ఈ సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.
- అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
- పలుకు తేనెలొలుకు..? (ముఖపత్ర కథనం)
- సెవెంటీటూ… నాట్ ఔట్ ! (కథ) పాణ్యం దత్త శర్మ
- ఇదీ వరస (కార్టూన్)
- బలే ఎలచ్చన్ జాతర (ఏడూళ్ల సూరిగాడు) – బాబు బహదూర్
- రంగమ్మత్త పచ్చిపులుసు (కథ) – ప్రతాప వెంకట సుబ్బారాయుడు
- మట్టిని నమ్మితే (కథ) – పంతంగి శ్రీనివాసరావు
- ఆసాంతం ఆసక్తికర సైన్స్ ఫిక్షన్ (పుస్తక సమీక్ష) డా|| వి.ఆర్.శర్మ
- శ్రావణ మేఘాలు (కథ) కందర్పమూర్తి
- వైరల్ వైరల్ – నవ్వుల్ నవ్వుల్
ముఖపత్ర కథనం
1.పలుకు తేనెలొలుకు..?

కోకిల కూ…అని మాత్రమే కూస్తుంది…
కానీ ఆ కూతకి ఓ మాధుర్యం ఉంది. అది తరాలు మారినా తరగలేదు.
కాకి కావు కావుమనడం తప్ప మరో అక్షరం ముక్క రాదు…
అయినా ఆ అరుపు అనేక నమ్మకాలకు సంకేతం…
కుక్కలూ, పిల్లులూ భౌ భౌ లూ మ్యావ్ మ్యావ్ మ్యావ్ లే తప్ప మరో మాట పలకగలవా?
సిం హాలూ పులుల గాండ్రింపులోని రాజసం ఎన్నటికీ వన్నె తరగదు…
ఆ ఒక్క అరుపు తప్ప వాటికి మరో ఆప్షన్ లేదు.
వాటికి మనసనేది ఉందో-లేదో, ఉన్నా ఆ మనసులో ఆలోచనలనేవి ఉన్నాయో-లేవో.
ప్రపంచంలో ఏ జీవికీ లేని అవే రెండు ఆప్షన్లు భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒకటి…ఆలోచించడానికి మనసు, రెండవది ఆ ఆలోచనలను వ్యక్తం చేయడానికి పలుకు….
మరి ఆ పలుకు తేనెలొలకాలి కదా? ఆ మనసు మానవత్వపు పరిమళాలతో పరవశింపజేయాలి కదా?
మాట కరుకైపోతోంది…
మమతానురాగాలు కరువైపోతున్నాయి…
మనిషికీ మనిషికీ మధ్య పూడ్చలేని అగాధాలు.
దూర ప్రాంతాలను కలిపేందుకు సాంకేతిక, రవాణా సౌకర్యాలకు కొదువ లేదు కానీ మనసులను కలిపేందుకు మార్గాలే లేవు…
పరస్పర దూషణలు…ఆగ్రహావేశాలు…
ఆత్మస్తుతి…పరనిందలూ…
రాజకీయమైనా క్రీడారంగమైనా…
సినిమాలైనా మరొకటైనా
విషం చిమ్మే కాలనాగులకన్నా మనిషే విషతుల్యమైపోయి..మాటల్లో దానిని విరజిమ్మేస్తూ…ప్రపంచాన్ని బ్రష్టుపట్టిస్తున్నాడు. ఇలాగైతే ఎలా? నాలుగు ప్రేమతో కూడిన మాటలను రేపటి తరానికి మిగల్చవద్దా? మనిషి మాట ఎంత మధురమైనదో రాబోయే రోజుల్లో తెలియవద్దా? కల్మషంతో కూడిన కృత్రిమ నవ్వులనూ, కఠినత్వపు కరుకు మాటలను అలవరుద్దామా? కాసింత ప్రేమ…కల్మషం లేని మాట…కరువైపోతున్నాయి. ఎక్కడ వెతుకుదాం..? ఎలా పొందుదాం..? ఎదుటివారిని తెలుసుకోలేని స్వోత్కర్షలు ఎక్కువై..అందరికంటే తామే అధికులమనిపించుకోవాలనే ఆరాటం అధికమైపోతున్నది.
ఇవన్నీ చూస్తుంటే “మాయమైపోతున్నడమ్మా….మనిషీ…మాయమైపోతున్నడమ్మా”అనిపించట్లేదా..?
2.సెవెంటీటూ… నాట్ ఔట్ !

‘‘ఒరేయ్, వేంకటేశ్వర్లు! ఏం చేస్తున్నావు?’’ అవతలి నుంచి ఫోనులో మిత్రుడు శరభలింగం అరుస్తున్నాడు. ‘‘ఏమిటిరా పొద్దున్నే నీ గోల? ఎందుకలా అరుస్తావు, ప్రతిదానికీ? నెమ్మదిగా మాట్లాడలేవేంట్రా గాడిదా? సరేగాని, ఈ రోజు పార్కుకు వాకింగ్కు రాలేదేంట్రా?’’ ‘‘కొంచెం బద్ధకించాలేగానీ, నీవు వెళ్లొచ్చావా? వెళ్లింటావులే! వర్షం వస్తున్నా, గొడుగేసుకుని వాకింగ్ చేసే రకానివి నవ్వు!’’ ‘‘ఒరేయ్ శరభా, ఒక్కమాట చెబుతా విను. మనిద్దరం సెవెంటీ క్రాస్ అయ్యాం.
ఈ స్టేజీలో, బోత్ అవర్ బాడీ అండ్ మైండ్ షుడ్ బి ప్రి ఆక్యుపైడ్!’’ ‘‘తెలుగులో అఘోరించు!’’ ‘‘వృద్ధాప్యంలో, శరీరం, మనస్సు, నిరంతరం ఏదో ఒక వ్యాపకంలో ఉండాలి. నీలాగా బద్ధకిస్తే, శరీరం తుప్పుపట్టిపోతుంది’’ రెస్ట్ మేక్స్ వన్ రస్ట్!’’ ‘‘ఒక్కరోజు రానందుకు ఎంత క్లాసు పీకావురా వెంకూ? సరేగాని, ఈ రోజు మా చెల్లెలు టిఫినేం చేస్తుందో?’’ ‘‘కొర్ర పొంగలి, పల్లీల చట్నీ!’’ ‘‘మీ యింట్లో?’’ ‘‘ఈ రోజు మీ చెల్లి ఉపవాసం. నన్ను బయట తినేసిరమ్మంటుంది!’’
‘‘అయితే, టిఫినుకు, భోజనానికి ఇక్కడికొచ్చేయ్!’’
‘‘అదే ఆలోచిస్తున్నా! కొర్ర పొంగలంటే.. అసలు ఆ మిల్లెట్మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నాడే, ఆ సాయిబు, ఖాదర్వలీ గదా ఆయన పేరు! ఆ మిల్లెట్స్ గురించి చెప్పీ చెప్పి చంపుతున్నాడు!’’
‘‘అవి ఆరోగ్యానికి చాలా మంచివని గదా! అందుకే ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు కూడ ఇచ్చారు. కొర్ర పొంగలి బాగుంటుందిరా, పెసరపప్పు కూడా ఉంటుంది. వచ్చేయ్!’’
వెంకటేశ్వర్లు శరభలింగం బాల్యమిత్రులు. ఇద్దరిదీ కర్నూలు దగ్గర వెల్దుర్తి. అక్కడనే ఎలిమెంటరీ, జెడ్.పి. హైస్కూల్లో ఒకటి నుంచి పదివరకు కలిసి చదువకున్నారు. వెంకటేశ్వర్లు యస్.వి యూనివర్సిటీలో ఎమ్.ఎ. ఇంగ్లీషు చేసి, చూసియర్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. శరభలింగం కర్నూలు ఉస్మానియా కాలేజీలో బి.కాం చేసి, సర్వీస్ కమీషన్ గ్రూప్ ఫోర్లో సెలెక్టయ్యాడు.
జూనియర్ అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించి, ప్రమోషన్లతో సూపరింటెంట్ స్థాయి వరకు ఎదిగాడు. కర్నూలు కలెక్టరేటులో రిటైరైనాడు. వెంకటేశ్వర్లు జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్గా తాడిపత్రిలో రిటైరైనాడు. ఇద్దరిదీ ఒకే వయసు. 2008లో ఇద్దరూ రిటైరైనారు. 15 సం॥ తర్వాత కమ్యూటేషన్ అమౌంట్ 40 శాతం కూడా ఈ మధ్యే పెన్షన్లో కలిసిపోయింది. పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఇరవై ఏళ్ల క్రితమే, హైదరాబాదు వనస్థలిపురంలో, చెరో నూటయాభై గజాల స్థలం కొని ఇండివిడ్యుయల్ ఇళ్లు కట్టేసుకున్నారు. పదేండ్ల కిందట పిల్లలు వాటిమీద ఫస్ట్ఫ్లోర్ కూడ వేశారు. వీళ్లు కొన్నప్పుడు వనస్థలిపురంలో చ.గజం ఐదు వందలలోపే ఉండేది. ఇప్పుడు లక్ష దాటింది! క్యాడర్స్, శాలరీలలాంటివి వారి స్నేహానికడ్డం రాలేదు. వెంకటేశ్వర్లు కమలానగర్లో, శరభలింగం సచివాలయనగర్లో ఉంటారు. ఇద్దరూ రోజూ ఉదయం, హెచ్ఎమ్డిఎ వారి పార్కులోని వాకింగ్ ట్రాక్మీద ముప్పావుగంట నడుస్తారు.
తర్వాత కాసేపు సిమెంటు బెంచీ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. పార్కు బయట ‘రాగిజావ’ అమ్ముతుంటాడొకతను. అది చెరో గ్లాసు తాగుతారు. సాయంత్రం ఏదైనా గుడికి వెళతారు. ఇద్దరూ సాహిత్య, సంగీతాభిమానులే. రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ, హరిహర కళాభవన్ లాంటి చోట్లకు సాహితీ సమావేశాలకు, సంగీత కచేరీలకు వెళుతూంటారు. పిల్లలు సెటిలైనారు. ఏ బాదరబందీలు లేవు. షుగర్, బి.పి.లు ఉన్నాయి కాని, కంట్రోల్లోనే ఉన్నాయి. మితాహారం, వ్యాయామం, సంగీతం, సాహిత్యం వారి ఆరోగ్య రహస్యాలు! నేస్తం వారి ఆరోగ్యానికి ఆపన్నహస్తం! తొమ్మిదింటికి శరభలింగం వచ్చేశాడు. వెంకటేశ్వర్లు భార్య నాగరత్నమ్మ ఇద్దరికీ కొర్రపొంగలి, పల్లీల చట్నీ వేసి ఇచ్చింది. పొంగలికి నేతితో తిరగమాత పెట్టిందేమో ఘుమఘుమలాడుతూంది.
‘‘చాలా బాగుందమ్మా! పాపం ఆసాయబుగారిని అనవసరంగా ఆడిపోసుకున్నాను’’ అన్నాడు శరభలింగం నవ్వుతూ. ‘‘ఒరేయ్ ముందు దేన్నైనా నెగెటివ్గా మాట్లాడటం నీకలవాటు కదా!’’ అన్నాడు వెంకటేశ్వర్లు. ‘‘నీ మొహంలే! ’’ అన్నాడు మిత్రుడు.
నాగరత్నమ్మకు వీళ్ల ధోరణి అలవాటే. నవ్వుకుంటూ వాళ్లకు షుగర్ లెస్ కాఫీ తేవడానికి వంటింట్లో వెళ్లింది. ‘‘వెంకూ, సాయంత్రం, వైదేహినగర్ కమ్యూనిటీ హాల్లో హరికథ ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో పధ్నాలుగేళ్ల కుర్రాడట, ఎన్.ఆర్.ఐ. అతని అష్టావధానం ఉంది. ఉదయాన్నే ‘‘నగరంలో ఈనాడు’’ లో చూశాను. దేనికెళదాం? ‘‘అంత చిన్న వయసులో అష్టావధానం చేస్తూన్నాడంటే, గట్టివాడురా ఆ అబ్బాయి! పిట్ట కొంచెం కూతఘనం’’ అంటే ఇదే! అక్కడికే పోదాం!’’ ‘‘అన్నయ్యా, ఈ రోజు మా ఇంట్లోనే మీ భోజనం ఏం కూర చేయమంటారు?’’ ‘‘ఏదో ఒకటి చెయ్యమ్మా!’’ అన్నాడు శరభలింగం.
‘‘మొన్న మన రైతు బజారులో, మీ స్నేహితుడు చిన్న చిన్న క్యాప్సికం తెచ్చారు. వాటిలో ఉల్లికారం కూరి నించుడుకాయ చేస్తా! గంగవాయలాకు పప్పు చేస్తా’’ అన్నదామె. ‘‘మరి, చారు?’’ అన్నాడామె మనోహరుడు. ‘‘చారు లేకపోతే మీరూరుకోరు కదా!’’ అన్నదామె నవుతూ. ‘‘మా చెల్లి ఇప్పుడన్న మాటల్లో ఏదో శబ్దాలంకారం ఉన్నట్లుందిరోయ్!’’ అన్నాడు శరభ. ‘‘వృత్యనుప్రాసంలేరా!’’ అన్నాడు వెంకూ! ‘‘సరిపోయింది!’’ అనుకుంటూ వెళ్లిందాయిల్లాలు.
ఇద్దరూ సా 4 గం॥కల్లా టీ తాగి ఎన్.జీ.వోస్ కాలనీ బస్ స్టాప్కు వెళ్లి మెహదీపట్నం వెళ్లే! 156v నం.బస్ ఎక్కి, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర దిగారు. అష్టావధానంలోని సమస్యాపూరణ, దత్తపది, నిషిదాక్షరిలాంటివి శ్రద్ధగా విన్నారు. బాలావధాని ప్రతిభకు ముగ్ధులైనారు. అవధానం ఎనిమిదికి ముగిసింది. బయటే తినేసి వస్తామని ముందే చెప్పేసి వచ్చారు. ఇద్దరూ నడుచుకుంటూ, రవీంద్రభారతికి దగ్గరే ఉన్న కామత్ హోటల్కు వెళ్లి ఉల్లి రవ్వదోసె తిని, బటర్ మిల్క్ తాగారు. అక్కడి నుంచి నడుచుకుంటూ లకిడీకాపూల్ మెట్రోస్టేషన్కెళ్లి మెట్రో ఎక్కి, ఎల్.బి.నగర్లో దిగి, ఆటోలో ఇళ్లకు వెళ్లారు.
మిత్రులిద్దరూ నాలుగు ఐదు నెలలకోసారి టూర్లకు వెళుతూంటారు, పెళ్లాలు లేకుండా! ఆడవాళ్లిద్దరికీ ఆచారాలు, సాంప్రదాయాలు, మడీ, పూజలు, ఉపవాసాలు. వాళ్లు కూడ వస్తే వీళ్లు ఫ్రీగా తిరగలేరు. ఒకరోజు వెంకటేశ్వర్లు అన్నాడు. ‘‘ఒరేయ్ శరభా, మనం గుజరాత్ టూర్ వెళ్ళొచ్చి నాలుగునెలలైంది. మళ్లీ ఎటైనా వెళ్దామురా!’’ శరభ అన్నాడు. తిట్టేనోరూ, తిరిగే కాలూ ఊరికే ఉండవు కదా!’’ ‘‘అలా ఎందుకనుకోవాలి?’’ ట్రావెల్ మేక్త్ ఎ కంప్లీట్ మ్యాన్’’ అన్నాడు ఫ్రాన్సిస్ బేకన్!
‘‘ఇది ప్రతి టూర్కు ముందూ చెపుతూంటావు. కొత్తదేదైనా అఘోరించు.’’ ‘‘అఘోరిస్తా విను!’’ ట్రావెల్ ఈజ్ యాన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఫిజికల్, మెంటల్, స్పిరిచుయల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్’’ ‘తెలుగులో ఏడు!’’
ప్రయాణం అనేది మనకోసం మనం పెట్టుకునే పెట్టుబడి. అది మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, భావవేశ స్వస్థత కోసం!’’
‘‘బాగుందిరా వెంకూ! మరి ప్లాన్ చెయ్యి! ‘‘హంపీ చూడలేదు రా మనం వెళ్లొద్దాం పద!’ వెంకూ తన కొడుకును పిలిచాడు. అతని పేరు నచికేత.
‘‘ఒరేయ్ నాన్నా, నాకూ, బాబాయికీ హంపీకి రైలు టికెట్లు బుక్ చేయి స్లీపర్ క్లాసే సుమా!’’ ‘‘స్లీపర్లో డిస్టర్బెన్స్ ఎక్కువ! ధర్డ్ ఎ.సి చేస్తాలే నాన్నా’’ అన్నాడు సుపుత్రుడు. ‘‘ఏం ఉండదు. ఇదేం ఎండాకాలం కాదులే’’ నెట్లో చూసి చెప్పాడా అబ్బాయి ‘‘నాన్నా, వారం తర్వాత ఉన్నాయి. కర్నాటక సంపర్క్ క్రాంతి! కాచిగూడలో ఎక్కాలి. ఉదయం ఎనిమిది ఇరవైకి.
సాయంత్రం 5.30 కి హోసపేట. ఎన్నిరోజులుంటారు?’’ ‘‘రెండు రోజులు. ఒకరోజు తుంగభద్ర డ్యాం. ఒకరోజు హంపీ.’’ ‘‘అయితే రెండో రోజు రాత్రి అదే ట్రయిన్ యశ్వంత్పూర్ నుంచి వస్తుంది ఉదయం ఎనిమిదికి కాచిగూడ.’’ ‘‘సూపర్! చేసెయ్యిరా’’ అన్నాడు శరభ. ఇద్దరూ సా. హోసపేటలో దిగారు. ట్రాలీ బ్యాగులు కాబట్టి ఇబ్బందిలేదు. ఆటోలో ‘‘హంపీ రెసిడెన్సీ’’కి వెళ్లి డబుల్ రూం తీసుకున్నారు. నాన్ ఎ.సి. నవంబరు నెలలో ఎ.సి ఎందుకు? ఇద్దరికీ ఆర్థికంగా లోటులేదు.
కానీ అనవసరంగా విలాసాలకు వెళ్లరు. మర్నాడుదయంలొక ఆటోలో తుంగభద్ర డ్యాం సైట్కి వెళ్లి, చూశారు. క్రింద పార్కుతో సహా! మధ్యాహ్నానానికి రూంకి తిరిగి వచ్చి ‘షిరిడిసాయి లింగాయత ఖానావళి’లో జొన్న రొట్టెతో వెజ్ భోజనం చేశారు. ఉదయం వారికి ఎంతో అభిమానపాత్రమైన, కర్నూలు జిల్లా స్పెషల్, ఉగ్గాణి, బజ్జీ టిఫిన్ దొరికింది. సాయంత్రం అలా హోసపేట బజార్లన్నీ తిరిగారు.
మర్నాడు ఉదయం హంపి బయలుదేరారు. ఆటోలోనే. హంపీలోని విరూపాక్ష, కోదండరామ, హజారరామ, విఠలాయాలను, లోటస్ మహల్ను, ఏనుగుల శాలను, ఉగ్రనరసింహ విగ్రహాన్ని, దసరా దిబ్బను, ఇంకా ఎన్నో కట్టడాలను దర్శించారు. వారు సాయంత్రం, హంపీకి దగ్గరలోని, అంటే 4 కి.మీ ఉంటుంది. ఆనెగొంది అన్న ఊరు చేరుకున్నారు. అక్కడ కొండమీద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. అక్కడే వాలివధ జరిగిందనీ, సుగ్రీవ పట్టాభిషేకం జరిగిందనీ ప్రతీతి.
సీతారాములక్ష్మణుల విగ్రహాలను సుగ్రీవులవారే స్వయంగా ఒక బండమీద చెక్కారని ఐతిహ్యం. ఆటో కొండ దిగువన ఆగింది. పైకి వెళ్లడానికి ఐదు వందలకు పైగా మెట్లున్నాయి! స్నేహితులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరి పెద్దవులపై దరహాసం! ‘‘జై భజరంగభళీ!’’ అన్నాడు శరభ ‘‘జై శ్రీరామ్!’’ అన్నాడు వెంకూ. ఇద్దరూ మెల్లగా మెట్లెక్కసాగారు. ప్రతి యాభై మెట్లకూ కాసేపు సేద తీరుతున్నారు. వాటర్ బాటిల్లోంచి నాలుగు గుక్కలు నీళ్లు తాగుతున్నారు. ఆటోవాడు క్రిందినుంచి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇద్దర్నీ! సాధారణంగా ఆ వయసువాళ్లు, ‘‘ఇన్ని మెట్లు ఎక్కలేం బాబూ’’ అని కిందినుంచి ఒక దండం పెట్టుకుంటారు. వీళ్లేమో అస్సలు జంకలేదు’’ అనుకున్నాడు అబ్బాయి.
సరిగ్గా గంట పట్టింది పైకి చేరడానికి. ఇద్దరికీ మోకాళ్ల నొప్పులు లేవు. మాడరేట్ వెయిట్తో ఉన్నారు. ఆయాసం రాలేదు. పైన విశేషాలన్నీ చూశారు. స్వామిని, షట్కోణయంత్రాన్ని దర్శించుకొని మెల్లగా కిందికి దిగి వచ్చారు. హోస్పేటలో అందరికీ తెలుగు వచ్చు ‘‘మీరిద్దరూ నిజంగా గ్రేట్ సార్!’’ అని అభినందించాడు ఆటో డ్రయివర్. ‘‘ముసిలోడయినా బసిరెడ్డే మేలని మన రాయలసీమలో సామెత ఉంది కదరా’’ అన్నాడు శరభ. ‘‘ఒరేయ్ వయసు మేనుకేరా, మనసుకుండదు. అంతా మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. అఫ్ కోర్స్, లైఫ్ మస్ట్ గో ఆన్! సాగనీ ఈ పయనం!’’ ‘‘ఏదైనా మంచి ఇంగ్లీషు కొటేషన్ చెప్పురా!’’
‘‘టెన్నిసన్, తన ‘యులిసెస్’ అనే పద్యంలో అంటాడు. ‘‘ఓల్డ్ ఏజ్ హాత్ ఇట్స్ ఓన్ ఆనర్ అండ్ టాయిల్. డెత్ క్లోజెస్ ఆల్. బట్ సమ్తింగ్ ఎర్ ది ఎండ్! టు స్ట్రెవ్, టు సీక్, టు ఫైండ్, నాట్ టు ఈల్డ్!’’ ‘‘వృద్ధాప్యానికి దాని గౌరవం శ్రమదానికున్నాయి. అందరం చచ్చిపోతాం. కాని ఏదైనా సాధించాలి. కష్టపడాలి. తెలుసుకోవాలి, కోరాలి, లొంగిపోకూడదు!’’ ‘‘సెబ్బాష్! ఏం చెప్పాడురా!’’ అన్నాడు శరభ
3.ఇదీ వరస (కార్టూన్)

4.బలే ఎలచ్చన్ జాతర
- ఏడూళ్ల సూరిగాడు

కొత్తపూడి. పచ్చటి పల్లెటూరు. పొద్దుకుంగుతోంది. పడమట సూరీడు ఎర్రగా అందంగా ముద్దులొలుకుతూ టాటా చెబుతున్నాడు. అప్పుడే డమ్మారే డమ్మా డమ్మా..డమ్ డమ్ డమ్..
నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్.. నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్… డీజేలో ఈ పాట మార్మోగిపోతోంది. చెట్లపై కాకులు ఒక్కసారిగా రెక్కులు టపటపలాడించాయి.ఎగిరి దూరంగా పారిపోయాయి. కావు కావుమని గోల చేస్తున్నాయి. పిడుగులు పడినట్టు.. బైకుల సైలెన్సర్లు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఒక్కసారిగా సూరిగాడు కంగుతిన్నాడు. గుండె దడదడ కొట్టుకుంటోంది. చాతీమీద చెయ్యి వేసి అదుముకున్నాడు. తలుపు తీసి వీధిలోకి వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. వంద మంది పైగా కుర్రోళ్లు బైకుల ర్యాలీలో దూసుకు వస్తున్నారు. “జై సీనయ్య… జైజై సీనయ్య” అని కేరింతలు, “కాబోయే ప్రెసిడెంట్ సీనయ్య జిందాబాద్” ఈలలతో మరో కేక చెవిలోని కర్ణభేరిని తాకాయి.
సూరిగాడు ఇక తట్టుకోలేకపోయాడు.
“అరే ఆగండ్ర.. మీ అమ్మ కడుపు కాల, నా గుండె ఆగిపోతోంది” అని అరిచాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ రణగొణ డీజే నెమ్మదిగా సాగుతుంటే.. ఈ కుర్ర గ్యాంగ్ చిందులు వేస్తూనే ఉంది. కొందరు సెల్ ఫోన్ లకు పని చెప్పారు. కింద పడుకుని వీడియోలు తీస్తుంటే, ఇంకొందరు డీజేకి ముందు పరిగెట్టి మేడలపైకి ఎక్కి విజువల్స్ తీస్తున్నారు. సూరిగాడికి చిర్రెత్తింది. “ ఇదేం పోయే కాలంరా బాబు. ప్రశాంతంగా రాములోరి గుడిలో హనుమాన్ చాలీసా.. వెంకన్న ఆలయంలో ఘంటసాల భగవద్గీత వినిపించేవి. ఇప్పుడు ఈ డీజే రోగం ఎప్పుడు వచ్చిందిరా’’? తిట్ల దండకం అందుకున్నాడు. కానీ డీజే హోరు ఆగలేదు. ఇంతలో పెదకాపు తమ్ముడు చెల్లారావు అక్కడకు వచ్చాడు.

“ బాబాయ్.. బాగున్నావా? ఎప్పుడొచ్చావే, రా, నువ్వు కూడా ఈ బైకు ఎక్కు,” ఖుషీ ఖుషీగా చెల్లారావు అన్నాడు. సూరిగాడు ముఖం మాడిపోయింది.
“పొద్దున్నే వచ్చా.. ఏంటిరా ఈ జాతర. పెడమ్మ సంబరం లేదు. గంగమ్మ జాతరలా లేదు. ఈ గందరగోళం” సూరిగాడు ప్రశ్నించాడు.
“బాబాయ్…ముందు నువ్వు బండెక్కు, చెబుతా” అని చెల్లారావు అనగానే సూరిగాడు మారుమట్లాడకుండా బైకు ఎక్కాడు. అక్కడ నుంచి పంచాయతీ ఆఫీసు దగ్గరకు తీసుకువెళ్లాడు. “అరే కిరిటీ రెండు టీలు తీసుకురా” చెల్లారావు ఆర్డరేశాడు. ఐదు నిముషాల్లో టీ గ్లాసులు వచ్చాయి. ఇద్దరూ టీ చప్పరించారు. చెల్లారావు ఇచ్చిన గోల్డ్ ఫ్యాక్ కింగ్ సిగరెట్టు అంటించారు.
“ఇప్పుడు చెప్పు.. ఎప్పుడూ లేనిది..ఈ ఊళ్లో ఈ రచ్చ రచ్చ రంబోలా కథేంటిరా?” అడిగాడు సూరిగాడు.
“బాబాయ్..ఎలక్షన్ వస్తే మనూళ్లో జాతరే. ఈ విషయం నీకు తెలీదా?” చెల్లారావు ఎదురు ప్రశ్న.
“అరే.. మనూళ్లో ఎలక్షనా? పాతికేళ్లుగా ఆ ఊసే లేదురా. పైగా మనం మన ప్రెసిడెంటుని ఏక గ్రీవంగా తీర్మానిస్తాం కదా’’? సూరిగాడు నసిగాడు.
“బాబాయ్.. అదంతా లోపాయికారి ఒప్పందం బాబాయ్. మనూళ్లో ఇద్దరే ఇద్దరు పెద్దకాపులు. వీరిద్దరి మధ్యే రాజీ జరుగుద్ది. ఒకరు ప్రెసిడెంటు అవుతారు. ఒకరు బ్యాంకు ప్రెసిడెంటు అవుతారు. కానీ పదేళ్లుగా రూటు సెపరేటుగా మారింది. ఇటు సీనయ్య, అటు బాపనయ్య రెండు గ్రూపులు. ఇద్దరూ ఒకే పార్టీ. ఒకళ్లంటే.. ఇంకొకళ్లకు పడదు. పంచాయతీ ఎలక్షన్ రాగానే.. ఇద్దరూ క్యాంపులు పెడతారు. రోజువారీ విందులు, చిందులు మామూలే. పోయిన ఎలక్షన్ లో ఆ పార్టీ రాజీ కుదిర్చి బాపనయ్యను ప్రెసిడెంట్ గా తీర్మానించింది. సీనయ్య ఒప్పుకోలేదు. బ్యాంకు ప్రెసిడెంట్ వద్దన్నాడు. ఎందుకంటే.. ఆ పదవి ఎస్సీలకు రిజర్వు అయింది.
బంట్రోతు చలమయ్యని ప్రెసిడెంటుగా పోటీకి దించాడు. ఇరవై లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ చలమయ్యకి డిపాజిట్ రాలేదు, అదే నేను పోటీ చేస్తే బాపనయ్యని ఓడించేవాడిని, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే నేనే గెలుస్తా అని సీనయ్య ఇప్పుడూ అదే మాటా మాట్లాడుతాడు. పంచాయతీ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదా.. బాపనయ్య కంటే ముందే సీనయ్య క్యాంపు తెరిచాడు. చుట్టుపక్కల ఊళ్ల నుంచి కుర్రోళ్లను రప్పించాడు, ట్యాంకు ఫుల్ ఆయిల్ డీల్ కుదిరింది. తాగినోళ్లకు తాగినంత ఫారిన్ విస్కీ, ప్రతి రోజూ 20 పొటేళ్లు తెగుతున్నాయి. ఊళ్లో ఇంటింటి భోజనాలు చెప్పాడు” చలమయ్య సుదీర్ఘంగా వివరించాడు.
“అరే ఎలక్షన్ ఇప్పుడే జరగదుగా.. ఇంకా ఆర్నేల్లు పడుతుంది, అప్పుడే ఇంత తొందర దేనికి?” సూరిగాడు అడిగాడు.
“బాబాయ్.. ఇప్పటి నుంచే జనాన్ని కూడగట్టుకోవాలి. బలగం ప్రదర్శనలో ముందుండాలి. నీకు తెలుసా? మా పాత సీఎం బయటకు వెళ్లాడంటే… వేలమంది అభిమానులు రోడ్డు ఎక్కుతారు? అదీ ఆయన సత్తా. ప్చ్.. ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా దొరకలేదు. జనాన్ని ఎంత మేపినా… కడకు పసుపు నీళ్లు చల్లేస్తారు, బాబాయ్. చలమయ్య నవ్వాడు.
“ఔను ఎంత ఖర్చు పెట్టిన.. జనం నిర్ణయం చెప్పలేం. ఇది ముమ్మాటికీ నిజం. అసలు మీ పంచాయితీ ఈ సారి బీసీలకో.. మహిళలకో రిజర్వు అయితే… మరి మీ సీనయ్య సంగతేంటీ?” అడిగాడు సూరిగాడు.
“బాబాయ్.. మన ఊరు మారిపోయింది. తెర మీదకు పెత్తందారమ్మలు వచ్చేశారు. సీనయ్య సతీమణి ఓ ట్రస్ట్ పెట్టింది. వీక్లీ ఎన్వీ భోజనాలు వడ్డిస్తోంది”
మరి బాపనయ్య తాలూక కూడా ఎంట్రీ ఇచ్చారా? సూరిగాడు ఇంట్రెస్టింగ్ గా అడిగాడు.
ఓ..బాపనయ్య వైఫ్, అమ్మ కలిసి మహిళ సంఘాలు తెరిచారు. ఆడోళ్లకు నిత్యం సారెలు పంచుతున్నారు. చర్చీలు దత్తత తీసుకున్నారు. మశీదుల్లో రంజాన్, బక్రీద్ వేడుకల్లో ఫోటోలు దిగుతున్నారు’’, చలమయ్య గుక్క తిప్పుకోలేదు.
“ వీళ్లద్దరికి పోటీ మూడో మనిషి వస్తే.. మళ్లీ ఏకగ్రీవమే అని అధిష్టానం అంటే.. జనం పరిస్థితి ఏంటీ? సూరిగాడి ప్రశ్న.
“ బాబాయ్.. జనం తెలివి మీరారు. . గెలిచినోళ్లు ఐదేళ్ల వరకూ ముఖం కూడా చూపించరు. ఊళ్లో ఎలక్షన్ జరగాల్సిందే. ఎంత మంది పోటీ చేస్తే.. అందరి దగ్గర వసూలు చేయాల్సిందే. ఓటు హక్కు మా జన్మ హక్కు మేం ఓటు వేయాల్సిందే అంటున్నారు. కానీ నోటుకు ఓటు ఢీల్ మాత్రం మారదు బాబాయ్ ’’, చలమయ్య అన్నాడు.
“ అంతేరా.. మన ప్రజాస్వామ్యం ధన స్వామ్యంగా మారింది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. సరే.. వెళ్లు .. నువ్వు తాగొద్దు” , అని చలమయ్యను సూరిగాడు సాగనంపాడు.
5.రంగమ్మత్త పచ్చిపులుసు

మా అమ్మావాళ్ల ఊరు ఊరు భీమవారం. నా చిన్నప్పుడు చాలాసార్లు మా అమ్మనాన్నలతో ఊరెళ్ళినప్పుడు, మా నాన్న అక్కడికి ఓ పదిహేను కిలోమీటర్ల దూరం ఉండే కుగ్రామంలో తనకు అత్తయ్య వరసయ్యే రంగమ్మ ఇంటికి నన్ను తీసుకెళ్ళేవాడు. వాళ్లాయన చాలాకాలం క్రితమే గతించాడు. అదో పూరిపాక, విశాలమైన స్థలం మధ్యలో ఉండేది. చుట్టూ పూలు, పళ్ల చెట్లుండేవి. పైకంటా నీళ్ళుండే బావిని చూసి సంబరపడేవాడిని.
చేతికందేంత ఎత్తులో చెట్టుకున్న పళ్ళు కోసుకుని తింటే భలేగా ఉండేది. సిటీ నుండి వెళ్లినవాణ్ని గనక నాకు ఆ పరిసరాలు చిత్రంగా ఉండేవి. రంగమ్మత్త (ఆవిణ్ని నేనూ రంగమ్మత్త అనే పిలిచేవాణ్ని అదేంటో) వాళ్లింటికెళ్తే అప్పటికప్పుడు వేడివేడి అన్నం వండి, రకరకాల పదార్థాలతో పాటు అరటి ఆకులో వడ్దించేది. అన్నీ ఒకెత్తు ఆవిడ చేసే పచ్చిపులుసు ఒకెత్తు. దాని రుచి మహత్తరంగా ఉండేది. పులుసన్నం జుర్రుకుని తినేశాక ఆకులోని పులుసు రుచిని వేళ్ళకు పట్టించుకుని, నోట్లో పెట్టుకుని లొట్టలేసుకుంటూ నాకే వాళ్లం. ఆవిడకి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.
ఇప్పుడు నేను పెరిగి పెద్దయ్యాను. నాన్న గతించాడు. ఏదో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. ఇదిలా ఉండగా చాలా సంవత్సరాల తర్వాత మా బావ పెళ్ళికి భీమవరం వెళ్లాను. పెళ్ళయ్యాక ఇక తిరిగి హైదరాబాదు వచ్చేద్దామనుకుంటే హఠాత్తుగా రంగమ్మత్త గుర్తొచ్చింది. నేను మా నాన్నతో వెళ్ళేటప్పుడే ఆవిడకి సుమారుగా ముప్పై ఏళ్ళుంటాయి. ఇప్పుడెలా ఉందో? ఏదేమైనా ఆవిణ్ని, ఆవిడ పచ్చిపులుసు రుచి చూడాలనిపించి ఆ గ్రామానికి బయల్దేరాను.
నేను వెళ్లి గమనించిందేమిటంటే చిన్న చిన్న మార్పులు తప్ప ఆ ఊరు, ఇల్లు, ఆవిడా ఏం మారలేదు. పైగా ఇంట్లో ఆర్థిక లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చాలా కాలమయింది గనక నన్ను నేను ఆవిడకి పరిచయం చేసుకున్నాను. నాన్న చనిపోయిన విషయం తెలుసుకుని కన్నీళ్ళు పెట్టుకుంది. ఆవిడ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిల్లయిపోయి వాళ్లకీ పిల్లల్ట. దగ్గర్లోనే ఉంటారట. ప్రస్తుతానికి వాళ్ళే ఆవిణ్ని చూసుకుంటున్నారు. నేను వెళ్లినప్పుడు ఆవిడ పెద్ద కూతురుంది.
నేను బావి దగ్గర కాళ్ళూ చేతులు కడుక్కుంటుంటే ‘అసలే వాళ్లు ఆర్థికంగా సతమతమవుతూంటే, తానో బరువయ్యాన’ని నా దగ్గర వాపోయింది. ఇంట్లోకి వచ్చాక హఠాత్తుగా నా వైపు తిరిగి “మీనాన్నే నిన్ను ఇక్కడకు పంపించి ఉంటాడురా! పిచ్చి సన్నాసికి నేనంటే ఎంత ప్రేమో! ఉండు..పొయ్యి మీద అన్నం పడేస్తాను” అని గబగబ పొయ్యి రాజేసి నాకు వేడి వేడి అన్నం వండుతుంటే, పచ్చిపులుసు గుర్తుచేశా. ’ఓరి భడవా, నా చేతి పులుసు రుచి నీకింకా గుర్తేనేంట్రా’ అని పెదాల్ని చెవుల్దాకా సాగదీసి నవ్వింది.
గుర్తుగా ఉంటుందని నేను ఆవిడ పచ్చి పులుసు చేయడాన్ని వీడియో తీశాను. అన్నానికి కూర్చునే ముందు వాళ్లమ్మాయికి సెల్ఫోన్ ఇచ్చి, నేను పచ్చి పులుసు తినడం వీడియో తీయమన్నాను. మళ్ళీ మా నాన్నతో తిన్నప్పటి రుచే అది, మెదడు ఇట్టే పోల్చి పట్టేసింది. ఆనాటి రుచి ఏమాత్రం తగ్గలేదు. భుక్తాయాసంతో (భయపడుతూ, కొలుచుకుంటూ తినే ఇప్పటి తరానికి దీనర్థం తెలీదు) త్రేన్చుకుంటూ (దీనర్థమూ తెలియదు) లేచి, గోడకానుకుని పీట మీద కూర్చున్నాను.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని హైదరాబాదు వచ్చేశాను. ఒకరోజు ఏం తోచక రీల్స్ చూస్తుంటే, హోటల్స్, వంటలు, పల్లెటూరి రుచులు, కుగ్రామాల ఘమఘమలు కనువిందు చేస్తూ కనిపించాయి. వెంటనే మెదడులో మెరుపులాంటి ఐడియా తళుక్కుమంది. సరదాగా రంగమ్మత్త చేస్తున్న పచ్చిపులుసు, ఆబగా దాన్ని నేను అన్నంలో కలుపుకుని జుర్రే వీడియోలను ఎడిటింగ్ చేసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేశాను.
కొద్దిసేపట్లోనే అసంఖ్యాకంగా ఆవిడ అడ్రసు, ఆ పచ్చిపులుసు కావాలని వ్యూస్, కామెంట్లు రావడం మొదలయ్యాయి. నేను వాళ్లమ్మాయికి విషయం చెప్పి ఇన్ స్టాగ్రాంలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, రంగమ్మత్తకు పేరు, డబ్బు రావడమేకాక, ఆవిడ చేతిలోని వంట కళ పదిమందికి చేరుతుందని చెప్పాను. వాళ్లకోదారి ఏర్పడింది.
ఒకసారి రంగమ్మత్త ఫోన్ చేసి “ఒరే, నీవల్ల నేను పదిమందికీ తెలియడమే కాదు నా పచ్చిపులుసుతో పాటు వంటలన్నీ దేశీయంగా ఖ్యాతినొందుతున్నాయి. నాలుగు డబ్బులూ సమకూరుతున్నాయి. ఏ లోకంలో ఉన్నాడో కాని మీ నాన్న నిన్ను ఇక్కడకు పంపి నీ ద్వారా ఇదంతా చేయించాడురా నాయనా! వందేళ్ళు చల్లగా ఉండు” అని దీవించింది. సామాజిక మాధ్యమాల వల్ల కొంత చెడు జరుగుతున్నా, ఎంతో మంచీ జరుగుతోంది. రంగమ్మత్తల్లాంటివాళ్ళు జగానికంతటికీ పరిచయమవుతున్నారు. మా రంగమ్మత్తకి ఓ దారి ఏర్పడింది. అది నాకెంతో సంతృప్తి కలిగించింది.
6.మట్టిని నమ్మితే

నుదురు మీద చెయ్యి పెట్టుకుని అలా దిగాలుగా కూర్చున్నాడు భూమయ్య.
అతనికి ఏమీ పాలు పోవడం లేదు. మిత్తికి తెచ్చాడు డబ్బు. వంశ పారంపర్యంగా వచ్చిన ఆ రెండెకరాల భూమి మీదనే అతని ఆశలన్నీ. అందులో పంట వస్తేనే అతని కుటుంబం బ్రతికేది. మట్టిని నమ్మిన రైతుకు ఇంత దిగులా? అనిపిస్తోంది. ఎప్పుడూ ఇంతటి కరువు కాలం రాలేదు.
కష్టపడి రూపాయి రూపాయి కూడపెట్టినదంతా కూతురు పెళ్లికి ఖర్చు పెట్టాడు. ఉన్నంతలో బాగానే చేశాడు. అల్లుడు సిటీలో ఆటో డ్రైవర్.. ఫర్వాలేదు పెళ్ళాన్ని పోషించుకో గలడు అనే ధీమా భూమయ్యది. సిటీ కదా, ఎప్పుడూ గిరాకీలే ఉంటాయి. వారి భుక్తికి లోటుండదు అనుకుంటాడు భూమయ్య. ఉన్నదంతా ఊడ్చి వేయడం వలన వడ్డీలకు తెచ్చి పంట వేశాడు భూమయ్య.
అయితే, సుభిక్షంగా ఉండవలసిన తరుణంలో దుర్భిక్షం తాండవిస్తోంది. కరెంట్ కోతలకు తోడు లో, హై ఓల్టేజ్ ల వలన మోటారు కాలిపోతే రిపేరుకు ఇచ్చాడు. మెకానిక్ రేటు పెంచాడు. పోనీ, వర్షం మీద ఆధారపడితే చుక్క నీరు కురవడం లేదు. ఏం చేద్దునురా భగవంతుడా!
దేశానికి అన్నం పెట్టేవాడిని రైతు అంటారు. ఆ రైతుకే ముద్ద కరువైంది కదా! రెండేళ్ల క్రితం తన దూరపు చుట్టం పొలంలో చల్లే పురుగుల మందు తాగి బలవంతంగా తన ఉసురు తానే తీసుకున్నాడు. అది గుర్తుకు వచ్చింది భూమయ్యకు. ప్రస్తుత రోజులు చూస్తుంటే తన పరిస్థితి అలా కాదు కదా అనిపిస్తోంది. సీజను అయిపోతోంది. పైన కువకువ రాగాలతో విహరించే పక్షులు అతని దైన్య స్థితిని చూసి మూగపోయాయి.
ఆ రాత్రి పలకరింపుగా ఫోన్ చేసింది కూతురు అలివేలు.
“అమ్మా, బాగున్నారా?” అడిగింది తల్లిని.
“ఏం బాగు బిడ్డా.. కరెంట్ లేదు.. వాన రాదు.. పంట పండటం కష్టమవుతుంది. నాన్న పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది బిడ్డా.. పైసలు మిత్తికి తెచ్చాడు.. మా బతుకులు ఏమవుతాయో? ఏమో?” గోస వెలిబుచ్చింది ఆ తల్లి.
“అమ్మా.. ఉండు.. మీ అల్లుడితో మాట్లాడి మళ్ళా ఫోన్ చేస్తా..” అని పావు గంట తర్వాత ఫోన్ చేసింది అలివేలు.
“అమ్మా, మీరిద్దరు. ఆడ ఎందుకు? పంట చేతికందుతుందో, లేదో అనే మనాదితో మీరు అక్కడ.. మిమ్మల్ని తలచుకుంటూ మేము ఇక్కడ.. పట్నం వచ్చేయండి..” సలహా చెప్పింది అలివేలు.
“పట్నం వచ్చి ఏం చేయాలమ్మా..”
“ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ వెలుస్తున్నాయి. కాయ కష్టం చేయనవసరం లేదు. వాచ్మన్ గా ఉంటే రూమ్, కరెంట్ ఫ్రీ. నెలకు కొంత ఇస్తారు.. మీ ఇద్దరికీ సరిపోతుంది… బేగి వచ్చెయ్యండమ్మా..” చెప్పింది అలివేలు.
“ఏమంటావయ్యా! బిడ్డ అడుగుతోంది.” భూమయ్య కేసి చూసింది ఆమె.
“పట్నమా? ఈ భూమిని వదలుకొనా?” బేలగా చూసాడు భూమయ్య.
“వద్దయ్యా! బతికుంటే బలుసాకు తినొచ్చు. ఆ పొలాన్ని ఎవరికయినా కౌలుకు ఇద్దామయ్యా” బతిమాలింది.
ఆలోచనల్లో పడ్డాడు భూమయ్య.
‘మనిషిని నమ్మితే ఏముందిరా? మట్టిని నమ్మినా ఫలితముందిరా!’ విన్న పాటను మననం చేసుకున్న అతని కళ్ళల్లో నీటి చమ్మ.
“పట్నంలో బతికే వాళ్లందరూ పల్లెల్లో బతకలేక వచ్చిన వారేనమ్మా! ఆలోచించకండి ఇక!” హితవు చెప్తోంది అలివేలు.
మరుసటి రోజు.. తన భూమి వద్ద కూలబడ్డాడు భూమయ్య. దశాబ్దాలుగా నమ్ముకున్న భూమి. పొడి పొడిగా కనిపిస్తోంది. పరిస్థితులు ఇలా అవుతాయని అనుకోలేదు. భూమయ్య కంట తడి అశ్రువులు జారి ఆ భూమిని కొంత తడి చేసింది. ఈ అశ్రువులే మేఘాల మీదకు చేరి నాలుగు చినుకులు కుమ్మరిస్తే ఎంత బావుణ్ణు అనిపించింది అతనికి.
‘ వలస ‘ తప్పదు అనే ఆలోచన వచ్చేసరికి మరింతగా జలజలా జాలువారాయి అశ్రువులు.
రచన: పంతంగి శ్రీనివాస రావు
7.ఆసాంతం ఆసక్తికర సైన్స్ ఫిక్షన్

బాల సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే సైన్స్ సబ్జెక్ట్ పట్ల మంచి అవగాహన ఉండి, దానికి కాల్పనికత జోడించి, పాఠకులను మెప్పించే శక్తి కొందరికే ఉంటుంది. అలాంటి అరుదైన సైన్స్ ఫిక్షన్ రచయితల్లో
‘ డా. వి.ఆర్. శర్మ ఒకరు. బాల సాహిత్యంలోనూ, కార్యశాలల ద్వారా బాలల్ని చైతన్య పరచడంలోను ముందువరుసలో ఉన్న డా.వి.ఆర్. శర్మ , తాజాగా వెలువరించిన పుస్తకం
‘ ద లాస్ట్ ఎవల్యూషన్ ‘ …
ఈ తరం టీనేజ్ పిల్లల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం ఆధునిక నవల.
ఈ పుస్తకం సమకాలీన సైన్స్ విశేషాలను, భావి సైన్స్ పురోగతిని కళ్ళకు కడుతుంది. సైన్స్ పట్ల అలసత్వం వహించే వారికి సైతం ఆసక్తి రేకెత్తించేలా, చైతన్య పరిచేలా ఉంది. అన్ని వయసుల వారికి ఉపయోగపడే పుస్తకమిది.
చదువుతుంటే సైన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. రక్ష, మోక్ష, ప్రాచీ, బాలవర్ధన్ పాత్రలను నేర్పుగా తీర్చిదిద్ది, వారితో అద్భుతాలు చేయించారు రచయిత. ట్రాన్స్ హ్యూమనిజం గురించి వివరంగా చర్చించారు. ఇక రచయిత కాల్పనికత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందనడానికి ఓ ఉదాహరణ ఇందులోని.. ఎగిరే రెక్కల ఒంటె. అది అదృశ్యరూపంలో శరత్ కు తోడుగా ఉండి లక్ష్య సాధనకు తోడ్పడడం. అలాగే ప్రాచీ పంపిన గ్రహాంతర సైబోర్గ్ వాహనం మరో అద్భుతం.
శరత్ గ్రహాంతర బాలుడిని రక్షించడం, ప్రాచీ, వర్ధన్ లు సైంటిస్టులను విడిపించి, పవర్ స్టేషన్ పేల్చేయడం, గ్రహాంతర జీవి ‘ నక్షత్ర ‘ రాక, అంతా కలిసి కేవలం రెండు నిముషాల్లో చంద్రమండలం చేరి, మనుషుల్ని గ్రహాంతర ట్రాన్స్ హ్యూమన్స్ గా మార్చే ప్రయోగాలను భగ్నం చేయడం…అన్నీ సంభ్రమాశ్చర్యాలు కలిగించేవే. సమకాలీన, భావి సైన్స్ పురోగతిని పాఠకులకు చక్కగా దర్శింపజేసే పుస్తకమిది. పెద్దలలో సైన్స్ అంశాల పట్ల అవగాహన పెంచడానికి, పిల్లలలో చైతన్యానికి, వారిని ప్రభావితం చేసి, కొందరయినా భవిష్యత్తులో సైంటిస్టులుగా రూపొందడానికి ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుందనడంలో సందేహంలేదు.
( ద లాస్ట్ ఎవల్యూషన్ : ఈ తరం టీనేజ్ పిల్లల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం ఆధునిక నవల: డా వి.ఆర్. శర్మ ; వెల: రూ. 149/ – ; ప్రతులకు: డా.వి.ఆర్.శర్మ, మొబైల్ నంబర్: 9177887749 ను సంప్రదించగలరు
) సమీక్షకులు : జె. శ్యామల
8.శ్రావణ మేఘాలు

“అమ్మా, ఇందే రెండొందలు.” అని రెండు వంద రూపాయల నోట్లు
ముసలవ్వ సూరమ్మకు ఇచ్చాడు కొడుకు శంకరం.
“షావుకారుక్ర్ డబ్బులు ఇచ్చినావురా?” అడిగింది సూరమ్మ దగ్గుతూ..
“షావుకారు డబ్బులు పైన వడ్డీతో కలిపి ఇచ్చినాక ఈ రెండొందలు
మిగిలినాయి.” అన్నాడు శంకరం.
పల్లె గ్రామం నుంచి బ్రతుకు తెరువు కోసం ముసలి తల్లితో పట్నానికి
వచ్చి లేబర్ కాలనీ బస్తీలో రేకుల షెడ్డు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు
శంకరం.
పోలియో వల్ల భారీ పనులు చెయ్యలేడు.తిండికి టికానా లేనప్పుడు పెళ్లి చేసుకుని పెళ్లాన్నీ ఏం సుఖపెట్టగలనే అని వాయిదా వేస్తువచ్చాడు. ముసిల్ది సూరమ్మ ఆస్తమా జబ్బు వల్ల తరచు ఆయాసంతో బాధపడుతుంటుంది.
బస్తీ షావుకారు వద్ద వడ్డీకి డబ్బులు తెచ్చి పెద్ద మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి వీధులంట అమ్మి సాయంకాలం షావుకారు బాకీ తీర్చి మిగతా డబ్బులు తల్లికి ఇంటి ఖర్చుల కోసం ఇస్తుంటాడు.
ఒక్కొక్కసారి భారీ వర్షాలు, రాజకీయ పార్టీల ఆందోళనలతో వ్యాపారం లేకపోతే దాచుకున్న డబ్బులతో కాలక్షేపం చేస్తారు వారు. రోజూ మాదిరి ఒకరోజు ఉదయం చీకటినే మండీలో కాయకూరలు కొనడానికి తోపుడుబండి తీసుకుని వెళుతున్నాడు శంకరం. కొద్దిదూరం
వెళ్ళినాక చెరువుగట్టున ఉన్న పొదలలోంచి చంటిపిల్ల ఏడుపు వినబడింది శంకరానికి. ఈ చీకట్లో ఇక్కడ పసిపిల్ల ఏడుపు ఏమిటని తోపుడుబండి పక్కన ఆపి వెళ్లి చూస్తె నెలల పసిపాప చీరలో చుట్టి కనబడింది. చుట్టుపక్కల ఎవరూ కనబడలేదు. దగ్గరలో ఎవరైన ఉన్నారేమోనని కేకేసి పిలిచినా జవాబు లేదు. మరికొద్ది సేపు ఆగి పరిసరాలు వెతికినా ఎవరి జాడ కనబడలేదు. ఆ చంటిపాపను జాగ్రత్తగా చీర చుట్టతో తోపుడుబండి మీదకు చేర్చి రేకులషెడ్డుకు వచ్చి తల్లికి జరిగిన విషయం చెప్పేడు.
ఎవరిపిల్లో ఈ పసిగుడ్డు, ఇలా రోడ్డున పడెయ్యడానికి చేతులు ఎలా వచ్చాయని తిడుతు చంటిపిల్లను జాగ్రత్తగా గుడిసెలో నులక మంచం మీద తన చేరెను మడతలు చేసి పడుకోబెట్టింది. ఆకలి వేస్తోంది కాబోలు పసిపాప ఏడుపు మొదలెట్టింది.
వెంటనే శంకరం షాపుకెళ్లి పాలపేకెట్ కొని తెచ్చాడు. చంటిది మెల్లమెల్లగా పాలు తాగి ఆకలి తీరిన తర్వాత ఏడుపు ఆపి పడుకుంది. ఇప్పుడు ఈ పసిపిల్లను ఏం చెయ్యడమని తల్లీ కొడుకులు తర్జనబర్జన పడసాగేరు. పాప ఆచూకీ తెలిస్తే చెప్పమని బస్తీలో అందరికీ తెలియ చేసారు. రోజులు గడుస్తున్నా ఎవరు పాపని తీసుకెళ్లడానికి రాలేదు. చంటిపాప పోషణకి, ఆడుకోడానికి ఏమేమి కావాలో శంకరం తెచ్చి తల్లికి ఇస్తున్నాడు. డాక్టరుకి చూపించి బలకరమైన పోషక పదార్థాలు, ఆటవస్తువులు కొని తెస్తున్నాడు. పాపకి మూడు సంవత్సరాలు పూర్తయాయి. బస్తీలోను, కనబడిన వారికి శంకరం పాప విషయం చెప్పినా ఎవరూ తీసుకెళ్లడానికి రాలేదు.
పాపకి ‘చిన్నూ’ పేరు పెట్టి పిలుస్తున్నారు. బుడిబుడి నడకలతో బొద్దుగా ముద్దు ముద్దు మాటలతో చంటిది చిన్నూ బస్తీలో అందరికీ దగ్గరైంది. ఇప్పుడు చంటి చిన్నూను అందరు చేరదీస్తున్నారు. పాపకి కావల్సిన ఫ్రాకులు, ఆటవస్తువులు తిండి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటు ఎక్కువ డబ్బులు సంపాదనకు కష్టపడుతున్నాడు శంకరం.
శంకరాన్ని ‘బాబూ’ అని మసలవ్వను ‘మామ్మా’ అని పిలుస్తోంది చిన్ను. సూరమ్మ చిన్నూను కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచుతోంది. బస్తీలో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న అనసూయమ్మ.
చిన్నారి చిన్ను రూపురేఖలు చలాకీతనం చూసి చిన్ను పేరును ‘స్రవంతి’ గా మార్చి తను నడుపుతున్న కాన్వెంట్ స్కూల్లో ఉచిత ప్రవేశం కలిగించింది.
ఇప్పుడు బేబీ స్రవంతికి వయసు ఐదు సంవత్సరాలు వచ్చాయి. ఎల్కేజీ, యూకేజీ పూర్తయి ఫస్టు క్లాసులోకి వచ్చింది. చదువులో చురుకైన చలాకీ స్రవంతి ఒకసారి విన్నది వెంటనే జ్ఞాపకం ఉంచుకుంటోది. బేబీ స్రవంతి వయసు పెరుగుతున్న కొద్దీ తాత, బాబాయ్, మామయ్య అన్న అక్క అని పిలుస్తు బస్తీలో అందరికీ ఆప్తురాలైంది.
యాదృచ్చికంగా స్రవంతీ మూవీస్ బేనర్ మీద సినిమాలు తీస్తున్న డైరెక్టర్ వాసు బస్తీకి వచ్చి కథకు అనువైన లొకేషన్ కోసం వెతుకుతుంటే అక్కడ ముద్దుగా చలాకీగా కాన్వెంట్ స్కూలు వద్ద ఆడుతున్న స్రవంతిని చూడటం జరిగింది. వారు తీయబోయె సినేమాలో ఒక చైల్డ్ ఆర్టిస్టు కోసం వెతుకుతున్న సమయంలో స్రవంతి గురించి కాన్వెంట్ యజమాని
అనసూయమ్మను సంప్రదించగా వికలాంగుడైన శంకరం వివరాలు తెలియచెప్పింది.
సినేమా డైరెక్టర్ వాసు, శంకరాన్ని పిలిపించి స్రవంతిని తమ సినేమాలో ఒక పాప పాత్ర కోసం తమతో పంపితే ఆడిషన్సు చేసి నటనలో తర్ఫీదు ఇస్తామని చెప్పారు.
అందుకు శంకరం, సూరమ్మ ఒప్పుకో లేదు. తమకి ప్రాణమైన చిన్నారి స్రవంతిని విడిచి ఉండలేమని కరాకండిగా చెప్పేసారు.
కాన్వెంట్ యజమాని అనసూయమ్మ వారికి నచ్చ చెప్పి స్రవంతి సినిమాలో నటిస్తే బస్తీకి పేరు వస్తుందని, డబ్బులు కూడా ఇస్తారని, వ్యాపారానికి ఎంతో పెట్టుబడిగా ఉంటుందని నచ్చచెప్పింది. మిగతా బస్తీ పెద్దలు కూడా స్రవంతిని సినిమా వారితో పంపమంటే అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
డైరెక్టర్ స్రవంతిని, వెంట శంకరం, అనసూయమ్మను ఆడిషన్ కోసం స్టూడియోకి రప్పించి మేకప్ టెస్టు చేసి వారికి కావల్సిన సీన్స్ షూట్ చేసారు. బేబీ స్రవంతి ఎటువంటి భయం లేకుండా వారు చెప్పిన విధంగా నటించింది. డైరెక్టర్ వాసు వారి సినేమాలో
చైల్డ్ ఆర్టిష్టు పాత్ర కోసం బేబీ స్రవంతిని తీసుకుని ఎడ్వాన్సుగా కొంత డబ్బు ఇచ్చారు శంకరానికి.
శంకరం ఆనందానికి అంతు లేకపోయింది. డైరెక్టర్ చెప్పిన సమయంలో బేబీ స్రవంతిని సినేమా షూటింగ్ కి తీసుకెల్తున్నాడు. వారు ఇచ్చిన డబ్బుతో బస్తీలోనె పెద్ద ఇల్లు బాడుగకు తీసుకుని కిరాణా వ్యాపారం మొదలెట్టాడు.
శంకరం అదృష్టం తిరిగింది. వ్యాపారం పుంజుకుంది.
షూటింగ్ లేని సమయంలో స్రవంతి స్కూలుకి రెగ్యులర్ గా వెళ్తోంది.
చదువులో కూడా స్రవంతి ఒక్కొక్క క్లాసు పూర్తి చేస్తోంది.
అనుకున్న సమయానికి డైరెక్టర్ వాసు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసాడు. సినిమా విజయం చెంది మిగతా నటీనటులతో పాటు బేబీ స్రవంతికి కూడా గుర్తింపు వచ్చింది.
తర్వాత మరికొన్ని సినిమా చాన్సులు వచ్చినా స్రవంతి చదువుకు ఆటంకం కలుగుతుందని అనసూయమ్మ సలహా మేరకు ఒప్పుకోలేదు శంకరం. సినేమాలో బాలనటిగా గుర్తింపు పొందిన బేబీ స్రవంతికి పట్నం కార్పొరేట్ హైస్కూలులో తర్వాత డిగ్రీ కాలేజీలో ఫ్రీగా చదువుకునే
అవకాశం కలిగింది.
ఇప్పుడు బేబీ స్రవంతి అందంగా బొద్దుగా కుమారి స్రవంతిగా కార్పోరేట్ కాలేజీలో చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటు కాలేజీ మిస్ బ్యూటీగా ఎంపికైంది.
ఇంతలో తనని ఆప్యాయంగా పెంచిన ముసలవ్వ సూరమ్మ ఆస్తమా జబ్బుతో కాలం చెయ్యడంతో ఎంతో బాధ పడింది.
శంకరానికి వ్యాపారంలో డబ్బు కలిసి రావడంతో బస్తీలో చక్కగా సౌకర్యాలతో ఇల్లు కొనగలిగాడు. స్రవంతీ మూవీస్ బేనర్ మీద డైరెక్టర్ వాసు అనేక సినిమాలు
తీసాడు. ఇప్పుడు కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్లో ఒక రోమాంటిక్ స్టోరీని సినిమాగా తీయాలనే సంకల్పంలో ఉండగా తన మొదటి చిత్రంలో చైల్డ్ ఆర్టిష్టుగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన కుమారి స్రవంతి మిస్ కాలేజీ బ్యూటీగా ఎంపికైన విషయం తెల్సింది.
ఆమె బాబు శంకరాన్ని సంప్రదించి స్రవంతి డిగ్రీ చదువు పూర్తైనందున తను తీయబోయె సినేమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు, ఆమెకు ఆరు నెలలు యాక్టింగ్ లో శిక్షణ ఇవ్వదలిచినట్టు నెలకి ఇంతని డబ్బు ముట్టచెప్పడానికి ఒప్పందమైంది. తనని చిన్న వయసులోనె నటన వైపు తీసుకెళ్లిన డైరెక్టర్ వాసును గురువుగా భావించి ఆయన సినేమాలో నటించడానికి ఒప్పుకుంది స్రవంతి.
తన దగ్గర డైరెక్షన్ లో అసిస్టెంట్ గా చాల కాలం నుంచి పని చేస్తున్న విజయ్ ని హీరోగాను, కుమారి స్రవంతిని హీరోయిన్ గా పెట్టి తక్కువ బడ్జెట్ తో ‘శ్రావణ మేఘాలు’ సినిమా షూటింగ్ ప్రారంభించాడు డైరెక్టర్ వాసు.
‘శ్రావణ మేఘాలు’ పిక్చర్ బాక్సాఫీస్ దగ్గర అఖండ విజయాన్ని సాధించి డైరెక్టర్ వాసుకి కనక వర్షం కురిపించింది.నూతన నటీ నటులుగా హీరో విజయ్ కి, హీరోయిన్ స్రవంతికి
ఉత్తమ నటనకు అవార్డులు వచ్చాయి. వరుస పెట్టి సినేమా ఆఫర్లు రావడం మొదలయాయి.
కుమారి స్రవంతి జీవితం శ్రావణ మేఘాలతో మలుపు తిరిగి పెద్ద సినీ నటిగా గుర్తింపు వచ్చి సమాజంలో సెలబ్రెటీగా పేరు సంపాదించింది.
పట్నంలో ఉండటానికి అన్ని హంగులతో బంగ్లా, ఖరీదైన కారు కొని వృద్ధాప్యంలో, పెంచిన తండ్రికి అన్ని సౌకర్యాలు సమకూర్చింది.
తనతో మొదటి చిత్రంలో నటించిన హీరో విజయ్ కూడా కష్టపడి జూనియర్ ఆర్టిష్టు నుంచి ఎదిగి హీరో స్థాయికి చేరుకున్నాడని తెలిసి అతన్ని జీవిత భాగస్వామిగా ఎంచుకుని లైఫ్ లో సెటిలైంది. బాల్యంలో తనని ఎంతో ఆప్యాయంగా చూసిన బస్తీవాసులకి ఇళ్ళు, మౌలిక సదుపాయాలు కల్పించి రుణం తీర్చుకుంది.
చిన్నతనంలో తను చదివిన కాన్వెంటు స్కూలును అనసూయమ్మ
పేరు మీదుగా బాగా అభివృద్ధి చేసి, పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తోంది.
స్రవంతి నిజ జీవితంలో తన నటనా ప్రతిభతో దినదిన ప్రవర్దమానమై
శ్రావణ మేఘాలు వర్షించి నవ వసంతం మొదలైంది.

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ ఐడి. prabhanewscontent@gmail.com


