తిరుపతి జిల్లా/తిరుమల, ఆంధ్రప్రభ : దసరా సెలవుల సందర్భంగా తిరుమల (Tirumala)కు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి (Srivari Darshan), వాహన సేవలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు (SP L. Subbaraidu) పేర్కొన్నారు. అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టం చేశామన్నారు. చిన్నారుల రక్షణ కోసం చైల్డ్ ట్యాగింగ్ సిస్టం (Child Tagging System) అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులు తక్కువ లగేజీతో రావాలని, క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని కోరారు.
వాహన సేవ సమయంలో చిల్లర నాణేలు విసరరాదన్నారు. వాహనాలను కేవలం నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ, టీటీడీ బస్సులను వినియోగించాలి. మత్తు పదార్థాలు, మద్యం తీసుకొని వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘాట్ రోడ్లలో ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు, అసభ్య వ్యాఖ్యలు చేయరాదని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే 112 నంబర్‌కు కాల్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతీ ఒక్కరికీ సహకరించాలని ఎస్పీ కోరారు.

