sunday magazine 26 oct 2025 ఆదివారం సంచిక 26 అక్టోబర్ 2025

ఈ సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 

అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

ఈ సంచికలో…

1) కార్తీక వనభోజనాలెందుకు? ముఖపత్ర వ్యాసం
2) మనసు-మాట శీర్షిక
3) కబుర్లు- శీర్షిక
4) మెదడుకు మేత-సామెత శీర్షిక
5) ముందు తరాలకు.. కథ
6) సన్నిహితం…శీర్షిక.
7) ఎదురీత కథ

8

9

  1. కార్తీక వనభోజనాలెందుకు? ముఖపత్ర వ్యాసం

తన గర్భంలో శిలాగ్ని భరిస్తూ పైన హరితాంబరమును చుట్టుకొని చల్లని హాయినిగొలిపే ప్రకృతిని ప్రసాదిస్తోంది భూదేవి. 84 లక్షల రకాల జీవరాశులకు మనుగడనిస్తోంది. కానీ ఏ మాత్రం త్యాగభావం లేని మానవుడు స్వార్ధంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఈ పృధివిని నాశనం చేస్తున్నాడు. రకరకాల పాపకార్యాలతో తాపాన్ని రగిలిస్తున్నాడు.
సమతుల్యంతో ప్రకృతి మాతను కాపాడుకోకపోతే శారీరకంగా, మానసికంగా మనిషి కృంగి కృషించిపోతాడు. అయితే మన భారతీయ సంస్కృతిలో సనాతనంగా ప్రకృతిని ఒక దైవీశక్తిగా పూజిస్తూ వస్తున్నారు. చెట్టు, పుట్ట, మట్టి అనే తారతమ్యం లేకుండా, జీవనానికి ఆలంబనలు అయిన ప్రతిదానిని పూజిస్తూ తరిస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఈ భక్తి ప్రభత్తుల అంతరార్ధాన్ని విస్మరిస్తున్నారు.
ఈ వేద భూమిలో జరుపుకునే ప్రతి పండుగకు, వ్రతానికి, పూజకు, ఒక ప్రయోజనం ఉంది. అది మానవజాతి మనుగడకు పది కాలాలు దోహదపడేదే.
సత్యం బృహదృతముగ్రం దీక్షా తపోబ్రహ్మయజ్ఞ:
పృథివీం ధారయంతి సానో భూతస్యభవ్యస్యపత్న్వురుం
లోకం పృథివీన:కృణోతు
సత్యనిష్ట. యదార్ధ జ్ఞానం, క్షత్రియ తేజం, ధర్మానుష్టానం, దీక్ష, దక్షత, తపస్సు, త్యాగనిరతి, బ్రహ్మజ్ఞానం, యజ్ఞం, ఇవి మాత్రమే భూమాతను పోషిస్తాయి, రక్షిస్తాయి. ఈ పృధివి పై సమస్త జీవరాశులకు హక్కు ఉంది. ఇది ఎవరి సొంతము కాదు. ఆ పరమాత్మది. కాబట్టి నీ కనీస జీవ అవసరాలకు మితంగా వినియోగించు. విధ్వంసం మాత్రం చేయకు. పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిని యజ్ఞంతో కాపాడుతూ వస్తున్నారు సనాతన ఋషిపుంగవులు.

ప్రకృతిలో ముఖ్యమైనవి వృక్షం, పర్వతం, నదులు. ప్రస్తుతం వీటి వినాశనం చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికైనా ప్రకృతి మాతను కాపాడుకుందాం. ప్రకృతిని కాపాడుకుకోవడానికి అవగాహన కలిగించుకోవడానికి వేదికలే కార్తీక వనభోజనాలు. కుత్సితబుద్ధితో స్వార్ధాన్ని జోడించి నేను-నా వాళ్ళు బాగుంటే చాలు అనే దౌర్భాగ్య సూత్రాలను వెంటనే విడిచిపెట్టాలి. ముందు గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే మన గృహాలు ఆరోగ్యంగా ఉంటాయి. గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండడం అంటే చెట్లు అడవులు నాశనం చేసి కాంక్రీట్ అరణ్యాలు నిర్మించమని కాదు. అలా చేయడం వలననే ఈనాడు భూతాపం పెరిగి పోయి రుతువుల క్రమం కూడా గాడి తప్పింది. ఈ విపరీత పోకడల పరిణామమే అకాల వర్షాలు, ఉరుములు, పిడుగులు. ఇంత వినాశనం జరుగుతున్నా ఆధునికత పేరుతో పాశ్చాత్య పోకడలకు పోయి మన సంస్కృతి సంప్రదాయాలకు వక్ర భాష్యం చెప్పి వినాశనం కొని తెచ్చుకుంటున్నాము. కార్తీక వనభోజనం అంటే మనో ప్రక్షాళన చేసుకునే మహత్తర అవకాశం. కుల- మత భేదాలను విడిచి పెట్టి ధనిక పేదలమే తారతమ్యాలను ప్రక్కన పెట్టి ప్రకృతిలో ముఖ్యమైన వృక్షాలను రక్షించుకోవాలి. అసలు నేడు భోజనానికి వనాలు ఎక్కడున్నాయి? రోడ్డు ప్రక్కన, నది ప్రక్కన, అపరిశుభ్రమైన వాతావరణంలో కార్తీక సమారాధన చేసుకునే దురదృష్టకర పరిస్థితి. ఉసిరి కొమ్మను నరికి తీసుకువచ్చి పాతిపెట్టి భోజనం చేసే దృశ్యాలు మనం చూస్తున్నాము. భోజనాలు అయ్యే సరికి ఆ ఉసిరి కొమ్మ వాడిపోయి ఆకులు రాలిపోతాయి ముందు మనసులు ప్రక్షాళన చేసుకోవాలి. ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా ఆదరించుకోవాలి. వృక్షం, నది బాగుంటే సమస్త జీవలు క్షేమంగా ఉంటాయి.
40-50 సంవత్సరాలకు పూర్వం కార్తీక వనభోజనాలకు రెండు మూడు ఎకరాలు ప్రత్యేకంగా ఉసిరి, మారేడు, నేరేడు, తులసి, జమ్మి మొదలగు వృక్షాలను ఏపుగా పెంచి ఉంచేవారు. ఎంతో ఆహ్లాదంగా అందరూ కలిసి మెలసి రెండు మూడు రోజులు గడిపేవారు. మళ్లీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. ఈరోజు కేటరింగులు వచ్చాక వనభోజనాల రూప రేఖలే మారిపోయాయి. గతంలో ఆ తోటలోనే గాడి పొయ్యిలు ఉండేవి. అక్కడే ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కలిసి వంటలు వండి వడ్డించేవారు. విస్తరాకులు వినియోగించేవారు. ఉసిరి చెట్టు నీడన కార్తీక దామోదర రూపమైన విష్ణువు, శివుడు, లక్ష్మి రూపాలను ఆవాహన చేసి పూజలు చేసి, ప్రసాదం సమర్పించేవారు. కట్టెలపై వంటలు ఎంతో రుచిని పుష్టిని కలిగించేవి. పూర్వం పెళ్లిళ్లు కూడా ఇప్పటిలా టెంట్ల క్రింద కాకుండా, తాటాకు పందిరి వేసి పుష్కలంగా మామిడి తోరణాలు కట్టి పెళ్లి విందు ఏర్పాటు చేసేవారు. తాటాకుల వాసనకు మామిడి ఆకుల సుగంధం తోడై పెళ్లి బూరెలు, పులిహోర, మిగిలిన పంచపక్ష్య పరమాన్నాలు అసలు సిసలు వాసనలు బయటపడేవి.
ఇప్పుడైనా మించిపోయింది. లేదు ప్రతి ఒక్కరూ మనసులో సంకల్పం చేసుకోవాలి. వనభోజనం అంటే కుల భోజనం కాదు. ప్రకృతి మాతను పూజించుకొని, రక్షించుకొనే సహకార కలల భోజనం. దురుద్దేశ పూరిత ప్రసంగాలను, స్వార్థ ప్రయోజనాల ప్రచారాలను ప్రక్కన పెట్టి ఆధ్యాత్మిక ప్రవచనాలను ప్రోత్సహించుకోవాలి. అంతిమ లక్ష్యం మనోల్లాసం.

ప్రకృతి రక్షణ అనేది ఇచ్చి పుచ్చుకునే సహకారం. ఇక కార్తీక వనభోజనాల పేరు చెప్పి చతుర్ముఖ పారాయణం, మద్య సేవనం మహాపాపం. ఇటువంటి పనులు వారికి శాపంగా పరిణమిస్తాయి. తలపొగరుతో వ్యవహరిస్తే తగిన శిక్షకు గురవుతారు. అది వారికి తెలియకుండానే తటస్తిస్తుంది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. నదీనదాలు ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటాయి. చెట్టు చేమలు హరిత వాతావరణంతో పుష్కలంగా కనువిందు చేస్తాయి. అటువంటి ప్రదేశాలలో ప్రాతః:కాలం స్నాన పానాదులు ముగించుకొని కార్తీక పురాణం పఠనం చేసి, పవిత్రంగా కార్తీక వన భోజనాలను అందరూ కలిసి మెలసి తయారు చేసుకొని పవిత్ర వృక్షాల చాయలలో సహ పంక్తుల భుజిస్తే, ఆ ఆనందం అనిర్వచనీయం.

భవిష్యత్తులో చక్కటి ప్రణాళికలు వేసుకోవడానికి, సమిష్టి ఆలోచనలు పుష్కలంగా వస్తాయి. గ్రామాన్ని, పట్టణాలను, దేశాన్ని, ఎలా సుసంపన్నం చేసుకోవాలి? అనే సంకల్పం ఆ పవిత్ర క్షణాల్లో కచ్చితంగా ఏర్పడుతుంది.
నేడు పట్టణాలలో నివసించే పిల్లలకు బియ్యం ఎక్కడినుంచి వస్తాయో కూడా తెలియదు. వృక్షాల రకాలను, వివిధ ప్రదేశాల రూపాలను, గూగుల్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూసి అనుభవించే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ముఖ్యంగా పిల్లలను సమీప వనాలకు తీసుకు వెళ్లి కార్తీక సమారాధనలు చేస్తే, ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వృక్షాలను ఎలా కాపాడుకోవాలి? ప్రకృతిని ఎందుకు రక్షించుకోవాలో తెలుస్తుంది. సంఘం, సమాజం, మనుషులు, సమానత్వం, సహాయం, సమీకృతం, మొదలైన ముఖ్యమైన విషయాల పట్ల పిల్లలకు అవగాహన అవుతుంది. యదార్ధ జ్ఞానం, త్యాగనిరతి, ప్రకృతితో మమేకం అయితేనే తెలుస్తుంది తోటి జీవజాతుల జీవన పోరాటం. అప్పుడే ఈ ప్రకృతిని కాపాడుకోవాలనే దీక్ష మొదలవుతుంది. కంప్యూటర్, కృతమ మేధస్సు, అవసరమే. కానీ, వాటిని సృజించే మానవ మేదకు ప్రకృతి మూలం ఆ ప్రకృతిలోని సమస్త అంశాలు సమతుల్యం తప్పితే కృతిమ మీద స్వయంగా వినాశనాన్ని కలిగిస్తుంది. కావున ఈ కార్తీక వనభోజనాలు ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన సమన్వయంలో కూడిన ప్రసంగాలు ఏర్పాటు చేసి పూర్తి ప్రయోజనకరంగా మలుచుకుంటామని మనందరం ప్రతినబూనుదాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పవిత్ర వృక్షాల సమానత్వ ఛాయలో సహపంక్తి భోజనాలు చేద్దాం.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు

2) మనసు-మాట శీర్షిక

ఆంధ్రప్రభ పాఠకులందరికీ నమస్సులు.
రచన అనే క్లయింట్ మనసు-మాటతో ఈవారం మానసిక ఆరోగ్యం గురించి చర్చించుకోవడానికి మీరందరు సిద్ధమేనా?
మరెందుకు ఆలస్యం కథలోకి వెళ్లిపోదాం..రండి.
రచన మనసు మాట : నేను ఎగువ మధ్య తరగతికి చెందిన 24 సంవత్సరాల అమ్మాయిని. నేను చదువు పూర్తి చేసుకొని గత రెండు సంవత్సరాల నుంచి ఒక సాఫ్టవేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను.
నన్ను చిన్నప్పటి నుంచి తల్లితండ్రులు చాలా గారాబంగా మరియు క్రమశిక్షణతో పెంచారు. నాకు సంబంధించే నిర్ణయాలు అన్ని నేను స్వయంగా తీసుకునేలా నన్ను ప్రోత్సహించారు. నా మీద ఉన్న నమ్మకంతో నా పెళ్లి కూడా నా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని భరోసా ఇచ్చేవారు. మా కంపెనీలో పనిచేసే రాకేష్ తో వృత్తి పరంగా ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారింది. ఆయన నా వ్యక్తిత్వం చూసి ఇష్టపడ్డాను అని పదే పదే చెప్పడంతో నిజం అని నమ్మి ప్రేమను అంగీకరించాను. మా పేరెంట్స్ కి కూడా పరిచయం చేశాను.


పెళ్లి కుదర్చుకుందాము అన్న సమయంలో నాకు ఇంకా సమయం కావాలి అని తన జీవితంలో నా కంటే ముందు ఇంకొక అమ్మాయిని ప్రేమించారని, ఆ అమ్మాయితో మా విషయం ఇంకా చెప్పలేదని, త్వరలోనే చెప్పి నన్ను వివాహం చేసుకుంటాను అని నమ్మబలికారు.
ఇది జరిగి సంవత్సరం అయ్యింది. ఐనా పెళ్ళి ప్రస్తావన తీసుకొనిరావట్లేదు, అడిగినప్పుడల్లా నువ్వు అనుమానిస్తున్నావు, నీకు నా మీద నమ్మకం లేదా? ఎన్నిసార్లు అడుగుతావు?? అని విసుక్కుంటున్నారు.. దీనితో నేను ఏమి చెయ్యాలో తెలియక నాలో నేనే కుమిలి పోతున్నాను.
ఇంకేం చేస్తే నా పెళ్లి జరుగుతుంది? నా లో ఏమైనా లోపాల్ల వలన నన్ను పెళ్ళి చేసుకోవట్లేదా అని ఆలోచించుకుంటూ రోజు రోజుకి కుమిలిపోతున్నాను. నా పేరెంట్స్ ఆనందం కోసం నేను దుఃఖం బయటకి రానివ్వట్లేదు. అంతా బానే వుంది అన్నట్లు ఉంటున్నాను. ఇలా ఎంత కాలం వెయిట్ చెయ్యాలి? రాకేష్ నన్ను ఎప్పుడు పెళ్లిచేసుకుంటారు? పెళ్ళి ఇంకా జరగక పోవడానికి నేను కారణమా?
సైకాలజిస్ట్ మాట: రచనా..! మీరు అనుభవిస్తున్న ఒత్తిడిని అప్రోచ్-అవాయిడన్స్ సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్)అని అంటారు. అంటే ఒక లక్ష్యం లేదా నిర్ణయం కొన్ని సార్లు కావాలి/కరెక్ట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు తప్పు అనిపిస్తుంది లేదా భయం కలిగిస్తుంది. అంటే ఒక పక్క మీకు ఈ పెళ్ళి జరగాలని వుంది ఇంకో పక్క నా నిర్ణయం కరెక్టేనా? అసలు రాకేష్ నాకు కరెక్ట్ భాగస్వామేనా అన్న సంధిగ్దాలు మీలో వున్నాయి. ఈ సంధిగ్దాలకు జవాబు రాకపోవడం వలనే మీరు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మీకు మరియు రాకేష్ కి ముఖ్యంగా వున్న సమస్య విభిన్నమైన విలువలు కలిగి ఉండడం. మీకున్న విలువలు రాకేష్ పట్ల గౌరవం, నమ్మకం, నిజాయతి, లాయల్టీ మరియు బంధాలలో బాధ్యతాయితంగా ఉండడం. అందుకే మీరు తల్లితండ్రులకు కూడా ఆయనను పరిచయం చేసారు. ఆయినకు మీ పట్ల నిజాయతి మరియు గౌరవం లోపించాయి. అందుకే మీరు ప్రేమ అంగీకరించాక అయన జీవితంలో ఇంకో స్త్రీ వున్నారని చెప్పారు. రాకేష్ కు బంధం మీద గౌరవం లేదు. మరియు బాధ్యతాయుతంగా ఉండడం రాదు కాబట్టే మీ భావనలను అర్థం చేసుకోలేక పోతున్నారు. అలాగే ఆయన తప్పులు అంగీకరించలేక పోతున్నారు. కాబట్టే అవి మీ ప్రవర్తనాలోపాలు లాగా చిత్రీకరించి మీకే తనమీద అనుమానం అని మీపై నింద వేస్తున్నారు. ప్రేమ బంధానికి మొదటి మెట్టు పెళ్ళి. అప్పటి వరకు చెప్పేవి అన్ని మాటలే. పెళ్ళి అన్నది మీ ఒక్కరి వలనే సాధ్యం కాదు. ప్రేమ బంధంలో ఉన్న ఇద్దరి సమిష్ట కృషి బాధ్యత మరియు లక్ష్యం అయ్యి ఉండాలి. మీరు ఆయన మాటలను నమ్మేస్తున్నారు. కానీ ఆయన మాటలకు మరియు చేతలకు పొంతన లేదు అన్నది గమనించట్లేదు. బంధాలలో ఆయనకి ముఖ్యమైన విలువలు వేరు, మీకు ముఖ్యమైన విలువలు వేరు. అన్నది గుర్తించండి
రాకేష్ ను అడగవల్సిన విషయాలు: రచనా..! మీరు ఈ విషయాలని రాకేష్ ని అడగండి.

3) కబుర్లు- శీర్షిక

పసందైన పద్యాల విందు

మాడయ్య కవి పద్యం
రాజభోజనం ఎలాగుండాలంటే :
ఒసపరి యైన రాజసపుటోగిరమున్ మిరియంపు గూరలుం
గసగసలానవాలు గడుగమ్మని నెయ్యిని బిండివంటలున్
రసములు బాయశంబు మధురంపు ఫలంబులు నూరుగాయలం
బసగల భక్తితో బసిడిపళ్లెరమందున బెట్టె నెంతయున్
కాకరకాయ
చౌడప్ప గారికి కాకరకాయలు అంటే మహా ఇష్టం. ఆయన శతకంలోని పద్యం :
వేయారు వగల కూరలు
కాయ లనేకములు ధాత్రి కల వందులలో
నాయకములు రా కాకర
కాయలు మరి కుందవరపు కవి చౌడప్పా!

శ్రీనాథుడు భోజనప్రియుడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా తన స్థాయికి తగ్గ భోజనం కోరుకొనేవాడు.

అందకపోతే చిందులు వేసేవాడు. పల్నాడు వైపు భోజనానికి ఎలా వంక పెట్టాడో వినండి!
జొన్న కలి, జొన్న యంబలి,
జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్
సున్న సుమీ సన్నన్నము
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్ .
నాదెళ్ల నృసింహ కవిగారికి కందిపప్పుపేరు చెబితే నోరూరేదిట.

ఆ కవిగారు కందిపప్పు మీద ఎంత హృద్యమైన పద్యం రాసారో చదవండి!
వేడి మంగలములో వేయించి వేయించి గరగర విసిరిన కందిపప్పు
సరిపడ్డ లవణంబు సంధించి వండిన కనకంబుతో సరి కందిపప్పు
అన్నంబులో జొన్పి యాజ్యంబు బోసియు కల్పి మర్దించిన కందిపప్పు
పట్టి ముద్దలు చేసి భక్షణ సేయంగ కడుపులో జొచ్చిన కందిపప్పు
పైత్య వాతంబు లెల్లను పారద్రోలి కాంతపై యాశ పుట్టించు కందిపప్పు
బక్క దేహుల కెల్లను బలమునిచ్చి ఘనత దెచ్చును ఏ ప్రొద్దు కందిపప్పు.
యోగి వేమనకూ జిహ్వారుచి లేకపోలేదు
ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన
పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు
తవిలిలోన గలదు నవనీత మిట్లురా
విశ్వదాభిరామ వినురవేమ!
రాయలవారు తన ఆముక్తమాల్యదలో వివరించిన రాజోచిత భోజన వైభవం :
తెలినులివెచ్చ యోగిరముఁ దియ్యని చారులుఁ దిమ్మనంబులున్
బలుచనియంబళు ల్చెఱకుపా లెడనీళ్లు రసావళు ల్ఫలం
బులును సుగంధిశీతజలము ల్వడపిందెలు నీరుఁజల్లయు
న్వెలయఁగఁ బెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్!
తెనాలి రామకృష్ణకవి దేవుణ్ణి రుచికరమైన భోజనం ప్రసాదించమని ఇలా వేడుకుంటున్నాడు.
చప్పటి దుంపలు తినుచును
తిప్పలు పడు చుంటిమయ్య దేవా దయతో
గొప్పగు మార్గంబొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్చన్
భోజనానికి పిలవకపోతే కోపంతో వేములవాడ భీమకవి కోపంతో శాపం పెడుతూ ఈ పద్యం చదివాడు.
గొప్పలు సెప్పుకొంచు ననుఁ గూటికి బంక్తికి రాకుమంచునీ
ద్రిప్పుడు బాపలందఱునుఁ దిట్టిరిఁ గావున నొక్క మాఱ మీ
యప్పములన్ని కప్పలయి యన్నము సున్నముఁ గాగ మాఱుచున్
బప్పును శాకముల్ పులుసు బచ్చడులుఁ జిఱురాలుగావుతన్
ఇక ఆధునిక కవుల భోజనప్రియత్వంకూడా తీసిపోలేదు సుమా!

బసవరాజు అప్పారావుగారి ప్రసిద్ధ గుత్తివంకాయ కూర పాట జగద్విదితం.
గుత్తి వంకాయ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!. ..
ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడు? తెలుగువాడు పంచభక్ష్యపరమాన్నాలు తన కంచాన వడ్డింప గోంగూర కోసమై గుటకలేసేవాడు అన్నారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి. నారాయణరెడ్డి. ఎంతైనా ఆంధ్రులం కదండీ! అందుకే గోంగూర మీద ఓ గొప్ప పద్యం.
వెల్లుల్లి పెట్టి పొగచిన
పుల్లని గోంగూర పొగడగ వశమా ;
మొల్లముగ నూనె వేసుక,
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా !
తిళ్ళే కాదు, చిరుతిండ్ల మీదా రుచికరమైన పద్యాలు వండారు మన తెలుగు కవులు.
అబ్బూరి రామకృష్ణరావుగారి పద్యం
ఉపమాపై, పెసరట్టుపై, ఇడిలిపై – హుమ్మంచు చూపించు నీ
జప సంబద్ధ పరాక్రమ క్రమ కటాక్ష శ్రేణి మన్నించి శు
భ్రపు జిల్లేబి పకోడి లడ్వగయిరా – పై కొంత రానిమ్ము శ్రీ
చపలాపాంగ సితాంగనా హృదయ పాశా! పూజ్య వస్తు ప్రియా!

అన్నీ ఉండి కాఫీ లేకపోతే ఎలా? అందునా మహాకవి శ్రీ శ్రీ గారి కాపీ!
ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన ఊరనుండుము
చొప్పడకున్నట్టి ఊరు చొరకుము మువ్వా! 🙂
ముక్తాయింపుగా ఈ జరుక్ శాస్త్రి – కిళ్ళీ కూడా సేవించేసెయ్యండి!

సుష్టుగా భోజనం చేసిన సంతృప్తి మిగులుతుంది.
మాగాయీ కందిపచ్చడీ
ఆవకాయీ పెసరప్పడమూ
తెగిపోయిన పాత చెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగ్ లో కారా కిళ్ళీ
సామానోయ్ సరదా పాటకు !


4) మెదడుకు మేత-సామెత శీర్షిక

మనసుంటే మార్గం ఉంటుంది

ఏదైనా పని మనం చేసి, సఫలీకృతులం కావాలంటే, ముందు దాన్ని చేయాలనే‘తలంపు’ఉండాలి కదా! ఆ‘మనస్సు’ఉందనుకోంది, పని ఎలా చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే త్రోవ కనిపిస్తుంది. తలంపే లేదనుకోండి, ఇక త్రోవ ఎక్కడిదండీ బాబూ! ఇలాంటిదే ఇంగ్లీషులో కూడ ఒక సామెత ప్రసిద్ధంగా ఉంది. భాషలు వేరు కావొచ్చు. మానవ స్వభావం ప్రపంచం అంతా ఒకటిగానీ ఉంటుందండోయ్! అందుకే ఒకే విధమైన సామెతలు చాలా భాషల్లోకనబడతాయి.

జార్జ్ హెర్బర్ట్ అనే ఆయన 1640లో‘జాకులా ప్రుడెంటమ్’అన్న సామెతల సంకలనం తెచ్చాడు. అందులో “To him that will, ways are not wanting” (ఎవరికైతే చెయ్యాలనే మనస్సు ఉంటుందో, వారికి మార్గాల కొరత ఉండదు) అన్నది చేర్చాడు. 19వ శతాబ్దంలో దాన్ని “Where there a will, there a way”అని మార్చారు. అసలు కంటే కొసరుముద్దని, అదే పాపులరై కూర్చుంది.

బాగానే ఉంది. సరే. కానీ, మన భారతీయ దృక్పథం ఇంత కంటే ఉదాత్తంగా, ప్రాక్టికల్‍గాఉంది. కేవలం‘అనుకుంటే’సరిపోదన్నారు మనవాళ్లు! అనుకున్నంత మాత్రాన అవంతట అవే మార్గాలు రావు! ‘హితోపదేశము’లోని‘మిత్రలాభము’లో నారాయణ పండితుడు ఇలా అంటాడు. చాలా గొప్ప శ్లోకం అది!

శ్లో: “ఉద్యమేన హి సిధ్యన్తి కార్యాణి న మనోరథైః।

న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః॥”

“అయ్యా! ‘మనోరథముల’తోమాత్రమే కార్యాలు సిద్ధించవండీ! ఉద్యమము అంటే కఠిన ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి. సింహం నిద్రపోతూ ఉంటే, జంతువులు వాటంతట అవి వచ్చి దాని నోట్లోకి వెళ్లవు కదా!”

చూశారా మాస్టారు? అదీ విషయం! సింహం మాటు వేయాలి, తన ఎరను లాఘవంగా పట్టుకోవాలి. దాన్ని కోరలతో చీల్చాలి, మాంసం బయటికి లాగాలి, తినాలి! అంత తతంగం ఉంది మరి! `తిందాం’అనుకుంటే చాలదు కదా! అన్నట్లు, ‘ఉద్యమం’ అంటే ఉద్యోగం అని కూడా సంస్కృతంలో అర్థముంది.

కాబట్టి అనుకొని అవలించి పండుకుంటే కుదరదు. బోలెడు వర్క్ చేయాలి. అఫ్ కోర్సు, ముందైతే ఒక ఆలోచన రావాలనుకోండి. ‘పెసరట్టుప్మా విత్ అల్లప్పచ్చడి’తినాలి అనిఈ రోజు అనుకున్నాం. దాన్ని భార్యామణికి చెప్పాలి ముందు. ఆమె అప్రూవ్ చేయాలి. అదంత సులభం కాదు. పెసలు నానేయాలి, మర్నాడు రుబ్బాలి. పచ్చిమిర్చి అల్లం సన్నగా మనమే తరిగివ్వాలి. పెసరట్టు మీద పరవడానికి ఉప్మా కొంచెం జారుగా ఉండాలి. ఇంత తతంగం నడిస్తే, పెసరట్టుప్మా పళ్లెంలోకొస్తుంది. ‘సింహం’ చేసినంత ఉద్యమం కాకపోయినా, ఆ మాత్రం మనకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి.

సో, సామెతను గుడ్డిగా అనుసరించకుండా, దానిలోని ప్రాక్టికాలిటీని కూడా చెక్ చేసుకోవాలి. అందుకు, పై శ్లోకం వ్రాసిన నారాయుణ పండితుల వంటి మహనీయులు మనకు ఉండనే ఉన్నారు!

వచ్చేవారం ఇంకో సామెతతో కలుద్దాం కామ్రేడ్స్!

——————+++++++++++++++———————-

5) ముందు తరాలకు.. కథ

లక్ష్మీ పతిని తెలిసిన వాళ్ళందరూ “షావుకారు లక్ష్మీ పతి” అని సంబోధించటం పరిపాటి.
ఆ గ్రామంలో పండిన అపరాల పంటలను కల్లంలోనేతక్కు వ ధరలకు కొనేసినిలువచేసి, ధరలు పెరిగినప్పు డు అమ్మడం, రైతులకేమైనా కుటుంబ అవసరాలకు, వ్యవసాయ ఖర్చు లకు అవసరమైనప్పు డు ఐదురూపాయల వడ్డీలకు సొమ్మిచ్చి, పంటలు రాగానే పంట రూపంలోనే
వసూలు చేసుకోవడం చేస్తాడు.
ఆ ఊళ్లో వ్యవసాయ సహకార బ్యాకు ఉంది. లోన్లు పెట్టి, అవి వచ్చే వరకు ఆగలేక కొందరు, ఆ కాగితాలు సంతకాలు అంటూ తిరగలేక కొంత… అక్కడ తీసుకుంటే ఎప్పుడైనా అద్దద్దాని పీకల మీదికొస్తే షావుకారు ఇవ్వడేమోనని.. తప్పక లక్ష్మీ పతిని ఆశ్రయించే వారు ఊళ్లోవాళ్లు.
పంటల సొమ్ము వసూళ్లవ్వగానే, ప్రతి ఏటా ఎండలు ముదరక ముందే భార్యతో సహా కలసి
పుణ్యక్షేత్రాలని దర్శించుకోవటానికి వెళ్తూంటాడు లక్ష్మీపతి.
అలా కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ “తల్పగిరి శ్రీరంగనాథస్వా మి”క్షేత్రం చేరారు..
ఏ క్షేత్రంలో దైవదర్శనం చేసుకున్నా, ఆ రాత్రి స్వామి వారి సన్నిధిలో ఆలయ సత్రంలోనే నిద్ర చేయడం కూడా లక్ష్మీపతికి అలవాటు.


ముందుగా ఆ క్షేత్రంలోని పెన్నమ్మకు మొక్కి, ఆశీర్వాదంగా ఆ జలాన్ని శిరస్సున దాల్చా రు.
శ్రీరంగనాధుని కనుల నిండుగా దర్శించుకుని, “తండ్రీ! శ్రీరంగనాథా! నీ దయ వలన నేను ఎంతో సుఖంగా ఉన్నాను. నా వారసులకు నాలుగైదు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను కూడబెట్టాను. నా కొడుకులు, కూతుళ్లకు సంతానాన్ని ఇచ్చి చల్లగా కాపాడు తండ్రీ” అని మొక్కు న్నాడు లక్ష్మీపతి.
ఆనవాయితీ పక్రారం లక్ష్మీపతి భార్యతో సహా ఆ రాత్రి స్వామివారి సత్రంలోనే నిద్రించారు…
రాత్రి నడిఝాము గడిచిన వేళ….లక్ష్మీపతి ఆరోజు భక్తిగా దర్శించుకున్న శ్రీరంగనాథస్వామి మందస్మిత వదనంతో నెమ్మదిగా కదిలి వస్తూ కనిపించాడు. లక్ష్మీ పతిఆశ్చర్యంతో ఆనంద భరితుడై “స్వామీ! ఉదయం నేను నీ దగ్గరకు వస్తే… ఇప్పుడు నీవే కదిలి నా దగ్గరకు వచ్చా వా తండ్రీ.ఎంత ధన్యుడను!” చేతులు జోడించాడు.


స్వామి చిరునవ్వు నవ్వుతూ “నీవు ఉదయం నీ కుమారులకు కుమార్తెలకు మంచి సంతానాన్ని ఇమ్మని ప్రార్థించావుగా లక్ష్మీపతీ? అలాగే. ఐతే…
వాళ్ళకు అంధులు, అంగవైకల్యం గలవాళ్లే బిడ్డలుగా జన్మి స్తారు. సరేనా?”అన్నా డు స్వామి.
అదిరిపడ్డాడు లక్ష్మీపతి. “అదేమిటి స్వామీ?”
ఆందోళనగా అడిగాడు.
శ్రీరంగనాథస్వామి చిద్విలాసంగా నవ్వాడు.
“నువ్వు, నీవాళ్లు నాలుగైదు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను కూడపెట్టావ్. ఇంక నీ పిల్లలు వాళ్ళ పిల్లలు కష్టపడాల్సిన పనేముంది? నీవు సంపాదించిన నాలుగైదు తరాల సొమ్మును
సుఖంగా కూర్చుని తింటారు. కష్టపడి బ్రతకాల్సిన వాళ్లకు కదా అవయవాలన్నీ సరిగా ఉండాలి? వాళ్లను కదా నేను చల్లగా చూడాలి?”
మర్మగర్భంగా నవ్వుతూ అడిగాడు స్వామి.
“స్వామీ, ఇదన్యాయం. నువ్వే కదా నా కష్టాన్ని ఫలవంతం చేసింది? ఇప్పుడిలా…” నసిగాడు.
“నువ్వు కేవలం కష్టంతోనే కాదు, అన్యాయంగా సొమ్మును కూడపెట్టావ్. ఆ సొమ్ముతో నీవు, నీ వాళ్లంతా సుఖంగా సంతోషంగా ఉండేలా నన్ను కాపలా కాయమనడం న్యాయమా?” స్వామి పశ్ర్న..
లక్ష్మీ పతి అయోమయంగా చూస్తున్నాడు.
“నీదగ్గరన్న అదనపు సంపదను అసహాయులకు, వికలాంగులకు, ఆపన్నులకు, పది మందికి పనికి వచ్చే దేనికైనా వెచ్చించి చూడు. నీకెంతో తృప్తిగా నీజన్మ సార్ధకమైనట్లు ఉంటుంది. నీ పుణ్యమే నీ సంపద లాగా మీ బిడ్డలకి వస్తుంది.
కాదంటావా? నువ్వే ఉంచుకో. మీ తరతరాలు కళ్ళూ , కాళ్ళు లేకపోయినా నీవు కూడబెట్టిన సంపదను తింటూ బతుకొచ్చు, ఆలోచించుకో” అంటూనే స్వామివారు అంతర్దానమైనారు.
“స్వామీ…” అరుస్తున్నాడు లక్ష్మీపతి కంగారుగా.
పక్కనే పడుకున్న భార్య ధనలక్ష్మి “ఏమిటండీ.. ఎందుకలా అరుస్తున్నారు?” లేపి అడుగుతోంది.
“స్వా …స్వా మి…నా స్వప్నంలో కనిపించి….”
“ఆ… కనిపించి?” ఆత్రుతగా అడిగింది భార్య.
ఆపైన చెప్పలేక స్వామి మాటలకు ఆలోచనలో పడ్డాడు లక్ష్మీపతి.

——————-+++—————————-

6) సన్నిహితం…శీర్షిక.

ఆరంభ శూరత్వం

నేను కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు…పాటలు బాగా పాడుతూ మంచి గుర్తింపు కలిగి ఉండేవాడిని. కాలేజీ లో చాలా మంది విద్యార్థులు నన్ను గుర్తుపడుతూ ఉండేవారు. అయితే ప్రతీ మనిషికి తనకు ఉన్నదానికంటే లేని దాని మీద మోజు ఎక్కువ ఉంటుంది.

ఆ విధంగా నాకు కూడా కీబోర్డ్ ప్లే చేస్తూ పాటలు పాడాలనే కోరిక ఉండేది. ఒక శుభముహూర్తాన ఎంక్వైరీ చేసి కీబోర్డ్ నేర్పే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను. ఆవేశంగా అక్కడి ట్యూటర్ తో మాట్లాడి జాయిన్ అయ్యాను. కొత్త నోట్ బుక్ కూడా కొనుక్కుని సరళీ స్వరాలతో మొదలు పెట్టి నేర్చుకోసాగాను . కొన్నాళ్ళు వెళ్ళాక జంట స్వరాల దగ్గరకి వచ్చేటప్పటికీ , సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. నెమ్మదిగా  ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడం మానేసి పరీక్షల కోసం చదువుకోసాగాను. అలా కీబోర్డ్ లెర్నింగ్ మానేశాను. మళ్ళీ సంవత్సరం తర్వాత , కీబోర్డ్ నేర్చుకోవాలి అన్న కోరిక తీవ్రంగా కలిగింది. ఈ సారి మరింత ఆవేశంగా ఇన్స్టిట్యూట్ లో  జాయిన్ అయ్యాను. ఏం బాబూ ఈసారైనా కంటిన్యూ చేస్తావా అని ఆ ట్యూటర్ నవ్వసాగాడు. దెబ్బతిన్నట్టు చూసాను నేను. మళ్ళీ సరళీ స్వరాలతో మొదలు పెట్టాను. జంటస్వరాల దాకా సిన్సియర్ గా వెళ్ళాను. తర్వాత షరా మామూలే. సెమిస్టర్ పరీక్షలు. కీబోర్డ్ డిస్కంటిన్యూ.

కాలేజీ చదువు అయిపోయింది. తర్వాత కిందా మీద పడి జాబ్ లో జాయిన్ అయ్యాను. ఈ సారి కీబోర్డ్ నేర్చుకోవాలి అని మరింత పట్టుదలతో ఉన్నాను. జంట స్వరాల దాకా నేర్చుకున్నాక , ఆఫీసు పని మీద క్యాంప్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ విధంగా క్యాంప్ వెళ్ళడం తర్వాత కీబోర్డ్ వదిలేయడం జరిగింది.

నెమ్మదిగా వివాహం అయి ఒక పిల్లాడు కూడా పుట్టాడు.

ఈ సారి మళ్లీ కీబోర్డ్ నేర్చుకోవాలి అన్న కోరిక రగిలింది నాలో.దానికి కారణం నా భార్య ప్రోత్సాహం. ఈ సారి ప్రేమగా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. జంట స్వరాల దాకా వచ్చాక , నా భార్య తిట్టడం మొదలు పెట్టింది. ఇంట్లో పనులు మానేసి బయట తిరుగుతున్నాను అని. ఇక తప్పక , సహధర్మచారిణి మాట విని కీబోర్డ్ లెర్నింగ్ మానేశాను.

ఆ విధంగా ఆ కోరిక తీరలేదు. రిటైర్ అయ్యాక మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి అని నా ఆలోచన.నా ఆరంభ శూరత్వం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ !!!

————————-+++——————

7) ఎదురీత కథ

సమయం రాత్రి తొమ్మిది గంటలైంది. ఆ సమయంలో శ్రీరామ్ తన ఇంటి డాబా మీద నిద్ర పోతున్నాడు. ఆరోజు ఆఫిసులో పని పూర్తయ్యే సరికి ఎనిమిది గంటలైంది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా పనిచేయడంతో అతను బాగా అలసిపోయాడు. అందుకే ఆఫీస్ నుంచి రాగానే డాబా మీదకు వెళ్లి చాప మీద నిద్ర పోయాడు. ఆసమయంలో అతని ఫోన్ రింగైంది. నిద్ర కళ్ళతోనే దాన్ని అందుకొని “హలో “అన్నాడు.
“రామ్,నేను దీపను మాట్లాడుతున్నాను. నన్ను గుర్తుపట్టావా?” అని అడిగింది.
దీప అన్నమాట వినగానే రామ్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఐదు సంవత్సరాల తరువాత మళ్ళీ దీప మాట ఇప్పుడు వింటునాడు. “నిన్నెలా మరిచిపోతాను దీపా? అది ఈ జన్మకు సాధ్యం కాదు”అన్నాడు.
“శ్రీ రామ్, నేను అమెరికా నుంచి ఆరు నెలల క్రితం ఇక్కడికి వచ్చేసాను. నా భర్త కిరణ్ సంవత్సరం క్రితం అమెరికాలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నా బాబు హర్షకి ఇప్పుడు నాలుగేళ్లు. నేను అర్జెంటుగా రేపు ఉదయాన్నే విజయనగరం దగ్గర ఉన్న మా వూరు శ్రీపురం వెళ్ళాలి. అక్కడ మా అమ్మకి ఒంట్లో బాగులేదు. అక్కడికి వంశీని తీసికెళ్ళడం కుదరదు. నేను మళ్ళీ రేపు వచ్చేస్తాను. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి వాడి దగ్గర ఉండగలవా? ఇలా అడుగుతునానని ఏమీ అనుకోకు. నీమీద ఉన్న చనువుతో అడుగుతున్నాను” అంది దీప. ఆమె మాట్లాడుతుంటే శ్రీరాం కి ఆమె స్వరంలో ఒక విధమైన వేడుకోలు వినిపించింది.
“దీపా, ఆరు నెలల క్రితం నువ్వు ఇక్కడికి వస్తే నాకెందుకు చెప్పలేదు? మీ ఇంటి లొకేషన్ నాకు పెట్టు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను” అన్నాడు. కొద్ది సేపటికి దీప వాట్సాప్ లో లొకేషన్ పెట్టింది. వెంటనే కారులో ఆమె దగ్గరకు బయలుదేరాడు శ్రీరామ్. ఆమె ఉంటున్న న్యూ కాలనీ అతను ఉంటున్న ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. అరగంట తరువాత అతను ఆమె ఇంటికి చేరుకున్నాడు. తలుపు తియ్యగానే ఎదురుగా కనిపించిన దీపను చూసి శ్రీరామ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఐదేళ్లయినా ఆమె రూపంలో ఏ మార్పు లేదు. పైగా అప్పటి కన్నా అందంగా కనిపిస్తోంది.
“హాయ్ శ్రీరామ్, లోపలి రా” అని దీప అతన్ని లోపలికి తీసికెళ్ళింది. లోపల నాలుగేళ్ళ బాబు ఆడుకుంటూ కనిపించాడు. “వీడు నా కొడుకు వంశీ” అని శ్రీరామ్ కి చెప్పి “వంశీ, అంకుల్ కి నమస్తే చెప్పు” అంది.
వెంటనే వాడు “నమస్తే అంకుల్” అని చెప్పాడు. శ్రీరామ్ వాడిని ఎత్తుకొని ముద్దులాడేడు.
“వంశీ, నువ్వు నీ గదిలోకి వెళ్లి హోమ్ వర్క్ చేసుకో. ఇక్కడ నేను అంకుల్ మాట్లాడుకుంటాము” అనీ చెప్పింది దీప. వాడు తన పుస్తకాలను తీసుకొని “బై అంకుల్” అనీ చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం. దీప కొద్ది సేపు మౌనం దాల్చి “శ్రీరామ్, ఎలా వున్నావు?అని అడిగింది.
“బాగానే వున్నాను దీప, నీ భర్త చనిపోయాడన్న వార్త నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఎలా జరిగింది. ఆరు నెలల క్రితం వచ్చినా ఎందుకు నాకు చెప్పలేదు” అనీ ప్రశ్నల వర్షం కురిపించాడు శ్రీరామ్.
“ఆఫీస్ కి వెళుతున్నప్పుడు ఎదురుగా వస్తున్న కార్ గుద్దుకోవడంతో ప్రమాదం జరిగింది. రెండు రోజులు కోమాలో ఉన్న తరువాత చనిపోయాడు. అతను చనిపోయిన తరువాత కొన్నాళ్ళు అక్కడే వున్నాను కానీ నాకెందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు. రాజీనామా చేస్తాను అని మా కంపెనీ వాళ్ళకి చెబితే విశాఖపట్నంలో కొత్తగా కాంపస్ పెట్టాము అనీ చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు “అనీ చెప్పింది దీప.
“మరి మీ అమ్మ నాన్న ఎక్కడ?”
“నా భర్త కిరణ్ చనిపోవడంతో నాన్న గారు నా గురించి బెంగ పెట్టుకున్నారు. రెండు నెలల తరువాత ఆ బెంగతోనే చనిపోయారు. అమ్మ మా ఊరుని వదలి రానంది. ఆమెకు కూడా వంట్లో బాగుండటం లేదు. ఇప్పుడు పక్క ఊరు హాస్పిటల్లో వుంది. ఆ ఊరు వెళ్లాలంటే ఏరు దాటి వెళ్ళాలి. అందుకే హర్షని తీసికెళ్ళటం లేదు. వాడిని ఎక్కడ వుంచాలో తెలియక నిన్ను తప్పక పిలిచాను. ఏమనుకోవద్దు” అంది దీప. ఆ మాటలు చెబుతున్నపుడు ఆమె గొంతులో బాధని స్పష్టంగా గమనించాడు రామ్.
“అవసరానికి ఉపయోగ పడక పోతే మనమెందుకు చెప్పు. ఇది నా బాధ్యత. నువ్వేం బాధ పడకు. నువ్వు ప్రశాంతంగా వెళ్లి మీ అమ్మను చూడు. అవసరం అయితే ఇక్కడకు తీసుకురా. ఇక్కడ మంచి డాక్టర్ కి చూపిద్దాము” అన్నాడు శ్రీరామ్.
“థాంక్స్ శ్రీరామ్, ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్నావా? నా పెళ్ళైన తరువాత చాలా రోజుల వరకు నిన్ను మరచి పోలేక పోయాను. అందువల్ల కిరణ్ తో మనస్ఫూర్తిగా కాపురం చెయ్యలేక పోయాను. దాంతో కిరణ్ డిప్రెషన్ కి లోనయ్యాడు. అందుకే జీవితంలో ఎవ్వరినీ ప్రేమించ కూడదు. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే నాలాగే ఇంకొకరిని పెళ్లి చేసుకొని నరకం అనుభవించాలి. అటువంటి బాధ పగవాళ్లకు కూడా రాకూడదు. మన ప్రేమ మనిద్దరి జీవితాలను అల్లకల్లోలం చేసింది. నేను పిరికిదాన్నై నా తల్లితండ్రులను ఎదిరించలేక పోయాను. నా వల్ల నీ జీవితం నాశనం అయింది. నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుండేది” అంది దీప.
ఆరోజు మనం నా గదిలో కలుసుకున్న తరువాత నీ తల్లి తండ్రులకు చెప్పి ముహూర్తం పెట్టిస్తానని నువ్వు వెళ్ళిపోయావు. అప్పటినుంచి నువ్వు వస్తావని చాలా రోజులు ఎదురు చూసాను. నీకేన్నో సార్లు ఫోన్ చేసినా నువ్వు బదులు ఇవ్వలేదు. కొన్నాళ్ల తరవాత నీ పెళ్లి ఇంకొకరితో అయిపోయిందన్న విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. ఆ బాధ ఎవరితో చెప్పుకోలేని బాధ. ఆ తరువాత నా మనసు మొద్దుబారి పోయింది. అమ్మ నాన్నలు పెళ్లి చేసుకొమ్మని ఎంత బలవంత పెట్టినా నేను ఒప్పుకోలేదు. రెండేళ్ల క్రితం నేను ఓ కంపెనీలో చేరాను. జీవితం యాంత్రికంగా గడిచి పోతున్నాది.
ప్రేమ నాలో రేపిన చిచ్చు ఎప్పటికీ పోదేమో. ళొవె అంద్ హతె అరె త్వొ ఒఫ్ థె స్త్రొంగెస్త్ ఎమొతిఒన్స్ వె ఫీల్ ఇన్ రెలతిఒన్షిప్స్. నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధ వేస్తుండేది. అందుకే నీ మీద ద్వేషం పెంచుకున్నాను. ఎందుకంటే నువ్వు గుర్తుకు రాకూడదని. కానీ అది సాధ్యం కాలేదు. నిన్ను మరిచి పోలేక పోవడం నా బలహీనత. కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు. ఆ రోజు నా గదిలో నువ్వు నాకిచ్చిన అనుభూతులను జీవితాంతం గుర్తు చేసుకుంటూ బతికేస్తున్నాను” అన్నాడు శ్రీ రామ్.
“ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య ఆ దేవుడు ఎందుకు పెట్టాడో గానీ దాని వల్ల బాధే గాని సుఖం లేదు. ప్రేమకు మరణం లేదు, అది ఓడి గెలుస్తుందని అంటారు. కానీ ఓటమే దానికి తెలుసు. ఇష్టం లేని వ్యక్తితో పెళ్లికన్నా కన్య గా ఉండి పోవటమే మేలు. అయినా ఏదీ మన చేతులో లేదు. పద భోజనం చేసి పడుకుందాము. నేను తెల్లవారి నాలుగు గంటలకు బయలుదేరాలి” అని చెప్పి లేచింది దీప.

  • * *
    ఆ మర్నాడు సాయంత్రం వచ్చింది దీప. అంత వరకూ శ్రీరామ్ హర్షతో ఆనందంగా గడిపేడు. మొదట ముభావంగా ఉన్న తరువాత చేరికయ్యాడు హర్ష. అతన్ని ఎన్నో సందేహాలు అడిగాడు. ఇదివరకు ఎప్పుడూ ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. ఇంకా తమతోనే ఉండిపొమ్మని చెప్పాడు. వాడి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక లోలోపలే నవ్వుకున్నాడు శ్రీరామ్.
    దీప వస్తూనే ‘హర్ష నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా?” అని అడిగింది.
    “లేదు దీపా, ఇద్దరం సరదాగా గడిపాము. గంటలోనే నాకు వాడు బాగా చేరికై పోయాడు. కొత్త వాళ్లన్న బెరుకు వాడికి లేదు. అది సరే, మీ అమ్మకు ఎలా ఉంది?” అనీ అడిగాడు.

  • “బాగానే ఉంది రామ్, ఆమె దగ్గర మా పిన్నిని వుంచాను. నెలకో సారి వెళితే సరిపోతుంది.” అనీ చెప్పింది.
    ఒక గంట తరువాత శ్రీ రామ్ “దీపా, నేను బయలుదేరతాను. ఎప్పుడైనా అవసరం అయితే చెప్పు. వస్తాను” అనీ చెప్పాడు.
    అతని మాటలకు దీప కొద్దిసేపు మౌనం దాల్చి “శ్రీరామ్, హర్ష నీ కొడుకే. నీ రక్తం పంచుకు పుట్టిన వాడే. ఆ విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకున్నా ధైర్యం చెయ్య లేక పోయాను” అనీ చెప్పింది.
    ఆమె మాటలకు శ్రీరామ్ ఆశ్చర్యపోతూ “ఏమిటి నువ్వు చెబుతున్నది నిజమా?” అన్నాడు “ఆ రోజు మన పెళ్లి గురించి మాట్లాడుకోవటానికి నీ గదికి వచ్చినప్పుడు మనం తొందర పడ్డాము. నువ్వు వద్దంటున్నా వినకుండా నేనే ఆ తప్పు పనికి కారణమయ్యాను. ఎలాగూ మన పెళ్లి జరుగుతుందన్న ధైర్యం నా చేత ఆపని చేయించింది. కానీ ఇంటికెళ్లిన తరువాత పరిస్థితులు మారి పోయాయి. నా తల్లి తండ్రులు నా మాట వినలేదు. ఒక నెల తరువాత నా పెళ్లి జరిగింది. అప్పటికే నేను గర్భవతినన్న సంగతి నాకు తెలిసిపోయింది. అయినా ఆ విషయం చెప్పడానికి నాకు భయం వేసింది. ఆ తరువాత కిరణ్ బతికున్నన్నాళ్లు నన్ను ఆ అపరాధ భావం వెంటాడింది. కిరణ్ కి ఆ విషయం తెలుసో లేదో నాకు తెలియదు. పెళ్లైన తొమ్మిది నెలలకే నాకు ప్రసవం జరిగింది కాబట్టి అతనికి అనుమానం వచ్చే ఉంటుంది. కానీ నన్ను ఎప్పుడూ అతను అడగలేదు. బహుశా తెలియడం వల్లనేమో అతను నాతో సరిగ్గా కాపురం చెయ్యలేదు.

  • మనిద్దరం ఆనాడు తొందర పడిన కారణంగా పుట్టిన హర్ష గురించి నీకు చెప్పక పోవడం నాకు తప్పనిపించింది. ఒకవేళ కిరణ్ బతికుండి ఉంటే ఏం చేసేదాన్నో నాకు తెలియదు కానీ, ఇప్పుడు అతను లేదు కాబట్టి నీకు చెప్పాలనిపించింది. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు. జీవితం నా చేతుల్లోంచి జారిపోయింది. నేను కిరణ్ తో మన ప్రేమ గురించి చెప్పకపోవడం నా తప్పే. కానీ అతను చనిపోయిన తరువాత నాకు ఒక చేదు నిజం తెలిసింది. అతనికి మా పెళ్ళికి ముందే మార్గరెట్ అనే అమ్మాయితో పెళ్లి జరిగి విడాకులు తీసుకున్నారన్న సంగతి అతను నాకు చెప్పకుండా దాచాడు.
  • ఆ విషయం అతను చనిపోయిన తరువాత మార్గరెట్ వచ్చి నాకు చెప్పింది. కిరణ్ కి పెళ్ళికి ముందు జరిగిన ఒక ప్రమాదంలో వెన్నెముక దెబ్బ తినడం వల్ల అతనికి పిల్లలు పుట్టరన్న సంగతి తెలిసిన తరువాత మార్గరెట్ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తరువాత ఆమె డేవిడ్ ని పెళ్లాడింది. ఇప్పుడామెకు ఇద్దరు పిల్లలు. కిరణ్ ఈ విషయాలన్నీ దాచి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా నాన్నగారి స్నేహితుడు మోసం చేయడం వల్ల మా పెళ్లి జరిగింది” అనీ చెప్పింది దీప.

  • “నువ్వు చెబుతున్న విషయాలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. హర్ష మనిద్దరికి పుట్టిన వాడంటే నేను నమ్మలేక పోతున్నాను. తెలిసిన తరువాత వీడిని, నిన్ను వదులుకోలేను. నీకు ఇంకొకరితో పెళ్ళైపోయిందని తెలియగానే నాకు బంధాలు, అనుబంధాల మీద నమ్మకం పోయింది. అప్పటి నుంచి నన్ను నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. నిర్వేదంతో కొట్టు మిట్టాడుతున్నాను. జీవితం మీద విరక్తితో బతుకుతునాను. అటువంటిది ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ వార్త విన్న తరువాత ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. విరాగిలా బతుకుతున్న నాకు ఈ కొత్త బంధం జీవితం మీద కొత్త ఆశలను రగిలిస్తుందేమో?” అన్నాడు శ్రీరామ్.

  • “శ్రీరామ్, ప్రతీ జీవితానికి ఒక గమ్యం ఉండాలి. జీవితం ఒక పోరాటం లాంటిది. అందులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలే తప్ప నిరాశలో కూరుకుపోతే బ్రతుక్కి అర్ధం ఉండదు. జీవన వాహినిని మనం విజయవంతంగా దాటాలంటే ఎదురీదక తప్పదు. చనిపోయిన చేపలే ప్రవాహంతో పాటు కిందకు వెళతాయి. బతికున్నవి ప్రవాహానికి ఎదురీదతాయి. మనం జీవితంలో విజయం సాధించాలంటే జీవన ప్రవాహానికి ఎదురీదక తప్పదు” అంది దీప.
    “నువ్వు చెప్పింది నిజం దీప, ప్రవాహంలో కొట్టుకు పోయేవాడు ఒడ్డుకు చేరలేడు. ఎదురీదితేనే తీరం చేరగలడు. ఇక నుంచి మనం కలిసి జీవన పోరాటాన్ని సాగిద్దాం. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు మనం వివాహం చేసుకొని ఈ బంధాన్ని కొనసాగిద్దాం. వాడికి తల్లితండ్రుల ప్రేమను అందిద్దాం” అన్నాడు శ్రీ రామ్.
    నెల రోజుల తరువాత శ్రీ రామ్,దీప రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు.

8) వినరో భాగ్యము శీర్షిక

తిరుమలేశుని వివాహ ఋణం

అలిగి వైకుంఠం వీడిన లక్ష్మీదేవి కోసం శేషాచలంపై అడుగు పెట్టిన శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి వద్ద అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. వేంకటేశ్వర మహాత్మ్యంలోని 9వ విభాగం 120-125 శ్లోకాల్లో వున్న ఆ వివరాల ప్రకారం విళంబి నామ సంవత్సరం వైశాఖమానం శుక్ల పక్ష సప్తమి రోజున కుబేరుని నుంచి 16 లక్షల రామ వరహాలు రుణంగా తీసుకున్నారు.

అపై మూడురోజుల తర్వాత పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం జరిగింది. ఈ రుణ స్వీకరణ సందర్భంగా రాసుకున్న పత్రంపై బ్రహ్మ, మహేశ్వరుడు, వృక్షరాజైన అశ్వర్ధుడు… సాక్షి సంతకాలు చేసారు. ఆ రుణ పత్ర ఫలకం ఇప్పటికీ శ్రీవారి కోనేటి ఒడ్డున ఉన్న వరాహ స్వామి మూలవిగ్రహం వెనుక ఉందని తెలుస్తోంది.

మరిన్ని తిరుమల విశేషాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం.


Leave a Reply