Sunday magazine | ఆదివారం సంచిక 07 సెప్టెంబర్ 2025

ఈ సంచికలో..

  1. అనురాగం కొండంత.. అడ్డుగోడ గోరంత (ముఖపత్ర కథనం)
  2. ఇదీ వరస (కార్టూన్)
  3. మూగ మనసు (కథ) జీడిగుంట నరసిం హమూర్తి
  4. నల్ల తుమ్మ (కథ) ఆర్.సి. కృష్ణస్వామి రాజు
  5. సహజ కథల గని ‘జక్కదొన (పుస్తక సమీక్ష)పుట్టంరాజు శ్రీ రామచంద్ర మూర్తి
  6. పలకని మొబైల్ (కథ) మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
  7. అనుబంధం .. ఆత్మీయత అంతా బూటకం (ఏడూళ్ళ సూరిగాడు) బాబు బహదూర్
  8. ఒక అసాధారణమైన జ్ఞాపకం (కథ) రాముకోలా
  9. వైరల్ వైరల్.. నవ్వుల్ నవ్వుల్ !

1) అనురాగం కొండంత.. అడ్డుగోడ గోరంత

అనేక ఎత్తుపల్లాలను…అవరోధాలను అధిగమించి…ఎన్నెన్నో సవాళ్ళనెదుర్కొని…వృత్తి-వ్యాపారాల్లో నిలదొక్కుకుని బాధ్యతల బరువులు మోసి…అలసి సొలసిన పెద్దలు వారు…ప్రేమ అనే తమ రెక్కల కింద కన్నవాళ్ళను కాపాడుకుని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు…శరీరం సహకరించకున్నా తమ పిల్లలకేదో తోడ్పాటు అందించాలన్న తపన తీరదు వారికి. తమ పిల్లలెంత ఎదిగినా, కాలికి ముల్లు గుచ్చుకోకుండా చూసుకోవాలన్న ఆరాటం వారిది.
అయితే, అలసిన వారికి మానసికంగా, శారీరకంగా ఏ కష్టం కలిగించకూడదన్న ఆప్యాయత కన్నవాళ్ళది. వారిచ్చిన స్ఫూర్తి, స్థైర్యంతో, వారు నేర్పించిన విద్యా బుద్ధులతో జీవితంలో స్థిరపడి, ఎలాంటి కష్టమొచ్చినా ఎదుర్కోలగమన్న ధైర్యం కలిగిన సంతానానికి, తమకెదురైన చిన్న చిన్న అవరోధాలను కన్నవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వారిని కలవరపెట్టకూడదనే ప్రేమ వీరిది….
అసలు చిక్కు అక్కడే వచ్చింది…తల్లిదండ్రుల పట్ల కన్నవారికీ, వీరిపట్ల తల్లిదండ్రులకీ అపారమైన ప్రేమాభిమానాలున్నా ఎక్కడో చిన్న గ్యాప్…ఎక్కడుంది? ఎలా పూడుకుంటుంది ఈ అగాధం….?

**

మేడ మీద మొక్కలకు నీళు పోస్తున్నారు రిటైర్డ్ టీచర్ రామనాథం. …ఇంతలో కోడలు వచ్చి, “ఎందుకు మామయ్యా? మేము పోస్తాం కదా? వెళ్ళండి” అని చేతిలోచి మగ్ తీసుకుని ఆయన్ని లోపలికి తీసుకెళ్ళింది. రామనాథం గారి మనస్సు చివుక్కుమంది. తన రిటెయిర్మెంట్ డబ్బుతో కట్టుకున్న ఇల్లు…అపురూపంగా పెంచుకుంటున్న మొక్కలు…స్వయంగా నీళ్ళుపోస్తేనేగానీ తనకు తోచదు. ఆ పాటి స్వతంత్రం కూడా లేదా తనకు..?


మరి కోడలి వెర్షన్ ఏమిటి?
పెద్దాయన మొక్కలకి నీళ్ళు పోస్తూ కాలు జారి పడ్తే ఆ వయసులో మళ్ళీ కోలుకోవడం కష్టం…ఆయనతో చిన్న పని కూడా చేయించ కూడదనేది కొడుకు, కోడలి ఆపేక్ష.

*

హాల్ లో పీట మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉంది డెబ్భై ఏళ్ళ రాధమ్మ. ఏదో గుర్తొచ్చినట్టు అమాంతంగా లేచి, తలగడ కింద పెట్టుకున్న డబ్బులు తీసి లెక్కపెట్టుకుని చూసింది. అందులో వంద తగ్గాయి, కోడల్ని పిలిచి, డబ్బుల్లో వంద తగ్గాయేంటని అడిగింది.
“అవును అత్తయ్యా, ఇందాక పాల ప్యాకెట్ కని తీసుకున్నాను..” క్యాజువల్ గా చెప్పింది కోడలు. “మరి నాకు చెప్పొచ్చు కదమ్మా” ఏదో ఘోరం జరిగిపోయినట్టు అంది రాధమ్మ. “మీరు నిద్రలో ఉన్నారత్తయ్యా, అనవసరంగా లేపడమెందుకని నేనే తీసుకున్నా” సంజాయిషీగా చెప్పేసి అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది కోడలు “నిద్రపోతే ఏమయ్యింది లేపి, చెప్పి తీసుకోవచ్చుగా?” అని అత్తగారు అనేలోగానే వంటింట్లోకి వెళ్ళిపోయింది కోడలు.

రాధమ్మది మరో కథ. కొడుకులిద్దరూ చిన్నగా ఉన్నప్పుడే భర్త దూరమైతే, వాళ్ళకు తండ్రి కూడా తానే అయి, అండగా నిలిచింది. వాళ్ళిద్దరికీ తాను పెద్దగా చదువులు చదివించలేదు. వాళ్ళంతట వాళ్ళే దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ పైకొచ్చారు. కానీ, వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయీ తల్లికి తెచ్చివ్వడం, తల్లికి తెలీకుండా ఖర్చు చేయకపోవడం, అన్నీ ఆమె చేతుల మీదుగానే జరగడంతో రాధమ్మకి పెత్తనం బాగా అలవాటైపోయింది. కొడుకులకి పెళ్ళిళ్ళయి కోడళ్ళొచ్చినా అదే పద్ధతి కొనసాగుతోంది. “అదేమిటండీ? ఇదేమైనా ఆమె పెన్షనా? వారసత్వపు ఆస్థా? మీరు సంపాదించిందే కదా? మేము ఖర్చు చేయాలన్నా ఆమెకు తెలియడం ఏమిటి? అని కోడళ్ళు అన్నా, కొడుకులు లైట్ తీసుకునేవారు.

సంపాదించింది తామే అయినా, సక్రమ మార్గంలో నడిపించింది తల్లేననీ, తమను కాదని తల్లి దాచుకునేదేమిటీ అయినా పెద్ద దిక్కుకి జవాబుదారీగా ఉంటే తమకే మంచిది కదా అనేది వారి అభిప్రాయం. రాధమ్మకు ఆన్ లైన్ పేమెంట్లు తెలీవు, అబ్బాయిలు సంపాదించినదంతా ఏటీఎం లో డ్రా చేసి తెచ్చి తన చేతికివ్వాల్సిందే. ప్రతి రూపాయీ తన చేతిమీదుగా ఖర్చు పెట్టాల్సిందే…ఆమెకు ఈ విషయంలో విసుగు అనేదే ఉండదు. తనకు తెలియకుండా ఎవ్వరు ఏ చిన్న ఖర్చు చేయడానికి వీల్లేదు. ఖర్చుల నిమిత్తం తాను స్వయంగా ఇవ్వాల్సిందే. కొడుకులిద్దరికీ చిన్నప్పట్నుంచీ అండగా నిలిచింది గొప్ప విషయమే..కానీ వాళ్ళిప్పుడు పెద్దవాళ్ళ్య్యారు, భార్యలొచ్చారు, పిల్లలు పుట్టారు. అయినా ఆమె మెదడుపై ఈ ఆర్ధిక లావాదేవీల ఒత్తిడి అవసరమా అని కొడుకులు కోడళ్ళ బాధ….

ఇలాంటి కథలెన్నో…

వాళ్ళు మారరు….అప్పటికే ఎంతో జీవితాన్ని చూసిన వ్యక్తిత్వాలు…ఆ వయసులో తమ పిల్లల కోసం తమ వైఖరి మార్చుకో(లే)రు..
ఒంట్లో ఏమాత్రం ఓపికున్నా, అది తమ పిల్లలకు ఉపయోగపడాలన్న తాపత్రయం వారిది. చేష్టలుడిగి కూర్చుంటే పరిసరాలతో కమ్యూనికేషన్ తెగిపోయినట్టు..ప్రపంచం తమని వెలేసినట్టు అభద్రతా భావం కలుగుతుంది. అందుకే కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాలి వారి ప్రేమని. వాళ్ళని పనులు చేయొద్దని వారించేది వారి భద్రత కోసమేనని సున్నితంగా తెలియజెయ్యాలి. అంతగా వాళ్ళకేవైనా చిన్నచిన్న పనులు చెయ్యాలని ఉంటే తామే దగ్గరుండి చేయించాలి. ఉదాహరణకు మొక్కలకు నీళ్ళు పొయ్యడం లాంటివి.

వారు పట్టుతప్పి కింద పడితే కోలుకోవడం కష్టమని వారిస్తున్నామని నెమ్మదిగా చెప్పి చూడాలి…అలాగే అన్ని విషయాలు కాకున్నా కొన్నైనా వారితో షేర్ చేసుకోవాలి. వారు తమ పెద్దరికం పోలేదని సంతోష పడతారు. మా ప్రొఫెషనల్ టెన్షన్స్ అన్నీ చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేదని చెప్పట్లేదు ..అంతే తప్ప మిమ్మల్ని పట్టించుకోకపోవడం కాదని చెప్పాలి. తమ పట్ల పిల్లల కేరింగ్ కి వారు ఎంతో సంతోషపడతారు. పెద్దవారు చిన్నపిల్లలలాంటివారు. వారిని తమ పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవడంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వారితో తమకున్న కొండంత అనురాగం ఆకాశమంత అవుతుంది.


2) ఇదీ వరస.. !


3) మూగ మనసు

ఆల్టో 800 మారుతి కార్ పోర్టికో లోంచి బయలు దేరడానికి సిద్దంగా ఉంది. సర్వెంట్ మెయిడ్ గ్రిల్ గేట్ లోంచి చేయి ఊపింది.
రాములమ్మ ఆ ఇంట్లో ఎంతో నమ్మకంగా అన్ని పనులు చూసుకుంటుంది. ఆమె భర్త చిన్నప్పుడే పోవడంతో పొట్ట పోసుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా చాలా కాలం క్రితం ఆ ఇంట్లో ప్రవేశించింది.

“ఇల్లు జాగ్రత్తగా చూసుకో “ అంటూ శశి, పద్మినిదేవి కారులో కూర్చున్నారు.
పద్మిని ముందు సీట్లో తన ఒళ్ళో చిన్మయిని కూర్చో పెట్టుకుంది. కారు అంతా మంచి మేలు రకపు పెర్ఫ్యూమ్ సువాసనలు ఆక్రమించుకున్నాయి. ఒక పక్క కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల కారంతా చల్లదనం ఆవరించింది. చిన్మయి చలికి వణుకుతూ ఉండటం గమనించి చిన్మయి చుట్టూ టవల్ తీసి కప్పి దగ్గరకు హత్తుకుంది పద్మిని . వాళ్ళిద్దరి వైపు ప్రేమగా చూస్తూ డ్రైవ్ చేయసాగాడు శశి.

చిన్మయికి మూడేళ్లు ఉంటాయి. ఆ వయసులోనే ఏదైనా చెపితే అర్ధం చేసుకునే జ్ఞానం వచ్చింది. . . చిన్మయిని అప్పుడప్పుడు బయట తిప్పకపోతే ఆ రోజు తను చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే శశి చిన్ననాటి మిత్రుడు ఇంట్లో పెళ్లి ఉండటంతో ప్రయాణం పెట్టుకున్నారు.
కొంత దూరం వెళ్ళాక చిన్మయికి ఆకలి వేస్తోందని గ్రహించిన ఆ దంపతులు ఒక రిజార్ట్ దగ్గర కారును నిలిపారు. చిన్మయి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును తినిపించి, పాలు పట్టించింది పద్మిని. చిన్మయి కళ్ళల్లో నీళ్ళు చిప్పల్లాయి . ప్రేమగా పద్మినీ వైపు చూడ సాగింది.

చిన్మయి గురించి బాగా తెలిసిన శశి మిత్రుడు వాళ్ళు గుమ్మంలో అడుగుబెట్టగానే చిన్మయిని ఆప్యాయతతో చేతిలోకి తీసుకుని తల నిమిరి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అక్కడున్న రెండు రోజులు చిన్మయి అందరితో బాగా కలిసి పోయింది. . .
విందు, వినోదాలు ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలు దేరారు శశి కుటుంబం .

చిన్మయిని పద్మినీ వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటారు. పద్మినీ దంపతులకు పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలైనా ఇంకా పిల్లలు కలగని వాళ్ళకు చిన్మయితో సరదాలు తీరిపోతున్నాయి.
కొంతకాలం క్రితం పద్మిని చిన్ననాటి మిత్రురాలి పెళ్లి ఢిల్లీలో జరుగుతూ ఉంటే శశి, పద్మిని ఆ పెళ్ళికి వెళ్లారు. ఆ సమయంలోనే ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న చిన్మయిని చూడటం జరిగింది. చిన్మయి ఎక్కడ పుట్టిందో తెలియదు. ఎవరో దగ్గర మిత్రులు ద్వారా ఆ ఇంట్లో చేరింది. పిల్లలు లేని శశి దంపతులు ముచ్చటపడి చిన్మయిని పెంచుకోవాలని ఉంది అనడం , అక్కడున్న అందరి మనసులు క్షణికంగా చెదిరినా అందుకు పద్మిని మిత్రురాలు చివరకు అంగీకరించడంతో ఆ నాటి నుండి చిన్మయి పద్మినీ వాళ్ళింట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడమే కాకుండా ఒక ముఖ్య సభ్యురాలి జాబితాలో చేరిపోయింది .

ఎక్కడో ఢిల్లీ నుండి చిన్మయిని తెచ్చుకుని ఇంట్లో మనిషి కన్నా ఎక్కువగా చూసుకోవడం, వాళ్ళు పడుకున్న పక్కలోనే స్థానం ఇవ్వడం , ఒళ్ళో కూర్చోపెట్టుకుని లాలిస్తూ అన్నం కలిపి పెడుతూ ఉండటం , ఏ ఊరు వెళ్ళినా వాళ్ళతో పాటు పక్కన చిన్మయి ఉండాల్సిందే. ఎక్కడినుండో తెచ్చుకున్న చిన్మయిని అత్యంత ప్రేమగా, గారాభంగా చూసుకుంటూ ఉండటం శశి బంధువర్గంలో కొంతమందికి నచ్చడం లేదు. . ఆ మాట చెప్పడానికి మొహమాటం వేసి వాళ్ళు ఆ ఇంటికి కావాలనే దూరంగా ఉంటూ ఉండేవారు.
“మా కోసం వచ్చే వాళ్ళు మా చిన్మయిని కూడా ప్రేమించగలిగితేనే రండి “ అని తెగేసి చెప్పేసేవాళ్ళు శశి దంపతులు.
సెలవులిచ్చినప్పుడల్లా పద్మినీ చెల్లెలు రాగిణీ అక్కగారింటికి వచ్చి కనీసం పదిహేను రోజులైనా ఉంటుంది. ఆ పిల్ల ఉన్నన్ని రోజులు ఆమె డ్యూటి రోజూ చిన్మయిని తనతో పాటు బయట షికారుకు తీసుకెళ్లడం , తన అవసరాలు చూడటం పనిగా పెట్టుకుంటుంది. . చిన్మయి వీధిలో చూసే వాళ్ళకు ఒక పెద్ద ఆకర్షణగా మారింది. కొంతమంది రాగిణీ చేతిలోంచి చిన్మయిని బలవంతంగా లాక్కుని లోపలకు తీసుకెళ్ళి ఏవేవో పదార్ధాలు తినిపించే వాళ్ళు.

చిన్మయికి ఇప్పుడు ఐదేళ్లు నిండాయి. ఎవరి దిష్టి తగిలిందో కానీ పద్మినీకి తెలియకుండా బయటకు వెళ్ళిన చిన్మయిని అటువైపుగా వస్తున్న కారు డాష్ ఇవ్వడంతో తీవ్రమైన గాయాల పాలయ్యింది. చిన్మయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పద్మినీ దంపతులు ఈ హఠాత్పరిణామానికి చాలా సేపు మ్రాన్పడి పోయారు. ఒక పక్క రక్తం ఓడుతున్నచిన్మయిని వైద్యుడికి చూపించాలని కాళ్లాడక అటూ ఇటూ పరిగెడుతున్న పద్మినీకి మరో పక్క బోరుమని కురుస్తున్న అనుకోని వర్షాన్ని చూస్తూంటే ఆమెలో గట్టు తెగిన నదిలా దు:ఖం ముంచుకొచ్చింది. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. సకాలంలో వైద్యం అందకపోవడంతో శశి దంపతుల ఆశలను అడియాసలు చేసి చిన్మయి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పోయింది. ఆమెలో ఎప్పుడూ లేని అవ్యక్తమైన బెదురూ, భయం ముంచుకొచ్చాయి. ఆ క్షణంలో వాళ్ళకు చిన్మయిని పోగొట్టుకున్న తర్వాత ఇక దేని కోసం బ్రతకాలో అర్ధం కాని పరిస్తితి . ఆ కుటుంబంలోని అందరి మనసులు వికలం అయిపోయాయి.

రోజులు గడుస్తున్నాయి. ముఖ్యంగా పద్మిని కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతలోనే ఒక ఊహించని శుభవార్త. చాలా కాలం తర్వాత పద్మిని తల్లి కాబోతోందని తెలిసి ఆ కుటుంబం అంతకు ముందు అనుభవించిన మానసిక వ్యధనుండి మెల్ల మెల్లగా దూరం కాసాగారు. ఇక్కడ చిన్మయి గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. పిల్లలు లేని ఆ దంపతులకు పిల్లల స్థానంలో దేవుడిచ్చిన వరం లాగా భావించి అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ప్రియమైన మేలు జాతి కుక్క పిల్లే ఈ చిన్మయి. దురదృష్టవశాత్తూ చిన్మయి ఒక మూగ జీవిగా భగవంతుడి సృష్టిలో ఉండిపోయింది కానీ దానికి అన్ని ఆలోచనలు, ఊహలూ ఉన్నాయి.

“తనకు అంత విలువనిస్తూ , ఒక జంతువులాగా కాకుండా అన్ని విషయాలలోనూ అత్యంత ప్రాధాన్యత నిస్తూ , తనకు అనారోగ్యం చేస్తే ఎంతో తల్లడిల్లి పోయి సకాలంలో వైద్య సేవలు అందిస్తూ , కడుపులో పెట్టుకుని చూసుకుంటూ ఉండటమే కాకుండా ఎవరైతే తన ఉనికిని అసహ్యించుకుంటూ , తనని చూడటానికి మొహం తిప్పుకునే యజమాని బంధువర్గాలను కూడా తన కోసం తృణప్రాయంగా త్యజించి కన్న తల్లి తండ్రుల కన్నా ఎంతో ఎక్కువగా చూసుకునే వాళ్ళు ఉండటం నిజంగా ఎంత అదృష్టం ? వీళ్ళ ఋణం ఎలా తీర్చుకోవాలి తను ? “ అని చిన్మయి ఖచ్చితంగా ఎన్నో సార్లు అనుకుంటూ ఉండి ఉంటుంది.

ఆ భావాలు చిన్మయి మనసులోకి దూరి పరకాయ ప్రవేశం చెయ్యగలిగే శక్తి ఉన్న వాళ్లకు ఖచ్చితంగా అర్ధం అవుతుంది. అయితే చిన్మయి మనసులో మనసుగా, ప్రతి కదలికలో కలియతిరుగుతూ, మమేకమై ఉండే పద్మినీ దంపతులకు దాని చూపులోని ప్రతి భావం కొట్టొచ్చినట్టు కనిపించేది. అర్ధాంతరంగా తనువు చాలించిన చిన్మయి లోని బలమైన ఆఖరి కోరిక పద్మినీ దంపతులకు తన స్థానంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఇంట్లో ఒక పసి పాప రూపంలో తీరుతూ ఉండటంతో ఇప్పుడు వేరే లోకంలో ఎంతగానో మురిసిపోతూ ఉండి ఉంటుంది.


4) నల్ల తుమ్మ

ఒక ఊర్లో పెద్ద జమీందారు ఉండేవాడు. ఆయనకు సురుచి అనే పెళ్లీడు కొచ్చిన కూతురు ఉండేది. అందగత్తె అయిన సురుచికి ఆమె ధరించే ముక్కుపుడక మరింత వన్నె తెచ్చేది. ఓరోజు పొలం వద్ద పూలు కోసుకు రావడానికి వెళ్ళింది సురుచి. దారిలో ఒక తుమ్మ ముళ్ళు ఆమె కాలికి గుచ్చుకుంది. ముళ్ళు తీసి పారేసి నొప్పికి ఏడుస్తూ ఇంటికి వచ్చింది.

కూతురు ఏడుపు చూసిన జమీందారు మనసు నొచ్చుకుంది. తుమ్మ ముళ్ళ మీద కోపం వచ్చింది ఆయనకు. వెంటనే తన ఇంటి చుట్టూ, పొలం వద్దా ఉన్న తుమ్మ చెట్లను తీయించి వేశాడు. “మన పాపకు ముళ్ళు గుచ్చుకుందని తుమ్మ చెట్లన్నీ తీయించి వేస్తారా?. అమ్మ చేసేంత సహాయం తుమ్మ చేస్తుందని పెద్దలు చెబుతారు” అని జమీందారు భార్య బాధపడింది. అయినా జమీందారు ఆమె మాటలేవీ పట్టించుకోలేదు.

“వాటికి ఒళ్లంతా ముళ్ళే. కాటుక పూత నలుపు చెట్లు అవి. ముళ్ళతో ఉండే కొమ్మలే కానీ పెద్ద ఆకులు కూడా ఉండవు వాటికి. ఆ చెట్లు ఉంటే ఏమి? లేక పోతే ఏమి?” అని తిట్టిపోశాడు జమీందారు. కొన్నాళ్ళు గడిచాయి. పక్కఊరిలో ఉన్న ఓ ధనవంతుడు పెళ్లి చూపులకని జమీందారు ఇంటికి రాదలిచాడు. పెద్దింటి సంబంధం దొరికినందుకు ఎంతో సంతోషించాడు జమీందారు. ఇంటిని బాగా శుభ్రం చేయించి, చక్కగా అలంకరించి, తియ్యటి పదార్థాలు దండిగా చేయించాడు.

అయితే ముందు రోజు రాత్రి వారి ఇంట్లో దొంగలు పడ్డారు. సురుచి ముక్కుపుడకతో సహా బంగారమంతా దోచుకెళ్ళారు. అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి… ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవని ఉన్న నగలతోనే కార్యక్రమం జరిపేద్దామని అనుకున్నారు. ముక్కుపుడక లేకుండా పెళ్లి చూపుల్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పింది సురుచి. వెంటనే సురుచి తల్లికి మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది.

ఊరి పొలిమేరల్లో చెరువుకాడ ఉన్న తుమ్మ చెట్ల దగ్గరికి వెళ్ళింది. తుమ్మ ముళ్ళు కోసి దాన్ని చిన్న కత్తితో అందంగా పుడక చేసి దానికి నాణ్యమైన రంగులు అద్ది కూతురికి ఇచ్చింది. చూడ ముచ్చటగా ఉన్న ఆ ముక్కు పుడకను మారు మాట్లాడకుండా ముక్కుకు బిగించుకుంది సురుచి. పెళ్లి సంభంధం వారు వచ్చారు.

అమ్మాయిని నచ్చారు. వెళ్తూ వెళ్తూ వియ్యంకురాలు “ ఈ ముక్కు పుడక భలే ఉంది. ఇంత అందమైన ముక్కుపుడక నేనెక్కడా చూడలేదు ” అని కితాబు ఇచ్చింది. మురిసిపోయింది పెండ్లి కూతురు. వారు వెళ్ళాక అసలు విషయం చెప్పింది సురుచి తల్లి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో ఊర్లో హడావుడి మొదలయ్యింది. ‘ఏమయ్యిందా…’ అని జమీందారు కుటుంబంతో సహా ఇంటి బయటికి వచ్చాడు. బంగారాన్ని ఎత్తుకెళ్ళిన దొంగలు ఊరికి దూరంగా మామిడి తోపు దగ్గర బంగారు పంచుకోవడం ప్రారంభించారు.

దాన్ని చూసిన రైతులు కొందరు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు.పరుగులు తీస్తూ దొంగలు మామిడి తోపు చుట్టూ ఉన్న తుమ్మ పొదల్లో చిక్కుకున్నారు. తుమ్మ ముళ్ళు గుచ్చుకుని వారి ఒళ్లంతా హూనమయ్యింది. పట్టుబడిన దొంగల్ని నాలుగు తన్నులు తన్ని బంగారం తెచ్చి జమీందారు చేతికి ఇచ్చారు రైతులు. తుమ్మ చెట్ల విలువ తెలుసుకున్నాడు జమీందారు. తన తోటల్లో తుమ్మ చెట్లు నాటించి వాటికి కంచె ఏర్పాటు చేయమని సేవకులకు చెప్పాడు. జమీందారు భార్య నవ్వుతూ “ తుమ్మకు తుమ్మే రక్షణ. దానికి కంచెలక్కరలేదు” అని నవ్వుతూ చెప్పింది. నగలు తెచ్చి ఇచ్చిన రైతులకు జమీందారు బహుమతిగా డబ్బులిచ్చాడు . ఆ రైతులు ఆనందంతో ఊరి బయట ఉన్న తుమ్మ తోపుల్లో కొత్త కోలాటం ఆడారు.


5) సహజ కథల గని ‘జక్కదొన

రచయిత శైలిలో సహజత్వం ప్రధానంగా కనిపిస్తుంది. జర్నలిస్టుగా పొందిన అనుభవం వలన చిన్న చిన్న సన్నివేశాలను కూడా పరిశీలించి, కథలో సహజంగా మేళవించడం ఆయన ప్రత్యేకత. పట్టణ వాతావరణానికి తగిన పదజాలం, గ్రామీణ వాతావరణానికి సరిపడే స్థానిక భాషను వాడడం ద్వారా కథ పాఠకుడికి ఆ ప్రదేశంలో ఉన్న భావన కలుగుతుంది. పాత్రలకు తగిన పేర్లు పెట్టడం, పాఠకుడి హృదయంలోని సానుభూతిని తాకేలా సన్నివేశాలు సృష్టించడం ఆయన శిల్ప నైపుణ్యానికి నిదర్శనం. ఆనందం, ఉపదేశం రెండూ సమపాళ్లలో కనిపించడం ఆయన కథనశైలి ప్రత్యేకత.

‘జక్కదొన’ కథలో రచయిత మానవీయతా విలువలు, జీవకారుణ్యం ప్రధానంగా ప్రతిఫలించారు. మనతోటి ప్రాణులైన ఆవులు, ఎద్దులు, మేకలు వంటి వాటిపట్ల కరుణ చూపించాలనే అవసరాన్ని ఈ కథ ప్రతిబింబిస్తుంది. సమాజంలో పరస్పర సహకారం, సహృదయం వలననే కొత్త సమాజపు ఛాయలు వెలువడతాయని రచయిత ఈ కథ ద్వారా చెప్పాడు. స్వార్థం కంటే సమాజ ప్రయోజనం ముఖ్యమని, మానవ సంబంధాల్లో సానుభూతి ప్రధానమని ఈ కథలో స్పష్టమవుతుంది. అందుకే ‘జక్కదొన’ సామాజిక అవసరాన్ని ప్రతిబింబించే విలువైన కథగా నిలుస్తుంది.

పుట్టంరాజు శ్రీ రామచంద్ర మూర్తి


6) పలకని మొబైల్

ఉదయం 10:00 గంటలు అయింది. అప్పుడే మార్కెట్లోని షాపులన్నీ తీస్తున్నారు. రోడ్డుమీద ఎక్కువగా జనం లేరు.

ఎప్పటిలాగే శంకరం తన మొబైల్ షాప్ తలుపు తీస్తున్నాడు. మొబైల్ అమ్మకాలతో పాటు రిపేర్లు కూడా చేస్తుంటాడు. శంకరం షాప్ అంతా శుభ్రం చేసి సీట్లో కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. ఎక్కడ చూసినా మొబైల్ కనబడుతున్నాయి.

మొబైల్ కూడా నిత్యావసర వస్తువుల్లా తయారైంది. రోజు రిపేర్ కోసం మొబైళ్లు, కొత్తవి కొనడానికి జనం వచ్చిపోతూనే ఉంటారు.

మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే కొంతమంది పాతవి అమ్మేస్తుంటారు. నిత్యజీవితంలో మొబైల్ అవసరం ఎంత బాగా పెరిగిపోయిందంటే అది లేకుండా జీవితం గడపడం కష్టం అయిపోయింది. మనిషిలా తోడుగా ఉంటుంది. కబుర్లు మోసుకొస్తుంది. మనసుకు ఆనందం కలిగిస్తుంది. అలాంటిది మొబైల్ ఒక రోజు పని చేయకపోతే పిచ్చెక్కిపోతుంది.అలానే ఉంది పరమేశ్వరరావు పరిస్థితి.

నెల రోజులుగా మొబైల్ ఉలుకు పలుకు లేదు. అసలు రింగ్ రావట్లేదు. ఏం పాడయిందో ఏమిటో! పోనీ రిపేర్‌కు తీసుకెళ్దాం అంటే ఆశ్రమం నుంచి రిపేర్ షాప్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరినైనా సాయం తీసుకుని వెళ్లాలి. నడుచుకుంటూ వెళ్లలేము. సాయం అడుగుదామంటే అందరూ బిజీగా ఉంటారు.
బతిమాలగా క్యాంటీన్లో పని చేసే రాము అనే కుర్రాడు సాయం వస్తానన్నాడు. ఇటు ఆటోకి యాభై రూపాయలు, అటు నుంచి మళ్లీ యాభై రూపాయలు, మొత్తం వంద రూపాయలు. రాము చేతిలో కూడా ఎంతో కొంత పెట్టాలి. అయినా తప్పదు. మళ్లీ రిపేర్‌కు ఎంత అడుగుతాడు ఏమిటో! వెంటనే రిపేర్ చేసి ఇస్తాడా? లేదో! మళ్లీ వెళ్లాలంటే ఇదే వరుస.

అంటూ ప్యాంటు, షర్టు వేసుకుని, కళ్లకి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని, మొబైల్ జేబులో పెట్టుకుని రాము వెంట రాగా ఆటో ఎక్కి శంకరం షాపు ముందు దిగాడు.

శంకరం గ్లాస్ డోర్ లోంచి నడవలేక నడుస్తూ వస్తున్న ముసలాయన్ని చూసాడు. పరమేశ్వరరావు షాపులోకి రాగానే తన జేబులోని మొబైల్‌ను శంకరం చేతిలో పెట్టాడు.
“ఏమైందండీ?” అని ప్రశ్నించాడు శంకరం.
“నెల రోజుల వరకు బాగానే ఉండేది. ఇప్పుడు రింగు రావటం లేదు” అన్నాడు పరమేశ్వరరావు.

శంకరం మొబైల్ విప్పి అన్ని చూశాడు. “ఎక్కడ ఏం తేడా లేదు” అన్నాడు.
అప్పుడు పెద్దాయన కళ్లలో నీళ్లు వచ్చాయి. “నా పిల్లలు ఫోన్ చేసి నెల పైనే దాటిపోయింది. నేను ఇన్నాళ్లు మొబైల్ పాడైందనుకున్నాను. కానీ పాడింది మొబైల్ కాదు… మనసు లేని నా పిల్లలే” అని ఏడుస్తూ మెట్లు దిగాడు.

ఈ వింత అనుభవానికి శంకరం కళ్లలో కూడా నీళ్లు వచ్చాయి.అప్పుడు అర్థమైంది పరమేశ్వరరావుకు తన మొబైల్ ఎందుకు పలకటం లేదన్న విషయం. గత రెండు మూడు నెలలుగా ఆ శరణాలయంలో ఒంటరిగా ఉండలేనని, కొడుకులతో పాటు తీసుకెళ్లిపోమని వాళ్లు ఫోన్ చేసినప్పుడల్లా ఇంచుమించుగా అడుగుతుండేవాడు. పట్టించుకోని కొడుకులు చివరికి ఫోన్ చేయడం మానేశారు. అదే చేదు నిజం అర్థమైంది పరమేశ్వరరావుకు.


7) అనుబంధం .. ఆత్మీయత అంతా బూటకం

“ గుడివాక లంక బంటాలకు విజ్ఞప్తి. మన పాత ప్రెసిడెంట్లు రాజన్న, చంద్రన్న కూతుళ్లు ఫిర్యాదుతో ఈ రోజు పైడమ్మ గుడిలో పంచాయితీ జరుగుతుంది. మన ఊరి దత్తపుత్రుడు ఏడూళ్ల సూరిగాడు గారు ఫైనల్ తీర్పు ఇస్తారు. ఆయనకు సన్మానం కూడా ఉంది. సభ్యులందరూ చేపల వేటకు వెళ్లొద్దు. తొమ్మిది గంటలకు గుడికి వచ్చేయండి. ఐదు నిముషాలు లేటు చేస్తే మనిషికి రెండువేలు తప్పు తప్పదు. బ్రాందీ, సారా, గంజాయి తాగి రావొద్దు. గుట్కా తినొద్దు. అలా చేస్తే ఐదువేలు తప్పు అదనం” అని మైకులో ఎనౌన్స్ వినపడగానే ఏడూళ్ల సూరిగాడు ఉలిక్కిపడ్డాడు. “ముప్పై ఏళ్ల కిందట ఈ ఊరు వచ్చాను. ఊరంతా మారిపోయింది. పరద పిట్ట వేపుడు, కొరమేను పులుసు తిందామని వస్తే వీళ్లేంటీ బంటా పంచాయితీలో తిరగమూత వేస్తున్నారు’’, సూరిగాడు కంగారు పడ్డాడు.


“ఈ ఊరు తీరే వేరు. గ్రామపెద్దలే పెద్దరాయుళ్లు. వాళ్లు చెప్పిందే తీర్పు. జరిమానా వేస్తే తక్షణం కట్టాల్సిందే. లేకపోతే ఊరి నుంచే వెలి వేస్తారు, ఇంతకీ ఈ ఆడపిల్లల తగువేంటో.. ఏమని తీర్పు చెప్పాలో? ఏమాత్రం తేడా వచ్చినా.. కనీసం నన్ను కూడా వదలరు’’, సూరిగాడు తనలో తాను గొణుక్కున్నాడు. నిన్ననే దేవరపల్లిలో కొనుక్కున్న పొగాకు కాడ బయటకు తీసి చుట్ట చుట్టి వెలిగించాడు. పొగవదులుతూ ధీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో గ్రామపెద్ద జయమంగళ సత్యం వచ్చాడు. “బాబాయ్’’ అంటూ సూరిగాడిని కౌగిలించుకున్నాడు.


“బాబాయ్ బాగున్నావా? ఎన్నేళ్లయిందే” అని పలకరించాడు.
“ఈ ఆడబిడ్డల గొడవేంటీ?” సూరిగాడు అడిగాడు.
“ పదా .. గుడిలో మాట్లాడుకుందాం. టిఫిన్ చేశావా? ముంగరోళ్ల హోటల్ కు వెళ్దాం. ఉప్మా పెసరట్టు బాగుంటుంది” సత్యం అన్నాడు. ఇద్దరూ పైడమ్మ గుడివైపు నడుస్తుంటే.. ఊరి జనం ఏడూళ్ల సూరిగాడికి నమస్కారాలు పెడుతున్నారు. సూరిగాడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆకలి మర్చిపోయాడు.
“ వీళ్ల ప్రేమ తగ్గలేదు” మనసులోనే సూరిగాడు మురిసిపోయాడు. ఇక అప్పటికే గుడి కిక్కిరిసి పోయింది. బంటా జనం వచ్చేశారు. గ్రామపెద్దలు కూడా నేలపై కూర్చున్నారు. ఇంతలో ఊరి బంట్రోతు మైకు తీసుకుని..
“అందరికీ స్వాగతం. ఈ రోజు ఇద్దరు అన్నా చెల్లిళ్ల తగువు పెద్దలకు అందింది. ఫిర్యాదిలను పెద్దలు విచారిస్తారు. ఇప్పుడు ఘంటసాల రాజన్న కూతురు చిన్నమ్మ తన బాధ చెబుతుంది’’, అన్నాడు.


“ చిన్నమ్మ ,,, చిన్నమ్మ” అని బంట్రోతు పిలిచాడు.
“అయ్యా వచ్చాను”, చిన్నమ్మ లేచి నిలబడింది.
“అమ్మా.. నీ బాధేంటీ”? ఓ పెద్ద ప్రశ్నించాడు.
నాన్న రాజన్న ఈ ఊరికి ప్రెసిడెంట్ చేశాడు. ఊరికి బడి తెచ్చాడు. పిల్లలకి పెద్ద చదువులు చెప్పించాడు. ఆసుపత్రి కట్టాడు. ఆపరేషన్లు చేయించాడు. అని చిన్నమ్మ చెబుతుండగా..
‘‘ ఔను ఆయన గొప్ప మనిషి, మీకు ఆస్తులు కూడా సంపాదించిపెట్టాడు, ఆ విషయం మాకు తెలుసు”మధ్యలో ఓ పెద్ద అందుకున్నాడు.
“సరే.. ఆ అమ్మాయిని చెప్పనీయండి” , సూరిగాడు కలగజేసుకున్నాడు.


“ నాన్న చనిపోగానే.. అన్న మోహనయ్య ప్రెసిడెంటుకు పోటీ చేశాడు. ఆయన గెలవటానికి నేను, అమ్మ ఇల్లిల్లూ తిరిగాం. ఆయన్ని గెలిపించుకున్నాం. నాన్న బతికి ఉన్నప్పుడు అన్నయ్యే కొల్లేరులో రెండు వందల ఎకరాల్లో చేపల చెరువులు తవ్వించాడు. ఆ భూములన్నీ బంటాలవే. ఈ చెరువుల మీద బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. అమ్మ పేరున, నా పేరున ఈ అప్పులన్నీ చేశాడు. భీమవరంలో చేపల కంపెనీ పెట్టాడు. ఇప్పుడు లాభాలన్నీ తన ఖాతాలో వేసుకుని కులుకుతున్నాడు. నా వాటా నాకు ఇవ్వటం లేదు’’, చిన్నమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో గ్రామ పెద్ద వెంకన్న క్రాస్ ఎగ్జామినేషన్ మొదలెట్టాడు.
“ఈ ఆస్తిలో నీకు వాటా ఉందనటానికి సాక్ష్యం ఉందా?” ప్రశ్నించాడు.
“అమ్మే సాక్ష్యం” అంటూ చిన్నమ్మ కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చింది.
“బంటా భూములని నీకు తెలుసా?” పెద్ద మరో ప్రశ్న.
“ఊహూ తెలీదండి,” చిన్నమ్మ అమాయకంగా చెప్పింది.
“బ్యాంకు లోన్లు తీర్చారా?” పెద్ద మరో ప్రశ్న.
“లేదండీ.. వడ్డీలు కడుతున్నాడు, అప్పు తీర్చట్లేదు,” చిన్నమ్మ నీరసంగా చెప్పింది.
“చేపల కంపెనీ డబ్బులు ఎవరు తీసుకొంటారు?” పెద్ద ఇంకో ప్రశ్న.
“కంపెనీ మొత్తం వదిన పేరున పెట్టాడు,” చిన్నమ్మ కోపంగా అంది.
“మీ అమ్మ వచ్చిందా? ఆమెను పిలవండి,” పెద్ద అన్నారు. చిన్నమ్మ తల్లి లేచి నిలబడింది.
మీ పేరు ? పెద్ద అడిగాడు.
“జయమ్మ” అని చిన్నమ్మ తల్లి చెప్పింది.
మీ కొడుకు చేతిలో ఆస్తి మొత్తం ఆయన సొంతమేనా?
“కాదు, మా ఆయన రాజన్న ఆస్తి,” జయమ్మ సమాధానం.
“అందుకు ఆధారాలు ఉన్నాయా?” గ్రామపెద్ద అడిగాడు.


ఆమె మాట పెగల్లేదు.
“తండ్రి ఆస్తిలో ఆడపిల్లకూ వాటా ఉంటుంది. ఈ రెండు వందల ఎకరాలు రాజన్నవి కాదు.
ఊరి బంటాల భూమి. ఈ భూమిని గుడివాక లంక జప్తు చేస్తుంది. చేపల కంపెనీ, బ్యాంకు లోన్లు మీరు మీరు చూసుకోండి” అని ఏడూళ్ల సూరిగాడు తీర్పు చెప్పాడు.
బంట జనం టప్పట్లు కొట్టారు. మోహనయ్య ముఖం మాడిపోయింది.
“చంద్రన్న కూతురు కల్పనమ్మను పిలవండి” గ్రామపెద్ద ఆర్డరేశాడు.
“కల్ననమ్మ..కల్పనమ్మ” బంట్రోతు పిలిచాడు. కల్పనమ్మ లేచి నిలబడింది. చేతులు జోడించి అందరికీ నమస్కారం చెప్పింది.
“నీ బాధ చెప్పమ్మా,”, గ్రామపెద్ద అన్నారు.
“ మానాన్న చంద్రన్న పదేళ్లు ప్రెసిడెంటుగా చేశాడు. ఆయన గెలవటానికి నేను ఆడోళ్లను ఏకం చేస్తే.. అన్న కుర్రోళ్లను దగ్గరకు తీశాడు. ఈ పదేళ్లు వైస్ ప్రెసిడెంటుగా అన్న రామన్నకే నాన్న అవకాశం ఇచ్చాడు. ఇంకో మా బావకు మెంబర్ పదవి ఇచ్చాడు. ఇక వీళ్లిద్దరూ కలిసి నాన్నను ముంచేశారు. జనం దూరమయ్యారు. ఆయన చేసిన సేవలన్నీ మాయం అయ్యాయి. నన్ను నాటు సారా కేసులో ఇరికించారు. జైలుకు వెళ్లాను. బెయిల్ ఇప్పించటానికి కూడా అన్న ముందుకు రాలేదు. పంచాయతీలో వేల ఎకరాలను కబ్జా చేశారని నాన్నపై అపవాదులు వచ్చాయి. అన్నయ్య, బావ కలిసి మానాన్నను సర్వనాశనం చేశారు. నాకు మా నాన్నను దూరం చేశారు. మా నాన్నను నాకు అప్పగించండి’’, కల్పనమ్మ వేడుకుంది. క్రాస్ ఎగ్జామినేషన్ కు గ్రామపెద్ద రెడీ అయ్యారు.
పంచాయతీ బోర్డులో మీకు కూడా మెంబర్ ఇచ్చారు కదా? పంచాయతీ పరిధిలో భూ కబ్జా జరుగుతున్న విషయం మీకు తెలీదా? ఈ సమాచారం ఎప్పుడు వచ్చింది? గ్రామపెద్ద ప్రశ్నించాడు.
“ కబ్జా గురించి తెలీదండి? ఆ పదేళ్లు ఏమి జరిగిందో గుర్తు లేదు’’, కల్పనమ్మ సమాధానం ఇచ్చింది.
“ అసలు మీ అన్నకు, మీకు గొవడ ఎందుకు వచ్చింది? మీ నాన్నకు ఈ విషయం చెప్పారా”? గ్రామపెద్ద నిలదీశారు.
“ ఏమో? సారా కేసులో జైలుకు వెళ్లిన తరువాత నాకు దూరమ్యాడు. జనంలో నాకు సానుభూతి పెరుగుతుందని, మా నాన్న తరువాత స్థానం నాకు దక్కుతుందని అన్నకు భయం వేసిందేమో’’? కల్పనమ్మ ఎదురు ప్రశ్న వేసింది.
మీనాన్నకు మీ అన్న వారసుడు కదా? రాజకీయం కావొచ్చు, ఆస్తులు కావొచ్చు. మీరెందుకు అన్న, నాన్నతో గొడవ పడ్డారు? గ్రామపెద్ద ప్రశ్నించాడు.
“ మానాన్నకు నేనంటే ప్రాణం, కానీ ఆయనే ఎందుకు దూరం అయ్యారో తెలియటం లేదు. కేవలం అన్న కుట్రతోనే నాన్న దూరమయ్యాడు”, కల్పనమ్మ సమాధానం.
“ ఇక్కడ ఆస్తులు, వారసత్వ గొడవే కనిపిస్తోంది. ఇది కుటుంబ సమస్య. అక్రమాస్తులతో గుడివాక లంక బంటాలకు సంబంధం లేదు. కానీ వేలాది ఎకరాలను కబ్జా చేసిన మాట నిజమైతే.. ఆ భూమిని ఈ బంటాలే స్వాధీనం చేసుకోవాలి, ఏడూళ్ల సూరిగాడు తీర్పు చెప్పాడు. జనం మళ్లీ టప్పట్లే టప్పట్లు. రామన్న ముఖం కూడా మాడిపోయింది.
“ ఈ ఆడోళ్ల గొడవ అచ్చూ.. ఏపీ, తెలంగాణ రాజకీయ చిత్రంలా కనిపిస్తున్నాయి కదా? వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చెల్లి షర్మిలా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత కంఠశోష.. ఇదే రీతిలో సాగుతోంది. అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం, ఆప్యాయత చచ్చిపోతే.. అనుబంధం, రక్త బంధం కన్నీరు పెట్టుకోక తప్పటం లేదు. ఏపీలో తల్లి , తెలంగాణలో తండ్రి తమ బిడ్డల మధ్య సయోధ్య కుదర్చలేక సతమతం అవుతున్నారంటే.. నిజమే. పచ్చినిజమే, అని ఏడూళ్ల సూరిగాడు మనసులో అనుకున్నాడు. గుడివాకలంక జనం మాత్రం సూరిగాడికి దండలతో సత్కరించటం విశేషం.


8) ఒక అసాధారణమైన జ్ఞాపకం”

ఎవరెస్ట్ శిఖరముపై ఒంటి కాలిపై తపస్సు చేస్తున్నట్లు ఉంది విశాల్ పరిస్థితి.
వేగంగా కొట్టుకుంటున్న గుండె. నుదుటిపైనుండి జారుతున్న స్వేదంతో తడిసి ముద్దగా మారిన శరీరం. అలసటతో మూతపడుతున్న కనురెప్పలు. ఆపరేషన్ థియేటర్ తలుపుకు తన చూపులను కాపలా ఉంచాడు విశాల్.

ఆస్పత్రి కారిడార్లోని క్షతగాత్రుల అరుపులు, యంత్రాల బీప్ శబ్ధాలు, డాక్టర్ల మాటలు—ఇవేమీ అతనికి వినిపించడం లేదు. కేవలం వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె శబ్దం తప్ప.

విశాల్ మనస్సులో భయంకరమైన సంఘర్షణ మొదలైంది. “సుమతి క్షేమంగా ఉంటుందా? నా బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తాడా?” అనే ప్రశ్నలు అతని ఆలోచనలను గందరగోళంలో ముంచెత్తాయి. ఒక వైపు, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్న గతం గుర్తుకొచ్చింది. మరోవైపున, ఆమెను కోల్పోతానేమోననే భయం అతని హృదయాన్ని పట్టి పీడిస్తోంది. ఈ అనిశ్ఛితి అతన్ని ఒక లోతైన మానసిక కలవరంలోకి నెట్టింది. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న విశాల్, ఈ క్షణంలో తనకు తాను అసహాయుడిగా అనిపించాడు. “నేను ఆమె కోసం ఏం చేయగలను?” అనే ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది..

ఐ.సి.యూ గది తలుపుల వైపు చూస్తూ, అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు విశాల్. కాలం ఎందుకింత నిదానంగా గడుస్తోందాని అసహనంగా అనిపించింది ఆ క్షణంలో. అతని మనసు ఒక రణరంగమయింది. ఒకవైపు ఆశ, మరోవైపు భయం. “ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే?” అనే ఆలోచన అతన్ని వదిలి పెట్టలేదు. ఒంటరితనం అతన్ని మరింత బలహీనున్ని చేసింది. “ఈ సమయంలో నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండునని అనిపించింది విశాల్ కి.

అప్పుడే, ఎవరో తనని పిలిచినట్టు అనిపించడంతో వెనుతిరిగి చూశాడు.
దూరంగా, చిరునవ్వుతో ఒక వ్యక్తి. ఆ ముఖం ఎక్కడో చూసినట్టు అనిపంచింది.

దూరంగా ఉన్న వ్యక్తి విశాల్ దగ్గరగా వస్తూనే “నా పేరు మోహన్,” అని పరిచయం చేసుకున్నాడు. కాసేపట్లోనే తన సరళమైన మాటల్తో, స్నేహ పూరితమైన ప్రవర్తనతో విశాల్ లోని ఆందోళనను తగ్గించాడు. మోహన్ చెప్పిన చిన్న చిన్న కథలు, జీవితంలోని హాస్య సంఘటనలు విశాల్ మనసును కాస్త ఉల్లాసంగా మార్చాయి. ఆ క్షణంలో, అతని భయం, ఆందోళన ఆవిరైపోయినట్లు అనిపించింది.

కానీ, లోలోపల, “ఈ వ్యక్తి ఎవరు? నన్ను ఎందుకు ఇంత కంఫర్ట్ గా భావించేలా చేస్తున్నాడు?” అనే అనుమానం విశాల్ మనసులో మొదలైంది.
మోహన్తో మాట్లాడుతూంటే, కాలం గడిచిపోయింది. అతని సంభాషణల్లో ఒక ప్రశాంతత దాగి ఉంది, కానీ విశాల్ మనసులో ఒక చిన్న అనుమానం అలాగే మిగిలిపోయింది.

“ఈ వ్యక్తి నాకు తెలిసినట్లు ఎందుకు అనిపిస్తోంది?” అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు.
కొంత సమయం తర్వాత, డాక్టర్ బయటకు వచ్చి, “అభినందనలు! మీకు అబ్బాయి పుట్టాడు. సుమతి కూడా క్షేమంగా ఉంది,” అని చెప్పారు. విశాల్ ఆనందంతో పొంగిపోయాడు. అతని మనసులోని భయం, సంఘర్షణ ఒక్కసారిగా కరిగిపోయాయి.
కానీ, ఆ ఆనందంలో కూడా, మోహన్ గురించిన అనుమానం అతన్ని వెంటాడుతూనే ఉంది.

హాస్పిటల్ బిల్ క్లియర్ చేసి తిరిగి వస్తూ, విశాల్ న్యూస్ పేపర్ స్టాండ్ వైపు చూశాడు. అక్కడ, ఒక ప్రకటనలో మోహన్ ఫోటో కనిపించింది. “డాక్టర్ మోహన్ ఆరవ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేస్తోంది,” అని రాసి ఉంది.

విశాల్కు ఒక్కసారిగా గుండె ఆగినట్లయింది. “అంటే… నాతో మాట్లాడిన మోహన్…?”
అతని మనసు అయోమయంతో నిండిపోయింది. ఆసుపత్రి సిబ్బందిని అడిగితే, “డాక్టర్ మోహన్ ఆరు సంవత్సరాల క్రితం పోయారు. ఆయన ఈ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఒకరు,” అని చెప్పారు.

విశాల్కు ఒళ్ళు జలదరించింది. మోహన్తో గడిపిన ప్రతి క్షణం గుర్తొచ్చింది. ఆ సమయంలో అతను అందించిన ధైర్యం, శాంతి—అది నిజమా? లేక తన మానసిక సంఘర్షణలో సృష్టించిన భ్రమా? అతని మనసు ఈ ప్రశ్నలతో పోరాడసాగింది. కానీ, సుమతి, కొడుకును చూసేందుకు గదిలోకి వెళ్ళినప్పుడు, ఆ చిన్నారి ముఖంలో ఒక చిరస్థాయి కాంతిని చూశాడు. అతని హృదయంలో శాంతి నెలకొంది.
“మోహన్… నీవు ఎవరైనా, నీవు నాకు ఇచ్చిన ఈ ధైర్యానికి ధన్యవాదాలు,” అని విశాల్ మనసులో అనుకున్నాడు.

తన కొడుకుకు “మోహన్” అని పేరు పెట్టాడు, ఆ అసాధారణమైన జ్ఞాపకానికి నివాళిగా. ఆ రోజు నుండి, విశాల్ జీవితంలో ఏ కష్టం వచ్చినా, మోహన్తో గడిపిన ఆ క్షణాలు అతనికి ఒక దివ్యమైన శక్తిని ఇస్తూ ముందుకు నడిపించేది..


9) వైరల్ వైరల్.. నవ్వుల్ నవ్వుల్ !

Leave a Reply