నిజంగా ఎంతగా అరిచినా, నన్ను అపురూపంగానే చూస్తుంది!. ఊరెళ్లి వచ్చినా పుట్టెడు బండ చాకిరీ చేసి వేడివేడిగా టిఫిన్ నా ముందు పెట్టింది. నేనేమీ పట్టించుకొకున్నా పిల్లలను మంచి స్థాయికి తెచ్చింది. నా పట్ల కుటుంబంపట్ల ఇంత శ్రద్ధ వహించే తనపట్ల నా కెందుకింత చులకన భావన ఏర్పడింది?. లోపాలు లేని మనుషులు ఉంటారా!? మరి నేనెందుకు అలా రాసాను?, నా రాతలు నాకే సిగ్గుగా అనిపించాయి.
కానీ నా మనసు మనసులో లేదు, ఏ పని చేస్తున్నా ఈ కథ నన్ను వెంటాడుతుంది, ఈ నరక యాతనతో సరిగ్గా తిండి తిప్పలు లేక, నిద్రపట్టక చీకి పారేసిన తాటి పండులా తయారయ్యాను.
అందుకే నా కథకు పోటీలో ఏ బహుమతి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఈ కథ చదివిన వారిలో ఎవరైనా కథల పోటీ నిర్వాహకులు కానీ, వారి బంధు మిత్ర సకుటుంబ సపరివారం గానీ…ఉంటే! వారికి నా మనవి.
“అయ్యలారా! అమ్మలారా! దయచేసి నా స్వీయ గాధను, అందులోని బాధను అర్థం చేసుకొని, నా కథకు ఎలాంటి బహుమతి రాకుండా చూడాలని కోరుకుంటున్నాను. మీరు చేసే మేలు ఒక అభాగ్యుడి సంసారాన్ని నిలబెడుతుందని మరిచి పోవద్దని మనవి. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి నా కథకు బహుమతి వస్తే ఇవే నా చివరి మాటలు కూడా కావచ్చుని గమనించ ప్రార్థన.
అందుకే ప్లీజ్… ఒట్టేసి మరీ చెపుతున్నా! నా కథకు బహుమతి ఇవ్వొద్దు.
సమాప్తం
10.కాలక్షేపం పిలుస్తోంది !(కథ)

“అమ్మా రేపు సాయంత్రమే మా ప్రయాణం. ఈ మూడు రోజులు జాగ్రత్త. మళ్ళీ ముక్కనుమనాడు వచ్చేస్తాం.”తల్లి పక్కన కూర్చుని చెప్పాడు చంద్రం.
ఏదో చెబుదామని తటపటాయించిన లోకేశ్వరి “సరేనాయనా! జాగ్రత్తగా వెళ్ళిరండి ” అంది.
” నేను మీతో వస్తానురా “.. అని అందామనుకుందిగాని అనలేకపోయింది.
” నాకు నాకు పదివేలు కావాలమ్మా.. మళ్లీ ఊరునుంచి వచ్చాక ఇచ్చేస్తాను ” నసిగాడు చంద్రం.’
‘అలాగే… వెళ్ళేటప్పుడు ఇస్తాను .నాకేమీ తిరిగి ఇవ్వక్కర్లేదు ” అంది లోకేశ్వరి.
”మామంచిఅమ్మ.” అని తల్లి బుగ్గమీద ముద్దుపెట్టుకుని తనగదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళాకా భార్యఅడిగింది.” కాయా…పండా?”
”చెవిలోపువ్వు. లేకపోతే నేను అడగడమూ అమ్మ ఇవ్వకపోవడమూనా వెర్రిమొహమా .”భార్య బుగ్గమీద చిటికేసి అన్నాడు .
”ఆవిడ ఎపుడూ పండుగ వచ్చినా మూడు రోజులు ముందే ఇచ్చేసేది…అడక్కపోతే మీ అక్కకి దోపుతుంది.మళ్ళీ ఇవ్వక్కర్లేదుగా తిరిగి?”
”ఓహ్…అలా వచ్చావా….’మనం ఇచ్చేస్తాననడమూ, ఆవిడ వద్దనడమూ రివాజేగా…’అనిచెప్పి …
”అమ్మా… కేరేజీలు సిద్ధం చేసేసావా?” అని అరిచాడు.
”ఆ. డైనింగ్ టేబుల్ మీద పెట్టాను తీసుకెళ్లండి.” అంది.
కొడుకును కాన్వెంట్ బస్ ఎక్కించి, క్రెచ్ లో అప్పగించేందుకు చంటిపిల్లను ఎత్తుకుని కోడలు, కొడుకు ఆఫీసులకు వెళ్లిపోయారు.
***
ఒక్కసారి నిస్త్రాణ వచ్చేసింది లోకేశ్వరికి.
”అయ్యో..అత్తగారు ఒక్కరే ఉంటారు… ఆవిడని మనతో తీసుకెళదాం…”అని కోడలు కొడుకుని అడగదు.వాడూ అనడు.
పోనీ కోడలు తల్లేనా ‘ మీ అత్తగారు ఒక్కర్తి ఉంటుంది కదా.. ఆవిడను కూడా తీసుకురావచ్చు కదా పాపం!’అని చెప్పుకోదేమో కూతురికి.
కొడుకు, కూతురు, మనుమలు ఉండికూడా తను ఎప్పుడూ ఒంటరే.
కొన్ని బతుకులు అంతేనేమో. ఆమెకు భర్త గుర్తొచ్చాడు. రోజుకోసారైనా గుర్తొస్తాడు. బ్రతికి ఉన్నంతకాలం తనని శారీరకంగా, మానసికంగా ఏడిపించిహఠాత్తుగా చనిపోయినందుకు.
ఎక్కువమంది భర్తలు భార్యని హింసించి సంతృప్తి పడటంలో మహదానందం పొందుతారు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళచేత ‘అమ్మని కొట్టు అమ్మని తిట్టు..’ లాంటి శాడిస్ట్ పనులే కాదు… రాత్రి కూడా శారీరకంగా ఎంతో హింసించేవాడు. అలాంటి ఉద్రేకంలోనే ఒక్కసారిగా గుండె పట్టుకొని కుప్ప కూలిపోయాడు. అంతే. మళ్లీ పైకి లేవలేదు.
తన కన్నతండ్రి “పిల్లలతోసహా నా ఇంటికి వచ్చేయమ్మా. నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను” అన్నాడు.
ఆమె అంగీకరించలేదు.దానికి కారణం జీవితాన్ని ఎదిరించి బ్రతకడం నేర్పేడు భర్త. ప్రతి సన్నివేశాన్ని ఎదుర్కొని కొత్త విజ్ఞానాన్ని సంపాదించడంలో ఆమెకు ఆసక్తి అభిరుచి పెరిగింది.భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకుని తన బిడ్డలను పక్కింటి వాళ్ళకి అప్పగించి ఇంటిగడపలో ఓ కాలు, ఆఫీస్ గడపలో ఓ కాలు అన్నట్టు భర్త పనిచేసిన ఆఫీసుల గడపలన్నింటికీ తిరిగింది.డబ్బుతో పాటు తనని ఆశించారు.. లోకం మీద అసహ్యం వేసింది. తండ్రిఉద్యోగం పిల్లవాడిచదువు పూర్తి అయ్యాక వాడికి ఇప్పించొచ్చు అని నిర్ణయించుకుని తన డిగ్రీలతో ఎయిడెడ్ పాఠశాలలో చేరింది.తెలిసి తెలియని వయసులో తండ్రి చేతిలో శిక్షణ పొందిన పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని సమాజంతో ఎలా యుద్ధంచేయాలో కథలుగా చెప్పింది.
‘ఒకవేళ మీ నాన్నలా నేను కూడా అర్ధాంతరంగా చచ్చిపోతే మీరు రోడ్డున పడతారు’ అని హెచ్చరించింది.
అర్థం చేసుకున్న పిల్లలతో శ్రద్ధగా చదువుకున్నారు. అమ్మాయికి డిగ్రీ పూర్తయ్యాక తన తమ్ముడు తన కూతుర్ని చేసుకుంటానని వచ్చాడు.
ఆలోచించకుండా వాడికిచ్చి పెళ్లి చేసేసింది.
కొడుకు డిగ్రీ పూర్తయ్యాకా భర్త ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి ఏడాదిపాటు పోరాడి భర్త ఉద్యోగం కొడుక్కి వచ్చేలా చేసింది. వాడు ఇష్టపడిన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. అటు ఉద్యోగం వల్ల వచ్చేటువంటి డబ్బుతో ఆర్థిక సుఖం, ఇష్టమైన అమ్మాయితో పెళ్లి,కాపురంతో… అతను తల్లి తనకోసంపడ్డ కష్టాన్ని మర్చిపోయాడు.
అలాంటి సమయంలో అనుకోకుండా భర్త తనకు తెలియకుండా చేసిన ఎల్ఐసి పాలసీల సొమ్ము మెచ్యూరిటీ పొంది తనకు అందింది.
ఆ సొమ్ముతో చక్కని అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని కొడుకుతో కోడలితో కలిసి జీవిస్తోంది.పిల్లలు పుట్టాక కోడల్ని తనే ఉద్యోగం చేయమని కోరింది. ఎందుకంటే నగరంలో ఇద్దరు సంపాదన ఉంటే గాని కుటుంబం గడవదు. కుటుంబం గడిస్తేనే గానీ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి. ఆ లోటు వాళ్లకు రాకూడదని పిల్లలిద్దరికీ ఏడాదికో మారు తాను ఫీజు కడుతూ పిల్లల దగ్గరే గడపడం అలవాటు చేసుకుంది.పిల్లలు పుట్టకముందు అయితే ప్రతి శని ,ఆదివారాలు అత్తారింటికి వెళ్లిపోయేవారు.
జీవితంలో ఇంతటి ఒంటరి పోరాటంచేసిన ఆమె, కొడుకు భార్యని తీసుకుని అత్తవారింటికి పండగల రూపంలో ప్రతీ పండుగకు వెళ్ళిపోతుంటే ఆ ఒంటరితనాన్ని భరించలేకపోతోంది.
కానీ జీవితం జీవించడం కోసం. తప్పదు అని సరిపెట్టుకుంది.ఆ మర్నాడు సాయంత్రం తమ ప్రణాళిక ప్రకారం కొడుకు కోడలు ప్రయాణమై వెళ్లిపోయారు.
**
మళ్ళీ ఒంటరితనం. ఎంతసేపని టీవీ చూస్తుంది?
పుస్తకాలు చదువుదామంటే కళ్ళు లాగేస్తున్నాయి.
ఏదో ఒక వ్యాపకం ఏర్పాటుచేసుకోవాలి.
ఎలా?
మెరుపులాంటి ఆలోచన వచ్చింది .వెంటనే సెల్ తీసుకుని తనకు కావలసిన సమాచారం కోసం గూగుల్ లో వెతికింది. ఆమె మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది. ఆ వెంటనే తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
**
”ఏంటమ్మా? మేము ఆఫీసులకి వెళ్లిపోయాకా రోజూ ఎక్కడికో వెళ్లి తిరిగి వస్తున్నావు..పైగా సెలవు రోజుల్లో కూడ వెళ్ళిపోతున్నావు. ఆ తిరుగుడువల్ల నీకు ఏమైనా అనారోగ్యం వస్తే మాకు ఎంత ఇబ్బంది చెప్పు?
”పిచ్చివాడా…మనిషి తిరక్కపోతే అనారోగ్యం వస్తుందిరా.. తిరిగితే రాదు. అయినా నాకు నేనుగా
అనారోగ్యం వచ్చే పని ఎందుకు చేస్తాను?మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీ వ్యాపకం మీకు ఉంది.కాస్త నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అంతే. నావల్ల మీకు ఇబ్బంది రానివ్వను. అలా వస్తుందనుకున్ననాడు ఆనాడే మానేస్తాను. సరేనా?” అంది తన సంచీలో ఆరోజు
చిరుతిళ్ళు సర్దుకుంటూ.
”అదికాదమ్మా..” ఏదో చెప్పబోయిన కొడుకుని చేత్తో వారించి అంది.
”చూడు నాన్న. నాకు ఓపిక ఉన్నంతకాలం నాకోసం నన్ను బ్రతకనివ్వండి. మీపనులు అన్ని పూర్తిచేశాకనే నేను వెళ్ళేది. ఈవిషయంలో అడ్డు చెప్పొద్దు ” అని
సెల్ లో ఆరోజు తాను వెళ్ళవలసిన చోటుకు వెళ్లే
బస్సుఎక్కేందుకు బయల్దేరింది లోకేశ్వరి.
తన అనుభవాలు వాళ్లకు, వాళ్ళ అనుభవాలు తనకుపంచుకునే ముసలిపక్షులుండే వృద్ధాశ్రమాలకు ఆమె వలసపక్షి మరి!
11.చెప్పుకోండి చూద్దాం – సమాధానాలు
ఈ నెల రిలీజ్ అవుతున్న ఓజీ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు ఏంటి
A: కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్)
భారత్ ఇప్పటి వరకు ఆసియా కప్ ఎన్ని సార్లు గెలిచింది.
A: 8సార్లు (2023)
HITEC City ఫుల్ ఫామ్
A: హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ
ఇటీవల శ్రీశైలం బోర్డు చైర్మెన్ గా నియమితులైంది ఎవరు
A: పోతుగంటి రమేష్ నాయుడు (ఏపీ – బీజేబీ)
