Student | ప్రాణం తీసిన వేగం..

Student | ప్రాణం తీసిన వేగం..
- రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
- బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం
- సంక్రాంతి పండగ వేళ గోదావరిఖనిలో విషాదం
Student | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన బీటెక్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గోదావరిఖనిలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక కేసీఆర్ కాలనీకి చెందిన గోషిక సాత్విక్ (22) ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు తెలిపారు.
కేసీఆర్ కాలనీలో నివాసముంటూ సుందిళ్ల సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న గోషిక రామకృష్ణ కుమారుడు సాత్విక్. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చాడు.
శనివారం ఎల్‌బీ నగర్‌కు చెందిన తన స్నేహితుడు చిలుముల కార్తికేయ కేసీఆర్ కాలనీకి వచ్చి సాత్విక్‌ను బయటకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా సాత్విక్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాన్ని కార్తికేయ నిర్లక్ష్యంగా నడిపాడు. జవహర్‌నగర్‌లోని గంగాజల వాటర్ ప్లాంట్ ఎదుట వాహనం అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయింది.
ఈ ప్రమాదంలో వాహనం వెనక కూర్చున్న సాత్విక్‌కు తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాత్విక్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఉమెన్ ఎస్‌ఐ అనూష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండగ సందర్భంగా ఇంటికి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
