చిలుపూర్‌లో సబ్ మార్కెట్ ఏర్పాటు చేయాలి: సీపీఎం డిమాండ్

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండల కేంద్రంలో సబ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం, సీఐటీయూ మండల కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సాదం రమేష్ మాట్లాడుతూ, మండలంలోని 17 గ్రామాల్లో అనేక మంది రైతులు మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. పండించిన పంటలను అమ్ముకునేందుకు సరైన మార్కెట్ సదుపాయం లేక రైతులు ప్రైవేట్ దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని అన్నారు. అందువల్ల ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి చిలుపూర్ మండల కేంద్రంలో సబ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే వరి కోతలు ప్రారంభమైనప్పటికీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో మొక్కజొన్న, వరి పంటలను కొనుగోలు చేసే కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులను మధ్య దళారుల నుండి రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ విజయ్ కుమార్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు ఆవుల ప్రభాకర్, పోలు సంపత్, సాదం శ్రీనివాస్, సీఐటీయూ మండల అధ్యక్షుడు మంద రాజు, మండల కార్యదర్శి అపారదాపు రాజు, జాగిల్లాపురం కిష్టయ్య, గుండెబోయన సదానందం, సాదం పరమేష్, పోలు శ్రీనివాస్, ఊరడి లింగయ్య, ముడిక బీమయ్య, పురామని శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply