NZB | స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : డీఎంహెచ్వో రాజశ్రీ

నిజామాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ రాజశ్రీ హెచ్చరించారు.

నగరంలోని ఖలీల్‌వాడ ప్రాంతంలో ఉన్న ‘నిత్య స్కానింగ్ సెంటర్’పై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఆమె వైద్యాధికారుల బృందంతో కలిసి అకస్మాత్తుగా తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా సెంటర్‌లో ఉన్న రికార్డులు, రిపోర్టులు, రిఫరల్ చీట్లు మరియు ఫామ్-ఎఫ్ నమోదు వివరాలను పరిశీలించారు. ఫామ్-ఎఫ్ లో పూర్తి వివరాలు నమోదు చేయకపోవడం, సరైన విధంగా నివేదికలు లేకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రిసెప్షన్ వద్దే రోగులను పూర్తిగా గుర్తించి, పూర్తిస్థాయిలో రిఫరల్ స్లిప్పులు సేకరించాలని సూచించారు. అలాగే ఫామ్-ఎఫ్‌ను ఆన్‌లైన్‌లో ఖచ్చితమైన సమాచారం సహా అప్లోడ్ చేయాలని, నెలవారీ నివేదికలు సకాలంలో శాఖ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.

ఈ నిబంధనలను మరల మరల ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీఎంహెచ్వో హెచ్చరించారు. ఈ తనిఖీలో డాక్టర్ ప్రవీణ్, డీహెచ్ఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.

Leave a Reply