Sunday magazine | ఆదివారం సంచిక 12 అక్టోబర్ 2025

ఈ సంచికలో…


మన మనసులో…మన ఇంట్లో…వీధిలో…గ్రామం/నగరం…రాష్ట్రం…దేశం….ఎక్కడైనా పూర్తి శాంతి అనేది ఉందా? అదసలు సాధ్యమయ్యే పనేనా?
ఇంతమంది మనుషులు…ఎన్నో వర్గాలు..రకరకాల సమస్యలు…నిరసనలు…రాజకీయాలు…కుట్రలు..కుతంత్రాలు…విబేధాలు…ఏ ఇద్దరి మధ్యా కుదరని ఏకాభిప్రాయాలు…
శాంతి పావురం స్వేచ్చగా విహరించే పరిస్థితి ఎక్కడైనా ఉందా?
సువిశాల పుడమిపై దేశాల మధ్య సయోధ్య…స్నేహం…అనేది నిరంతర ప్రక్రియ…అది పూర్తిగా ఆయా దేశాల విదేశాంగ విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశాల్లో అధికార మార్పిడి జరిగినప్పుడల్లా ఈ స్నేహ సంబంధాలలో కూడా మార్పు వస్తుంది.
మరి శాంతిస్థాపన ఎక్కడ? ఎన్నిరోజులు? అసలు శాంతి స్థాపనకు ప్రయత్నించేది ఎవరు? సాధించేదెవరు? దేశాల పాలకులా? ప్రజాసంఘాల నాయకులా? కళాకారులా? సాహితీవేత్తలా?
ఇవన్నీ ఆసక్తి కలిగించే విషయాలు.
శాంతి స్థాపనకు ప్రయత్నించిన వారిని గుర్తించి, అందించే శాంతి పురస్కారమే..
నోబెల్…
విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ఆయా రంగాలకు గానూ అందించే పురస్కారాల వంటిదే శాంతి పురస్కారం…
ఎవరిస్తారు ఈ పురస్కారం? ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు?
ఈ బహుమతిని నార్వేలోని నోబెల్ కమిటీ అందజేస్తుంది. కమిటీని నార్వే పార్లమెంట్ నియమిస్తుంది.
ఇతర నోబెల్ అవార్డులు స్వీడన్‌లో ఇస్తారు. కానీ శాంతి బహుమతి మాత్రం నార్వేలోనే ఇస్తారు.

ఈ ప్రక్రియలో ముందుగా నామినేషన్లు ఆహ్వానిస్తారు. ఈ నామినేషన్లను ప్రముఖులు సిఫార్సు చేస్తారు.
ఆ తర్వాత ఈ నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల పనితీరు, శాంతి నెలకొల్పడంపై వారి ప్రభావం, విశ్వసనీయతను విశ్లేషిస్తారు.
ఈ నామినేషన్లన్నిటిపైనా రహస్య ఓటింగ్ జరుగుతుంది. ఇందులో కమిటీ సభ్యులు గోప్యంగా ఓటు వేస్తారు.
ఇక ఫైనల్ గా విజేత పేరు ప్రకటిస్తారు. ఈ ప్రకటన సాధారణంగా అక్టోబర్ లో వెలువడుతుంది.
ప్రకటన వెలువడిన అనంతరం డిసెంబర్ 10న అల్ఫ్రెడ్ నోబెల్ జన్మదినం రోజున నార్వే రాజధాని ఓస్లోలో బహుమతి అందజేస్తారు.
నోబెల్ బహుమతిలో బంగారు పతకం, సర్టిఫికేట్(డిప్లోమా), సుమారు 1 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన నగదు ఉంటాయి.
ప్రతి సారీ లాగే ఈసారి కూడా నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు.
వెనిజులా ప్రతిపక్షనేత మరియా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.
పెరుగుతున్న చీకటి మధ్య ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించిన ఉక్కు మహిళగా మరియా మచాడోను నోబెల్ కమిటీ ప్రశంసించింది.
ఇదంతా సమాచారం…


ఇక ఇందులోని రెండో పార్శ్వాన్ని పరిశీలిస్తే, ఈ సారి నోబెల్ శాంతి పురస్కారానికి ఎదురు చూసిన ట్రంప్ ప్రవర్తన…వ్యాఖ్యలు, బాగా వైరల్ అయ్యాయి. తమ నేతకు ఈ పురస్కారం కోసం వైట్ హౌజ్ అనేక లాబీయింగ్ లు కూడా చేసారని గుసగుసలు వినిపించాయి.
తాను ఏడు యుద్ధాలు ఆపాననీ, ఈసారి ఈ పురస్కారం తనకే దక్కాలనీ అనేక వేదికల మీద ఎలుగెత్తి అరిచి, ఆక్రోశించి అలసి పోయారు ట్రంపు మహాశయుడు. అయినా ఆయనకు దక్కలేదు. ఆఖరికి గతంలో ఈ పురస్కారం దక్కిన ఒబామాపై అక్కసు కూడా వెళ్ళగ్రక్కారు.
అయినా నోబెల్ కమిటీ తమ పంథాలోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది.
అయినా తమ నాయకుడు యుద్ధాలు ఆపడం మానరని ఆయన నిజమైన శాంతికాముకుడని వైట్ హౌజ్ తెలిపింది. అదేం విచిత్రమో గానీ, పదేపదే ట్రంపు గారూ, వారి వైట్ హౌజ్ గణం చెప్తుంటే తప్ప వారి శాంతికాముకత్వం ప్రపంచానికి అర్థం కావడం లేదు.

ఆయుధాలు అమ్ముకోవడం కోసమే దేశాల మధ్య చిచ్చురేపుతున్నారని అపార్థం చేసుకోవడమే కానీ, ఆపడం కోసమే ఆ యుద్ధాలకు ప్రేరేపిస్తున్నారని ఒక్కరూ అర్థం చేసుకోవడం లేదు.

ప్రపంచ దేశాలపై ప్రేమతో, పెద్దన్నగా బాధ్యతతో సుంకాలతో బాదుతుంటే , అందులోని ప్రేమ, అభిమానాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు.

ఎవరి దేశంలో వారుండి చదువుకోవడం బెటరని భావించి విద్యార్థి వీసాలను కఠినతరం చేస్తున్నారే తప్ప అందులో వీసమెత్తు దురుద్దేశమైనా లేకపాయే. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి గురుదక్షిణగా ఆంక్షలను విధిస్తుంటే అదేదో నేరంగా, ప్రతీకార చర్యగా భావిస్తున్నారు.

ఇన్ని చేసినా, ఇంత కోరుకున్నా నోబెల్ రాకపాయె పాపం ట్రంపు గారికి…
అసలు ట్రంపు గారికి నోబెల్ శాంతి పురస్కారంపై అంత మక్కువ దేనికో..?
అదేం ప్రశ్న?? తమకు ఏది లేదో, ఏది రాలేదో అది కోరుకోవడం మానవనైజం.
అమెరికాలో విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ట్రంపు…కోరుకున్నవన్నీ అనుభవించాడు..అమెరికాధ్యక్షుడుగానూ పీఠాన్ని అధిష్టించాడు…ఇంకేమింకేం కావాలి? నోబులొక్కటేగా మిగిలింది? ఇచ్చేస్తే పోలా?
బెటర్ లక్ నెక్స్ట్ టైం ట్రంప్ జీ..
మళ్ళీ ఈ పురస్కారాల వరకు మరిన్ని యుద్ధాలు ఆపైనా, ప్రపంచ దేశాలను ఇంకా సుంకాలతో చావబాదైనా, తమదేశంలోకి ఒక్క పురుగునైనా అడుగుపెట్టనీయకుండా వీసాలను కఠినతరం చేసైనా, తమదేశంలో స్థిరపడిన వారిని ఏడోక నెపంతో తరిమేసైనా…మీరు ఈ పురస్కారానికి ఎంపిక కావాలని కోరుకుంటాం…


1)టాలీవుడ్‌లో మొదటి 100 కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా ఏది?
2)మనదేశంలో తేయాకు ఈ రాష్ట్రంలో ప్రసిధి ?
3)ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు?

  • సమాధానాలు చివర్లో..

సావిత్రి తను కొత్తగా కొన్న వాషింగ్ మెషీన్ను సెట్ చేసిన వ్యక్తిని చూసి, ” ఇక బాగా పని చేస్తుందా?” అని అడిగింది.
“యెస్ మేడమ్! పని చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏమీ చేయక్కర్లేదు, బట్టలను ఈ అరలో వేస ఈ బటన్ నొక్కండి చాలు. ఈ లైట్ వెలుగుతుంది. ఫజ్జీ లాజిక్, మైక్రోప్రాసెసర్ కంట్రోల్, ఆరు వాషింగ్ ప్రోగ్రామ్స్, పద్దెనిమిది కాంబినేషన్స్. ఐదు కిలోల బట్టలు వేసెయ్యొచ్చు ఈజీగా. హీరోయిన్ రష్మిక ఇంట్లో కూడా ఇదే మోడల్ ఉంది. మీ బట్టలకు సరిపడా టైమింగ్స్ తనే ఆటోమాటిక్ గా సెట్ చేసుకుంటుందీ మెషీన్. మొదట రిన్సింగ్ చేస్తుంది. ఆ తర్వాత వాషింగ్, స్పిన్నింగ్, డ్రైయింగ్… ఇది రెండు డైరక్షన్లలో పని చేస్తుంది. తడిబట్టలు బయటకు వచ్చేటప్పుడు, సుమారు నాలుగు వంతులు పొడిగా ఉంటాయి. మీరు కొంచెం విదిల్చాలి అంతే. బట్ట ష్రింకవదు. రంగు వెలిసిపోదు. మీరు కాస్త వైటనర్ వేస్తే…పెళ్ళి డ్రస్సులా మెరిసిపోతుంది కూడా. “
“దీపావళి ఫెస్టివల్ కి డిస్కౌంట్ అన్నారే ?”
“పదిహేను వేలు.. డిస్కౌంట్ తర్వాతే మేడమ్. మీకు ఒక పెద్ద ప్లాస్టిక్ టబ్ ఉచితంగా ఇస్తున్నాం, ఉతికిన బట్టలు వేసుకోడానికి .”
సేల్స్ మేన్ మరోసారి డెమోన్ స్ట్రేషన్ చేస్తుంటే, విప్పారిన కళ్ళతో చూసింది సావిత్రి. రన్నింగ్ మెషీన్ చేసే శబ్దాలు చెవులకు మృందంగ సంగీతంలా అనిపించింది.
సావిత్రి ఇచ్చిన టిప్ను తీసుకుని, టూల్ కిట్టు సర్దుకుని వెళ్లిపోయాడు సేల్స్ మ్యాన్ .
వాషింగ్ మెషీన్లో బట్టలు వేసేటప్పుడు, సావిత్రికి హై-టెక్ యుగంలోకి అడుగుపెట్టినట్లనంత గర్వంగా అనిపించింది.
సేల్స్ మ్యాన్ చెప్పినట్లు బైటికి తీసిన బట్టలు నాలుగు వంతులు పొడిగా మెరుస్తూ కనిపించాయి. తృప్తిగా ఊపిరి తీసుకుంది సావిత్రి.

శశిధర్ ఆఫీసు నుంచి వచ్చే వేళకు బాగా చీకటిబడింది!
అప్పటికే, వాషింగ్ మెషీన్ ఆపరేషన్ లో మాష్టర్ డిగ్రీ సాధించి ఉంది సావిత్రి.
బాత్ రూం బైట DRA 934 మోడల్ వాషింగ్ మెషీన్, గుళ్ళో అమ్మవారిలా కనిపించటంతో “వావ్” అని అరిచాడు శశిధర్.
“మీ టెక్కీ మాత ప్రసాదం ఇంటికొచ్చేసిందన్న మాట! ఎలాగైనా, ఈకాలం మీ ఆడవాళ్ళు మహా అదృష్టజాతకులు తల్లీ! ఇంటి పనులన్నీ యంత్రాలే చేసేస్తున్నాయ్! చపాతీ మెషీన్, రెడీమేడ్ ఇడ్లీ బ్యాటర్..మిక్సీ, గ్రైండర్.. ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్! ఇంకేం కావాలో ఆదేశించండి మహారాణీ! శిరసావహించటానికి సిద్ధంగా ఉన్నాడీ దాసుడు” అన్నాడు శశిధర్ నాటకీయంగా .

“ఈ గృహరాణి శ్రమను గుర్తించి ప్రశంసించారు. అదే శ్రీవారు ఇచ్చే పెద్ద కానుక. మా ప్రాణనాథులు సదా ఇలాగే ప్రేమిస్తుంటే కైలాసగిరిని సైతం గడ్డిపోచలా ఎత్తేయగలదు ఈ ప్రేయసి మరి.” అంది అంతే నాటకీయంగా సావిత్రి నవ్వుతూ.
“కొత్తగా ఈ ప్రేమలూ ప్రాణాలూ ఏంటి సుందరీ?! అవునూ! అన్నట్లు మనకు పెళ్లయి ఎన్నేళ్ళు అయింది ప్రియా?”
“ఈ నెలగడిస్తే నిండు పదిహేను వసంతాలు మతిమరుపు మహాశయా!”

“అబ్బా! అప్పుడే అన్ని వసంతాలా! నిన్న గాక మొన్నే జరిగినట్లుంది మన ఫస్ట్ నైట్ యడ్వెంచర్. అప్పుడు సిగ్గుతో ఈ ముగ్ధ బకాయి పెట్టిన ముద్దులన్నీ ఇప్పుడు చక్రవడ్డీతో సహా తీర్చుకోక తప్పదు” అంటూ భార్యను చిలిపిగా దగ్గరికి తీసుకోబోయాడు శశిధర్. భర్తను మురిపెంగా వెనక్కి తోసి . “ముందు తమరు వెళ్ళి స్నానం చేసి రండి స్వామీ! ఆ బట్టలు ఇటు పారెయ్యండి!”
శశిధర్ బుద్ధిగా బాత్రూంలోకి దూరిపోయాడు తుండులోకి మారి. భర్త చిలిపి చేష్టలు తలుచుకుని మురిసిపోయింది సావిత్రి.
అతగాడు విడిచిన బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తూ షర్ట్ ను ఒకసారి గట్టిగా విదిల్చింది. ఎప్పట్నుంచి అంటుకొనుందో వెనక.. షర్టు దులిపిన విసురికి ఎదురుగా నేలమీద పడింది.. వడలిపోయినా ఇంకా వాసన తగ్గని నలిగిని మల్లెపూవు ఒకటి!


ఆంధ్ర ప్రభ పాఠకులు అందరికి శుభోదయం. నా పేరు గాయత్రి. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అంటే మానసిక నిపుణురాలిని. వృత్తి పరంగా నేను చాలా మంది క్లయింట్స్ తో మాట్లాడతాను. వీళ్లలో పిల్లలు, టీనేజర్స్ యుక్త వయసు వారు మరియు పెద్దవారు ఇలా అన్ని వయసుల-వర్గాల వారూ ఉంటారు. మరి మేము ఏం మాట్లాడుకుంటాము? అంతా మనసు గురించే. మనసు బాగుందా? బాగోలేదా? అని ఎలా తెలుస్తోంది? మానసిక రుగ్మతలు అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి. తగ్గించుకోవడం ఎలా? మానసిక దృఢత్వం పెంచుకోవడం ఎలా? ఇవన్నీ మేము మాట్లాడుకునే ముఖ్యమైన విషయాలు. కౌన్సిలింగ్ మరియి థెరపీ అన్నది ఒక థెరపిస్ట్ మరియు క్లయింట్ మధ్యన ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్ షిప్. ఇందులో పరస్పర గౌరవం అన్నది చాలా ముఖ్యం. గౌరవం ఉంటేనే నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఉంటేనే క్లయింట్స్ తన మానసిక పరిస్థితి గురించి నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పగల్గుతారు. ఆలాగే వాళ్ళని జడ్జ్ చెయ్యము అన్న భరోసా, మరియు ఏది షేర్ చేసినా గుప్తంగా ఉంచుతాము అన్న భరోసా గుండె లోతుల్లో దాచుకున్న మనసు మాటలను బయటికి తీసుకురావటానికి తోడ్పడుతుంది.

అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? మానసిక ఆరోగ్యం మీద అవగాహన పెంచాలి అనే దృడమైన సంకల్పంతో ఆంధ్రప్రభ చేపట్టిన ప్రయత్నమే మా “మనసు-మాట” ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మేము మాట్లాడేది అంత మనసు గురించే. మన డైనందిక జీవితంలో ఎంత మంది మనసు మాట వింటున్నాము? ఈ వురుకులు పరుగుల కాలంలో ఎంతవరకు మన మనసు మీద, మన చుట్టూ ఉన్న వారి మనసు మీద దృష్టి పెట్టగల్గుతున్నాం ? ఆలా పెట్టినప్పుడే కదా మన బంధాలు బలపడతాయి. మనమెప్పుడైతే మానసికంగా ఆరోగ్యంగా ఉంటామో, అప్పుడే మనతో మనకున్న బంధం, మరియు ఇతరులతో మన బంధం దృఢమవుతాయి.

ది మైండ్ వాయిస్: నా వృత్తి పరంగా ఎంతోమంది మైండ్ వాయిస్ నేను వింటాను. ఇప్పుడు మనసు-మాట ది మైండ్ వాయిస్ ఫీచర్ ద్వారా మీ మనసు మాటలు వినాలి అనుకుంటున్నాను. మన ఆలోచనలు మరియు భావొద్వేగాలే ఈ మైండ్ వాయిస్. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకొనే మార్గంలో ఎక్కాల్సిన మొదటి మెట్టు. ఈ మైండ్ వాయిస్ ని వినడం మరియు వ్యక్తపరచడం వలనే దానిని బలపర్చుకోలుగుతాము. అయితే నిత్య జీవితంలో మనం ఈ వాయిస్ ని ఎలా వినాలి? ఎంత వరకు వినాలి? విన్న తరువాత ఆ ఆలోచనల్ని కార్యరూపంలోకి ఎలా మార్చాలి. భావొద్వేగాలని ఎలా నియంత్రించుకోవాలి? అన్న దాని మీద దృష్టిపెట్టడం వల్లనే మానసిక ఆరోగ్యం పెంచుకోగల్గుతాము.

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సస్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో 23% మంది పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 2% చొప్పున సూసైడ్ రేట్స్ పెరుగుతున్నాయి. అలాగే విద్యార్థుల్లో 4% సూసైడ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఈ గణాంకాలు ఏం సూచిస్తున్నాయంటే మనమందరం మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అలాగే అవగాహన పెంచుకోవాలి. మా మనసు మాట ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. మనసు మాటని సెల్ఫ్ టాక్ అని కూడా అంటారు. దీని ప్రభావం మన మానసిక పరిస్థితి మీద ఉంటుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ వలన మన మూడ్స్ ని మెరుగు పరుస్తుంది. ఏ సందర్భానైనా ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపోందిస్తుంది. నెగటివ్ సెల్ఫ్ టాక్ వలన వత్తిడి పెరిగి యాంగ్జైటీ మరియి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మనసు మాట గురించి ఇంకా చదవాలని వుందా? అయితే వచ్చే ఆదివారం మనసు-మాట ఫీచర్ తో ఇక్కడే మళ్ళీ కలుద్దాం.
-గాయత్రి


జీవితం క‌ల‌బోత‌! సామెత‌!

ఈ కాల‌మ్ గురించి..

     సామెత‌లు లేదా లోకోక్తులు సుసంప‌న్నం చేయ‌ని భాష ఉండ‌దు. ఇవి క్లుప్తంగా, ప్ర‌జ‌ల నోళ్ల‌లో నిరంత‌రం నానుతూ ఉంటాయి. వీటిలో భాషా నిర్మాణం తొణికిస‌లాడుతూ ఉంటుంది. ఏదేని మీది మాట‌ల్లో ఉన్నా, ఎన్నో జీవిత స‌త్యాల‌ను ఆవిష్క‌రిస్తుంది సామెత‌. సంద‌ర్భానుసారంగా సామెత‌ల‌ను ఉటంకించ‌డం భాష‌లో మ‌న‌కున్నప‌ట్టును సూచిస్తుంది. ఏద‌యినా ఒక స‌మాజ విశేష‌మును చెప్పి, దాన్ని వెంట‌నే ఒక సామెత‌తో అన్వ‌యిస్తే, అది అర్థాంత‌ర న్యాసాలంకారమై కూర్చుంటుంది.

        సామెత‌ను ప‌లుకుబ‌టి అని  కూడా అంటారు. అది ఆ భాష మాట్లాడే వారి సంస్కృతి, సంప్ర‌దాయం, నాగ‌రిక‌త‌ల‌ను ప్ర‌తిఫ‌లిస్తాయి. సామెత లేని మాట ఆమెత లేనియిల్లు అంటారు. ఆమెత అంటే ఉత్స‌వ‌ము, విందు, పండుగ అని అర్థాలున్నాయి. సామెత‌లు ప్ర‌జ‌ల అనుభ‌వాల్లోనించే వ‌స్తాయి. వాటికి సృష్టిక‌ర్త‌లు ప్ర‌త్యేకంగా ఉండ‌రు. కానీ, గొప్ప‌గొప్ప క‌వులు, ర‌చ‌యిత‌ల గ్రంథాల్లో వారు వాడిన‌, పాత్ర‌ల చేత ప‌లికించిన మాట‌లు సామెత‌ల హోదా పొందుతాయి. అలా జ‌రిగితే దానిని ప్రావ‌ర్బియ‌ల్ స్టేట‌స్ అంటారు. అప్పుడ‌వి విశ్వ‌జ‌నీనంగా మార‌తాయి.

      భాష‌కు, సాహిత్యానికి ద‌శాబ్దాలుగా ఆంధ్ర‌ప్ర‌భలో చేస్తున్న‌సేవ ఎన‌లేనిది. ఇప్పుడు వారి ప్ర‌భాన్యూస్ వెబ్‌సైట్‌లో భాగంగా ఆదివారం సంచిక‌ను వెలువ‌రించ‌డం అత్యంత ముదావ‌హం.

    ప్ర‌తివారం ఒక చ‌క్క‌ని తెలుగు సామెత‌ను తీసుకొని దాన్ని స‌మ‌కాలీన స‌మాజానికి, జీవితానికి అన్వ‌యిస్తూ దానిలోని భాషా, భావ‌సంప‌ద‌ను వివ‌రిస్తూ, ఇత‌ర భాష‌ల్లో అలాంటివే ఏమైనా ఉన్నాయోమో ప‌రామ‌ర్శిస్తూ, వెర‌సి సాహిత్య‌పు ఆమెత‌ను అందిస్తూ ఈ కాల‌మ్ సాగుతుంది.



చిన్న చిన్న పనులే ఒక్కోసారి గొప్ప ఆనందాలని ఇస్తాయి.
సూర్య ఒకరోజు పొద్దున్నే తన కూతుర్ని రెడీ చేసి కార్ లో తీసుకెళ్ళి స్కూల్ లో దింపాక..తిరిగొస్తూంటే చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడడంతో కారాపాడు. ఒక అమ్మాయి వచ్చి చేతిలోని పెన్నులు కొనమని దీనంగా అడుగుతూ చేతులు చాచింది. ఇప్పుడంతా టైపింగ్ కాలమేనాయే…పెన్నులతో పనేమిటి? అనుకుని చూసీ చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఎంతకూ వదలకుండా కారు కిటికీవద్దే నిల్చుని బ్రతిమిలాడుతూనే ఉంది. ఆ అమ్మాయి మొహం చూస్తుంటే పాపం అని జాలి అనిపించి ఊరికే ఓ ఐదు రూపాయల బిళ్ళ ఇస్తే తీసుకోలేదు. పైగా పెన్ను కొనమని దీనంగా అభ్యర్థిస్తోంది.

పెన్ను అవసరం కోసం కాకున్నా, ఆ అమ్మాయి కోసమని ఇరవై రూపాయల నోటిచ్చాడు. దానికి ఆ అమ్మాయి సంతోషంగా రెండు పెన్నులు ఇచ్చి, ఇంకో గిరాకీని వెతుక్కోవడానికి వెళ్ళిపోయింది. ఊరికే డబ్బులిచ్చినా తీసుకోని ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసానికి ముచ్చటేసింది సూర్యానికి.
ఈలోగా గ్రీన్ లైట్ పడడంతో గబగబా పెన్నులు జేబులో వేసుకుని కార్ స్టార్ట్ చేసి ముందుకురికించాడు.

తర్వాత ఇంటికి వచ్చి ‘నేను రెండు పెన్నులు కొన్నాను..ఒకటి నీకు ఇంకొకటి చెల్లికి’ అని చెప్పాడు. కొడుకు హేపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత రెడీ అయి ఆఫీసుకి వెళ్ళిపోయాడు సూర్య.


సాయంత్రం ఇంటికొచ్చాక వాళ్ళమ్మాయి ఎదురొచ్చి “డాడీ! నీకో గుడ్ న్యూస్!!” అంటూ చెప్పింది.
“ఏంటమ్మా అది” అని అడిగాడు సూర్య.
“నాకు సైన్స్ లో టెన్ అవుటాఫ్ టెన్ మార్క్స్ వచ్చాయి” అని సంబరంగా చెప్పింది సూర్య కూతురు.
“ఓహ్.. అవునా..అయితే ఇదిగో నీకు గిఫ్ట్” అని పెన్ను ఇచ్చాడు సూర్య.
“థాంక్యూ డాడీ” అంటూ మురిసి పోయింది అమ్మాయి.
“నీకు మంచి మార్కులు వస్తాయి అని ముందే ఊహించి ఈ గిఫ్ట్ తెచ్చాను తెలుసా!
నువ్వు బాగా చదివే నా బంగారు తల్లివి కదా!” అంటూ ముద్దు చేసాడు సూర్య.
పక్క నుండి ఇది వింటున్న కొడుకు, “ఎంత బాగా క్రియేటివిటీ చూపిస్తున్నావు డాడీ..ఊరికే పెన్ను కొని, ఇప్పుడు ఆ పెన్ను గిఫ్ట్ గా కొన్నాను అని చెబుతున్నావు” అంటూ నవ్వాడు.
“ఎప్పుడు కొన్నాము, ఎందుకు కొన్నాము అని కాదు. దాన్ని సందర్భానుసారంగా ఎలా ప్రెజెంట్ చేసాం అన్నది ముఖ్యం” అని నవ్వుతూ చెప్పాడు సూర్య.
ఆ పెన్నులు చూస్తుంటే మనసులో ఆ అమ్మాయి మొహం గుర్తొచ్చి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా అనిపించింది సూర్యానికి.


చుట్టూ వున్న పదిమంది మాటలు వినిపిస్తున్నాయి రాంబాబుకి. వాళ్లల్లో ఒకడు ‘ఒక శకం ముగిసింది’ అన్నాడు. మరొకడు ఎవడో లేచి కాళ్ల దగ్గరకొచ్చి నమస్కరించి పూలు విసిరేసి ‘మహా విశ్రాంతి తీసుకోబోతున్నాడు, ధన్యుడు’ అన్నాడు. అంతే పట్టలేని వీరావేశం పెల్లుబికింది రాంబాబుకు. తనకు ఎప్పటికీ నచ్చని మాట, తన డిక్షనరీలో లేని పదం ‘విశ్రాంతి’.

అర్ధం ఏంటో తెలియని పదం. ఎలా వుంటుందో తెలియని పదం. అందుకే బఢాలున కట్టలు తెగి ప్రవహించేంత ఆవేశం పొంగుకొచ్చింది. ఒక్కసారిగా లేచి అతని గొంతు పట్టుకొని ‘ఎక్కడరా విశ్రాంతి. ఎప్పుడైనా నువ్వు అనుభవించావురా దాన్ని. నాకు నచ్చని ఏకైక బద్ద శత్రువురా అది. మరొకసారి ఆ మాట అన్నావంటే గొంతు పిసికి చంపేస్తాను. జాగ్రత్త’ అని గట్టిగా అరవాలనిపించింది.

కాని అరవలేకపోయాడు. తమాయించుకున్నాడు. ఎందుకిలా తను ఆలోచిస్తున్నాడు తనకు తానే అలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనలోంచి తెలియకుండానే సింహావలోకనం చేస్తూ గతంలోకి ప్రయాణించాడు.

రాంబాబు తన తండ్రి చిటికిన వేలు పట్టుకుని వెళ్లి స్కూలులో చేరాడు తండ్రికి రాంబాబు అంటే ఎంతో ఇష్టం. ఇష్టం అనడం కంటే ప్రాణం అంటే బాగుంటుందేమో. స్కూలులో చేర్చినరోజే పుస్తకాల ఫీజు కట్టేశాడు. ఆ రోజే ఓ బస్తాలాంటి బ్యాగు, దానినిండా పుస్తకాలు బుజాన వేశారు స్కూలువాళ్లు..

ఇంటికి వచ్చాక చేతులు నొప్పులు వచ్చాయి వాటిని ఓర్చు కుంటూ అదొకొత్త అనుభూతిలా భావించాడు. మరుసటి రోజు నుండి ఇచ్చిన హోమ్ వర్క్ చేసేటప్పటికి నొప్పులు మర్చిపోయాడు. ఒక్కోరోజు మద్యలోనే అలసిపోయి నిద్రపోయేవాడు తెలియకుండానే.

అమ్మ తీసుకెళ్లి మంచంపైన పడుకోబెట్టేదట. అటువంటప్పుడు పొద్దునే లేపి అమ్మ పక్కన స్కూలులో కూర్చుండబెట్టుకుని వర్క్ మొత్తం గబగబా చేయించేది. వెంటనే రెడీ చేసి దింపేసేది. నిద్రసరిపోక స్కూలు కెళ్లి తూగుతూ ఉండేవాడు. మిత్రులందరూ హేళన చేసేవారు.

ఓ రోజూ అలా హెూమ్ వర్క్ చేయించే ఓపిక, తీరిక అమ్మకు లేక, అమ్మ టీవి చూసే సమయంలో తను కూడా దానికి అలవాటు పడుతున్నానని ట్యూషన్లో చేర్పించారు. రాగానే గబగబా స్నాక్స్ తినేసి పరిగెత్తుకుంటూ ట్యూషన్కు వెళ్లేవాడు. అలా స్కూలుకెళ్లటమే ఒక యుగంగా భావించే రాంబాబుకు ట్యూషన్ మరొక గుదిబండలా మారింది.

అలా ఎలిమెంట రీ స్కూలు అయిపోగానే వేసవి సెలవల్లో స్నేహితులతో ఆడుకోవడానికి అలవాటుపడ్డాడని సెలవులు అయిపోకముందే హాస్టలులో వేశారు. నెలకో రెండు నెలలకో అమావస్య, పున్నమిల్లాగా వచ్చి చూసి పొయ్యేవారు అమ్మనాన్నలు.

హాస్టలులో పిల్లలంతా మరీ మరబొమ్మల్లా ఉండేవాళ్లు. తినడం, చదవడం, రాయడం లేక నిద్రపోవడం అంతే ఇవే దినచర్యలో ముఖ్యాంశాలు. తల్లిదండ్రులతో మాట్లాడాలంటే అదో ప్రహసనం. బాగాలేదనో లేక దిగులుగా వుందనో చెప్పి పర్మిషను తీసుకుని ఓ రెండు నిమిషాలు ఫోనులో మాట్లాడితే బాగా చదువుకో, ఆరోగ్యం జాగ్రత్త ఇవి రెండే మాటలు. మూడో మాటమాట్లాడితే మార్కులు ఎలా వస్తున్నాయి. చివరికి సమాధానం చెప్పలేక మాట్లాడడం తగ్గించేశాడు.

ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ కోసం ఓ యజ్ఞం చేయాల్సివచ్చింది. తర్వాత మళ్లీ హాస్టలుకే అంకితం గావటంతో ఏం తింటున్నామో తెలియని జీవితం, ఏం సాధించాలో తెలియని పయనం. తర్వాత ఉద్యోగం కోసం పాట్లు, పరుగులు, పోటీపరీక్షలు అలసి.. సొలసి ఉద్యోగం సాధించితే కనీసం నెళ్లాయినా అలుపు తీర్చుకోకముందే మెడకో డోలు.

ఒక్కడినే ఏ మాత్రం ఎంజాయ్మెంట్ లేదని భావిస్తుంటే జీవితంలో మరో తోడు. మరో బాధ్యత. మరో లోకంలో విహరిద్దాం అంటూ మాయలోపడి ఏదో చేయబోతే మరో రెండు జీవులు సంసారాన్ని రెట్టింపు చేసి మా సంగతేంటని ప్రశ్నించాయి. పరుగుల జోరు మరింత వేగం పుంజుకుంది.

ఆఫీసుకు వెళ్లాలని హడావుడిగా బయలుదేరే సమయంలో ఒకడికి కడుపు నొప్పి, మరొకడికి జ్వరం. డాక్టరు దగ్గరకు పరిగెత్తే సమయం వుండదు. మనకు సమయం వున్నప్పుడు డాక్టరు వుండడు.

ఏమి చెయ్యాలి. ఇద్దరూ ఉద్యోగం చేస్తేగాని గడవని పరిస్తితి. ఎవరికీ సెలవు పెట్టడం కుదరదు. ఇదికదా జీవితమంటే. ఎక్కడ ప్రశాంతత, ఎక్కడ విశ్రాంతి. ఎవడైనా ఒక్కడిని చెప్పమనండి వాడు హాయిగా విశ్రాంతిగా వున్నాడని, ప్రశాంతంగా వున్నాడని.

ఓసారి జరిగిన ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన గుర్తొచ్చింది రాంబాబుకి.

ఆరోజు ఆఫీసునుండి వస్తూ దారిలో పడిపోయాడు. దగ్గరలో హాస్పిటల్కు చేర్చారు. డాక్టరు అన్ని టెస్ట్ లు చేసి గుండె బలహీనంగా వుందని ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా వుండాలని చెప్పాడు. ఇంటికి వచ్చాక బస్సు ప్రయాణం వల్ల అలసిపోతున్నావని… భార్య, పిల్లలు తీర్మానం చేసి రేపటినుండి టాక్సీలో వెళ్లాల్సిందేనని, దానివల్ల పోయేటప్పుడు రెస్ట్ వస్తుందని పట్టుబట్టారు.

తప్పక అలాగే వెళ్లాడు. ఆ విషయం తెలిసిన ఆఫీసు బాస్, రాంబాబు నీవు వచ్చేటప్పుడు ఈ ఫైలు చదువుతూ రా, ఈ కస్టమర్లతో మాట్లాడుతూ రా… అని కొత్త పనులు అంటించాడు. దానివల్ల మరింత స్ట్రెయిన్ అయి వారంలోనే మరోసారి గుండెనొప్పి వచ్చింది. ఇంక ఎక్కడిదిరా విశ్రాంతి. ఎక్కడరా ప్రశాంతత.

ఆరోజు ఇంటికి వచ్చేటప్పుడు రాకెట్ స్పీడుతో వెళుతున్న ఓ కుర్రవాడు కనిపించాడు. రోడ్డు మీద వెళ్లేవాడికి అంత వేగంగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ప్రశాంతంగావుంటే… వాడు గాలి కన్నా వేగంగా వెళితే మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటాడా. మద్యలో తెలియని మరో జీవి అకస్మాత్తుగా ఎదురైతే పరిస్థితి ఏమిటి. ఎంతమందికి అది అవరోధం. వీరిలో ఎవరికి విశ్రాంతి దొరుకుతుంది. ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నాడు రాంబాబు.

ఇంతలో సెల్ఫోన్ మాట్లాడుతూ… రోడ్డు దాటే మరో వేగచోదకుడు బలంగా గుద్దటంతో తాను అక్కడే పడిపోయాడు. అక్కడికక్కడే కోమాలోకి వెళ్లాడు అనుకుంటున్నారు అందరూ, కానీ తనకు అన్నీ వినపడుతున్నాయి… కానీ మాట్లాడే పరిస్తితిలేదు స్పందించే ఓపిక లేదు. అందుకే వాళ్ల మాటలు వింటూ జీవనపర్యంతాన్ని నెమరు వేసుకుంటున్నాడు.

ఇంతలో ఆఫీసు స్టాఫ్ అంతా వచ్చినట్టున్నారు. కొత్త నిట్టూర్పులు విన్పిస్తున్నాయి. బాస్ అంటున్నాడు. ‘రాంబాబు చాలా మంచి వ్యక్తి. అంతేకాదు ఎవరికీ హాని చేయడు. కష్ట పడి పనిచేస్తాడు. ఆఫీసులో అందరికన్నా బాధ్యతగా అంతా తన పనే అనుకుని చక్కగా చేస్తాడు అలాంటి వ్యక్తి ఇలా అవతాడని కలలో కూడా ఊహించలేము’ అంటూ కళ్లు తుడుచుకుంటున్నాడు.

అవునండి రాంబాబుగారు చాలా మంచివాడు. ఆ ఆఫీసులో ఏ పని వచ్చినా ఈయన దగ్గరికే వెళతాం. అంతేకాదు చాలా నిక్కచ్చి మనిషి, ఒక్క రూపాయి కూడా లంచం తీసుకుని ఎరగడు. ఏ ఆఫీసుకెళ్లినా ఎంత ఇస్తారు అని డిమాండ్ చేసే ఈ రోజుల్లో ఎటువంటి మచ్చ లేకుండా మంచి సర్వీస్ చేసిన రాంబాబు చాలా గొప్పవాడు.

దేముడు చాలా అన్యాయం చేశాడు. మరికొంత కాలం ఇటువంటి వారు ఉంటే జనానికి మరింత మేలు జరిగేది’ అంటున్నా డు ఓ బాగా తెలిసిన కస్టమరు ఎంతో బాధగా. ‘రాంబాబుగారు చాలా సిన్సియర్. ప్రతిరోజు టంచనుగా టైం పాటించేవాడు. సమయానికి రావడం కాని, పనిలో సిన్సియారిటీ గాని ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను’ చెప్తున్నాడు ఓ కొలీగ్…

‘ఆఫీసులో తెలియని విషయాలు చాలా చెప్పేవాడు మాకందరికీ మంచి గైడ్. అంతేకాదు ఆయన ఎప్పుడూ సెలవలు కూడా ఎక్కువగా పెట్టేవాడు కాదు. ఆఫీసుకొస్తే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసేవాడు కాదు ఆయనను ఎలా మర్చిపోగలం’ అంటూ వలవలా ఏడ్చేస్తున్నాడు. పక్కసీటు సహోద్యోగి.

అవునా ఇంత మంచి పేరుందా నాకు ఆశ్చర్యపోయాడు రాంబాబు. ఇంత గొప్పవాడినా నేను. అంటే నేను ఇప్పటివరకు నెమరు వేసుకున్న నా బాధ అంతా నాణానికి ఓవైపేనా. మరోవైపు కనిపించకుండా సంతోషపెట్టే బొమ్మ కూడా వుంటుందా, తెలియకుండానే కన్నీరు కారిపోసాగాయి.

అంటే నేను అనుకున్నది సాధించాలనుకున్నాను కాబట్టే అన్ని కష్టాలు ఎదురయ్యాయా. అవును. కష్టాలు దాటితేనే గదా సుఖం దక్కేది. అసలు కష్టాలకే విలవిలలాడిపోతే సుఖం విలువ ఏం తెలుస్తుంది. అవును నేను ఈ పరుగుల యుగంలో ఇంత స్తాయికి వచ్చి ఇక్కడ ఇంత మంచి పేరు తెచ్చుకున్నానంటే నేను ఆ పుస్తకాల బస్తాతో తంటాలు పడబట్టేకదా.

లేకుంటే నాకన్నా ఎంతోమంది నాలాగా చదివినవారికన్నా గొప్పగా ఇంత మంచి ఉద్యోగం చేస్తూ ఇంత మంచి పేరు సంపాదించగలిగేవాడినా. దానికి కారణం నాన్నా, అమ్మా కాదా. నాకోసం కష్ట పడి సంపాదించి వారు తిన్నా తినకపోయినా నన్ను హాస్టలు చేర్పించి చదివించన ప్రతిఫలమే గదా ఇది అనుకుని మరో కన్నీటిబొట్టు విడిచాడు.

చదువుకున్న వారెక్కువ అయినప్పుడు పోటీ తప్పదుకదా. ఎన్ని పరీక్షలు రాసినా కాదనకుండా ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చి పంపిన నాన్న రుణం తీర్చుకోవద్దా. ఉద్యోగం వచ్చి దూరంగా పోతే సరైన భోజనం ఉండదని అమ్మా నాన్న వెంటనే పెళ్లి చేస్తే తను ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నాడు.

ఆలోచించేకొద్దీ తను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో ఇప్పుడు అర్ధం అవుతోంది. కష్టపడితేనేగదా ఫలితం వుంటుంది. అంతేకాదు ఎంత కష్టపడితే అంత ఫలితం వుంటుంది కదా. ఇంకా సాధించవలసింది చాలా వుంది అనుకుంటుంటే మరింత పై స్థాయికి వెళ్లగలుగుతాం అంతేకాని విశ్రాంతి లేని జీవితం అని భావిస్తే చివరకు మిగిలేది విశ్రాంతే బాధ గా మరింత ఆలోచనలో మునిగిపోయాడు రాంబాబు.

ఇంతలోనే అదుగో ఎవరో మళ్లీ మరొకరు అంటున్నారు. ‘పాపం ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నాడు. నిజంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లున్నాడు’ ధన్యజీవి, కారణజన్ముడు’.

ఇప్పుడు మనసు బాధతో మూలిగింది. తెలియకుండానే మనసు పెదాలతో ఉచ్ఛరించాడు చివరిసారిగా వి…శ్రాం…తి…..


తిరుమలలోని నిద్రపోని చింతచెట్టు

తిరుమలేశుని మహాద్వారం ముందు ఒకప్పుడు ఒక పెద్ద చింత చెట్టు ఉండేది.
ఆ చెట్టు కింద ఉన్న పుట్టలోనే స్వామివారి మూలమూర్తి లభ్యమైనదని ఐతిహ్యం చెబుతోంది. అ విగ్రహాన్ని గోపీనాథ దీక్షితులు అనే వైఖానస అర్చకుడు ఇప్పుడు ఉన్న గర్భాలయ స్థలంలో ప్రతిష్టింప చేసారని పురాణాలు పేర్కొంటున్నాయి.

సాధారణ చెట్లకు భిన్నంగా ఆ చెట్టులో ఏడాది పొడవునా పూత పూయడం, కాయలు కాయడం నిరంతరాయంగా కొనసాగేదని, అందుకే దాన్ని ఉన్నిద్ర తింత్రీణి వృక్షం (నిద్రపోని చింతచెట్టు) అని పిలిచేవారని చెబుతారు.

శ్రీవారి గర్భాలయ నిర్మాణం చేసేటప్పుడు ఆ చెట్టును అలాగే ఉంచాలని స్వామివారే తొండమాన్ చక్రవర్తికి చెప్పారని కూడా పురాణాలు తెలియచేస్తున్నాయి.

ఆ తర్వాత వివిధ నిర్మాణాలు చేపట్టిన రాజవంశాలు ఆ చెట్టును తొలగించడంతో ఆ చెట్టు 10వ శతాబ్దం నుంచి కనిపించకుండాపోయింది.

మరిన్ని తిరుమల విశేషాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం.

========================================


సంకలనం పేరు : హరికృష్ణ కార్టూన్లు
వెల : రూ. 450/-
ప్రతులకు : నాగేశ్వరం హరికృష్ణ,
మొబైల్ నెంబర్ : 9951817518

హరికృష్ణ వెలువరించిన కార్టూన్ల సంకలనం ప్రయత్నం హర్షణీయం. ఖర్చుకు వెనుకాడకుండా పూర్తిగా అన్ని పేజీలూ రంగుల్లో వేసారు. ఒక్కొక్కసారి కార్టూన్ అందం రంగుల్లోనే తెలుస్తుంది. అందుకే పుస్తకం ఆసాంతం అందంగా కనిపిస్తోంది. చాలా వరకు విదేశీ ప్రసిద్ధ కార్టూనిస్టులలో బొమ్మమీద కంటే కాన్సెప్ట్ మీదనే కాన్సంట్రేషన్ కనిపిస్తుంది. మన హరికృష్ణను కూడా అదే కోవలో పరిగణించవచ్చు. ఏ కార్టూన్ లో కూడా హెవీ వర్క్ లేని లైట్ కార్టూన్స్ ఇవి. సబ్జెక్టులు బాగున్నాయి. వాటిని సందర్భానుసారం వేసారని తెలుస్తూనే ఉంది. కానీ, ఎప్పుడు చూసినా నవ్వొచ్చే విధంగా ఉన్నాయి.

అలాగే చాలావరకు సామాజికాంశాలపై సూటిగా వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. బ్రష్ లైన్ లేదా సింగిల్ లైన్ అని చెప్పలేం. ఎందుకంటే డిజిటల్ లైన్ అని కార్టూనిస్టులంతా కొత్తపుంతలు తొక్కుతూ, సాంకేతికతను ఒడిసి పట్టుకుంటున్నారు . అలాంటివారిలో హరికృష్ణ ముందే ఉంటాడు. పైగా ట్యాబ్ ఎలా వాడాలో తానే శిక్షణ కూడా ఇస్తాడాయె. డిజిటల్ లైనింగ్ అని ఆ స్పీడ్ చూస్తేనే తెలుస్తుంది.

సరే…కార్టూన్లు చూసి హాయిగా నవ్వుకోవాలనుకునే కార్టూన్ ఇష్టులకు ఇవన్నీ అవసరం లేని అంశాలు. కార్టూన్ ప్రియులు తప్పకుండా కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది. చక్కగా నవ్వుకోవచ్చు…బాగా పేలే గన్నులకు లైసెన్సు అవసరమేమో గానీ, బాగా పేలే కార్టూన్లు ఉన్న ఈ పుస్తకం కొనాలంటే మాత్రం ఏ లైసెన్సూ అవసరం లేదు. పైగా గన్ను కంటే ఈ పుస్తకమే ధర తక్కువ కూడా. వీలైనంత త్వరగా ఈ పుస్తకం కొని, ఇంట్లో దాచుకుని వీలైనప్పుడల్లా కార్టూన్లు చూసుకుంటూ నవ్వుకుందాం మది.
-మాధవ్


1)మగధీర (2009)
2)అస్సాం
3)మార్టిన్ కూపర్ (1973 – మోటరోలా)


Leave a Reply