Sunday magazine | ఆదివారం సంచిక 05 అక్టోబర్ 2025

  • మనసు…బాగుందా…? – ముఖప‌త్ర క‌థ‌నం
  • చెప్పుకోండి చూద్దాం – ప్రశ్నలు
  • మా మంచి నాన్న (కథ) – మ‌ద్దిరాల శ్రీనివాసులు
  • కదలని కలం.. మూగబోయిన గళం.. జుబీన్ గార్గ్కోట దామోదర్
  • ఫోన్ లేని రోజుల్లో… (క‌థ‌) – గోనుగుంట ముర‌ళీకృష్ణ‌
  • చెప్పుకోండి చూద్దాం – సమాధానాలు

1.మనసు…బాగుందా…?

అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేస్తూ…మన పనులు మనం చేసుకోవడం…చదువు, వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో రాణించడం. అంతే కదా…
మన దేహం కూడా ఒక యంత్రమే. ఎల్లప్పుడూ ఒకే విధంగా పనిచేయదు…అప్పుడప్పుడు ఏదోక రుగ్మత రూపంలో మొరాయిస్తుంది. విశ్రాంతి కోరుకుంటుంది.
చికిత్స అవసరమవుతుంది. వైద్యుల అవసరం ఏర్పడుతుంది. ఒకప్పుడంటే ఫ్యామిలీ డాక్టర్లు ఉండెవారు..ఏ ప్రాబ్లెం ఉన్నా వారే దిక్కు…కానీ, కార్పొరేట్ వైద్యానికి అలవాటు పడిన ఈ కాలంలో కళ్ళ ప్రాబ్లెం వస్తే ఐ స్పెషలిస్టు, గుండెనొప్పికి కార్డియాలజిస్టు, ఎముకల ప్రాబ్లెంస్ కి ఆర్థోపెడిక్, డయాబెటీషియన్లు, డైట్ స్పెషలిస్టులు…ఇలా అన్నిటికీ స్పెషలిస్టులే. గూగుల్ లో వెతికి, వారికి స్టార్ రేటింగ్స్ చూసి మరీ అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్తాం…కన్సల్టేషన్ ఫీజూ…టెస్టులూ…స్కానింగులూ వేలకు వేలే….

బాగానే ఉంది కానీ, మరి, అన్ని అవయవాలూ సక్రమంగా పని చేయడానికీ సహకరించే, అన్ని కదలికలను నియంత్రించే కేంద్ర బిందువైన మనసుకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఏం చేస్తున్నాం?
మనసు బాగోలేదని సరిపెట్టుకుంటున్నాం…సర్దిచెప్పుకుంటున్నాం…ఒకట్రెండురోజులు గడిస్తే అదే బాగవుతుందని భ్రమపడుతున్నాం. మన మనసు కూడా చికిత్స కోరుకుంటోందని మనలో ఎందరు గుర్తిస్తున్నారు? అన్ని స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినట్టే మానసిక వైద్యుల వద్దకు కూడా వెళ్ళడానికి ఎందుకు సందేహిస్తున్నాం? ఎందుకంటే, అలా వెళ్ళడం వల్ల మానసిక రోగి అని అందరూ వేలెత్తి చూపుతారని భయం. సమాజంలో చులకనౌతామని న్యూనతా భావం. లేదా కౌన్సెలింగ్ పేరుతో ఏదో నాలుగు మాటలు చెప్పి ఫీజు తీసుకుంటారని అపోహ…ఇది పెద్ద పొరపాటు…

ఇంకా మనమెక్కడున్నాం? మన మనసేం కోరుకుంటోందో, మనసుకు వైద్యం చేసేవారి విలువేమితో తెలియని స్థితిలో ఉన్నామా?

అసలుమానసిక వైద్య నిపుణులు అంటే ఎవరు? ఏ విధమైన చికిత్సను అందిస్తారు?
1) సైకియాట్రిస్ట్ : వీరు ఎంబీబీఎస్ తర్వువాత ఎం డీ(సైకియాట్రీ) విద్యను అభ్యసించినవారు. మానసిక రుగ్మతలను మందులతో నయం చేస్తారు. శారీరక, జన్యుపరమైన(వంశపారంపర్య) కారణాల వలన సంక్రమించే మానసిక లోపాలను మందులతో నయం చేస్తారు.
2) సైకాలజిస్ట్ లు : వీరు మానసిక రుగ్మతలను నివారించేందుకు అవసరమైన పర్సనాలిటీ ఇవాల్యుయేషన్ వంటి థెరపీలను అందిస్తారు. సైకాలజిస్టులు బీ.యే. బీ.ఎస్. (సైకాలజీ), ఎం.ఏ.(సైకాలజీ) ఎం.ఫిల్. (సైకాలజీ) ఎం.ఫిల్(సైకాలజీ) పీహెచ్ డీ అభ్యసిస్తారు.
వీళ్ళు ప్రధానంగా సలహాలూ, సూచనలతో మానసిక రుగ్మతలను నయం చేస్తారు. ఈ వైద్య విధానన్ని కౌన్సెలింగ్ అంటారు. ఈ రెండు వైద్యవిధానాలనూ మనోవిజ్ఞాన శాస్త్రము, మనోతత్వ శాస్త్రము అంటారు.
ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పితే, లేదా తమకు తాము సాంత్వన కలిగించుకుంటే మానసిక రుగ్మత నయమవుతుందనుకోవడం ఎలా ఉంటుందంటే, ఏ డాక్టరు దగ్గరికీ వెళ్ళకుండా, మెడికల్ షాపులో దొరికే రెండు బిళ్ళలతో మన వ్యాధి నయమవుతుందనుకోవడం లాగా ఉంటుంది.
అసలు మానసిక రుగ్మత అంటే ఏమిటి..? అదెలా ఉంటుంది?
ఒక వైఫల్యం…ఒక ఎడబాటు..ఒక నష్టం…వాటిలోంచి పుట్టుకొచ్చే నైరాశ్యం..కాలం మాంపని గాయం కాస్తా మానసిక కృంగుబాటు తీవ్రమవుతుంది…జీవితంపై విరక్తిని పెంచుతుంది…అది మన శరీరావయవాలన్నిటిపైనా ప్రభావం చూపుతుంది…అన్నిటి మీదా అనాసక్తి కలిగిస్తుంది..
అప్పుడు కావాలి సరైన సాంత్వన…అది మన జీవితానికి పునరుత్తేజం కలిగించే చికిత్స్…అది అందించే నిపుణులే మానసిక వైద్యులు. అవసరమైన సమయంలో మానసిక వైద్యం పొందక కృంగుబాటుతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బలవన్మరణాలు సంభవిస్తున్నాయి. బంధాలు దూరమవుతున్నాయి..అందుకే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ఈ పోటీ ప్రపంచంలో అనేక మానసిక ఒత్తిడులు..వీటి పర్యవసానంగా తాత్కాలిక ఉపశమనం కోసం ఆశ్రయించే మత్తి పదార్థాల వ్యసనాలు, వాటి దుష్ప్రభావాలు..లేదా భాగస్వామితో మనస్ఫర్థలు…ప్రేమలు-వైఫల్యాలు, పెటాకులయ్యే పెళ్ళిళ్ళు…దూరమైనకన్నప్రేమలు..సమాజంలో సమస్యలు ఎన్నని చెప్పగలం?
మనకైనా, మనవారికైనా మానసిక అనారోగ్యం అనిపించినప్పుడు సత్వరమే చికిత్స పొందడానికి సంకోచించకుండా వైద్యులను సంప్రదిద్దాం. మానసిక ఆరోగ్యమే సామాజిక సంక్షేమం అని గుర్తిద్దాం.


(అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా)

మానసిక నిపుణులు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, గాయత్రి ఉప్పలపాటి

మానసిక ఆరోగ్యంపై అందిస్తున్న శీర్షిక వచ్చేవారం నుండి….


2.చెప్పుకోండి చూద్దాం

1.ఆర్తి అగర్వాల్, సౌందర్య, ఉదయ్ కిరణ్
ఈ నటుల మధ్య పోలిక ఏమిటో తెలుసా?

2.ఈ నటి ఎవరో గుర్తు పట్టారా.. ?


3.మా మంచి నాన్న (కథ)

రామనాథం కిరాణా షాపు అంటే ఊర్లో మంచి పేరు. రామానికి ఆరేళ్ళ వయసున్నపుడు తండ్రి అనారోగ్యంతో కాలం చేశాడు. తల్లి కష్టం చేసి పెంచింది. 10వరకు ప్రభుత్వ బడిలో చదివాడు. ఇక తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలని అనుకున్నాడు. బడి మానేశాడు. కిరాణా షాపులో గుమాస్తాగా చేరాడు. తండ్రి లాగే నీతి, నిజాయితీ, నమ్మకం గల వ్యక్తిగా పేరు సంపాదించాడు. నాలుగు రాళ్ళను వెనకేయసాగాడు. కొనేళ్ళ తరువాత దాచిన సొమ్ముతో ఓ చిన్న దుకాణం తెరిచాడు. తనకున్న మంచితనంతో షాపు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. ఆదాయాలు పెరుగుతున్నా మంచితనం మాసిపోలేదు. శ్రీలక్ష్మితో వివాహమైంది. భర్తకు తగ్గ ఇల్లాలు. కొన్నాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. పేరు గౌతమ్. ఇక పిల్లలు వద్దనుకున్నారు. కొడుకును 7వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివించాడు. ఇంగ్లీషు కోసమని 8వ తరగతి నుండి కాన్వెంట్లో చేర్పించాలనుకున్నాడు. ‘విశ్వం పబ్లిక్ స్కూల్’ కు ఆ ఊర్లో మంచి పేరుంది. పైగా టీచర్లు, పేరెంట్స్ చాలా మంది తన వద్ద ఖాతాదారులే. అందుకని ఆ బడిలో చేర్పించాడు. మంచివాడు కనుక ఆ ఏడు పేరెంట్స్ అంతా కలిసి, రామనాథాన్నే ఆ పాఠశాల కమిటీ చైర్మన్ గా ఎంపిక చేసుకున్నారు.

అనుకోకుండా మార్చి నెలలో కరోన వచ్చింది. బడి, షాపులు అన్నీ మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నాళ్ళకు షాపులను రోజుకు రెండు గంటలు తెరిచేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, విద్యార్థుల శ్రేయస్సు కోసం బడులను తెరవనీయలేదు. దాని వలన ఆ స్కూల్ టీచర్స్కి జీతాలు లేవు. ఒక నెల దాటింది. కానీ, కరోన తగ్గలేదు. బడులు తెరవలేదు. ప్రయివేటు బడుల టీచర్స్ బాధలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిచోట్ల స్టూడెంట్స్ తమ టీచర్కు చందాలు ఇచ్చారని టీవీలో చూశాడు గౌతమ్. నాన్నతో విషయం చెప్పాడు. “మనం కూడా మా టీచర్స్కు సాయం చేద్దాం నాన్నా. నేను మా క్లాస్మేట్స్తో కలిసి పేరెంట్స్ వద్దకు వెళ్ళి చందాలు కూడా వసూలు చేస్తామని” చెప్పాడు.

” బంగారు కన్నా! మీ గురువులపై నీకున్న గౌరవం, అభిమానానికి అభినందిస్తున్నాను. కాకపోతే మీరంతా కలిసి వసూలు చేస్తే ఎంత రావచ్చు. తలకో వందో, రెండొందలో ఇస్తారనుకుందాం. మరికొందరు ఏ 500 దాకానో ఇవ్వవచ్చు. కొందరు అసలు ఇవ్వలేకపోవచ్చు. ఇలా ఓ నలభై వేలో, యాభై వేలో వస్తాయి. మీ టీచర్స్ 10మంది. ఒక్కో టీచర్కు నాలుగైదు వేలు రావచ్చు. మహా అయితే, అది వాళ్ళకు ఓ నెల ఖర్చులకు సరిపోతాయి. తరువాత పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇవ్వరు కదా. కాబట్టి ఇవన్నీ పనికి వచ్చేవి కావులే నాన్నా! నువు చిన్న పిల్లవాడివి. నీకు ఏమీ తెలియదు ఊరుకో” అన్నాడు.

ఆ మాటలతో గౌతమ్కు బాధేసింది. కానీ, చేసేది లేక ఊరుకున్నాడు. ఇదే విషయాన్ని కొందరు పేరెంట్స్ కూడా నాన్న వద్దకు వచ్చి చెబుతుండగా గౌతమ్ విన్నాడు. అపుడు నాన్న ఒప్పుకుంటాడన్న ఆశతో ఉత్సాహం కలిగేది. కానీ, నాన్న వాళ్ళతో, “చూడండీ! ఆకలితో ఉండే వాడికి అన్నం పెట్టడం మంచిదే. కానీ, ఎన్నాళ్ళనీ? చెప్పండి అనేవాడు. వాళ్ళేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు. దాంతో వెంటనే గౌతమ్కు నిరాశ కలిగేది. నాన్నపై కోపం వచ్చేది. లాక్ డౌన్ కొనసాగింది. రెండు నెలలు దాటింది. పరిస్థితి ఇప్పట్లో చక్కబడేలా లేదు. రామనాథం మనసు కలతగా ఉంటున్నది. ఆలోచించసాగాడు. ఓరోజు మెదడులో ఓ ఆలోచన తళుక్కుమంది.

మరుసటి రోజు రామనాథం కరెస్పాండెంట్ విశ్వాన్ని కలిశారు. ఆ పాఠశాలలో టీచర్లను, పనిచేసిన వారిని ఆదుకుందాం అన్నాడు. ఒక ఉపాయం చెప్పారు. ఛైర్మన్ ఆలోచన అద్భుతంగా అనిపించింది విశ్వానికి. ఆదివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. దానికన్నా ముందే టీచర్లను పనివారిని పిలిపించి విషయం వారి చెవిలో వేశారు. ఏమనుకుంటారో? అని సందేహించారు. కానీ, వారి కళ్ళు తళుక్కుమన్నాయి. ఆనందంతో ఆమోదం తెలిపారు. తరువాతి రోజు విశ్వం గారు పోలీస్ స్టేషన్కు వెళ్లి సమావేశంకు అనుమతి పొందారు.

ఆదివారం కఠిన నిబంధనలతో సమావేశం ఏర్పాట్లు చేశారు విశ్వం. వచ్చిన వారందరినీ పరీక్ష చేశారు. సమావేశంలో రామనాథం మాట్లాడుతూ,” ఈ కరోన పరిస్థితి మీకు తెలుసు. దీనివలన మన బడి టీచర్లు పడే బాధలను మీలో కొందరు నాకు చెప్పారు. సాయం చేద్దామన్నారు. అందుకు మీకు అభినందనలు. నేను చదువుకునే రోజుల్లో మా సార్ ఒకాయన ఒక సామెత చెప్పేవాడు. ‘ఆకలి వేసిన వాడికి చేపలు ఇవ్వకండి. చేపలు పట్టడం నేర్పండి’ అని. పాపం మన టీచర్లంతా ఇప్పుడు ఆకలిగా ఉన్నారు. కాబట్టి, వారికి చేపలు ఇవ్వకూడదు. చేపలు పట్టడం నేర్పించాలి.” అనగానే, అక్కడి వారంతా అయోమయంలో పడిపోయారు. కానీ, విషయం ముందే తెలిసిన టీచర్ల ముఖంలో చిరునవ్వు వెలుగుతున్నది. ఇంతలో
.”ఆ చేపల కథేంటో? మన కరస్పాండెంట్ గారు చెబుతారు” అంటూ ముగించారు.

కరస్పాండెంట్ లేచి,” మన ఛ్కెర్మన్ గారు మంచి మనసున్నవాడు. పదిమంది మేలు కోరేవాడు. అది మీకు తెలుసు. నాలుగు రోజుల క్రితం నా వద్దకు వచ్చారు. అద్భుతమైన ఉపాయం చెప్పారు. అదేమిటంటే, బడిలోనే ఈ తరగతి గదులలో కిరాణా, ఫ్యాన్సీ, కూరగాయల దుకాణాలను పెట్టడం. వాటి నిర్వహణ మన టీచర్లు చూడడం. వారికి బడి సెక్యూరిటీ గార్డు, న్కెట్ వాచ్మెన్, ప్యూన్, వార్డెన్, ఆయమ్మలు, పనివాళ్ళు సహాయంగా ఉండడం. వాటికి కావలసిన పెట్టుబడిని రామనాథం గారే చూసుకుంటానని చెప్పారు. ఈ విషయం అదుగో.. మన టీచర్లకు కూడా చెప్పాము. వారు కూడా చాలా సంతోషించారు. అయితే, ఇందుకు మీరు కూడా సహాయం చేయాలి. కానీ, చందాల రూపంలో కాదు. సరుకులు కొనడం ద్వారా. అదీ అప్పు లేకుండా….హహహ.. ఈ కరోన పరిస్థితి ఉన్నంత వరకూ మీమీ ఇళ్ళకు కావలసిన సరుకులు ఇక్కడే కొనాలి. అలాగని బలవంతంగా కాదు. నాణ్యత చూసి నచ్చితేనే కొనండి. మీ చుట్టుప్రక్కల వాళ్ళకు తెలియజేయండి. వచ్చే ఆదాయాన్ని మన ఉపాధ్యాయులతో పాటు, పాఠశాలలో పనిచేసే వారందరికీ పంచుదాము. “విశ్వం సూపర్ బజార్, సదా మీ సేవలో” అంటూ చిరునవ్వుతో ముగించారు. పేరెంట్స్ కూడా ఈ ఆలోచన బాగా నచ్చడంతో చప్పట్లు మారు మ్రోగించారు.

ఆలోచన అమలైంది. ఆ ఊరితో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా సూపర్ బజార్ గురించి చాటింపు వేయించారు విశ్వం గారు. సరుకులను పట్నం నుండి స్కూల్ బస్లలో తెప్పించసాగారు. ఉపాధ్యాయులు శ్రద్ధతో, ఆసక్తితో షాపులు నడపసాగారు. నాణ్యత బాగుండడంతో పేరెంట్సే కాదు. ఇతరులు కూడా చాలామంది వస్తున్నారు. అంతే కాదు, అక్కడ గ్రౌండ్ విశాంగా ఉండడంతో సామాజిక దూరం కూడా పాటిస్తున్నారు. మాస్క్లు తప్పనిసరి చేశారు. వచ్చే ఆదాయంలో కొంత స్కూలు బస్సులు, రామనాథం పెట్టుబడులకు ఇస్తున్నారు. ఆ పాఠశాల ఆధారంతో బ్రతికే కుటుంబాలకు ఇప్పుడు కూడా ఆ పాఠశాలే ఆసరా అయింది.

ఒకరోజు కూరగాయలకు రామనాథం గౌతమ్ను వెంట బెట్టుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించిన గౌతమ్కు ఆశ్చర్యమేసింది. నోట మాట రాలేదు. నాన్న ముఖం వైపు చూశారు. నవ్వుతున్నాడు. కానీ, గౌతము ఏమీ అర్ధం కావడంలేదు. జరిగినదంతా వివరించాడు రామనాథం. అవధులు దాటిన ఆనందంతో గౌతమ్ ‘మా మంచి నాన్న’ అంటూ ఎగిరి నాన్న మెడను కరుచుకున్నాడు. రెండు బుగ్గలనూ ముద్దులతో ముంచెత్తాడు.


4.కదలని కలం.. మూగబోయిన గళం.. జుబీన్ గార్గ్

జుబీన్ గార్గ్ గళంలో అంతు పట్టని మార్మికత. ఎవరికీ అందని ప్రత్యేకత. ఆ స్వరం తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన మెలోడీ అతని పాటలో ప్రత్యేక లక్షణం. సంగీతం శిశువుల్ని, పశువులనే కాదు, పాములను కూడా పరవశింపజేస్తుందన్నట్లు ఆయన పాట కుర్రకారును ఉర్రూతలూగించింది. జుబీన్ గార్గ్ స్వర మాధుర్యం అస్సాంలో ఉద్భవించి మానవతా, ఉద్యమ స్ఫూర్తిని ఇముడ్చుకుని ఒక ఝరిలా సరిహద్దులను దాటి ప్రవహించింది. అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా బాలీవుడ్ సంగీత ప్రియులను కూడా విషాదంలో ముంచెత్తింది. జుబీన్ గార్గ్ అంత్యక్రియలు మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, మరియు రాణి ఎలిజబెత్ తరహాలో ప్రపంచంలో 4వ అతిపెద్ద అంత్యక్రియగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో నిలిచింది.

జుబీన్ కేవలం గాయకుడిగానే కాకుండా స్వరకర్త, పాటల రచయిత, వాయిద్యకారుడు, నటుడు, దర్శకుడు, చిత్ర నిర్మాత, కవి గా తన బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. శ్రావ్యమైన ఆయన స్వరంలో అపురూపమైన భావోద్వేగాలు పలికి శ్రోతలను మైమరిపించాయి. అస్సాం సంగీత, సాంప్రదాయాలు, జానపద గీతాలు, స్థానిక కథాకథనాలు అతని మీద లోతైన ప్రభావాన్ని చూపాయి. ఆ అనుభవాలు అతని సంగీత కళా నైపుణ్యంతో బలమైన పునాదిగా మారాయి. అస్సామీ ప్రజల వ్యక్తిత్వం మరియు ప్రత్యేక గుర్తింపు అతని సంగీతంలో ప్రతిబింబించాయి. జుబీన్ గానం ప్రజల గుండెచప్పుడైంది. అందుకే అతను మిలియన్ల మంది అభిమానుల హృదయాలను గెల్చుకోగలిగాడు.

1972లో మేఘాలయలోని తురాలో జన్మించిన జుబీన్ గార్గ్ సుమారు 40 భాషల్లో 38,000 పైగా పాటలు పాడారు. అంతేకాకుండా ఆయన ప్రజలతో సాన్నిహితాన్ని పెంచుకుని, సామాజిక సమస్యల కోసం పోరాటం చేసి, వారి హృదయాలలో చెరగని ముద్ర వేశారు. భూపేన్ హజారికా వంటి దిగ్గజాల పాటలకు అలవాటు పడిన అత్యధిక ప్రేక్షకులకు, మొదట అతని గురించి ఎక్కువగా తెలిసేది కాదు. కానీ, క్రమంగా అతని సంగీతం అస్సామీస్ సంస్కృతిలో కొత్త ధోరణిని సృష్టించింది. అతని పాటలు భావోద్వేగం, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, వైవిధ్యభరితమైన పాటలతో విమర్శకులను కూడా ఆకట్టుకోగలిగాయి. అతని విలక్షణమైన స్వరం మరియు ప్రత్యేకమైన శైలి, సంగీత అభిమానులను ఉర్రూతలూగించింది. అతని పాటలు అస్సాంలో అత్యల్ప సమయంలోనే ప్రాచుర్యం పొంది, సంగీత ప్రయాణానికి నాంది పలికింది.

జుబీన్ సంగీత ప్రయాణం ఆయన మూడేళ్ల వయసులోనే ప్రారంభమైంది. తండ్రి కవి మరియు గీత రచయిత కావడం వల్ల, అతనికి పాడటం అలవోకగా అబ్బింది. సంగీతం ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో ఒక పార్శ్వం మాత్రమే. తన మొదటి ఆల్బమ్ “అనామిక” 19 సంవత్సరాల వయస్సులో విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నారు. తన మొట్టమొదటి పాట 1997 లో “దిల్ మేరా చురయా ఏక్ హసీనా” తో మొదలుకొని 1999లో గ్యాంగ్ స్టర్ చిత్రంలో తన హిట్ సాంగ్ “యా అలీ” తో బాలీవుడ్ లో జుబీన్ పేరు మారుమోగి, అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. హిందీ, అస్సామీ మరియు బెంగాలీ వంటి భాషల్లో పాడిన జుబీన్ విభిన్న భాషల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగలిగాడు.

ఆయన యొక్క సృజనాత్మక కౌశలాలు కేవలం సంగీతం తోనే పరిమితం కాలేదు. ధోల్, డోటారా, మాండొలిన్, కీబోర్డ్, తబలా, హార్మోనియం, గిటార్, డ్రమ్స్, హార్మోనికా మరియు వివిధ పెర్కషన్ వాయిద్యాలతో సహా 12 కి పైగా సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన తన ప్రతిభను సినిమాల్లోనూ ప్రదర్శించారు. అస్సామీస్ చిత్రాలు ‘బహా’ (2009) మరియు ‘కన్యాడన్’ (2013) వంటి సినిమాల్లో నటించడం ద్వారా, దేశం ఆయనను బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారుడుగా గుర్తించింది. అస్సామీ సంప్రదాయాలు, భాష మరియు జానపద వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, అస్సామీ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడంలో, భాష సంస్కృతిని పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో జుబీన్ గార్గ్ ఎనలేని కృషి చేశారు. అస్సాంలో విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా నిరుపేద పిల్లలకు విద్య, వైద్యం అందించేందుకు వివిధ దాతృత్వ కార్యక్రమాలు చేపడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు.

ఆస్సాంలోని అనేక యువ కళాకారులకు సంగీత పరిశ్రమలో రాణించడానికి విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు. అస్సామీ సంగీతం వృద్ధి చెందేలా నిర్విరామ కృషి చేశారు. అంతేకాకుండా కలగురు ఆర్టిస్ట్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద ప్రజలకు నిధులు మరియు భౌతిక సహాయాన్ని అందించారు. వరదల కారణంగా అస్సాం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినప్పుడు తన ఫౌండేషన్ ద్వారా బట్టలు, మందులు మరియు విరాళాలు సేకరించి నిరుపేదల పాలిట దేవుడైనాడు. కోవిడ్ సమయంలో ఆసుపత్రులు నిండి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో జుబీన్ తన రెండు అంతస్తుల గౌహతి ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చడానికి ముందుకొచ్చాడు. సాధారణంగా కళాకారులు “పాటలకు మాత్రమే పరిమితం. కానీ జుబీన్ పాటలకు పరిమితం కాకుండా ప్రజల కోసం పోరాడాడు. అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రిక్రూట్మెంట్ స్క్యామ్ తర్వాత, జుబీన్ అవినీతి గురించి బహిరంగం చేయడానికి ‘కంచన్ జంగ్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా రాజకీయ విమర్శలకు కారణమైనా, అతను వాటికి జంకకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అస్సాంలో పౌరసత్వ (సవరణ) చట్టం నిరసనలు తలెత్తినప్పుడు జుబీన్ క్రియాశీలక పాత్ర పోషించి, రాజకీయేతర ఉద్యమ ధీరుడిగా ఎదిగాడు.

భారతదేశ చరిత్రలో “అన్నాదురై” అంత్యక్రియల ఊరేగింపుకు కనీవినీ ఎరుగని రీతిలో 15 మిలియన్ల మంది హాజరయ్యారు. ఇది దేశంలోనే మొదటి అతిపెద్ద అంత్యక్రియ ఊరేగింపు. గౌహతిలో జుబీన్ గార్గ్ అంతిమ వీడ్కోలు ప్రపంచంలో 4వ అతిపెద్ద అంత్యక్రియగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచింది.


-కోట దామోదర్


5.ఫోన్ లేని రోజుల్లో…

“పోస్ట్”

కేక వినబడగానే ఇంట్లో అందరిలో ఒక అలజడి, కుతూహలం! ఎక్కడి నుంచో పోస్ట్? మొన్న చిన్నక్కను చూసి వెళ్ళిన పెళ్లికొడుకు తరపువాళ్ళు అమ్మాయి నచ్చిందని లెటర్ వేశారేమో అని నాన్న ఆలోచన! డెలివరీ కోసం పుట్టింటికి వచ్చిన పెద్దక్కకు భర్త దగ్గర నుంచీ వచ్చిందేమో అని ఎదురుచూపు!

పదిరోజుల క్రితం వెళ్ళిన ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినట్లుగా సెలక్షన్ ఆర్డర్ వచ్చిందేమో అని అన్నయ్య ఆలోచన! అమ్మమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అని అమ్మ ఆందోళన! ఇలా రకరకాలుగా అనుకునే వారు. పదేళ్ళ వయసున్న నేను వాకిట్లోకి పరుగెత్తుకుని వెళ్లి కవర్ అందుకుని తిరిగి అంతే వేగంతో వచ్చి కవర్ నాన్నకి అందించేవాడిని. నాన్న స్నేహితుడి కుమార్తె పెళ్లి శుభలేఖ అది!

ఇలా ఒకప్పుడు పోస్ట్ మేన్ ఇంటిల్లిపాదికీ ఆత్మీయుడు అయిపోయేవాడు. ఉదయం పదకొండు గంటలు అయితే చాలు ఏదైనా లెటర్ వస్తుందేమో అని అందరూ పోస్ట్ కోసం ఎదురు చూసేవారు. అందుకున్న లెటర్స్ అన్నీ ఒక తీగకు గుచ్చి చూరుకి వేలాడదీసేవారు.

ఏదైనా సెలవురోజు వచ్చినప్పుడు నాన్న ఆ ఉత్తరాలు అన్నీ తీసి చూసి, ఆ జ్ఞాపకాలలో విహరిస్తూ ఉండేవారు. ఏ స్నేహితుడికో ఉత్తరం రాయటానికి కవర్ తీసుకురమ్మని నన్ను పోస్టాఫీసుకి పంపేవారు. ఆరోజుల్లో కరణం గారి ఇల్లే పోస్టాఫీసు. కరణంగారు ఊరి పెద్దమనిషి అవటం వల్ల ఏదో ఒక పనిమీద ఎక్కువగా బయటే తిరుగుతూ ఉండేవారు. కరణంగారి భార్యే కవర్లు, కార్డులు అమ్ముతూ ఉండేది. నేను వెళ్లి “మా నాన్న ఇంగ్లాండ్ కవర్ తీసుకురమ్మన్నారు” అని అడిగేవాడిని.

కరణంగారి అమ్మాయి ఉయ్యాలబల్ల మీద కుర్చుని సన్నజాజి పూలు మాల కట్టుకుంటూ “ఇంగ్లాండ్ కవర్ కావాలా? అమెరికా కవర్ వద్దా?” అని ఫక్కున నవ్వేది. ఆ అమ్మాయి పదవ తరగతి చదువుతూ ఉంది. “ఇంగ్లాండ్ కవర్ కాదు, ఇన్ లాండ్ కవర్ అనాలి” అని చెప్పేది.

“మా నాన్న ఇంగ్లాండ్ కవర్ అనే చెప్పారు” అనేవాడిని చిరుకోపంగా, మా నాన్ననే తప్పు పడతావా అన్నట్లుగా! “వీళ్ళ నాన్న మాటతప్ప దేవుడు వచ్చిచెప్పినా నమ్మడు ఈ అబ్బాయి” అంటూ మళ్ళీ నవ్వేది..

పట్టుచీర గూడకట్టులా కట్టుకుని తలస్నానం చేసిన జుట్టు టవల్ తో సహా ముడివేసుకుని, నుదుటన పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని, చేతిలో గరిటతో లలితా సహస్రనామాలు చదువుకుంటూ లోపలనుంచీ వచ్చిన కరణంగారి భార్య చదవటం ఆపకుండానే కుడివైపు కిటికీ దగ్గరకు రమ్మని సైగచేసేది.

కిటికీలో నుంచీ డబ్బు ఇస్తే కవర్ కూడా కిటికీలోనుంచీ అందించి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయేది. అప్పట్లో ఇన్ లాండ్ కవర్ ఖరీదు పావలా. కార్డ్ అయితే పదిపైసలు. ఎన్వలప్ అయితే అర్ధరూపాయి. ఎన్వలప్ ఖరీదు అయినది ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడేవారు.

ఎక్కువగా కార్డులు, లేదా ఇన్ లాండ్ కవర్లు వాడేవారు. ఉత్తరం మొదలు పెట్టబోయే ముందు పై భాగాన “శ్రీరామ” అని రాసిన తర్వాత, మొదలు పెట్టేవారు. ఉదయంపూటే వంట ముగించి పది గంటల కల్లా భోజనాలు చేసేవారు. ఇప్పటిలా టిఫెన్లు తినే అలవాటు ఊరిలో ఎవరికీ లేదు. ఏదైనా పెళ్లివంటలు లాంటివి చేసేటప్పుడు భోజనాలు లేటు అవుతాయని, అంతసేపు పిల్లలు ఆకలికి ఉండలేరు అని ఈలోపు తొందరగా అయిపోయే ఏ ఉప్మానో చేసిపెట్టేవారు. అదే రానురానూ రకరకాల టిఫెన్లు చేసుకుని తినటం, భోజనం ఏ ఒంటిగంటకో తినటం అలవాటుగా అయింది.

నేను పదవ తరగతి పరీక్షలు రాసాను. పరీక్షలు అవగానే కొండంత సంతోషం వేసేది. ఇక దాదాపు రెండునెలల దాకా బడికి వెళ్లక్కరలేదు. అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళేవాడిని. నన్ను అమ్మమ్మ, మామయ్యలు, పిన్ని వాళ్ళు ఎంతో ప్రేమగా చూసేవారు. మామయ్య కొడుకులతో, పిన్ని వాళ్ళ పిల్లలతో ఆడుకునేవాడిని. అందరం ఊరిబయట మర్రిచెట్టు కింద ఆడుకునే వాళ్ళం. ఊడలతో ఉయ్యాలలూగే వాళ్ళం. చెట్టువెనక దాగుడుమూతలు ఆడుకునే వాళ్ళం. చెట్టుకింద గల కాలవలో ఈతలు కొట్టేవాళ్ళం. తాటిబుర్రలతో చక్రాల బండిచేసి ఆడేవాళ్ళం. ఆ చెట్టుకిందే ఆడపిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవారు. మగపిల్లలు భజంత్రీలు అని డబ్బాలు మ్రోగించేవారు. ఉత్తిత్తి భోజనాలు చేసి, చేతులు కడుక్కున్నట్లు అభినయించేవాళ్ళం.

ఆరోజుల్లో వార్తాపత్రిక ఏ ఊరిలో నైనా రెండుచోట్ల మాత్రమే దొరికేది. పోస్టాఫీస్ లో, కరణంగారి ఇంట్లో! మా ఊరిలో పోస్టాఫీస్, కరణంగారిల్లు రెండూ ఒకటే కాబట్టి ఊరు మొత్తానికి ఒకే ఒక పత్రిక వచ్చేది. పదవ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించగానే సాయంత్రంపూట “ఈవినింగ్ ఎడిషన్” అని ప్రత్యేకంగా వచ్చేది. పరీక్షలు రాసిన పిల్లలందరం పోలో మంటూ కరణం గారింటికి పరుగు తీసేవాళ్ళం. “అందరూ క్యూలో నిలబడండి, తొందరపెడితే కుదరదు” అని కరణంగారి అమ్మాయి ఒక్కొక్కరి దగ్గర నంబర్లు తీసుకుని, చూసి పాసయ్యిందీ లేనిదీ చెప్పేది. ఫోన్ లు, సినిమాలు వంటి కాలక్షేపాలు ఏమీ లేవు కాబట్టి, ఆడుతూ పాడుతూ చదివినా దాదాపు అందరూ పాసయ్యేవారు. ఆ మర్నాడు రెగ్యులర్ పేపర్ లో మళ్ళీ ఫలితాలు వేసేవారు. మా అన్నయ్య అయిదు కిలోమీటర్లు నడిచి టౌన్ కి వెళ్లి నా కోసం పేపర్ కొని తెచ్చేవాడు.

పల్లెటూర్లలో సినిమాలు ఉండవు, షికార్లు ఉండవు. మగవాళ్ళు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్ళకీ వెళ్ళిన తర్వాత మద్యాహ్నం పూట ఇరుగుపొరుగు ఆడవాళ్ళు అందరూ ఏ ఇంటిఅరుగు మీదో, ఏ చెట్టుకిందో చేరి కబుర్లు చెప్పుకునేవారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో కూడా అందరూ స్నేహంగా మాట్లాడుకుంటూ ఆనందంగా జీవించేవారు. పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవటం, పెళ్ళిళ్ళు వంటి వేడుకల్లో ఫోటో గ్రాఫర్ ని పిలిపించి ఫోటోలు తీయించుకునేవారు. ఆ ఫోటోలు ఆల్బంలో పెట్టుకుని, ఎన్నో సంవత్సరాల పాటు దాచుకుని, చూస్తూ ఆనందించేవారు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాన్నగారు రేడియో కొన్నారు. అప్పట్లో రేడియో ఉంటే ధనవంతుల కిందే లెక్క! జనాభాలెక్కలు రాసుకునేవారు వచ్చినప్పుడు “మీకు రేడియో ఉందా! సైకిల్ ఉందా!” అని అడిగి వారి ఆర్ధికస్థాయి అంచనా వేసేవారు.

రేడియోలో కార్యక్రమాలు బట్టి టైం ఎంత అయిందో సులభంగా చెప్పెసేవారు. ఉదయం సంస్కృతంలో వార్తలు వస్తుంటే ఏడుగంటలు అయినట్లు లెక్క!. జనరంజని-శ్రోతలు కోరిన పాటలు ఉదయం ఎనిమిదిన్నర నుంచీ పదింటి వరకూ వచ్చేవి. మద్యాహ్నం పన్నెండున్నరకు కార్మికుల కార్యక్రమం, సాయంత్రం అయిదింటికి యువవాణి, ఏడింటికి పొలం పనులు కార్యక్రమం, రాత్రి తొమ్మిదిన్నరకు మన్ చాహే గీత్ కార్యక్రమంలో హిందీ పాటలు వచ్చేవి. పక్కింటామె పని చేసుకుంటూనే ‘రత్తమ్మగారూ! రేడియో సౌండ్ కొంచెం పెంచండి’ అని మా అమ్మను అడిగి వింటూ పనులు ముగించుకునేది.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వచ్చే ఉషశ్రీ మహాభారత ప్రవచనం వినటం ఓ మధురానుభూతి! శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం ప్రత్యక్షప్రసారం వినిపించేవారు. మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పొలాలు చదును చేసి, విశాలమైన పందిళ్ళు వేసేవారు. పందిళ్ళు మామిడాకుల తోరణాలతో, పూల దండలతో అలంకరించేవారు. సీతారాముల విగ్రహాలు పెట్టి కళ్యాణం జరిపేవారు. ప్రత్యక్ష ప్రసారం, భక్తిగీతాలు మైకులో ఊరంతా వినిపించేది. సీతారాముల కళ్యాణం అయిన తర్వాత అందరికీ పానకం, వడపప్పు ప్రసాదంగా ఇచ్చేవారు.సీతారాముల కళ్యాణం తర్వాత పదహారు రోజుల పండగ దాకా పూజలు, యజ్ఞాలు, యాగాలు జరిగేవి, ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఆ ఉత్సవం కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసేవాళ్ళం. విరాళాలుగా ఇవ్వటానికి డబ్బు లేకపోయినా కొంతమంది ధాన్యం, కందిపప్పు, మినప్పప్పు వంటివి బస్తాల కొద్దీ ఇచ్చేవారు. కొంతమంది తట్టలతో కూరగాయలు, ఇంకొంతమంది లీటర్ల కొద్దీ పాలు …. ఇలా ఎవరికీ తోచింది వారు ఇచ్చేవారు. పంటలు పండి, పంట అమ్మిన తర్వాతే డబ్బు చేతికి వచ్చేది. అందువల్ల వస్తురూపేణా తప్ప నోట్లరూపంలో ఎవరి దగ్గరా డబ్బు ఉండేది కాదు.

సినిమాకి వెళ్ళటం అంటే అదొక పెద్దసంబరం లాంటిది. మా అక్క, అన్నయ్య, నేను, ఇరుగుపొరుగు అమ్మాయిలు, అబ్బాయిలు అందరం నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి సినిమా చూసేవాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టిక్కెట్టే ఇచ్చేవారు. అడిగినన్ని ఇస్తే బ్లాక్ లో అమ్ముకుంటారేమో అని ఇచ్చేవాళ్ళు కాదు. నేల టికెట్టు ముప్పావలా, బెంచీ టిక్కెట్టు రూపాయి, కుర్చీ రూపాయిన్నర ఇలా ఉండేవి రేట్లు. గవర్నమెంట్ మారినప్పుడు టిక్కెట్లు రేట్లు పెంచేసేవారు. “అమ్మో! కుర్చీ టిక్కెట్టు రెండు రూపాయలా! అంత ఖరీదు పెట్టి ఇంకేం చూస్తారు? ఇక సినిమాలు ఆడవు” అనేది మా అమ్మ. “నీ మొహం! రెండు రూపాయలేమిటి? పది రూపాయలు పెంచినా జనం చూస్తూనే ఉంటారు” అనేవారు నాన్న. అన్నట్లుగానే ఈ రోజుల్లో ఏ షాపింగ్ మాల్ కో వెళ్ళినప్పుడు టిక్కెట్ మూడువందల రూపాయలు అయినా జనం చూస్తూనే ఉన్నారు. ఇంట్లో నలుగురు సినిమా చూడాలంటే కనీసం రెండువేలు పైన అవుతాయి. ఇప్పుడు ఆ విషయాలు గుర్తు చేసుకుంటే అప్పటి పెద్దలు దీర్ఘదర్శుల లాగా అలా ఆలోచించేవారు కాబోలు! అనిపిస్తుంది.

సినిమా చూసి వచ్చిన తర్వాత రోజుల తరబడి ఆ సినిమా గురించి చెప్పుకునేవారు. నెలకు ఒక్క సినిమా చూడటానికి మాత్రమే అనుమతించేవారు తల్లిదండ్రులు. సినిమా పిచ్చిలో పడితే చదువు చెట్టెక్కుతుంది అని అనేవారు. నా చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత టి.వి. లలో తెలుగు కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ప్రతి శనివారం సాయంత్రం ఒక సినిమా ప్రసారం చేసేవారు. ఆ టైంకి ఇల్లు ఊడ్చి, చాపలు వేసి రెడీగా కూర్చునేవారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడటానికి వచ్చేవారు. తర్వాత కొంత కాలానికి వి.సి.పి.(వీడియో క్యాసెట్ ప్లేయర్) లు వచ్చాయి. మనకి ఇష్టమైన సినిమాలు క్యాసెట్ లు అమ్మేవారు. అద్దెకు తెచ్చుకుని వేసుకుని చూసుకునే వారు.

ఇంటింటికి ల్యాండ్ ఫోన్ లు వచ్చాయి. ఫోన్ కలిగి ఉండటం స్టేటస్ సింబల్ గా మారింది. వి.సి.పి. లు పోయి, సి.డి.ప్లేయర్ లు., డి.వి.డి. ప్లేయర్, లువచ్చాయి. సినిమాలు అన్నీ అరచేతిలోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ రావటం ఒక సంచలనం. కావలసిన నంబర్లు నొక్కుకుంటే నిమిషంలో కాల్ వెళ్ళేది. ఇంకొంత కాలానికి టచ్ స్క్రీన్ ఫోన్ లు వచ్చాయి. ఫోటోలు తీసుకోవటం, సినిమాలు చూడటం, పాటలు వినటం అన్నీ ఫోన్ లోనే! పుస్తకాలు చదివి ఆనందించే అలవాటు పోయింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు. తలా ఒక ఫోన్ పట్టుకుని మాటా పలుకూ లేకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటారు.

గతంలో ఉన్న అద్దె పుస్తకాల షాపులు మూతబడ్డాయి. పోస్టాఫీస్ లో కవర్ల అమ్మకాలు పోయాయి. టెలీగ్రాంలు మూత పడ్డాయి. పాటల రికార్డింగ్ షాపులు పోయాయి. ఫోటో స్టుడియోలు తగ్గిపోయాయి. సినిమా థియేటర్ లు ఫంక్షన్ హాళ్ళుగా మారిపోయాయి.సెల్ ఫోన్ ఒక విప్లవం సృష్టించింది. ఇప్పుడు సమస్తం ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. చివరికి మోసాలు కూడా! టెక్నాలజీ డెవలప్ మెంట్ వద్దని ఎవరూ అనలేరు. కానీ ప్రతి విషయానికీ మంచీ, చెడు ఉంటాయి నాణానికి రెండు పార్శ్వాల లాగా! టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలి. అదే సమయానికి మనుషుల్లో ఉండాల్సిన ప్రేమ, అభిమానం, ఐకమత్యం తగ్గిపోకుండా జాగ్రత్త పడాలి. మాతృభాషని, సృజనాత్మకతనీ నిలబెట్టుకోవాలి. మనుషుల జీవితాల్లో టెక్నాలజీ ముందు ముందు ఇంకా ఎన్ని మార్పులు తెస్తుందో చూద్దాం!

  • గోనుగుంట మురళీకృష్ణ.

6.చెప్పుకోండి చూద్దాం – స‌మాధానాలు

ఆర్తి అగర్వాల్ (31), సౌందర్య (32), ఉదయ్ కిరణ్ (33)
– చిన్న వ‌య‌స్సులోనే మృతి చెందిన టాలీవుడ్ నీటీ, న‌టులు

2.ఈ నటి ఎవరో గుర్తు పట్టారా.. ?

నిత్యామీనన్

Leave a Reply