హైదరాబాద్ – ఆంధ్రప్రభ – వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని చెప్పేస్తాం. కానీ వాతావరణ మార్పుల కారణంగా జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి ముందుగానే వచ్చేసిందా అనే భావన మనలో కలుగుతోంది. ఏటా ఉష్ణోగ్రతల్లో రికార్డు స్థాయి పెరుగుదల నమోదు అవుతోంది. గత శతాబ్దకాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదు అయ్యింది. 2025 కూడా దే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. 2023లో 6నెలలు 2024లో ఏడాది పొడవునా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1901 నుంచి సేకరిస్తున్న సమాచారం ప్రకారం 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఉష్ణోగ్రత సగటున 0.65 డిగ్రీలు పెరిగింది. గతఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రత సగటున 0.94 డిగ్రీలు పెరిగింది. 1958లో 1.17,1990లో 0.97 డిగ్రీలు పెరిగాయి. ఆ తర్వాత కూడా ఇదే అధికం. ఇక ఎపి , తెలంగాణాలలో కూడా జనవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. జనవరి 15 వ తేది నాటికి 27 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండగా జనవరి 31వ తేది నాటికి అది 31 డిగ్రీలకు చేరింది.. ఇక ఫిబ్రవరి ఏడో తేదినాటికి మరో మూడు డిగ్రీలు పెరిగి 34 కి చేరవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ మార్పుల ప్రభావం లానినా పరిస్థితులపై కూడా పడుతోంది. లానినా పరిస్థితులు బలహీనపడటంతో శీతాకాలంలోనూ చలి తీవ్రత అసాధారణంగా లేదు. వచ్చే వారం నుంచి తూర్పు, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. కేరళలో జనవరిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు అయ్యాయి.