students l విద్యార్థులకు కళ్లజోడులు పంపిణీ

students l విద్యార్థులకు కళ్లజోడులు పంపిణీ

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు..
బిషప్ హాజరయ్య బాలికల హై స్కూల్‌లో కంటి పరీక్షలు..
35 మందికి ఉచిత కళ్లజోడుల పంపిణీ

students l విజయవాడ, ఆంధ్రప్రభః రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ, అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బిషప్ హాజరయ్య బాలికల హై స్కూల్‌లో కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దృష్టిలోపం ఉన్న 35 మంది విద్యార్థినులను గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు హాజరై విద్యార్థినులకు స్వయంగా కళ్లజోడులు అందజేశారు.

రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని బొండా ఉమామహేశ్వరావు అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది విద్యార్థులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, షూస్, బెల్ట్స్ వంటి అన్ని విద్యా సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు.

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న పౌష్టికాహారం అందిస్తూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ ద్వారా పాఠశాలల్లో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కంటి పరీక్ష శిబిరం కూడా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా చేపట్టిన ముఖ్య కార్యక్రమమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో, ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థికి అన్ని విధాలా అండగా ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ, డాక్టర్ మూర్తి, స్కూల్ యాజమాన్యం, గడ్డం రాజు, గాజుల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply